సినిమా(యా) లోకం !
శ్రీ సాయినాథాయనమః! శ్రీ రమణదేవాయనమః! నేడు భగవాన్ శ్రీ రమణమహర్షి 143వ జయంతి. పాఠకులందరికి భగవానుల ఆశీసులు లభించుగాక! జీవితము ఓ రంగస్థలమని, బొమ్మలాటయని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతకాలంలో నాటకరంగము మరియు తోలుబొమ్మలాటలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చును. వాటిస్థానంలో మూవీ థియేటర్స్ చోటుచేసుకున్నాయి. థియేటర్లో ప్రేక్షకులు చూసే సినిమాకి మరియు నిజజీవితానికి ఎంతో సారూప్యముంది. అదెలాగో పరిశీలించెదము. ప్రధమంగా థియేటర్లో సినిమా ప్రదర్శనవెనుక జరిగే ప్రక్రియ ఏమిటో చూచెదము. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల వెనుకవైపు గోడలోపల ఆపరేటర్ చే నడుపబడే ప్రొజెక్టర్ రూమ్ వుంటుంది. సినిమా పెద్దఫిల్ములో రికార్డయి పైనున్న చక్రమునకు చుట్టబడి చలిస్తూ ఓ చట్రం ద్వారా పయనించి క్రింది కదిలే చక్రానికి వృత్తాకారంగా చుట్టబడుతుంది. ఫిలిం చట్రం వెనుకభాగాన పెద్దదేదీప్యమానంగా ప్రకాశించే వెలుగు దీపముంటుంది. ఫిల్ము చట్రానికి ముందుభాగాన కటకముంటుంది. సినిమా నడిచేటప్పుడు దీపమునుండి మిరుమిట్లు గొల్పు వెలుగు ఫిల్ముపై పడుతుంది. ఆ ఫిల్ము ప్రతిబింబం సమీప కటకంపై బడి, ఆకటకమునుండి విభజననొంది ఎన్నోరెట్లుగా ప్రేక్షకుల ముందున్న తెర...