అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.
శ్రీ సాయినాథాయనమః ! శ్రీరామచంద్రాయనమః ! పాఠకభక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు! శ్రీరామచంద్రుడు రాక్షసుల సంహరించి యజ్ఞమును కాపాడిన యనంతరము విశ్వామిత్ర సీతాలక్ష్మణుల తోడ జనకపురికి బయలుదేరుతాడు . శ్రీరాముడు మార్గమధ్యమున ముని చూపిన శిలలా పడియున్న అహల్యను తనపాద స్పర్శచే స్పృశిస్తాడు . శాపవిమోచనానంతరము తపస్వియగు అహల్య శ్రీరాముని పీతాంబర ధారియై చతుర్భుజముల శంఖ చక్ర గదాపద్మముల ధరించి మందహాసముతో కమలములవంటి కన్నులతో వక్షమున శ్రీవత్సచిహ్నముతో దశదిశల ప్రకాశింపజేయు నీలమణి దివ్యాకాంతితో ధనుర్బాణముల ధరించి లక్ష్మణునితో నిలిచియున్నవానిగా చూచి హర్షవిహ్వలయై విప్పారిన నేత్రములతో శ్రీరాముని రమానాథుడు పరమాత్మయగు నారాయణునిగా తెలిసికొని ఆర్ఘ్య పాద్యములతో పూజించి దండప్రణామములుజేసి నిలుచుండి రాజీవలోచనుడైన రామునిజూసి,సర్వాంగములు పులకింప గద్గద స్వరంతో ఇట్లుస్థుతించెను. " జగన్నివాసా ! మీచరణకమల రజాకణము స్పృశించి నేను కృతార్థురాలనైతిని . ఆహా ! నా అదృష్టమేమనవచ్చును! బ్రహ్మ ఈశ్వరుడు మొదలగు లోకపాలకులే శుద్ధమైన మనసుతో ఈ పాదరాజమును వెదకుచుందురు . రామా ! నీలీలలు కాదు విచిత్రమైనవి . నీవు మానుషవేషము...