సాయి కథలు - ఆరతి సాయిబాబా !

శ్రీసాయినాథాయనమః 


ప్రియ సాయిభక్తకోటి పరివారానికి నూతనసంవత్సర శుభాకాంక్షలు !

సాయి కథలు - ఆరతి సాయిబాబా !
(సంక్షిప్త సాయిచరిత్ర)

(సమర్ధసద్గురు  శ్రీసాయిబాబా ప్రేరణచే హేమాద్రిపంతు రచించిన  శ్రీసాయిసచ్చరిత్రము సాయిభక్తులకు భగవద్గిత, ఖురాను, బైబిల్ లాంటి పవిత్రగ్రంధ సమానము. ప్రస్తుతము శ్రీసాయిచరిత్రసారాంశమును  తక్కువసమయంలో చదువుటకు వీలుగా వ్రాయడమైనది. ఇప్పటికే పూర్తిగ్రంధ  పారాయణము జేసిన భక్తులకిది సింహావలోకనంగా ఉపకరించుననెడి సదుద్దేశ్యముతో జేసిన నావినయపూర్వక ప్రయత్నమిది. పాఠకులు ఇందలి మంచిభావముల, సందేశములను  గ్రహించి సాయిబాబా పరిపూర్ణకృపపొందుటకు  సద్గురుసాయినాథుని మనఃపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను.) 

" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

   గురుమద్యే స్థితం విశ్వం,  విశ్వమద్యే స్థితో గురు 
గురుర్విశ్వం నచాన్యోస్తి,   తస్మై శ్రీగురువేనమః 

1) సాయిబాబా కర్మధ్వంసి, గోధుమల విసిరి శిరిడీగ్రామమునుండి   కలరావ్యాధిని పారద్రోలిరి. 
2) సాయిబాబా ప్రేరణకర్త, అన్నాసాహెబ్ దబోల్కర్ నకు హేమాద్రిపంతు యను బిరుదునిచ్చి,  ప్రేరణకూర్చి  తమ చరిత్రను తామే రచించారు, వాదోపవాదముల నిరసించారు. 
3) సాయిబాబా కథలు జీవనమార్గమున దారిచూపు వెలుగు స్తంభములు, జగత్తు నడిపించేవాడు, సూత్రధారి తామేనని చెప్పారు. 
4) సాయిబాబా రాకచే శిరిడీ పావన నగరమైనది, గౌలిబువాయను వృద్ధభక్తుడు సాయిని పాండురంగనిగా నిర్ధారణ పరచాడు. సాయి పాదములు పవిత్ర శ్రీహరి పాదములు, వారిపాదములనుండి పావనగంగ ప్రవహించినది. 
5) సాయిబాబా పెళ్లిబృందముతో శిరిడీ వచ్చి యచటనే లోకకల్యాణ నిమిత్తము స్థిరపడ్డారు, వేపచెట్టుమూలమున వారి పవిత్ర పాదుకలు ప్రతిష్టింపబడ్డాయి. తంబోలీ యనువానితో కుస్తీలో ఓడినను వైరాగ్యము పొందారేగాని కుంగిపోలేదు. నీళ్లతో దీపాలు వెలిగించి వారిమహిమను లోకానికి చాటిచూపారు. 
6) సాయిబాబా శ్రీరామనవమి, ఉర్సుఉత్సవముల కలిపి జరిపి రాము రహీములు ఒక్కరని చాటిన మహితాత్ములు.  తమ భక్తుల ఇండ్లలో అన్నవస్త్రములకు లోటుండదని అభయమిచ్చారు. 
7) సాయిబాబా మతముల హద్దులుదాటిన మహనీయులు, ధౌతి, ఖండయోగ నిష్ణాతులు,  సర్వవ్యాపకులు, సర్వజ్ఞులు, కరుణాంతరంగులు. కొలిమిలో పడ్డ బిడ్డను దూరమునుండియే రక్షించారు, ఖాపర్డే పుత్రుని ప్లేగువ్యాధిని తమ దేహమున ధరించిన కృపాసాగరులు. 


8) సాయిబాబా భిక్షమెత్తుట భక్తుల పాపముల హరించుటకొరకే, కృతజ్ఞతకు మారుపేరు సాయి, బాయిజాబాయి సేవకు, యామె పుత్రుడు తాత్యాను చావునుండి రక్షించుటకై తమప్రాణముల నర్పించారు. 
9) సాయిబాబా శిరిడీక్షేత్ర పాలకులు, వారియనుమతిలేక శిరిడీని వీడినవారు కష్టములపాలైరి. మరచిన  భక్తుల గుర్తుజేసి నైవేద్యములు  స్వీకరించెడివారు. బాంద్రాలో తార్ఖడ్ నైవేద్యం మరచిపోతే, శిరిడీలో వాని భార్యాపుత్రులకు గుర్తుజేశారు. సర్వజీవుల ఆకలి సాయి ఆకలే! తార్ఖడు భార్య కుక్కకు విసరిన రొట్టెతో వారి యాకలి తీరినది. 
10) సాయిబాబా ఆధీనమునయున్నవి అష్టసిద్ధులు. సన్నని గుడ్డపీలికలతో మసీదు కప్పుకు కట్టిన అడ్డ బల్లపై నిదురించేవారు సాయి. సర్వమత సామరస్యము,  సర్వజీవ సమానత్వము వారి ఆశయము. ఆత్మ సాక్షాత్కార యనుభవ ప్రదాత, సద్గురువు.  నానావళికై గద్దె దిగిన అహంకార రహితులు.  వారి  కథలు వినుట వారి సత్సంగ సమానమే! 
11) సాయిబాబా రూపుదాల్చిన పరబ్రహ్మ తత్వము. డాక్టరు పండితు నిష్కల్మ భక్తికి వశులైనారు, అహంకార పూరిత హాజీని దూరంగా ఉంచారు. పంచభూతములు వారి స్వాధీనములు, తుఫాను తీవ్రత తగ్గించారు, ఎగయు దునిమంటల శాంతింపజేశారు. 
12) సాయిబాబా యనుమతితోనె శిరిడీలో కొనసాగుట లేక వీడుట. సాముద్రికశాస్త్ర  మూలే శాస్త్రికి    కాషాయవస్త్రముల   వాని గురువు ఘోలప్ స్వామిని ద్వారకామాయిన చూపించిన సమర్థులు.  మహమ్మదీయునిగా దలచు డాక్టరుకు తన ఆరాధ్య దైవ శ్రీరామ దర్శనమిచ్చిన అవతారపురుషులు సాయిదేవులు.    
13) సాయిబాబా ఆరోగ్యప్రదాత. భీమాజీ పాటీలు క్షయవ్యాధినుండి, బాలాషింపి మలేరియా నుండి, బాపుసాహెబు బూటీ వాంతులు విరేచనములనుండి, ఆళంది స్వామి చెవిపోటునుండి, కాకామహాజని విరేచనములనుండి, హర్దా నివాసి కడుపునొప్పినుండి, శ్యామా మూలవ్యాధినుండి, గంగాధరపంతు మరియు  నానాసాహెబు చాందోర్కరు కడుపునొప్పినుండి బాబా ఆసిసులతో ముక్తులైనారు. 
14) సాయిబాబా సంతానసౌభాగ్య ప్రదాత. నాందేడు పట్టణ నివాసి రతంజీ వాడియా బాబాదయచే సంతానం పొందాడు. మౌలాసాహెబుకు చేసిన సేవ సాయికి జేసినట్లే. బాబా భక్తులనుండి పొందిన దక్షిణ వారి రక్షణ కొరకే. కాంతా కనకములకు దూరమైనగాని పారమార్ధిక ప్రగతి లభించదు. 
15) సాయిబాబా ఉద్యోగ ప్రదాత. చోల్కరు బాబాదయచే స్థిరమైన నౌకరీ పొందాడు. సాయిబాబా భక్తహృదయ నివాసి, వారికై ఏడు సముద్రములదాటి  వెళతారు. సాయిబాబా సర్వజ్ఞులు, బల్లి చెల్లిరాక ముందుగా చెప్పిన  సిద్ధపురుషులు. 


16,17) సాయిబాబా  భక్తులకు బ్రహ్మజ్ఞానమును ప్రసాదింపగల సమర్థులు. ధనంపై పేరాస దైవాన్ని దూరంజేస్తుంది.  పిసినారి ధనికునకు జ్ఞానోపదేశం జేశారు.  ధనికపెద్ద పుణ్యమాయని పక్కవారు ఆధ్యాత్మిక విందుజేశారు. 
18,19) సాయిబాబా  సాఠే యను భక్తునికి  గురుచరిత్ర పఠనానంతరం స్వప్నానుభవం కల్గించారు. శ్యామాచే  రాధాబాయి దేశ్ ముఖ్ కథచెప్పించి హేమాడ్ పంతుననుగ్రహించారు. శ్రద్ధ మరియు సహనములు గురుకృప పొందుటకు ఆవశ్యకములు. మంత్రోపదేశములతో  పనిలేక కేవలము తల్లితాబేలు బోలిన చూపులతో తమభక్తుల రక్షిస్తారు. సదా సాయిబాబా రూపముపై మనసునిలిపి ధ్యానముజేసిన మనసు చాంచల్యము తొలగి విశ్వచైతన్యంతొ విలీనమౌతుంది. ఏనాటి ఋణానుబంధమో వ్యక్తుల కలయిక కావున యెవరిని ద్వేషింపరాదు, చేయగలిగిన సహాయముజేసిన దైవము సంతోషించును. సదాధ్యానించేవారి మంచివిచారములను సాయి ప్రోత్సహించెదరు. పరనింద మనకష్టఫలమైన పుణ్యాన్ని హరిస్తుంది. వేరువేరు భక్తులకు వేరువేరు సాధనలు. కూలివానికి తగిన ప్రతిఫలమీయనిచో అది ఋణానుబంధ సూత్రాన్ననుసరించి రాబోవు కాలంలో తీర్చవలసి యుంటుంది. 
20) సాయిబాబా  భక్తుల సమస్యపరిష్కారమార్గములు చిత్రాతిచిత్రములు. ఈశోపనిషదుకు భాష్యము వ్రాసినను భావము నెరుగడు దాసగణు.  అతనికి  విలేపార్లేలోని దీక్షితు పనిపిల్లద్వారా  సమస్యా నివృత్తిజేశారు. భగవంతుడు సర్వవ్యాపి, మనిషి సదా  శాస్త్రముల జెప్పబడిన కర్మల చేయుచుండవలెను, లభించిన దానితో  తృప్తినొందవలెను. ఇతరుల సొమ్ము కోరరాదు. భగవంతుడు సంపూర్ణము, వాని సృష్టి సంపూర్ణము, సృష్టి లయించినను మిగులునది పరిపూర్ణము. 
21) సాయిబాబా  బోధనామార్గమనేక రీతులు.  వీ.హెచ్. ఠాకూరు యను రెవిన్యూ శాఖ గుమాస్తాకి గురుకృపలేని కేవల పుస్తకజ్ఞానము నిరుపయోగమని చెప్పారు. వేదవేదాంతములు చదివిననూ శాంతి పొందని  అనంతరావు పాటంకరుకు తొమ్మిది విధముల భక్తిలోని ఏదేని నొక మార్గాన నడువమని బోధించారు.  ముందుముచ్చట్లు, వెనుక చప్పట్లు ఎప్పటికి తగదని  పండరీపురం నుండి వచ్చిన లాయరుకు సర్వజ్ఞులు సాయి చక్కటి ఉపదేశమిచ్చారు.
22) సాయిబాబా  ప్రబోధము సందర్భముననుసరించి వివిధ విధములు. ద్వారకామాయి ప్రవేశించిన చాలును, భక్తులకు మిగుల రక్షణ కలుగును.  బాలాసాహెబ్ మిరీకర్ బాబా చల్లని ఆశీసులచే సర్పగండమునుండి రక్షింపబడెను.  అదేక్రమంలో బాపూసాహెబ్ బూటీ, హేమాద్రిపంత్, కాకాసాహెబ్ దీక్షిత్ మున్నగు భక్తులను  పాము కాటునుండి బాబా రక్షించారు. అనవసర హింసయందు పాల్గొనక అన్నిజీవులను ప్రేమింపవలెననెడిది సాయి సందేశము.

23) సాయిబాబా మాటేమంత్రము, ' దిగుదిగు ' యనుచు ప్రియభక్తుడు శ్యామాను పాము విషమునుండి కాపాడారు. ఉల్లి దినుచు సాయి,  జీర్ణించుకొనగలవారు ఏదైనా తినవచ్చునను సత్యమునొక  యోగాభ్యాస సాధకునకు తెలియజెప్పారు. బాబా శక్తి, సర్వజ్ఞతల నెరిగి సాధకుడు ఆశ్చర్యానందములకు లోనైనాడు. మూఢనమ్మకములు అజ్ఞానజనితములు. పంచాయితీవారు జేసిన నియమముల బాబా నుల్లంఘించారు; కట్టెలు కొన్నారు, ద్వారకామాయిలో మేకనరుకుటకాజ్ఞాపించారు. బ్రాహ్మణుడైనప్పటికీ గురువాజ్ఞ పాటించి మేకనరుకుటకు సిద్ధపడిన దీక్షితు అసలైన భక్తుడు. 
24) సాయిబాబా హాస్యప్రియులు. కోటు జేబున శనగలంటిన హేమాద్రిపంతుతో పరిహాసమాడి, దగ్గరనున్న వారల ఆనందపరచారు. మన కోరికల, విషయవాసనలను  ఇంద్రియములు అనుభవించుటకు ముందుగా దైవానికి సమర్పించి యనుభవించిన మన అంతరంగములు పునీతమై శీలము చక్కబడును. గురుపత్ని పంపిన శనగల శ్రీకృష్ణునితో పంచుకొనక సుధాముడు కష్టముల పాలైనాడు. నిష్కపట మావిశీబాయి సేవలకు బాబా మిగుల వశులైనారు 
25) సాయిబాబా సర్వజ్ఞులు భక్తరక్షణా ధురంధరులు. పత్తి, ధాన్య వ్యాపారముల జేయతలపెట్టిన భక్తుడు దాము అన్నాను పెను  నష్టములనుండి కాపాడారు. బాబా ఆజ్ఞపై దామూ ఆయా వ్యాపారముల జేయక రక్షింపబడ్డాడు. 
బాబా ఆశీసుల మామిడిపండ్ల పొంది సంతానఫలముపొందాడు దాము. సాయి  రక్షణ సదాకొనసాగుతుంది, శరణన్నవారల సమాధినుండియే రక్షిస్తున్నారు. మావిడి పూతంతా ఫలమైన యెంత బావుంటుంది? 
26) సాయిబాబా ఆరోగ్య ప్రదాత. హరిశ్చంద్ర పితళే పుత్రుడు  మూర్ఛ వ్యాధి ముక్తుడయ్యెను. అక్కల్కోట స్వామి సమర్ధ, సాయిబాబా లకు భేదము లేదు.  నమ్మిన గురువునందే భక్తి నిలుపవలెననెడి సత్యాన్ని విరార్ నుండి వచ్చిన పంతు గ్రహించెను. ఆత్మహత్యచే,  చేసిన కర్మఫలములు తొలగవనెడి నిజాన్ని  అంబాడేకర్ యనువాడు గ్రహించెను. 
27) సాయిబాబా సద్గ్రంథపఠనల ప్రోత్సహించెడివారు. విష్ణుసహస్రనామము చదివిన రామదాసి మమతలో జిక్కి సమతమరచిన అజ్ఞాని, అహంకారి. బాబా దయచే శ్యామా విష్ణుసహస్రనామమును బాగుగా నెరిగెను. సాయిబాబా జన్మజన్మల బాంధవుడు. శ్రీమతి ఖాపర్డే పూర్వజన్మలెరిగి యామె సేవలను మిగులప్రేమతో స్వీకరించారు.
' రాజారాం ' యను మంత్రోపదేశం జేసి యామెకు శక్తిపాతం సమకూర్చారు. వారి పరస్పర సేవ గురుశిష్య ప్రబలబంధానికొక చక్కని యుదాహరణ. 
28)సాయిబాబా తమభక్తుల పిచ్చుక కాళ్లకు దారము కట్టి యీడ్చినటుల లాగెదరు. వారిజేరు భక్తుల యనుభవములు బహు వింత వింతలు. స్వప్నాల ద్వారాకూడ తనవారల లాగెడివారు. బొంబాయి శాంతాక్రుజ్ నుండి లాలా లక్ష్మీచందును, బరహంపూర్ నుండి యొక మహిళను స్వప్నసందేశాల ద్వారా శిరిడీ కీడ్చారు. విరంగామ్ నుండి వచ్చిన పెద్దపిచ్చుక మేఘాశ్యాముడు, మిగుల శివభక్తుడు.  మొదట్లో బాబాపై యాతనికి నమ్మకము కుదరనప్పటికీ, కాలక్రమంలో సాయికి మిగుల అంకితభక్తుడై సాయిబాబాలో పరమశివుని గాంచి ఆవిధముగా సేవించాడు. తుదకు బాబా సమ్ముఖమున తుదిశ్యాస విడిచి సద్గతినొందాడు.  
29) సాయిబాబా సర్వదేవతా రూపుడు. మద్రాసు భజనమండలి మహిళకు శ్రీరామ దర్శనమిచ్చారు. నమ్మికలేక  డబ్బుల నాశించెడి యామె భర్తను స్వప్నానుభవం ద్వారా మార్చారు. గ్రహబలంకన్నా సాయి అనుగ్రహబలం మిన్న యన్నది శ్రీమతి సావిత్రీబాయి పుత్రుని వైద్యవిద్య ప్రవేశ పరీక్షయందు రుజువైనది. సాయి ఆశీసులతో యతడు ప్రవేశ పరీక్ష నుత్తీర్ణుడైనాడు. ఆమె భర్తకు తగు పింఛను లభించెను. కాప్టెన్ హాటే చిక్కుడు కూర, దక్షిణల ప్రేమతో స్వీకరించారు, ఆశీసులతో రూపాయి నాణెము నందజేశారు. 
30) సాయిబాబా లాగిన మరోపిచ్చుక వణిలోని సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్య. . తన సమస్యలనుండి బయటపడుటకు, ఆత్మశాంతికి శిరిడీ బాబాను దర్శింప  స్వప్నసందేశమిచ్చినది ఆరాధ్య దేవత. శిరిడీ యెటుల వెళ్ళాలాయని దలచు వాని ఇంటికి బాబాప్రియభక్తుడు శ్యామా వేంచేసెను, తనమొక్కులదీర్చు నిమిత్తమై. పనిముగిసిన పిమ్మట వారిరువురు శిరిడీకి పయనమయ్యిరి. సాయి దయతొ వైద్య పరమశాంతి పొందెను. రహతా నివాసి కలలో కనబడి శిరిడీకి రమ్మనిరి, వచ్చుటకు గుర్రపుబండితో దీక్షితును పంపిరి. బొంబాయి నివాసి రామలాల్ పంజాబీ బ్రాహ్మణుడు, సాయి నామ, చిరునామములెరుగనివాడు.  కలలో సాయినిజూసి ఆపై  సాయంకాలము వీధిదుకాణంలో సాయి ఫోటోనుజూసి వివరములు గ్రహించి  శిరిడీ వెళ్లి తన అంతిమ క్షణంవరకచటనే జీవించాడు. 


31) సాయిబాబా సద్గతి ప్రదాత. వారి సన్నిధిలో తుదిశ్వాస విడిచిన భక్తులు మిగుల అదృష్టవంతులు. వారి సమ్ముఖమున మదరాసి సన్యాసి విజయానందు, బొంబాయి నివాసి బాలారాం మాన్కర్, పండరీపుర సబ్ జడ్జి తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘశ్యాముడు (మరియు ఒక పులి ) తమ అంతిమ శ్వాసను విడిచి పుణ్యలోకాలకు తరలి వెళ్లారు. మరణమునకు ముందు రామవిజయము, భాగవతము లాంటి పవిత్రగ్రంధముల చదివించెడివారు సాయిబాబా. 
32) సాయిబాబా తామే సద్గురువులైనప్పటికీ, ఇతరులకు దారిచూపుటకై తామొక గురువు నాశ్రయించారు. గురువు లభించినా గురుకృప అందరూ పొందలేరు. సాయి ఒక్కడే గురువునాశ్రయించి 12 సంవత్సరములు మిగుల భక్తి శ్రద్దల సేవించి లోకానికి తామే సద్గురువులుగా అవతరించారు. సాయి తో అడవులదిరిగిన స్నేహితులు దారితప్పి గమ్యాన్ని కోల్పోయారు. ఉపవాసమన  భగవంతునికి సమీపమున జీవించుటయేగాని, కేవలము భోజనము మానుట కాదనేది సాయి సందేశము. ఈకారణమున  గోఖలే భార్య ఉపవాసమును మాన్పించారు. తమ అపార తపః శక్తిచే సాయి అశేష పుణ్యరాశిని వశపరచుకొన్నారు, వారిని భక్తిశ్రద్ధల సేవించి మనమూ వారిసంపద పొందుటకు పాత్రులగుదుము గాక! 
33) సాయిబాబా ద్వారకామాయిలో ధునిని స్థాపించి అందుండి వచ్చిన ఊదీని భక్తులకు పంచెడివారు. ఊదిచే పెక్కు మహిమలు సంభవించుచుండెను,   తేలుకాటు, ప్లేగు జబ్బు, ప్రసవ వేదన లాంటి పెక్కురోగములు నయమగుచుండెను, సంపద పెంపొందుచుండెను. మనఃస్ఫూర్తిగా బాబా ఫొటోకు నమస్కరించిన వారిని నమస్కరించినటులేయను సత్యమును బొంబాయినగర   బాలబువా సతార్ గ్రహించెను. హరిభావ్ కర్ణిక్ సాయికివ్వదలచిన మరో రూపాయి దక్షిణను నాసిక్ చెందిన నరసింగ మహారాజను యోగి గ్రహించెను, యోగులందరు ఏకాత్మభావంతో వ్యవహరించెదరు.  
34) సాయిబాబా ఆశీర్వాదములతో ఇచ్చిన  ఊధితో డాక్టరు మేనల్లుని రాచకురుపువ్యాధి నయమయ్యెను. సందేహ మనస్కుడైన డాక్టరు మనసుమార్చి శిరిడీ కీడ్చారు సాయినాథులు. సాయి దయచే డాక్టరు పిళ్లే  పదిజన్మలలో  యనుభవించదలచిన నారిపుండు బాధ పదిరోజులలో తొలగిపోయినది. శ్యామా మరదలు ప్లేగువ్యాధి బొబ్బలు సాయిదీవెనల విభూతిచే మానిపోయెను. ఇరానీబాలిక మూర్ఛవ్యాధి, హార్దా పెద్ద మూత్రకోశవ్యాధి, బొంబాయి మహిళ ప్రసవవేదన బాబాచేతుల యూదిచే  నివారింపబడెను. 
35) సాయిబాబా పట్ల విశ్వాసములేని కాకామహాజని స్నేహితుడు సాయిమహిమకు దాసుడాయెను.  బాబాను పరీక్షింప వచ్చిన కాకా యజమాని ఠక్కర్ ప్రత్యక్షంగా సాయిశక్తిని వీక్షించి తన సంశయముల వీడెను.  బాంద్రానివాసి కాయస్థప్రభు కులపెద్ద అనిద్రవ్యాధి నుండి ముక్తుడాయెను. బాలాజీపాటిలు నెవాస్కరునింట సాంవత్సరమునాడు వండిన తక్కువ వంట విభూతిమహిమచే మూడురెట్లు వచ్చిన అతిధులకు సరిపడటమే గాక యింకను మిగిలినది. 
36) సాయిబాబా భక్తులనుండి దక్షిణల స్వీకరించి వారిని రుణముక్తుల జేసెడివారు. గోవానుండి వచ్చిన మొదటిపెద్ద 15రూపాయలు దక్షిణ సాయికి సమర్పించి తన దత్తదేవు మొక్కును దీర్చుకొన్నాడు. రెండవ పెద్ద సాయి దయచే 30 వేలరూపాయల తిరిగిపోంది, కృతజ్ఞతా పూర్వకముగా బాబాను దర్శించాడు గాని ఎలాంటి దక్షిణ సమర్పించలేదు. ఋణము, శత్రుత్వము, హత్య జేసిన దోషము చెల్లింపక తప్పదనేవారు బాబా. ఎలాంటి బిడ్డలులేని పెద్దవయసునయున్న ఔరంగాబాదుకర్ భార్య, బాబా దీవెనలచే పుత్రసంతాన ఫలాన్ని పొందినది. 
37) సాయిబాబా సన్నిధి నిత్యకల్యాణము, పచ్చతోరనము. మసీదు మరమత్తులు సమయమునుండి బాబా రోజువిడచిరోజు సమీప చావడిలో నిదురించెడివారు. బాబా చావడిలో నిదురించెడిరోజు భక్తులకు మహాపండుగ, ఇప్పటికీ ప్రతిగురువారం ఆవేడుక కొనసాగుతుంది. మజీదునుండి భక్తులు సాయిని మేళతాళములతో చావడికి తీసుకెళ్లేవారు. బాబా గుర్రము శ్యామకర్ణ పక్కన నడిచేది. భజనల, సాయినామ ఘోషలు మిన్నంటేవి. హరినామస్మరణ, సాయినామస్మరణలచే ఆకాశం బద్దలయ్యేది. చావడిజేరిన పిమ్మట భక్తులు బాబాకు ఆరతి నిచ్చెడివారు. సాయి స్పర్శ తగిలిన చిలుము ఎంతటిపుణ్యము జేసికొన్నదో కదా! అంతటి చావడి సంబరవేడుక వేళ  సాయిదేవులు తమ మనసున ఏపాటి కంపనలేక భావాతీత పరమానందస్థితిలో ప్రకాశించెడివారు. 


38) సాయిబాబా అన్నదాన ప్రియులు. అన్నిదానముల అన్నదానమె మిన్న,  తామే స్వయంగా శాకాహార మాంసాహారముల వండి వడ్డించేవారు. వేడి వంటపాత్రలో  తమచేతిని గరిటలా తిప్పెడివారు, యోగసంపన్నులు సాయి.  సాయి చేతుల భోంచేసినవారెంతటి యదృష్టవంతులోగదా! శిరిడీ వచ్చుదారిలోని  కోపర్గావ్   దత్తదేవుని  దర్శింపక శిరిడీ వచ్చిన నానాసాహెబుపై మిగుల కోపితులైనారు సాయిబాబా. బాబా చేతులమీదుగా  తీయని మజ్జిగ స్వీకరించి అమృతమయ సాయిలీలామృతమును మనకందించిన హేమాద్రిపంతు జన్మ ధన్యము.  
39) సాయిబాబా స్వయంజ్ఞాన ప్రకాశసూర్యులు. సామాన్యుల జ్ఞానము మిణుగురు తుల్యము. తాను సంస్కృతభాషలో ప్రవీణునిగాను, బాబాకు భగవద్గీత పరిజ్ఞానము లేనివానిగాను  తలచెడువాడు నానాసాహెబ్ చాందోర్కర్. కాని గీతలోని 4వ అధ్యాయములోని 34వ శ్లోకము తనలోతాను చదువుకొను వేళ, బాబా శ్లోక ప్రతిపదార్ధవివరణమడుగ భావమునెరుగని  నానా తడబడ్డాడు.   ఆపై బాబా ఆ శ్లోకార్ధాన్ని ఏ వ్యాఖ్యాత చెప్పనివిధంగా వివరించ వానికహంకార భంగమైనది. గురువు వాచా బోధించెడి అజ్ఞానమే! కేవలము ఆత్మసాక్షత్కారము పొందిన సద్గురువే భావాతీత పరమానందానుభవమును ప్రసాదించగలడు.  బాబా చేయుపనుల నెరుగలేము. నాగపూర్ ధనికుడు గోపాలరావు బూటీకి కలలో ప్రేరణనిచ్చి సమాధిమందిరనిర్మాణం  చేయించిన నాటకసూత్రధారి సాయి.  
40) సాయిబాబా తమమాట నిలుపుటకు తమప్రాణముల సయితము సమర్పించెదరు. బి.వీ.దేవ్ కిచ్చిన మాటప్రకారం దహనులో దేవ్ తల్లి యాచరించిన వ్రత ఉద్యాపన భోజనానికి మరిద్దరితో హాజరైనారు సాయిబాబా. ముందట కలిసిన సన్యాసిరూపములో  వచ్చుటచే సాయి రాకను గుర్తింపలేకపోయిన దేవు  జోగు వ్రాసిన ఉత్తరము ద్వారా నిజమెరిగి విస్తుపోయాడు. అదేవిధంగా హేమాద్రిపంతుకు కలలో చెప్పిన విధంగా  భోజనసమయానికి వచ్చి  చిత్రపటరూపంతో విందారగించారు సాయి, సాయిలీల లెరుగతరమే? 
41) సాయిబాబా తమ భక్త సదనముల  హృదయముల వీడలేరు, సదా నివసించెదరు. బొంబాయిలో బావమరిది నూరుమొహమ్మద్ పీరుభాయ్ ఇంట్లో యుంటున్న  బాంద్రానివాసి ఆలీమహమ్మద్ తన ఆరోగ్యనిమిత్తమై తన యింటనున్నయోగుల  పటముల   వాని మేనేజర్ ద్వారా సముద్రజలముల  ముంచినపిమ్మట, కేవలము బాబాపటము మాత్రమే ఇంటిగోడపై నిలిచెను. పీరుభాయ్ కిష్టములేని కారణమున,  సాయి పటమును మిత్రుడు యినుముముఝవర్ సలహాపై ఆలీమహమ్మద్   హోలీపండుగ నాడు సరిగా భోజనవేళ హేమాడ్ పంతుకు సమర్పించెను. బాబాపటమును మధ్యనుంచి పంతు బంధుమిత్రులు విందుజేసిరి. సాయికి వారి చిత్రపటానికి తేడాలేదు. బాబా ఆసిసుల జ్ఞానేశ్వరి చదువ దలచిన దేవు నేరుగా బాబాసాయము కోరక  బాలకరాముని సాయమడిగెను. ఇదెలా యుందంటే   పట్టుబట్టలిచ్చెడి సాయి పక్కనుండ   గుడ్డపీలికలనెడి బాలకరాముని సాయమును దేవు కోరుట.  సర్వమెరిగెడి సాయిబాబా  దేవుపై మిగుల కోపగించి, పిదప చల్లారి దీవించారు. ఆపై జ్ఞానేశ్వరి పఠనము దేవుకు సులభమాయెను. 
42) సాయిబాబా తమ మహాసమాధి సమయమును  రెండుసంవత్సరముల ముందుగనే  సీమోల్లంఘన సందర్భముననే సూచించిరి. తాత్యా ఆయువు ముగియు విజయదశమి వేళ వానిమరణమును తాము స్వీకరించి 1918లో సమాధి చెందిరి. తమ చివరిక్షణాల్లోనూ, లక్ష్మిబాయి షిండేకి  నవవిధభక్తులకు సంకేతంగా తొమ్మిది నాణాల దానమిచ్చిన   సాయి దానగుణమెన్నదగినది.  ఆకలిగొన్నవారికన్నమిడినచో  సాయికి సమర్పించినటులే! 
43,44) సాయిబాబా తమసమాధికి ముందు మృత్యుదేవతకు ప్రియమైన రామవిజయ శ్రవణము జేసిరి. బాబామరణవార్త విన్న శిరిడీ దుఃఖసాగరమున మునిగినది. బాబా ఇచ్చానుసారము వారిదేహాన్ని బూటీవాడలో సమాధిజేసిరి. బాబా మరణమునకు ముందు దుశ్శకునము కలిగినది,  తలగడగా వినియోగించు ఇటుక రెండుముక్కలైనది. సాయిబాబా తమసమాధికి 32 సంవత్సరముల ముందుగా 1886లో తమప్రాణముల వీడి మూడుదినముల పిమ్మట మరల జీవితులైరి.  రామకృష్ణ పరమహంస అవతారకార్యభారమును నిర్వహించుటకే మరల ప్రాణములపొందినటుల  చెప్పుటచే సాయిబాబా  కారణజన్ములు, అవతారపురుషులు !


45) సాయిబాబా జీవించియున్నప్పటికంటెను ప్రస్తుతము వారి లీలలు జగద్వ్యాపకములగుచున్నవి. కాకామహాజని ఇంట ఎకనాథభాగవతము చదువుసమయమున, సాయిని సర్వస్య శరణాగతి వేడిన కాకాసాహెబు దీక్షితుకు సైతము సమాధియనంతరము బాబాయొక్క ఉనికిపై సందేహము కలిగినప్పుడు, సందర్భానుసారముగా  ఆనందరావు పాఖాడే ను బొంబాయి  చౌపాటీ లోని కాకామహాజని యింటికి పంపి సందేహనివృత్తిజేశారు నిత్యసత్య సాయినాథులు. సాయిని నమ్మినవారికి నమ్మినంత యనుభవము, రక్షణ లభిస్తున్నవి  ప్రస్తుతకాలంలోనూ!  
46) సాయిబాబా లీలలు చిత్రాతిచిత్రములు. ప్రియభక్తులు కాకాసాహెబు దీక్షితు, నానాసాహెబు చాందోర్కరులు నాగపూర్, గ్వాలియర్ లోని తమతమయిండ్ల జరుగు శుభకార్యములకు సాయిని ఆహ్వానింప, తమకు బదులు శ్యామావచ్చుననియు, శ్యామాకంటే ముందుగా తాము గయ చేరెదమని చెప్పిరి. శ్యామా అప్పాకోతే యనువాని వెంటనిడుకొని శుభకార్యములకు హాజరైన పిమ్మట,   కాశీ  అయోధ్య నగరముల సందర్శించి ఆపై  గయ లోని పాండా గృహము ప్రవేశింప, ఆ యింటి ముందుభాగపు గదిలో బాబాయొక్క అందమైన పెద్దపటం దర్శనమిచ్చినది. అతిధి శ్యామానుండియే 12యేండ్ల క్రిందట ఆ బాబాపటమును పొందినవిషయము తెలిసికొన్న పాండా, శ్యామాలు  మిగుల ఆనందాశ్చర్యములకు  లోనయ్యారు. శ్యామాను గజారోహణతో మిగుల సత్కరించాడు గయపురోహితుడు పాండా. సాయిపటమున్న గృహమున  సాయున్నటులే!  సాయి జతగాండ్రయిన అన్నదమ్ములు   పరస్పర వైరంచే ఒకరినొకరు చంపుకొని  మేకజన్మలెత్త  సాయి వారినాదరించెను.  సర్వజీవులపట్ల  సాయిప్రేమ సదా ప్రసరిస్తుందికదా!   
47) సాయిబాబా ఋణము, విరోధము మరియు హత్యలకు తగిన మూల్యముచెల్లింపవలెనని నొక్కి వక్కాణించారు. వీరభద్రప్ప, చెన్నబసప్పల జన్మలు మారినప్పటికీ వారి పూర్వ వైరము కొనసాగినది. పూర్వజన్మమున వీరభద్రప్ప ధనికుడు లోభి,  చెన్నబసప్ప పేదరాలగు డుబ్కీ  మరుజన్మమున ధనపిపాసియగు వీరభద్రప్ప పాముగాను, సాయి రక్షణకోరిన పిరికివాడగు చెన్నబసప్ప కప్పలుగా జన్మలెత్తిరి. వారి పూర్వజన్మల వైరము కొనసాగిన కారణమున పాము కప్పను చెరబట్టినది. తానిచ్చిన మాటప్రకారం సాయి సమయానికి వచ్చి పామునోటినుండి కప్పను  రక్షించారు. సాయి సాయము జన్మజన్మలకు. వైరముకొనసాగినచో యది   హీనజన్మలకు దారితీస్తుంది. 
48) సాయిబాబా భక్తుల యాపదల నివారించెడి  అభయప్రదాత. సాయి సాయంచే లా పరీక్షలో కృతార్థుడాయెను శేవడే. వాని  సహచరుడు అక్కల్కోట నివాసియగు సపత్నేకర్,  సాయిని పరిహసించి కష్టముల పాలాయెను. తుదకు తప్పునెఱిగి, సాయిని శరణువేడి   వారి ఆశీసుల  పుత్రసంతానమునొందెను.  సాధు సత్పురుషుల అవహేళన యెంతటి ప్రమాదకరమోకదా! 
49) సాయిబాబా మహిమలు వేయినాలుకల శేషుడు వర్ణించలేనపుడు సామాన్యుడుడేల తెలియగలడు. గంతులు వేయు కప్ప సాగరలోతులను, వైశాల్యమును కొలవజాలదు. సాయిని పరీక్షయింప వచ్చిన బొంబాయి పెద్దమనిషి సాయిదర్శనానంతరం  ద్వారకామాయిలో తన కొత్తచెప్పులు కనబడక చాల చికాకు పడ్డాడు, వాడాలో  ' హరీకా బేటా జరీకా పేటా ' యని యఱచు బాలునినుండి పోయినచెప్పులుపొంది సాయిశక్తిని గ్రహించాడు. దూరాన మజీదుపై నెగురు జండాల గాంచిన సోమదేవస్వామి సాయిని కీర్తికామునిగా తలచాడు, కాని తనమనసెరిగిన పలికిన  సాయి మాటలకు, సర్వజ్ఞతకు  దాసోహమైనాడు. మనసు చంచలగుఱ్ఱము, అందమైన మహమ్మదీయ మహిళా ముఖ సౌందర్యానికి చాంచల్యము పొందినది  సాయి చెంత కూర్చున్ననానాసాహెబ్  చాందోర్కరుని మనసు.  వాని ఆంతర్యమెరిగిన సర్వజ్ఞుడు సాయి ' దేహసౌందర్యాని కతీతమైన సుందర దైవరూపాన్ని  అందరి హృదయాల గాంచి  స్థిర చిత్తుడు కావలె ' నని నానాకు  హితబోదజేశారు.  
50) సాయిబాబా కథలు చెప్పువారును, వినువారును ధన్యులు. సాయిని కేవలము తొమ్మిసంవత్సరములే సేవించి, సర్వస్యశరణాగతిజేసి  గొప్ప పరిణతి పొందిన కాకాసాహెబు దీక్షితు బాబా అంకితభక్తుడు. సాయి చెంత నివసించుటకై దీక్షిత్ వాడ నిర్మించుకొనినాడు, ఎన్నో  సాయిలీలల యనుభవము పొందినాడు. చివరకు సాయి ఆశీసులతో  సునాయాసంగా తుదిశ్వాసవిడచిన ధన్యజీవి దీక్షితు.  దత్తదేవుని కృపాపాత్రులు శ్రీవాసుదేవానందస్వామి సాయికి సమకాలీయులు, తమను దర్శించిన పుండలీక రావు కు బాబాకు సమర్పించుటకై నొక నారికేళమిచ్చినాడు. విషయం మరచిన పుండలీకుడు మార్గమధ్యమున కొబ్బరికాయ పగలగొట్టి తిన్నాడు. తమను దర్శించిన పుండలీకుని నారికేళమేదని యడిగారు సాయి. తనపొరపాటు గ్రహించిన పుండలీకుని బాధపడవలదని, జరిగినదంతయు తమసంకల్పమేనని సర్వజ్ఞులు సాయి పలికారు. బాలారాం ధురంధర్ సాయితో అరువది తరముల సంబంధమున్న ధన్యుడు, పరిపూర్ణ సాయికృపకు పాత్రుడు. సాయిచేతుల  చిలుముపీల్చి ఉబ్బసవ్యాధిని పోగొట్టుకున్నాడు. గురువార చావడి యుత్సవః శుభవేళ సాయి లో పాండురంగని తేజసు గాంచాడు బాలారామ్.   
51) సాయిబాబా సర్వవ్యాపకులు. వారిని నిరంతరం స్మరిస్తూ సర్వస్యశరణాగతి వేడినవారి కోర్కెలనెల్ల  నెరవేర్చెదరు. సంసారసాగరము దాటుటకు సురక్షిత నావ సాయి. శ్రీసాయిలీలలు వినుటచే దైవభక్తి వృద్ధిచెందును, పాపములు నశించును, సాయిలీలల చెప్పెడివారు, వినెడివారు సాయిరక్షణ పొందెదరు. నియమంగా శ్రీసాయిసచ్చరిత్రము ను సప్తాహపారాయణ జేసినవారి ఆపదలెల్ల తొలగిపోవును, ధనప్రాప్తి వ్యాపారాభివృద్ధి  జరుగును.  ఫలితములు వ్యక్తుల భక్తిశ్రద్ధలపై ఆధారపడియుండును. పేదరికము తొలగును, అజ్ఞానము నశించును. రోజుకో అధ్యాయము చదివిన అపరిమితానందము కలుగును. ఈగ్రంధమును గురుపౌర్ణమినాడు, గోకులాష్టమినాడు, శ్రీరామనవమినాడు, విజయదశమినాడు ఇంటివద్ద తప్పక చదువవలెను. పారాయణచే రోగులు ఆరోగ్యవంతులగుదురు, అకాలమృత్యువు తొలగును.  వ్యక్తుల మనోచాంచల్యము తొలగిపోయి సాయిపై పెంపొందును భక్తివిశ్వాసములు. 


సంక్షిప్త శ్రీసాయినాధసచ్చరిత్రము సంపూర్ణము 
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like.  ( మీ సలహా  మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో  పంచుకోండి.)



Comments

  1. నూతనసంవత్సర శుభవేళ సద్గురుసాయినాథులు పాఠకభక్తులెల్లరకు ఆయురారోగ్యసౌభాగ్యములు, భక్తిశ్రద్ధలు సదా ప్రసాదించుటకై హృదయపూర్వకముగా ప్రార్ధిస్తున్నాను !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)