అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.

శ్రీ సాయినాథాయనమః ! శ్రీరామచంద్రాయనమః ! పాఠకభక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు!
శ్రీరామచంద్రుడు రాక్షసుల సంహరించి యజ్ఞమును కాపాడిన యనంతరము విశ్వామిత్ర సీతాలక్ష్మణుల తోడ జనకపురికి బయలుదేరుతాడు . శ్రీరాముడు మార్గమధ్యమున ముని చూపిన శిలలా పడియున్న అహల్యను తనపాద స్పర్శచే స్పృశిస్తాడు . శాపవిమోచనానంతరము తపస్వియగు అహల్య శ్రీరాముని పీతాంబర ధారియై చతుర్భుజముల శంఖ చక్ర గదాపద్మముల ధరించి మందహాసముతో కమలములవంటి కన్నులతో వక్షమున శ్రీవత్సచిహ్నముతో దశదిశల ప్రకాశింపజేయు నీలమణి దివ్యాకాంతితో ధనుర్బాణముల ధరించి లక్ష్మణునితో నిలిచియున్నవానిగా చూచి హర్షవిహ్వలయై విప్పారిన నేత్రములతో శ్రీరాముని రమానాథుడు పరమాత్మయగు నారాయణునిగా తెలిసికొని ఆర్ఘ్య పాద్యములతో పూజించి దండప్రణామములుజేసి నిలుచుండి రాజీవలోచనుడైన రామునిజూసి,సర్వాంగములు పులకింప గద్గద స్వరంతో ఇట్లుస్థుతించెను.
" జగన్నివాసా ! మీచరణకమల రజాకణము స్పృశించి నేను కృతార్థురాలనైతిని . ఆహా ! నా అదృష్టమేమనవచ్చును! బ్రహ్మ ఈశ్వరుడు మొదలగు లోకపాలకులే శుద్ధమైన మనసుతో ఈ పాదరాజమును వెదకుచుందురు . రామా ! నీలీలలు కాదు విచిత్రమైనవి . నీవు మానుషవేషముతో జగత్తును మోహింపజేయుచున్నావు . నిశ్చయముగా నీవు సర్వవ్యాపివి . నిరాకారుడవు . కర చరణాది అంగములు లేకున్నను మానవరూపముదాల్చి సదా సంచరించుచున్నావు . పూర్ణ ఆనందమయుడవగు నీవు మాయాతీతుడవు . మహామాయావివి . నీపాద పంకజ పరాగముచే పవిత్రదేహముగల గంగానది శివుడు, బ్రహ్మ మొదలగు దేవతలనందరిని పవిత్రము చేయుచున్నది . అట్టి నీపాదరజము నేడు సాక్షాత్తు నా కన్నులకు గోచరమగుచున్నది . నా పూర్వజన్మమును ఏమని వర్ణింపవచ్చును ?
మర్త్యలోకమున మానవాకృతితో జనించి మనోహరమైన అలౌకిక దేహమునుదాల్చి, ధనుర్బాణములను ధరించి ,పద్మములవలె విశాలమైన కన్నులుగల రాముడనుపేరుగల శ్రీహరిని అనుదినము భజింతును . ఇతరులనెవ్వరిని భజింపను . ఎవని చరణ కమలముల రజము వేదములద్వారా వెదుక దగినదో, ఎవని నామరసామృతము శంకరభగవానుడు కూడా ఆస్వాదించునో అట్టి శ్రీరామచంద్రుని అహర్నిశము నా హృదయమున ధ్యానించెదను . ఎవని అవతారచరిత్రమును బ్రహ్మలోకమునందు శంకర పద్మభవాదులు, నారదాదిమునులు సంతత ఆనందాశ్రుధారలు ఉరఃసీమను తడుపు చుండగా సరస్వతీదేవియు గానముచేయుదురో అట్టి పరమాత్ముని నేను శరణువేడుచున్నాను . నా ఎదురుగానున్న ఈ రాముడు పరమాత్మతప్ప మరియొకడు కాడు. ఇతడు పురాణపురుషుడు. అద్వితీయుడు . స్వయంప్రకాశకుడు . అనంతుడు . సర్వమునకు మూలకారణమైనవాడు . అట్టిభగవానుడు జగన్మోహనకరమైన మాయామానుష విగ్రహమును కేవలము భక్తులను అనుగ్రహించుటకే ధరించినాడు. దీనివలన భగవంతుని అవ్యాజకరుణయే ద్యోతకమగును . తానొక్కడై యుండి సృష్టి స్థితి లయములు గావించుటకై, తన మాయాగుణముల నాశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో విభిన్నరూపముల దాల్చువాడు . అట్టి స్వతంత్ర పరిపూర్ణాత్మస్వరూపము నీవే ! " ఓ రామా! నీ యొక్క చరణకమలములను లక్ష్మీదేవి తన హృదయముపై నిలుపుకొని అత్యంత ప్రీతితో లాలించును . నీ చరణకమలములు పూర్వము బలిచక్రవర్తి నణచు సందర్భమున ఒక్క అడుగుగా మూడులోకములను కొలిచినవి . అభిమాన వర్జితులైన మునులు నీ చరణకమలములనే నిరంతరము ధ్యానింతురు . అట్టి చరణకమలములకు నేను ప్రణమిల్లుచున్నాను" .
" ప్రభూ ! ఈజగత్తుకు పూర్వము ఉన్నవాడవు. జగత్తునకు ఆదికారణుడవు . సర్వజగత్తు నీ రూపమే ! నిన్ను ఆశ్రయించియే జగత్తు పరిభ్రమించుచున్నది . సర్వప్రాణులు వేరువేరుగా కనబడుచున్నప్పటికీ అన్నిటిలో నీవే ఉన్నావు. కాని వానిలో నీవు లిప్తుడవుకావు . నీవే నానారూపములలో ప్రకాశించుచున్నావు . అయినను నీవు అన్నిటికంటె పరముడవు,శ్రేష్ఠుడవు . " ఓ రామా ! నీవు ఓంకారశబ్దవాచ్యుడవు . వాక్కునకు అందని పరమపురుషుడవు . వాచ్య వాచక భేదములచే నీవే సకల ప్రపంచ స్వరూపమై యున్నావు " . "నీవే కార్యము , అనగా ప్రపంచము . నీవు కారణము అనగా మూలప్రకృతివి . నీవే కర్తవు , అనగా నీసంకల్పముచేతనే సృష్టి జరుగుచున్నది . దీనిని పొందదగిన ఫలమునీవే ! సాధనమూ నీవే ! నీవు ఒక్కడవే అయినను నీ మాయద్వారా అనేక రూపములుగా గోచరించుచున్నావు . నీ మాయచే మోహితమైన బుద్ధి కలవారు నీ వాస్తవిక తత్త్వమును తెలియక మాయామానుష్య రూపుడవైన నిన్ను, పరమేశ్వరుడవైనను సామాన్యమానవునిగా భావింతురు . నీవు ఆకాశమువలె వెలుపల లోపల అంతయు వ్యాపించియున్నావు . అయినను నీవు నిరంజనుడవు . నిర్లిప్తుడవు . అచలుడవు , నిత్యుడవు,శుద్ధుడవు , జ్ఞానస్వరూపుడవు . సత్స్వరూపుడవు , అవ్యయుడవు . హే ! విభో ! నేను వివేక శూన్యురాలను. పరమేశ్వర విషయిక జ్ఞానము ఎరుగని దానను,స్త్రీని . నీ తత్వము ఎటుల తెలియగలను ? అందువలన అనన్యభక్తితో పలుమారులు నీకు నమస్కరించెదను . దేవా ! నేను ఎచట ఉన్నను సర్వకాల సర్వావస్థలయందు నీ పాదకమలములయందే దృఢమైన భక్తి యుండుగాక ! పురుషోత్తమా ! భక్తవత్సలా ! హృషీకేశా ! నారాయణా ! నీకు పదేపదే నమస్కరించుచున్నాను . " రామా ! సంసార భయమును తొలగించుటకు నీవొక్కడివే సమర్థుడవు . అసంఖ్యాక సూర్యుల కాంతికలవాడవు. కరముల శరచాపముల ధరించినవాడవు . నీలమేఘశ్యాముడవు . సువర్ణనిభ పీతాంబరధారివి . రత్నఖచిత కుండలములు ధరించినవాడవు . పూర్ణవికాసముగల పద్మములవంటి నేత్రములు కలవాడవు . రామా ! అనుజునితో నిన్ను స్తుతించుచున్నాను". ఈవిధముగా సమ్ముఖమున నిలిచియున్న సాక్షాత్తు పరమపురుషుడైన శ్రీరఘునాథుని స్తుతించి అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి,అతని అనుజ్నగొని, అహల్య వెంటనే తన పతియొద్దకు వెడలిపోయెను . అహల్యచే గావింపబడిన ఈస్తోత్రమును భక్తిపూర్వకముగా పఠించువారు సమస్తపాపములనుండి ముక్తులై పరబ్రహ్మపదమును పొందుదురు . శ్రీసీతాలక్ష్మణహనుమత్సమేత శ్రీరామచంద్రుల, సద్గురు శ్రీసాయినాథుల కరుణాకటాక్షములు అందరిపై ప్రసరించుగాక ! అందరికి శుభమగుగాక ! శ్రీరాం జైరాం జైజై రాం ! ఓంసాయి శ్రీసాయి జైజై సాయి !

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)