సాయికోపము
శ్రీసాయినాథాయనమః సాయికోపము తమభక్తులపైన సాయిబాబాప్రేమ తల్లిప్రేమవంటిది, తల్లి దండన బిడ్డశ్రేయస్సుకొరకే! అలాగే వైద్యుడు రోగికిచ్చు చేదు కషాయము రోగనివారణకు మాత్రమేగదా! ఈ విషయమై బాబా భావాన్ని తెలుసుకొందాము. బాబా కోపించిన అన్ని సందర్భాలలో భక్తులకు మేలే జరుగుట నిచట గమనార్హము. భక్తులు వారివారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను , ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్లెమును విసరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టిసమయములలో బాబాను సమీపించుటకు కూడా యెవ్వరికీ ధైర్యము చాలెడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనముకంటె మెత్తగా గనిపించెడివారు. అప్పుడు వారు శాంతిక్షమలకు ప్రతిరూపమువలే గాన్పించుచుండిరి. బయిటికి కోపముతో నూగిపోవుచూ , కళ్లెర్రజేసినప్పటికీ, వారి హృదయము మాత్రము మాతృహృదయమువలే అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరతీసి , " నేనెప్పుడూ యెవరిపైనా కోపించి యెరుగను. తల్లి తన బిడ్డలనెక్కడనైనా తరిమివేయునా? సముద్రము తనను జేరు నదుల నెప్పుడైన తిరుగగొట...