మసీదుమాయి బాకీని కోరును

శ్రీసాయినాథాయనమః 

"ఇవ్వదలచువారలను, బాకీయున్నవారాలను మాత్రమే బాబా దక్షిణ యడుగుచుండెను. ద్వారకామాయి బాకీని కోరును. బాకీవున్నవారు చెల్లించి , రుణవిమోచనమును పొందెదరు."

ఒక రోజున గోవానుండి ఇద్దరు పెద్దలు బాబాదర్శనానికై ద్వారకమాయికి వచ్చి  బాబాకు సాష్టాంగ నమస్కారం చేయగ , బాబావారిలొ కేవలం ఒక్కనినుండి మాత్రమే 15 రూపాయల దక్షిణ అడిగి తీసుకొంటారు. రెండవపెద్ద తనకుతానుగ 35 రూపాయల దక్షిణ యిస్తే బాబా తిరస్కరించారు. ప్రక్కనున్న శ్యామాకిదంతయు బోధపడక అట్లేల చేసారని బాబాను ప్రశ్నించాడు. సర్వజ్ఞులైనబాబా ఇలాచెబుతారు, " శ్యామా! నేనెవరినుండి ఏమియు తీసికొనను. మసీదుమాయి బాకీని కోరును. బాకీయున్నవాడు చెల్లించి, ఋణముక్తుడగును. ఋణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము  తప్పక చెల్లింపవలెను. "

శ్యామా తరువాత ఆపెద్దలనుండి దానికి వివరణకోరి, తెలుసుకొంటాడు.  మొదటివాడు ప్రథమంలో పేదవాడు, ఉద్యోగము దొరకినచో మొదటి జీతం తన ఇష్టదైవమైన దత్తదేవునికివ్వ సంకల్పిస్తాడు. ఉద్యోగం దొరికి క్రమంగా వానిజీతం 15 రూపాయలనుండి 700 వరకు పెరుగుతుంది. అలా ధనవంతుడై తన మొక్కును మరిచాడు. తన కర్మఫలంచే బాబాను చూడరాగా, మరచిన బాకీ 15 రూపాయలను దక్షిణగా స్వీకరించి వాని ఋణముక్తుని జేశారు. రెండవ పెద్ద తనకథనిలా చెప్పాడు. విశ్వాసపాత్రుడైన తన బ్రాహ్మణ సేవకుడు తన సొమ్ము 30,000 రూపాయల దొంగిలించాడు. రాత్రి పగలు యేడ్చుచున్న వానివద్దకు ఓఫకీరు వచ్చి సొమ్ముదొరకు వరకు తన ఇష్టమైన ఆహారము విడువమనియు, ఆపై శిరిడీ సాయిని దర్శించుమని చెబుతాడు. అతడట్లే తనకిష్టమైన అన్నం మానేస్తాడు. సరిగా 15 రోజులపిమ్మట తానుదొంగిలించిన డబ్బును మిగుల పచ్చాతాపంతో సేవకుడు యజమానికప్పగిస్తాడు. మిగుల దయతో సాయిబాబాయే ఆఫకీరు రూపంలో వచ్చి తనకట్టి సహాయం చేసారని నమ్ముతాడు. తాను శిరిడీసాయిని దర్శించెదనను మొక్కు పూర్తిగా మరచిపోతాడు. కొలాబాలోయున్న వానికి స్వప్నంలో సాయి కన్పింప, శిరిడీ పోవలెనను మరచిన  విషయం జ్ఞప్తికొస్తుంది. ఆపై యచటినుండి గోవా మీదుగా శిరిడీ వస్తాడు. గోవా స్టీమర్ లో జాగాలేకుంటే, పరిచయంలేని నౌకరు రూపంలో బాబా సహాయంజేస్తారు. రెండవవాని మొక్కు కేవలం సాయిదర్శనం మాత్రమే కావున, 35 రూపాయల నివ్వదలచినను  వానినుండి బాబా ఎలాంటి దక్షిణ స్వీకరింపలేదు. అనగా బాబా దక్షిణ స్వీకరించడం కేవలం భక్తుల ఋణవిమోచనకేయని మనం  గ్రహింప వలెను. ఇలాగె శత్రుత్వము వహింపరాదు, హత్యలు కూడదు  యనుటకు శ్రీసాయిసచ్చరిత్రములో  ఉదాహరణల మనం చూస్తాము. అన్నదమ్ములిరువురు తమసౌభాగ్యమేమోగాని గతజన్మలో బాబాకు  జతగాండ్రు. కాని కాలక్రమంలో డబ్బువిషయంలో  పరస్పరం అసూయ, ద్వేషాల పెంచుకొని, అన్నదమ్ముల బంధాన్నికూడ విస్మరించి ఒకరినొకరు చంపుకొంటారు. వారిపాపకర్మల ఫలితంగా మరుజన్మలో మేకలుగా పుడతారు.  మందలో మేకలరూపంలోయున్న వారిని  గుర్తించి , కనికరించి సాయి వాటికి  తిండి పెడతారు. బాబా చెప్పిన  వేరొక కథలో వీరభద్రప్ప, చెన్నబసప్పలు బాబాకు సన్నిహితులు. కాని ధనసంబంధంగా ఒకరినొకరు ద్వేషించుకొంటారు. క్రూరుడగు వీరభద్రప్ప పిరికివాడగు చెన్నబసప్పను చంపెదనని బెదరించుటచే, యతడు బాబాను ఆశ్రయించి రక్షణపొందుతాడు.  వారిరువురు అదేద్వేషభావంతో మరణించి మరుజన్మలో వీరభద్ర కాలనాగుగా  పుట్టి, బెకబెకలాడు కప్పగా పుట్టిన చెన్నబసప్పను కబళించబోవ, సమయానికి బాబా యచటికెళ్లి పాముచెరనుండి తనమాటప్రకారంగా, కప్పను రక్షిస్తారు. రాగ ద్వేషభావాలు జన్మజన్మలకు కొనసాగుతవి కావున, ప్రస్తుతజన్మలోనే యలాంటి అసురభావాలనుండి ముక్తిపొందాలి. 

ఈసందర్భంలో బాబా మరికొన్ని ఆసక్తికర విషయముల జెప్పారు. " ఋణము, శత్రుత్వము , హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు. "  

బాబా చెప్పిన ఈసత్యమునె, పురాణగాధలలో  మనం చూడగలం. పిలిస్తే పలికే కలియుగదైవం, భక్తవత్సలుడు తిరుమల శ్రీవేంకటేశ్వరుడు తన కళ్యాణ  నిమిత్తం కుబేరునినుండి  చేసిన అప్పును  యిప్పటివరకూ  తీరుస్తూనేయున్నాడుగదా, శ్రీగోవిందస్వామి ఆడబ్బును కొలుస్తూనేయున్నాడుగదా! ఇక శత్రుత్వవిషయానికొస్తే  మహాభారతంలో భీష్మ పితామహుడు యెంతటి గొప్పవాడు. కాని పూర్వం తనను వివాహము చేసికొననన్న కారణాన, కాశీరాజు పెద్దకుమార్తె అంబకోపానికి మరియు  శత్రుత్వానికి కారణమౌతాడు. మరుజన్మలో అంబ ద్రుపదుని కుమార్తె శిఖండినిగా జన్మిస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీకరంగా పోరాడుచున్న ఆజన్మబ్రహ్మచారి భీష్మాచార్యుల కెదురుగా  నిలుస్తుంది. శిఖండిని గాంచిన భీష్మపితామహులు అస్త్రసన్యాసం జేస్తారు. అపుడు అర్జునుడు తనశరపరంపరతో భీష్మాచార్యులను తీవ్రంగా గాయపరుస్తాడు. ఆపిమ్మట భీష్మాచార్యులు  పవిత్ర ఏకాదశినాడు పరమపదిస్తారు. ఈవిధంగా అంబ కోపం, భీష్ములవారికి శాపమై  తుదకు మరణ కారణమౌతుంది. కావున శత్రుత్వం యెట్టివారికి తగదను సత్యం బోధపడుతుంది.శ్రీకృష్ణుని ఛత్రఛాయనున్న  పాండవులపై మిగుల శత్రుత్వం పెంచుకున్న కౌరవ వంశం  పూర్తిగా నాశనమైనదికదా! వేరొక సందర్భం. అభిమన్యుని పుత్రుడు పరీక్షిత్తు శమీక ఋషి  మెడలో చచ్చినపామును వేసి, ఋషిపుత్రుని కోపశాపములకు గురియై యేడవ దినమున తక్షకుడను సర్పపు  కాటుకు గురియై మరణిస్తాడు. మరణించేముందు శుకమహర్షి చే సప్తాహ భాగవతశ్రవణం జేసి మోక్షాన్ని పొందుట జగమెరిగిన సత్యం. రామాయణ సందేశంకూడా అదే.  తనదేహంలోని కణకణంలో ప్రతిక్షణం రామునిపై ద్వేషం పెంచుకొన్న లంకాధిపతి రావణుడు చివరకు  సంపూర్ణ  రాక్షస వంశనాశనానికి కారణుడైనాడు కదా!

చివరిగా హత్య ఏవిధంగా హానికారి. దశరథమహారాజు తన యవ్వనంలో సరయూనదికి నీటికి వెళ్లిన మునిబాలుడు శ్రావణుని ధ్వనిచేయుచున్న  జింకగాభావించి   బాణంవేసి చంపుతాడు. పిదప గ్రుడ్డివారైన శ్రావణుని తలిదండ్రుల శాపముచే దశరధుడు తనవృద్ధాప్యంలో, శ్రీరాముడు    వనవాసానికి      వెళ్లేవేళ , పుత్రశోకంచే తుదిశ్వాస విడుస్తాడు.  తాను పొరపాటున జేసిన హత్యయే తనకు  మరణ కారణ మైనదికదా! ఇదేసత్యం అవతారపురుషుల విషయంలోనూ ఋజువైనది. వనంలో పొదలమాటున నిదురించు కృష్ణుని  పాదములను పక్షిగా  తలచి, జరాయను పేరుగల బోయవాడు వేసిన బాణంతో శ్రీకృష్ణావతారం పరిసమాప్తమౌతుంది. రామావతారంలో శ్రీరాముడు చెట్టుచాటునుంఢి వేయబడిన బాణానికి హతుడైన వాలియే ఈ జరాయను బోయవాడు. ఈ ఘటన , హత్యకు బదులు హత్యయే యను  పురాణ సందేశంగా మిగిలిపోయింది. కావున పైన చూచిన విషయాలన్నిటిలో మిగులజాగరూకులమై మెలగాలనెడిదే  శ్రీసాయిసందేశం!

 శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

   శ్రీనివాసుని రుణ ధనం కొలుస్తూఅలసిన  శ్రీగోవిందస్వామి!   

శిఖండిని రథముపైబెట్టుకొని భీష్మాచార్యునితో యుద్ధానికి
 వెడలు అర్జునుడు 
 దశరథుని పుత్రవియోగం

Sri Venkateswara Kalyanam Story Song

Comments

  1. ఋణము, శత్రుత్వము, హత్యలకు మూల్యము తప్పక చెల్లింపవలెను!

    ReplyDelete

Post a Comment