అధ్యాత్మ రామాయణము : భక్తశబరికి శ్రీరామచంద్రుని సందేశము!
శ్రీసాయినాథాయనమః !
అరణ్యవాససమయమున భక్తురాలి శబరి సేవలకు మిగుల ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు ఆమెతో ఇట్లనెను. - " పురుషుడు - స్త్రీ యను భేదముకాని,జాతి నామ , ఆశ్రమాది భేదములుకాని నా భజనమునకు కారణములుకావు . దానికి ఒక్క భక్తియే కారణము. నా యందలి భక్తికి విముఖులైనవారు యజ్ఞదాన తపములవలనకాని ,వేదాధ్యయనాది కర్మలవలనగాని నన్ను దర్శింపలేరు . అందువలన , భామినీ ! భక్తిని పొందుటకుగల సాధనములను నేను సంక్షేమముగా చెప్పుచున్నాను . మొదటిది - సత్పురుషులతోడి సాంగత్యమని చెప్పబడినది . నా జన్మకర్మల కథాగానము రెండవది . నా అనంత కళ్యాణగుణగణములను చర్చించుకొనుట మూడవసాధనము . నా ప్రవచన రూపములైన సృతులను , ఉపనిషదాదులను,గీతాది వాక్యములను విశ్లేషించుకొనుట నాల్గవసాధనము . నాయందే బుద్ధిని నిలిపి ,మాయకులోనుగాక , పుణ్యకార్యములందాసక్తి కలిగి ,యమనియమాదులను అనుష్ఠించుచు ఆచార్య ఉపాసన చేయుట ఐదవ భక్తిసాధనము . అనునిత్యము నా పూజయందు నిష్ఠకలిగియుండుట ఆరవసాధనగా చెప్పబడినది . సాంగోపాంగముగా నా మంత్రపూజనమే ఏడవ సాధనమందురు . నా భక్తులయందు నాయందుకన్న అధికమైన భక్తిభావములు కలిగియుండుట , సమస్తప్రాణికోటిలో నా స్వరూపమునే దర్శించగలుగుట,ప్రాపంచిక విషయములందు వైరాగ్యము కలిగియుండుట ,శమదమాదులు కలిగియుండుట నా భక్తికి ఎనిమిదవ సాధనము . నా యదార్థ తత్త్వవిచారము తొమ్మిదవ సాధనము . శుభలక్షణా! ఎవరికైనను ఈ తొమ్మిది భక్తి సాధనములు ఉన్నయెడల, వారు స్త్రీలైనను,పురుషులైనను,పశుపక్ష్యాదులలో జన్మనెత్తినను,ప్రేమస్వరూపమైన భక్తి సంజనమొందును. సాధకుని హృదయములో భక్తి పుట్టినంతమాత్రముననే నా స్వరూపము అనుభవమునకు వచ్చుట ,తద్వారా నా అనుభవ శుద్ధియగుటచేత అదే జన్మమునందు ముక్తియు లభించును . అందువలన భక్తి ఒక్కటే నిశ్చయముగా ముక్తికి కారణము అని సిద్ధమగుచున్నది . మొదటి సాధనమగు సత్సంగసమాగమము ఎవరికి లభించునో, వానికి క్రమముగా మిగిలిన సాధనములన్నియు అనువర్తించి తద్వారా భక్తిజనించి ,తత్ఫలముగా ముక్తిలభించి తీరును . ఇది నిస్సంశయము . నీవు నాయందు అపరిమితమగు భక్తి కలదానవు . అందులకే నేను నిన్ను చేరవచ్చితిని . నా ఈదర్శనమువలన నీకు ముక్తి లభించియే తీరును.సంశయము లేనేలేదు " .
శ్రీసాయిరాముని కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Comments
Post a Comment