కోర్కెలు ఆనందసోపానాలా ?
శ్రీసాయినాథాయనమః. ఆనందమనేది ఓ చక్కటి అనుభూతి. సృష్టిలో కేవలం మనుషులేగాక పశుపక్ష్యాదులు సయితం ఎదో క్షణంలో ఆనందానుభూతి పొందుతూనే వుంటాయి. కాని ఆ అనుభూతి క్షణికమో లేక ఏకొద్దిపాటి సమయానికో పరిమితమౌతుంది. తాననుకొన్న కోరిక చిన్నదైనా లేక పెద్దదైనా తీరినవేళ వ్యక్తి ఆనందానుభూతి పొందుతాడు. కాని కొంతకాలం తరువాత ఆ ఆనందక్షణాలు మాయమౌతాయి. మనసు తన మామూలు మూసలో మరల చరిస్తూ ఎదో తెలియని అన్వేషణ కొనసాగిస్తుంది. మునుపు కోరిక తీరినందువలనగదా సంతోషం కల్గిందని తలచిన మనసు మరొక కోరికద్వారా అలాంటి మధురక్షణాల మరలపొందుటకై తపిస్తుంది. మానవ నిత్యావసరములైన అన్నవస్త్ర నివాసాదాలకు పరిమితములైన కోర్కెలు సహజం, సాధారణజీవనానికి ఆవశ్యంకూడా. కాని అవి లభించినపిమ్మటకూడా కోర్కెల వేట కొనసాగుతూనే వుంటుంది, మనసు మాయలేడికై పరువులిడుతూనే వుంటుంది ఎదో తృప్తి, శాంతుల పొందుటకు అవిశ్రాంతి ప్రయాణం. యోగ, వేదాంత గ్రంధాలను పరిశీలిస్తే ఈ నిత్య పోరాటానికి సంబంధించిన కొన్ని మూల సత్యాలు బయటపడతాయి. మనిషి సత్, చిత్, ఆనంద అనగా సచ్చిదానంద రూపుడు. అనగా వ్యక్తి భౌతిక, మానసిక, ఆనందములు కలబోసిన చైతన్యరూపుడు. ఆనందమనేది వ్యక్తి సహజ స్వభావం. క...