శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)

శ్రీసాయినాథాయనమః !
సమర్థ సద్గురుసాయినాథులు సర్వజ్ఞులు , సర్వవ్యాపకులు , సర్వశక్తిమంతులు , కరుణాంతరంగులు , భక్తరక్షణ దీక్షావ్రతులు . వారినే స్మరిస్తూ శరణుపొందినచొ మనకోర్కెలెల్లదీర్చి తుదకు కోర్కెలేలేని మోక్షమును ప్రసాదింతురు . నిత్యసాయిసచ్చరిత్ర పారాయణమందులకెంతో ప్రయోజనకారి, ఏలన మననిత్యకృత్యములలోని ప్రతిపనికి అందు సమాధానము దొరుకుతుంది . బాబా తమకు తమఫోటోకు తేడాలేదనే యనుభవాన్ని భక్తులకు ప్రసాదించారుగావున మన ఇంట్లోని బాబా చిత్రపటం బాబాతో సమానంగా భావించి తదనుగూనంగా మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి . ఇంట్లోని పెద్దలా, సాయి చూస్తున్నారు , వింటున్నారు నినాదాన్ని సదా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి . మనసాధక బాధకాలు సాయికి తెలిసినా అపుడపుడు మనసువిప్పి ఆయనకు సమస్యలను విన్నవించుకోవాలి . తల్లి తండ్రి గురువు దైవం సర్వం సాయే యను భావన మిగుల ప్రయోజనకారి . అలాంటిసమయాల్లో సాయి ఏదోరూపంలో సాయమందిస్తారు . శ్రీసాయిసచ్చరిత్ర శ్రవణ పఠనాదులు కేవలం పర్వదినాలలోనేగాక అనునిత్యం జరగాలి . లేకుంటే మాయకమ్మేసి మనలనజ్ఞానంలోకి తోసివేస్తుంది, అద్దంపై ధూళిలా అంతరంగంపై మాయపొర ఏర్పడుతుంది. చరిత్రపారాయణ యనే శుద్ధవస్త్రంచే ధూళిని తుడిచి నిత్యం వ్యక్తి శుద్ధికావాలి.నిత్యసాయి స్మరణచే భక్తుల మనోవాంఛలు నెరవేరుతాయి, దేహారోగ్యము మానసిక ప్రశాంతత, చిత్తశాంతికలిగి జీవితప్రయాణం మిగుల ప్రయాసరహితంగా సాగుతోంది . భక్తునికున్న భక్తిశ్రద్ధల వ్యాకులతలపై ఫలితం ఆధారపడుతుంది . బాబాకొరకు ఒక అడుగువేస్తే ఆయన మనకై పది అడుగులువేస్తారనేది భక్తుల యనుభవం . అన్న పానీయప్రసాదాదులనేగాక మన ఆలోచనలను , ఆశయాలను బాబాకు నైవేద్యంగా సమర్పించాలి . అందరిలో సాయిని చూడగలిగితే మనుజులమధ్య పోట్లాటలు కీచులాటలుండవు . సాయి జన్మజన్మల బంధువు . సదా వారిరక్షణ మనంపొందాలంటే సాయిలీలాపఠనం స్మరణం కొనసాగాలి . కష్టంలోయున్న తోటివారికి యూది పారాయణగ్రంధాల సమకూర్చడంకూడా బాబాకు ప్రియము . మనంజేసే ప్రతిమంచికార్యానికి పదిరెట్లఫలమిస్తారు సాయి, ఇది సాయిజేసిన వాగ్దానము. సాయియుగం ప్రారంభమై విశ్వవ్యాపకమవుతున్న శుభతరుణంలో వారిభక్తులుగా నుండుట మనజన్మకు మహాభాగ్యము , సువర్ణావకాశము .సాయిజూస్తున్నారు ,సాయి వింటున్నారు, తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
లోకాస్సమస్తా సుఖినోభవంతు ! ఓం శాంతి శాంతి శాంతిః !

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.