కోర్కెలు ఆనందసోపానాలా ?
శ్రీసాయినాథాయనమః.
ఆనందమనేది ఓ చక్కటి అనుభూతి. సృష్టిలో కేవలం మనుషులేగాక పశుపక్ష్యాదులు సయితం ఎదో క్షణంలో ఆనందానుభూతి పొందుతూనే వుంటాయి. కాని ఆ అనుభూతి క్షణికమో లేక ఏకొద్దిపాటి సమయానికో పరిమితమౌతుంది. తాననుకొన్న కోరిక చిన్నదైనా లేక పెద్దదైనా తీరినవేళ వ్యక్తి ఆనందానుభూతి పొందుతాడు. కాని కొంతకాలం తరువాత ఆ ఆనందక్షణాలు మాయమౌతాయి. మనసు తన మామూలు మూసలో మరల చరిస్తూ ఎదో తెలియని అన్వేషణ కొనసాగిస్తుంది. మునుపు కోరిక తీరినందువలనగదా సంతోషం కల్గిందని తలచిన మనసు మరొక కోరికద్వారా అలాంటి మధురక్షణాల మరలపొందుటకై తపిస్తుంది. మానవ నిత్యావసరములైన అన్నవస్త్ర నివాసాదాలకు పరిమితములైన కోర్కెలు సహజం, సాధారణజీవనానికి ఆవశ్యంకూడా. కాని అవి లభించినపిమ్మటకూడా కోర్కెల వేట కొనసాగుతూనే వుంటుంది, మనసు మాయలేడికై పరువులిడుతూనే వుంటుంది ఎదో తృప్తి, శాంతుల పొందుటకు అవిశ్రాంతి ప్రయాణం. యోగ, వేదాంత గ్రంధాలను పరిశీలిస్తే ఈ నిత్య పోరాటానికి సంబంధించిన కొన్ని మూల సత్యాలు బయటపడతాయి. మనిషి సత్, చిత్, ఆనంద అనగా సచ్చిదానంద రూపుడు. అనగా వ్యక్తి భౌతిక, మానసిక, ఆనందములు కలబోసిన చైతన్యరూపుడు. ఆనందమనేది వ్యక్తి సహజ స్వభావం. కాని అలాంటి స్పృహలేమిచే మనిషి తన ఉనికిని కేవలం తన భౌతిక దేహానికో లేక మానసిక ప్రపంచానికో పరిమితం జేసుకొంటాడు. కానీ వానియొక్క అంతరాంతరాళలలొ దాగిన వ్యక్తి చైతన్యం సహజమైన తన ఆత్మ లేక ఆనందమయ స్థితి వైపుకు పరువు తీస్తుంటుంది. వాగుల, వంకల, ఎత్తు పల్లముల సీమల దాటి సాగర సంగమానికై వేగంగా ప్రవహించే నదీ గమనంతో పోల్చదగిన ప్రయాణమీ వ్యక్తి ప్రయాణం. కాని వింతలకు వింతైన విషయమేమంటే మనిషి అజ్ఞానమనెడి మాయలో లేక అవివేకమనే చీకటిలో తన గమ్యవస్తువును గాంచక కోర్కెల రూపంలో తన ఆనందాన్ని పొందజూస్తాడు. కాని చీకటి ప్రయాణంలో తన నిజవస్తువును గాంచక మరల కోర్కెల వలయంలో ఆనందాన్ని వెదుకుతాడు. ఈ సమస్యను పరిష్కరించుటకై మహనీయులు మరియు ,ు సద్గురువులు చక్కని మార్గం జూపారు. అదే సత్యదృష్టి. ఏది సత్యమో ఎదసత్యమో నెరిగెడి స్థితి సత్యదృష్టి. సత్యమైనది నిత్యము, అసత్యమైనది అనిత్యము. అనగా నిత్యానిత్య విచక్షణయే సత్యదృష్టి.ఈ సత్యదృష్టినే భగవాన్ రమణ మహర్షి విచారణ మార్గంగా బోధించారు. ఈ మార్గంలో, నిత్యవస్తువు యొక్క ఉనికి తెలియదుగనుక వివేకంతో క్రమంగా అనిత్యవస్తువుల లక్షణములనెఱిఁగి వాటిని పరిత్యజించాలి. ఇదికాదు, యిదికాదంటూ అనిత్యవస్తువుల నేరిపారవేయాలి. ఈక్రమంలో అనిత్యవస్తువులెల్ల తొలగిపోయి తుదకు కేవల సత్యవస్తువేదో అదే మిగులుతుంది. ఈవిషయాన్ని ఉదాహారణలతో మరింత తెలిసికొనుటకు ప్రయత్నించెదము. ప్రస్తుత వ్యాసంలోని విషయం భగవద్గీత, ఉపనిషత్తుల మరియు, కపిలాది ఋషుల, ఆత్మానుభవ బోధామృతముగా నెరుగవలెను. వారు తమ సూక్ష్మ తపశ్శక్తిచే నిత్యానిత్య ముల చూడగలిగారు. నిత్యము కానిది సదా మార్పుచెందునని, నిత్యమైనది అన్నివేళల ఎలాంటి పరిణామము చెందదని, అనిత్యము నాశ్రయించిన దుఃఖము కలుగునని నిత్యమునాశ్రయించిన ఆనందము లభించునని గ్రహించారు. ఇంతియేగాక మరియొక ముఖ్యవిషయమును సాక్షాత్కరించుకొన్నారు. అదేమన సదా మార్పుచెందు వస్తువునకు మార్పుచెందని వేదిక ఆధారము మరియు ఆవశ్యకమని. ఈవిషయ అవగాహనకొరకు కొన్ని ఉదాహరణల పరిశీలించెదము. కదిలే రైలుబండి చలనానికి చలింపని పట్టాలు , ప్రవహించే జలాలకు కదలికలేని నదీ భూతలము ఆధారము. అహోరాత్రాలు కొనసాగే భూభ్రమణానికి ఎలాంటి కదలికలేని సూర్యుని గురుత్వాకర్షణశక్తి కారణముగదా! ఇలా మరెన్నో ఉపమానముల నూహింపవచ్చును. మహర్షులు ఇదే చలనాచలన సిద్ధాంతాన్ని మనిషి జీవితస్వరూపానికి, తద్వారా వ్యక్తికి కలిగే సుఖదుఃఖాలకు అన్వయించి, కొన్ని మహత్తర రహస్యాల వెల్లడించారు. క్లుప్తంగా ఆయా మహర్షుల దివ్య దర్శన సత్యాలతెలిసికొనుట మిగుల ప్రయోజన కరముగదా!గణిత శాస్త్రంలో వేరియబుల్స్ అని కాన్స్టెంట్స్ అని విలువలు రెండు విధములు. ఎలాంటి మార్పుచెందక సదా ఒకే విలువకలిగియుండేవి కాన్స్టెంట్స్ . ఉదాహరణకు 1,2,3 మున్నగు అంకెలు. వీటి విలువ అన్నిసందర్భములలో అలానే వుంటవి. ఇందులకు భిన్నంగా x, y, z లాంటి వేరియబుల్స్ విలువలు సదా మారుతుంటవి. ఇదేవిధంగా ప్రతిమనిషిలోను సదా పరిణామంచెందే పెక్కు అంశాలుంటాయి. అందులకే Change is the law of Life, అంటే జీవితానికి మార్పు తప్పని లక్షణమని తత్త్వవేత్తలు ప్రవచించారు. ఇదే పరిణామ లక్షణము ప్రతి జీవికి వర్తిస్తుంది. ఉదాహరణకు మనిషి విషయానికొస్తే అతని యునికికి సప్తధాతువులచే చేయబడి కర్మేంద్రియాలతో కూడిన బాహ్యదేహమవసరము. ఇదేరీతి వాని అంతరనిర్మాణం జ్ఞానేంద్రియాలు,మనసు, బుద్ధి, అహంకారముల సంగమము. పైచెప్పబడిన సిద్ధాంతాన్ననుసరించి మనిషి దేహము, అంతరంగములు జలతరంగములవలె సదా మార్పునకు లోనవుతవి. వయసుతోపాటు దేహము మార్పుచెందుట అందరి అనుభవవిషయమే! అలాగే మనసు దానినుండి జనించే ఆలోచనలు సదా పరిణామశీలములు. ఆలోచనలనుండే కోర్కెలు జనిస్తాయి. మనిషి కోర్కెలదీర్చుకొనే రూపంలో ఆనందాన్ని పొందజూస్తాడు. కాని ఆ కోర్కెలు చలించే మనసునుండి వెలవడుటవలన ఆవిగూడ ఎల్లవేళలా మారుతుంటవి. ఆవిధంగా తన సహజమైన ఆనందాన్ని కోర్కెల రూపంలో పొందజూస్తాడు. ఓ కోర్కె తీరినపుడు మనిషి తాత్కాలికంగా కొద్దిక్షణాలు సంతోషపడతాడు. నిజానికి సంతోషం ఆవస్తువులోలేదు. అదేవస్తువు వేరొకరి దుఃఖానికి, అసూయలకు కారణం కాగలదు. ఆ కోర్కెతీరినవేళ మనసు తాత్కాలిక ఆనందానుభూతికి లోనవుతుంది. అంటే తనలో ఎక్కడో దాగున్నసహజానంద స్థితిని మనసు తాత్కాలికంగా స్పృశించి మరల కొద్దిక్షణాలలోనో,సమయం తరువాతో తిరిగి తన చంచల స్వభావానికి మరలుతోంది. వ్యక్తి కోర్కెలకు మరో ముఖ్యకారణం ఎదుటి వానికున్న పేరుప్రఖ్యాతులు, సిరిసంపదలు. తానుగూడ అలానే ఆశిస్తాడు గాని ఎదుటివాని భోగభాగ్యాలు , దైవగుణాలు మున్నగునవి వాని పూర్వ కర్మఫలితాలుగా లభించాయని యెరుగనేరడు. ఎలాంటి పూర్వజన్మ పుణ్యఫలంలేక అతిగా కోర్కెలకై పరిగెత్తుట, అవి తీరనపుడు బాధపడుట అజ్ఞానజనితమే కాగలదు! మనిషిలో దాగిన ఆనంద భాండారము లేక సంతోషసాగరాన్నే ఆత్మయని మహర్షులు స్వానుభవంతో నిర్ధారించారు. ఈ సత్యనిరూపణము మహర్షుల దివ్యానుభవముగావున సాధారణమానవులెల్లరకు విశ్వసనీయము. ప్రతివ్యక్తిలో దాగిన ఆస్థితి, సహజము మరియు ఆనందమయము. ఆ స్థితియే ఆత్మయని, దానిని అగ్ని దహింపజాలదని, జలము తడుపజాలదని, వాయువు శోషింప జాలదని భగవద్గీతలో బహు వివరంగా చెప్పబడినది. మరల మరల కోర్కెలవైపు పరుగిడు మనసును సాధనచే ఆ ఆనందానుభూతిలో సుస్థిరపరచుటయే మోక్షముగా బోధింపబడ్డది. ఆ స్థితినే పతంజలి " యోగః చిత్తవృత్తి నిరోధకః " గా సూత్రీకరించాడు. ఈ సూత్రార్ధమేమన, పరి పరి విషయములపై పరిభ్రమించు చంచలమైన మనసు బాహ్యగమనాన్ని నిరోధించి అంతర్ముఖమై తన సహజానంద స్థితిలో సదా భాసిల్లుట. ఆలా వ్యక్తి, యోగిగా మారి పొందే పరమశాంతి బాహ్య కోర్కెలవలన కలిగే తృప్తి, శాంతులకుకోటిరెట్లకంటే యధికమని ఋషులు తమ సాధనాను భవములచే ధృవీకరించారు. బుద్ధభగవానుడు నిర్వాణానంతరము, గయ బోధివృక్షం కింద సాక్షాత్కరించుకొన్న సత్యమిదే! అంతర్ముఖమైన ప్రశాంత చిత్తము గాలిచొరబడని ప్రదేశంలో వెలిగే దేదీప్యమైన దీపమైతే, కోర్కెలమయజీవితం గాలికి రెపరెపలాడే అనిశ్చిత దీప శిఖ. ప్రస్తుత విషయసారాంశమేమన వ్యకి తన మనసును సదాపరిణామశీలమైన (variables) బాహ్య ఇంద్రియవిషయాలు, కోర్కెలనుండి మరల్చి అంతర్ముఖుడై ఎలాంటి పరిణామము చెందని (constant) తన సహజానంద స్థితిలో నిలుపవలెను. దేహము మనసు చలించే రైలు
బండయితే ు, ఆత్మ కదలని రైలు పట్టాలుగ గ్రహింపవలెను. ఆత్మ ప్రకాశమునుండియే దేహము మనసులు తమతమ యునికిని, శక్తిని సంతరించుకొంటాయని జ్ఞానుల వాక్యము. కోర్కెలు తీర్చుకొనుటవలన లభించే సంతోషం ఎండమావుల నీరులాంటిదని మహనీయుల సందేశము. అందరి హృదయాల నిండిన ఆత్మశక్తియే సద్గురు సాయినాథులు, వారికి దగ్గరయ్యేకొలది బాహ్యకోర్కెల వలయం దూరమౌతుంది! Inspiration: Who Am I ? by Bhagavan Sri Ramana Maharshi and Sreesaisaccharitra. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
"Desires are the most unrelenting enemies of man, he cannot appease them. Have only one desire to know God. Satisfying the sensory desires cannot satisfy you, because you are not the senses. They are only your servants, not your Self". Parmmahansa Yogananda " Sayings of Yogananda ".
"I continue fullfilling the wishes of My devotees till they ask Me That, which I would like to give (Self Realisation)". Shirdi Saibaba.
One of the central tenets of Buddhism is that tanha, or desire, leads to suffering.
Comments
Post a Comment