సాయిలీలావిశ్లేషణ : ప్రేమ - పగ.
శ్రీసాయినాథాయనమః! పెద్దలు జీవితాన్ని పరమపదసోపానపటం లేక పాము,నిచ్చెనల ఆటతో పోల్చిచెబుతారు. సాత్విక గుణములు కలిగి మంచిపనులు జేయువారు క్రమంగా వృద్ధిచెంది నిచ్చెనలనెక్కినట్లు ఉన్నతమార్గంలో పయనించి క్రమంగా జన్మజన్మకు వృద్ధినొంది దైవసన్నిధికి జేరుతారు. అదేవిధంగా రాక్షసస్వభావం కలిగి చెడుకర్మలుజేస్తూ ఇతరులకు హానిజేయువారు తమకు ప్రాప్తించిన మానవజన్మనూ కోల్పోయి పాము కరిచిన విధంగా పాతాళానికి నెట్టవేయబడి పాపజన్మల నెత్తుతారు. శ్రీసాయిసచ్చరిత్రమునందు ఇందులకు చక్కని ఉదాహరణలు చూడగలము. కొందరు పుణ్యాత్ములు సాయిని జన్మజన్మల సేవించి ఉన్నతస్థితిని పొందగా మరికొందరు భాగ్యహీనులు సాయికి సన్నిహిత వ్యక్తులుగా జన్మలనెత్తినప్పటికీ ధర్మాన్నితప్పి పరులకు కీడుజేస్తూ ఆపై హీనజన్మలపోందారు.ఈవిషయాన్ని వివరంగా తెలుసుకొందాము. మొట్టమొదట దాదాసాహెబ్ ఖాపర్డే భార్యను గూర్చిన విషయము. ఖాపర్డే గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ స్వాతంత్ర సంపాదనకై బాలగంగాధర తిలక్ కు కుడిభుజంగా పనిజేసాడు. ఖాపర్డే సాయి అనుగ్రహము రక్షణ పొందిన అదృష్టశాలి. భార్యాభర్తలిరువురు సాయిని మిగులభక్తిశ్రద్ధల సేవించారు. శిరిడీలో ఖాపర్డే నాలుగుమాసములుండగా వ...