సాయిబాబా శివరూపుడా?
శ్రీసాయినాథాయనమః!
శ్రీసాయిబాబా అష్టోత్తరశతనామావళిలో మూడవనామం శ్రీరామకృష్ణశివమరుత్యాది రూపాయనమః. ఈనామభావమేమన శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, మారుతి మున్నగు దేవతా స్వరూపుడైన సాయిబాబాకు నా నమస్కారము. అనగా నిచట బాబాను శివరూపునిగా చెప్పడమైనది. "పూజ్యశ్రీ భరద్వాజ మాష్టారు రంచించిన శ్రీసాయిలీలామృతగ్రంథంలొ బాబాలో పరమశివునిఁజూపు లీలలు కొన్ని కలవు. వానినిపుడు క్లుప్తముగా స్మరించెదము. మహల్సాపతి కుమారుడు మార్తాండమాల్సాపతి ఓరోజు ఖండోబా దేవాలయంవద్ద కూర్చొన్నాడు. సాయి వానియెదుట ప్రత్యక్షమైనారు. మార్తాండ్ నిలబడగానే బాబా నవ్వుచూ ఖండోబా విగ్రహంవైపు నడచి అందులో లీనమయ్యారు. ఆశ్చర్యంతో మార్తాండ్ విగ్రహంవెనుక వైపు చూసాడు. అక్కడెవ్వరూలేరు. తిరిగి విగ్రహంనుండి సాయి వెలువడి చిరునవ్వుతో ఆతనిఁజూస్తూ బయటకువెళ్లిపోయారు. నాటినుండి యతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. ( మహారాష్ట్రలో ఖండోబాను శివుని రూపుగా పూజిస్తారు). మరియొక ఉదాహరణ జూచెదము. బాబా సన్నిహిత భక్తురాలు లక్ష్మీబాయి షిండే ఓరోజు దునిదగ్గర స్తంభానికానుకొని కూర్చొంది. ఆమెతో సాయి అక్కడకు రోజూవచ్చే పామునుజూచావా యన్నారు. ఆమె చూడలేదంది. కొద్దినిముషాలలో ఒక పాము సాయి వీపుమీదుగా భుజముపైకి పాకి కూర్చున్నది. ఆమె మిగుల భయపడగా, అదేమీ చేయదనీ తనదారినితాను తులసీబృందావనం వద్దకువెళుతుందని బాబా చెప్పారు. ఆక్షణంలో లక్ష్మీబాయికి సాయి శంకరునిలా తోచారు. కొద్దిసేపటికి పాము తులసిచెట్టువద్దకు పోయింది. కన్నప్ప శివునికెలాంటి పరమభక్తుడో సాయిశివునికి మేఘశ్యాముడలాంటి అంకితభక్తుడు. మేఘుడు సాయిని తన ఆరాధ్యదైవం శివునిలా భావించి పూజించేవాడు. బాబాకు నిత్యం ఆరతులిచ్చేవాడు. మైళ్ళదూరం నడచి గోదావరిజలాన్ని దెచ్చి బాబానుపూజించేవాడు. ఓ మకరసంక్రాంతి పర్వదినాన బాబాకు అభిషేకముజేయ దలచి తాను దెచ్చిన పవిత్ర గోదావరిజలాల నీటికుండను బాబాకిష్టంలేకున్నా తలపైగుమ్మరించాడు బాబా శిరసుమాత్రమే తడిసి మిగిలినదేహభాగం పొడిగామిగులుట యచటివారలకు మిగుల ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మేఘుని యంతరంగమెరిగిన సాయి ఓ రోజు తెల్లవారుజామున వాడాలోని వానిగదిలో దర్శనమిచ్చి గోడపై త్రిసూలం గీయమని ఆనతిచ్చాడు. ఎఱ్ఱరంగుతో త్రిసూలం గీశాడు మేఘుడు. మరునాడు పూనానుండి వచ్చిన రామదాసి భక్తుడు బాబాకు శివలింగాన్ని సమర్పించుకొంటాడు. అదేసమయానికచ్చటకొచ్చిన మేఘునికి బాబా ఆ శివలింగాన్ని కానుకగా యిచ్చి పూజింపమంటాడు. త్రిసూలం సిద్ధమైనవెంటనే శివలింగం రావడానికి మేఘుడు మిగుల ఆశ్చర్యపడతాడు. వాడాలో నిత్యం సాయిని ధ్యానించే దీక్షితుకు ఆరోజున సాయి స్థానంలో శివలింగం దర్శనమైయింది. అదేసమయంలో మేఘుడు తెచ్చిన లింగం, వానికి ధ్యానంలో దర్శనమిచ్చిన లింగాన్ని పోలియుండుటచే దీక్షితు మిగుల యబ్బురపడతాడు. సాయిని నిత్యం సేవిస్తూ మేఘుడు సాయిసన్నిధిలో తుదిశ్వాసవిడచి సద్గతిపొందుతాడు. విభూతి ధారణ, శిలావేదిక సింహాసనము, అతిసాధారణ వస్త్రధారణ, భిక్షాటనము, పావనగంగాధారణ, అశ్రీతజనబాధస్వీకరణ మున్నగు విశిష్ట దైవగుణములను శ్రీసాయినాథులయందు, శంభోశంకరునియందు గాంచగలము. ప్రస్తుత పావనకార్తీక మాసంలో సాయిబాబాకు చేసిన పూజ పరమశివునికి జేసినటులే, పరమశివునికిజేసిన పూజ సాయికి చేసినటులే! పవిత్ర కార్తీకదీప వెలుగులో సాయిబాబాలో పరమశివుని జూచెదముగాక,వారిపరిపూర్ణ ఆశీసులపొందెదము గాక! శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
ఓం శ్రీసాయి శివరూపాయ నమః !
ReplyDelete