అధ్యాత్మ రామాయణము : భక్తశబరికి శ్రీరామచంద్రుని సందేశము!
శ్రీసాయినాథాయనమః ! అరణ్యవాససమయమున భక్తురాలి శబరి సేవలకు మిగుల ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు ఆమెతో ఇట్లనెను. - " పురుషుడు - స్త్రీ యను భేదముకాని,జాతి నామ , ఆశ్రమాది భేదములుకాని నా భజనమునకు కారణములుకావు . దానికి ఒక్క భక్తియే కారణము. నా యందలి భక్తికి విముఖులైనవారు యజ్ఞదాన తపములవలనకాని ,వేదాధ్యయనాది కర్మలవలనగాని నన్ను దర్శింపలేరు . అందువలన , భామినీ ! భక్తిని పొందుటకుగల సాధనములను నేను సంక్షేమముగా చెప్పుచున్నాను . మొదటిది - సత్పురుషులతోడి సాంగత్యమని చెప్పబడినది . నా జన్మకర్మల కథాగానము రెండవది . నా అనంత కళ్యాణగుణగణములను చర్చించుకొనుట మూడవసాధనము . నా ప్రవచన రూపములైన సృతులను , ఉపనిషదాదులను,గీతాది వాక్యములను విశ్లేషించుకొనుట నాల్గవసాధనము . నాయందే బుద్ధిని నిలిపి ,మాయకులోనుగాక , పుణ్యకార్యములందాసక్తి కలిగి ,యమనియమాదులను అనుష్ఠించుచు ఆచార్య ఉపాసన చేయుట ఐదవ భక్తిసాధనము . అనునిత్యము నా పూజయందు నిష్ఠకలిగియుండుట ఆరవసాధనగా చెప్పబడినది . సాంగోపాంగముగా నా మంత్రపూజనమే ఏడవ సాధనమందురు . నా భక్తులయందు నాయందుకన్న అధికమైన భక్తిభావములు కలిగియుండుట , సమస్తప్రాణికోటిలో నా స్వరూపమునే దర్శించగలుగుట...