శ్రీసాయిసచ్చరిత్ర ఆధ్యాయవిశ్లేషణము

శ్రీసాయినాథాయనమః


శ్రీసాయిసచ్చరిత్ర ఆధ్యాయవిశ్లేషణము

మొదటి అధ్యాయము 

బాబా తిరుగలి విసిరి కాలరామారిని పారద్రోలారు. అంతఃకరణ శుద్ధి , సాత్విక ప్రవృతి , సత్కర్మాచరణ ప్రతివారికి ఆవశ్యకము. తమో, రజో ప్రవృత్తులతో పాపకర్మ వలయం పెరుగుతుంది. ఆ పాపకర్మల ఫలితమే మనుషులకు వ్యాధులు,బాధలు,అశాంతి,నిత్యానిత్య విచక్షణాజ్ఞానలేమి మున్నగునవి ప్రాప్తిస్తాయి. అంతులేని అనవసరపు  కోరికల కాంక్షకూడా అజ్ఞానజనితమే. అంతఃకరణశుద్ధి, నిరంతర విచక్షణ  లేకుంటే కామ క్రోధాది అంతఃశత్రువులు మనిషిని అజ్ఞానంలోకి తోసేస్తాయి. మంచివంటకానికి భాండశుద్ధి ఎలాఅవసరమో , సత్కర్మాచరణకు హృదయశుద్ధి అంతే అవసరము.  కావున అలాంటి హృదయశుద్ధి అందరికి కలిగించుటకొరకు, వారిలోని పాపాలను దోషాలను నిత్యం క్షాళన  చేయుటకా యన్నట్లు బాబా 60 సంవత్సరాలు ప్రతిరోజూ  గోధుమలు విసరేవారు. " యోగః చిత్తవృత్తినిరోధకః " యని పతాంజలి యోగశాస్త్రం నిర్వచిస్తుంది. అంటే నిలకడలేని మనసును బాహ్యవిషయాలలో చిక్కనీయక అంతర్ముఖం చేయాలని, తద్వారా కలిగే మానసికశాంతికి, తృప్తికి  అందరూ అర్హులేనని గుర్తుంచుకోకలగాలి.


రెండవ  అధ్యాయము 

బాబాగారి లీలలు,చర్యలు మనసునకు ఆనందమును కలుగజేస్తాయి. వాటినుండి చక్కని సందేశం వెలువడుతుంది. తర్కం మనసునుండి పుడుతుంది కావున అలాంటి తర్కమనే పరికరంతో మనసునకందని స్థాయిలో యుండే బాబాజీవితఘనతను కొలవలేము. కావున బాబా చరిత్రను వ్రాయుటకు రచయిత హేమాద్రిపంతు సంకోచించాడు. సాయి జీవితం సాగరంలా మిగుల లోతైనది,విశాలమైనది. ఎవరి శక్తి సామర్ధ్యాలనుబట్టి వారు ఆసాగర గర్భమునుండి మిగులవిలువైన భక్తి, జ్ఞానమనెడి మణులనుగ్రహించి కోరినవారలకు పంచిపెట్టవచ్చును. అహంకారమున్న మనసులోకి దైవం ప్రవేశించలేడు, అందులకు సర్వశ్య శరణాగతి  ఎంతోఅవసరము. అందుచే అహంకారాన్ని ప్రక్కనబెట్టితే, తానే రచయిత హృదయంలో ప్రవేశించి గ్రంథరచన చేస్తానని బాబా ఆశీర్వదించారు. సాధారణమనుషులలోదైవం పట్ల భక్తిగాని, విశ్వాసంగాని కలగడం అంత సులభవిషయంకాదు. కాని  బాబాలీలలు భక్తులలో భక్తిని విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఎందుకంటే బాబాచూపే లీలలన్నీ భక్తులకు అనుభవం సమకూర్చుతాయి. తమకు కలిగిన అనుభవాల ననుసరించి  వారు తమసమస్యల, అవసరాల నెరిగే వ్యక్తిగా, తీర్చెడి శక్తిగా సాయిని గుర్తిస్తారు, క్రమంగా బాబామార్గంలోకి తెలియకనే ప్రవేశిస్తారు. అదే బాబాచెప్పిన  పిచ్చుకకాలికి తాడు వేసి తనవద్దకు లాగడం.

బాబా పాదాలతాకినంతనే రచయిత ఇంద్రియాలన్ని తృప్తి చెందాయట, మనసుకు సంతుష్టి కలిగి తన జీవితంలో  పెద్దమార్పు చోటుచేసుకొందట. తనలోని పరిమిత శక్తికలిగిన ఇంద్రియాలు, మనసు ఆ అపరిమిత ఆత్మశక్తిని తాకగానే అవికూడా మిగుల శక్తివంతములై  అపరిమిత ఆనందానికి, అనుభవానికి లోనైయ్యాయట, ప్రపంచమంతా సాయిబాబా రూపం దాల్చిందట!

ఆ కనపడని దైవంపై విశ్వాసం కుదరడం అంత తేలిక విషయం కాదు. ఇంద్రియాతీత అనుభవం పొందికూడ, రచయిత గురువు అవసరమేమిటని అదేరోజు రాత్రి బాలాసాహెబ్ భాటేతో గొప్పగా వాదించడం, మాయాశక్తి  ఎంతగొప్పదోయనెడి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

మజీదులోకూర్చున్న బాబాకిదంతా తెలియడం ఆయన సర్వజ్ఞతకు తార్కాణం. గురువెంత దయాళు. ఇంతజరిగినా రచయితను కోపగించుకోలేదు, పైగా హేమాద్ పంతు యనెడి బిరుదునిచ్చారు. ఇంతటితో ఇదిచాలదన్నట్లు కొన్ని ఆధ్యాత్మిక మెళకువలు బోధించారు. ఆ కనబడని  దైవాన్ని చేరడానికి షిర్డీనుండి కూడ ఓ మార్గముందని, సంక్లిష్టమైన ఆ మార్గాన్ని గురువనెడి మార్గదర్శిద్వారా సులభంగా దాటవచ్చని తరుణోపాయం సూచించారు.

మూడవ అధ్యాయము 
ఈ అధ్యాయంలో బాబా ఎన్నో అమృతగుళికలులాంటి మాటలు చెప్పారు. వారిలీలలు వ్రాస్తే అవిద్య అంతరిస్తుందట. అజ్ఞానమే అవిద్య. నామరూపమయ సృష్టియే నిజమనెడి అపోహ కలిగియుండడం అవిద్య. నామరూపాతీత సత్యమే, నిత్యమనెడి అనుభవం పొందడమే విద్య.శ్రద్ధా భక్తులతోడ వినెడివారలు కూడ మేలుపొందెదరు. వివేకమును వైరాగ్యమును  పెంపొందించుకొందురు. దైవంపట్ల ప్రేమ,భక్తి పెరుగుతాయి, జ్ఞానరత్నాలు లభిస్తాయి.
ప్రేమతో సాయినామము పలికిన వారికోరికలు తీరుతాయి. భక్తిపెరుగుటయేగాక, అమిత హృదయానందము, తృప్తి కలుగుతాయి. సాయిని సర్వస్య శరణాగతి కోరినవారలు దుంఖబంధములనుండి విడివడుదురు. సాయి నామాన్నే జపిస్తూ, పూజనే చేస్తూ, లీలల చరిత్ర మననం చేస్తూ ఎల్లవేళలా సాయిని గుర్తుంచుకొనెడివారలు అశాశ్విత ప్రపంచవిషయాలనుండి దూరులు కాగలరు. అకాల మృత్యువునుండి బయట పడెదరు. రోగములెల్లయు నివారింపబడును. క్రమంగా గర్వము, అహంకారము పలుచబడతాయి. లీలాశ్రవణముచే ఆత్మ శాంతి కలుగుతోంది. పరిపూర్ణ విశ్వాసముంచువారలు విశ్వచైతన్యంతో ఏకత్వమును పొందెదరు. సాయినామ స్మరణచే చెడు పలుకుటవలన వినుటవలన కలిగెడి పాపములు తొలగిపోతాయి.

వేరు వేరు భక్తులకు వారిసంస్కారములబట్టి బాబా వేరువేరు పనుల పురమాయించెడివారు. భగవంతుని అనుగ్రహము కుంటివానిని నడిపించును,గుడ్డివానికి చూపునిచ్చును. సాయి అనుగ్రహముచే గ్రంధకర్త రచన జేసెను. వేణుగాన మాధుర్యం వేణువెరుగదు, వాయించువానికే తెలియును. చంద్రోదయమే సాగరోల్లాసానికి హేతువు.

సాగరనావికులకు దారిచూపు వెలుగు స్తంభాలు సాయి కథలు. వారి కథలు, వారి లీలలు  " అసతోమాసత్యమయా " అనెడి సత్యాన్ని సూచిస్తాయి.   అహమును నమ్ముకొన్నవారి నిర్ణయాలు స్వార్ధ ప్రయోజనాలకొరకే యుంటాయి, సాయిని నింపుకొన్నవారి హృదయాలు కాంతివంతములై సర్వజనావళికి శ్రేయోదాయకములు కాగలవు. సాయి వెలుగులో గమనం సులభం, గమ్యం క్షేమం!  యోగీశ్వరుల కథలు హృదయాలలోని అజ్ఞానపుతెరల తొలగిస్తాయి. హృదయాంతర్గత కుసంస్కారాలను, సుసంస్కారాలుగ మార్చివేస్తాయి. సాత్విక భావాల నుద్దీపింపజేస్తాయి. సాయి మహిమల ప్రేమతో పాడినా, వినినా భక్తులకు పాపక్షయమై, పుణ్యఫలములు ప్రాప్తిస్తాయి. చదువుట, వినుట బాబాపై ధ్యానావస్థను కల్గిస్తాయి. వారిపై మనసు నిలుస్తోంది. అందులకే  పారాయణమునకంత ప్రాముఖ్యత గలదు.

సద్గురునిప్రేమ తల్లిప్రేమను మించుతుంది. శిష్యుల అవసరాల సద్గురువెరుగును. రచయితకు ఉద్యోగ విరమణ అనంతరము బాబా కృపచే మరియొక ఉద్యోగము కొంతకాలము వరకు లభించెను. ఆపై సాయిసంస్థానానికెంతో సేవజేసే  భాగ్యం కలిగింది.దైవస్మరణ కొందరికసౌకర్యము కలిగించినను సర్వులకు శ్రేయస్కరము. అందుచే బాబా బిగ్గరగా " అల్లాహు అక్బరు " యని యఱచు రోహిలాను నియంత్రించలేదు.

సాయి సర్వ చరాచర జీవకోటి హృదయవాసి, పాలకుడు, రక్షకుడు. వారే జగన్నాటక సూత్రధారి. సాయే జగన్మాత. అలాంటి హృదయవాసిని మరచి స్వార్ధంగా వ్యవహరిస్తే, ఈలోక మాయ శిక్షిస్తుంది. కావున మన సర్వకార్యములు సాయిపరంగా సాగాలి. లోభికి ఎల్లవేళలా ధనపిపాస యెలాగో , భక్తునికి సాయిస్మరణ యటులుండవలెను. లోభి ఆలోచనలన్నియు ధనంచుట్టూ తిరిగినట్లే మన అంతరంగాలు సాయిభావనా తరంగాలతో పెనవేసుకోవాలి.   

నాల్గవ అధ్యాయము 
దైవానికి మరోపేరు ధర్మము. అలాంటి సృష్టి విశ్వచైతన్య విన్యాస సమతుల్యం కొనసాగించడం కూడా ఆ దైవ శక్తి బాధ్యతగా చెప్పబడినది. ఆ బాధ్యతా నిర్వాహుకులుగా అవతారపురుషుల అవతరణ, సద్గురువుల ఆగమనము సంభవిస్తాయని ఋషివాక్యం. ఈక్రమంలోనే శ్రీరామ , శ్రీకృష్ణాది  అవతారపురుషులు,  అలాగే వారి ఆత్మస్వరూపులైన ఎందరో మహనీయులు,సద్గురువులు భువినవతరించారు. షిర్డీ భూమి యెంతపుణ్యం చేసు కొందో గాని సద్గురుసాయిని తనవైపు నాకర్షించుకొన్నది. ఈపరి అవతరణస్వరూపం చాల విలక్షణంగా ఆవిర్భవించినది. సాయి శాంతస్వభావులు,జ్ఞానమూర్తులు,ఉదారులు,అనిత్యప్రపంచంపట్ల నిర్వ్యామోహులు. నిత్యము, సత్యము,నిర్మలమని చెప్పబడు ఆత్మస్థితిలో స్థిరులు. వారిమాటలు అమృతధారలు. రాజూ పేదల మధ్య భేదమెంచక సృష్టిపట్ల సమదృష్టి గలవారు. చిత్తవృత్తుల విహరించినా, సమాధిస్థితినెన్నడు వీడని యోగవరిష్ఠులు. వారే  దైవమైనాగూడ అల్లానామాన్ని సదాస్మరించేవారు. వారిహృదయం లోతైన సాగరంలా శాంతము,గాంభీర్యము. సర్వవ్యాపకులుగావున ప్రపంచవ్యవహారములన్నియు వారియెఱుకలోనివే. చలించే లోకంలో చలనరహిత స్థిరులు. మాట్లాడినా మాటలవెనుకటి మౌనంలా, సాక్షిభూతులుగా ప్రకాశించేవారు. నాటక సూత్రధారి యైనప్పటికీ, చిన్నపాత్రధారిగానే మసలేవారు. మేరుపర్వత సమానులైనప్పటికీ ఓ చిరు అణు భావంతో అలరేవారు. అలాంటి దైవస్వరూపుని పాదస్పర్శచే షిరిడీనేలలోని ప్రతిధూళికణం  పరమపవిత్రతను,శక్తిని సంతరించుకొన్నది. షిరిడీయే భక్తులకు పావన పండరీక్షేత్రము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము,బదరీకేదార్, నాసిక్, త్య్రంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణమాది పుణ్యస్థల సమము. సాయిదర్శనమే యోగసాధనము, వారితో సంభాషణే పాపహరణము. వారిపాదసేవచే త్రివేణి సంగమ స్నానఫలము ప్రాప్తిస్తుంది. ఈవిధంగా  సాయి సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపులు.  

విఠలభక్తుడు గౌలిబువాకు సాయి సాక్షాత్తు పండరినాథుడే! భగవన్నామస్మరణమంటే బాబాకు బహుప్రీతి. నామసప్తాహానంతరము కాకాసాహెబు దీక్షితునకు ధ్యానంలో  విఠల దర్శనమైనది. భగవంతరావు, తనతండ్రి మరణానంతరము యాతని  ఇష్టదైవం  విఠలు పూజమరువ, వానికావిషయం గుర్తుజేసి మరల పూజ కొనసాగింపజేశారు. సాయి తమపాదములందు, దాసగణుకి గంగయమునల  జూపించి , వానికి ప్రయాగస్నాన అనుభూతిని కలిగించారు. ఆ అనుభవప్రసాద శక్తియే సద్గురుని ఇతరగురువులనుండి వేరుజేసి చూపుతోంది.
 సాయిబాబా తల్లి తండ్రుల వివరములు తెలియవు. మహనీయుల పుట్టుక మనసు పరిధికి అందనిది, మనుషుల తర్కమునకు బాహ్యమైనది. నింబవృక్షమూలముక్రింద భూగృహంలో గుప్తమైనది గురుస్థానము. సాయి పావన తపోస్థలము. ప్రారంభంలో సాయిశక్తిగూడా అలానే గుప్తమైనది. 12 సంవత్సరముల తీవ్ర తపసానంతరము సాధకులు సిద్ధిపొందుతారేమో, సాయి అలాగే 12 వర్షములు తపోఫలంగా పరిపూర్ణసిద్ధులయ్యారు. గురుభక్తిని హృదయంలో భద్రపదరచినట్లు, బాహ్య గురుస్థానాన్ని శ్రద్ధగా కాపాడాలి. తానుపిలిచిన భక్తులకు తానే వసతి కల్పించడానికే యన్నట్లు  సాయి ప్రేరణచే  3 వాడల నిర్మాణమైనది.   


ఐదవ అధ్యాయము 

చాందుపాటిలుకు తన చంచల మనస్సనెడి గుఱ్ఱము ప్రపంచారణ్యంలో తప్పిపోయి యాతని నిరాశతో నింపింది. గురుదర్శనాకృపచే పాటీలు తన చంచల హయాన్ని తిరిగి పొందాడు. నీరు నిప్పుల సృష్టించి సాయి తమ మహిమను పాటిలుకు తెలియజెప్పారు. సాయి షిరిడీలో ఓ కళ్యాణం చూడడానికి వచ్చి, లోకకళ్యాణార్థము షిరిడిలోనే స్థిరవాసర మేర్పరచుకొన్నారు. ఈసునకు మరోరూపమే తానుగావున సాయిగా భక్తుడు మహాల్సాపతిచే అప్రయత్నంగా పిలవబడ్డారు. సాయితపోశక్తి ఇతర సాధుసత్పురుషుల నాకర్షించి వారిచే మణిగా గుర్తింపబడినది. సాయి ఎప్పుడూ కాలహరణం చేయలేదు, తాము సిద్ధులైనా కర్మాచరణ నెన్నడూ  వీడలేదు. మూడుమైళ్ళు రహతావరకు నడచి మొక్కలదెచ్చి ఓ చక్కని పూలతోటను పెంచారు. రాబోయే సమాధిస్థలాన్ని ముందుగనే శుద్ధిజేశారు. ఏరోజుకుండలారోజే విరిగినా ఓ చక్కని తోటకు దోహదమైనటుల, ఈ అశాశ్విత దేహంతో కృషిజేసి పావన, పరిమళ  పరమార్ధాన్ని పొందమనెడి సాయిమౌన సందేశమేమోయది, ఎవరికెరుక?

యోగులు ఆత్మస్థితులుగావున యేకాత్మభావంతో వ్యవహరిస్తారు. స్వామిసమర్థులు శ్రీఅక్కల్కోట మహారాజులు తాముజూడదలచు భక్తుడు భాయికృష్ణజీ అలీబాగ్ కర్ ను షిరిడీలోనే ఆపేసారు. గురుస్థానంవద్ద గురు పాదుకల ప్రతిష్టింపజేసి సద్గురుసాయికృపాపాత్రుని జేశారు. వేప చేదును విరచి తీపిజేసిన సాయినాథులు మన చెడుసంస్కారాల హరించి మనసుల మధుర గుణముల నింపినారు. తంబోలీతో కుస్తీపోటీలో తానోడినా , విరక్తిని చూపారేకాని జీవనవోటమిని చూపలేదు. తమ మహిమాన్మితమైన అవతారకార్యారంభమా యన్నటుల తమ భక్తరక్షణా క్రియగా నానాసాహెబు దేన్గాలె కు పుత్రప్రాప్తిని, షిరిడీవాసులకు నీటితో దీపోత్సవము కల్పించారు.

ఆరవ అధ్యాయము 

జీవన నావకు సద్గురువు నావికుడైన గమ్యమును క్షేమముగా జేరగలము. కావున నిత్యకృత్యములందు సాయి బోధలగుర్తుంచుకొని తదనుగుణంగా నిర్ణయాల తీసికొని  ఆచరించడం సుఖమయజీవనానికి తొలిమెట్టు. సద్గురువు  ఆధ్యాత్మికంగా ఎంతో ఊహాతీతమైన శక్తిక్షేత్రంలో విలసిల్లుతారు, కావున వారి చేతిస్పర్శలో ఎంతో శక్తి దాగియుంటుంది. సద్గురుని స్పర్శగాని,  అనుగ్రహాన్ని గాని  పొందిన భక్తులుగూడ ఆ శక్తిపాతాన్ని అనుభవిస్తారు. షిరిడీ క్షేత్రదర్శనములోగూడ భక్తులు అలాంటి అనుభవాన్ని చవిజూస్తారు. అలాంటి సద్గురు శక్తిపాతంలో తక్కువస్థాయి మానవుల దోషాలు,కర్మఫలాలు, అజ్ఞానం దహించుకుపోతాయి. మనసులలోని అలజడి అణిగి, బుద్ధిలోని మాంద్యం తొలగుతుంది. అపుడు మిగిలే చైతన్యస్థాయి రుచి భక్తునకు కలుగుతుంది. వేరొక నూతన శక్తి ఆవిర్భవిస్తుంది, దానినే కుండలిని శక్తిగా గ్రహింపవచ్చును. అపుడు క్షణక్షణం సాయిభావనే మనసునగలిగి సద్గురు స్మరణ నిలుస్తుంది. చేసేపనులలో, చూసేమనుషులలో, చదివే పుస్తకాలలో అంతటా సాయే కనిపిస్తారు. క్రమంగా జీవనం సాయిమయంకాగలదు. ప్రతివిషయంలో ఆయనే గుర్తొస్తారు, వారిలీలలే ఉపమానాలగుతాయి. క్రమంగా జీవితము ఓ ఆనందసాగరంలా అనుభవమౌతుంది. కొందరి పరిణితిచెందిన సాయిభక్తులలో ఈ తేడాని స్పష్టంగా గ్రహింపవచ్చును. రోజువారీ చికాకులకు అతీతంగా నిత్యం నవ్వుతూ, తేలికబడిన హృదయంతో కనబడుతారు. ఇదే సాయిప్రసాదించే మహాప్రసాదం. సాయిభక్తుని గృహంలో నిత్యావసరాల కొరత యుండదు. సాయిని పూర్తిగా మనసున నింపుకొన్న భక్తుని యోగక్షేమాలను  సాయే జూస్తారు. కావున మనసును పరిపరివిధముల పరుగులెత్తించక, దృఢంగా నిలుపగలిగితే క్రమంగా మనసు శాంతిమయం, చింతారహితం  కాగలదు. సాయిదర్శనం సదానిలచి మనసే సాయిమందిరమౌతుంది.

భక్తులు ఆనందమయజీవనాన్ని గడపాలని సాయిబాబా ఉద్దేశ్యం, కావుననే వారు ఉరుసు, చందన ఉత్సవముల; శ్రీరామనవమి, గురుపూర్ణిమా లాంటి పండుగల జరుపుకొనుటకు ప్రోత్సహించేవారు. మతాతీత, మానవతా స్థాయిలో తన మనుషులుండాలని బాబా భావించేవారు. హిందువులు ముస్లింలు తరతమ భేదాల మరచి సోదరభావంతో మెలగాలని, అందరిదేవుడూ ఒక్కడేయని, అదే అల్లా మాలిక్కని నిత్యసందేశంగా చెబుతుండేవారు.
బాబా జీవన విధానంనుండి  భక్తులు  చెప్పకచెప్పిన ఎన్నోవిషయాల గ్రహింపగలరు. సాయి నిరాడంబరతకు మారుపేరు. మజీదు ఎంతో పాడుబడినా, మరమ్మత్తులకు యిష్టపడలేదు. భక్తుల బలవంతంపై కొన్ని మార్పులు చేయబడ్డాయి. వారి కోపం, తిట్టుగూడా  భక్తులకు ఆశీసులే! మజీదు మరమ్మత్తువేళ భక్తుల కొట్టి, తిట్టి  తాత్యాపాత తలపాగాకు నిప్పంటించి, మరల ఓకొత్త తలపాగాతో సత్కరించారు. వారిచేష్టలు అగమ్యగోచరాలు.

  ఏడవ అధ్యాయము 

సాయి మతమేమన, హిందూముస్లిము మతములలో నిబిడమైన మానవతా భావన. సాయీయనగ శుద్ధానందమయ స్థితి. వారితో కూడినవారుకూడ ఆ ఆనందపు రుచులు చూచుచుండిరి. 'అల్లాహ్ మాలిక్ ' శబ్దమే వారి నిత్యమంత్రోచ్చారణ ! సాయికి వాదవివాదములన్న గిట్టదు. చిర్రుబుర్రుల అలలు అపుడపుడూ లేచినా, వారు పరమశాంతి సాగరులు. వారినిజస్థితి సామాన్యుల అవగాహనకందదు. అందరి అంతరంగ ఆలోచనల ప్రకాశింపజేయునది వారి వారి ఆత్మస్థితి. అట్టి ఆత్మప్రకాశంతోనే అందరు ఆలోచించేది. సాయి యన అందరియాత్మల ప్రకాశింపజేయు ఆత్మ లేక పరమాత్మ ప్రకాశము. దానికారణముననే అందరి అంతరంగముల సాయి నెఱిఁగెడి వారు. ఇదే వారి సర్వజ్ఞతకు మూలకారణము. అందుచే వారికి లోకసమ్మానములన్న అభిరుచిలేదు. వారు మానవరూపు దాల్చిన పరంధాములు.

షిరిడీలోని అన్నిదేవాలయాలను తాత్యాచే మరమ్మత్తు చేయించారు. వారిది నిత్యదక్షిణా సేకరణ, దానితో సమమైనదే వారి ధాతృత్వగుణము. బాబాది భగవంతునిలా శుభమైన,ఆరోగ్యకరమైన, సాత్విక ప్రధాన, కోరికలుతీరిన పవిత్రస్థితి కావున వారిసన్నిధిలో భక్తుల బాధలు తీరేవి, భయములు పోయేవి, కోరికలు ఫలించేవి. వెలిగే సూర్యుణ్ణి లోకమంతా చూసేవిధంగా , సాయిమహిమను ప్రపంచం గుర్తించింది. కావున వారిదర్శనానికి జనవాహిని కదలివచ్చేది. సాయి అగ్గిలాంటి దొర, వారుకూర్చున్నది నిత్యాగ్నిహోత్రమైన ధుని కెదురుస్థలము. . సాయిమాటే మంత్రము, వారిచేతిమాత్రే ఔషధము. కావున వారు రోగుల రోగముల పొంతనలేని మందుల నిచ్చి  కుదిర్చేవారు.

బాబనిజస్థితి దేహాతీతముకావున, వారు ధౌతి,ఖండయోగముల అతిసులువుగా జేసెడివారు. బాబా సర్వహృదయవాసి, దయాసాగరులుకావున తమచేతిని కాల్చి దూరదేశమునయున్న కొలిమిలోపడ్డబిడ్డను కాపాడారు. కుష్టువ్యాధిపీడితుడు భాగోజీషిండే సేవను గ్రహించి, వాని ననుగ్రహించారు, కావున యాతడు భాగ్యవంతుడు. భక్తుల బాధలు బాబావే, ఖాపర్డే బిడ్డప్లేగును దూరంచేశారు. భక్తుల ఆనందమే బాబా ఆనందము, చందోర్కరు  పండరి బదిలీనెఱిగి, తోటివారితో పాటలరూపమున వాని యానందపరచారు. వారిలీలలకు అంతులేదుకదా!     

ఎనిమిదవ అధ్యాయము 

ఈ సమస్తసృస్టిలో మానవజన్మ విశిష్టాతి విశిష్టమైనది. సృష్టి మూలమునకు కారణమేమని ప్రశ్నించి, తెలిసికొన ప్రయత్నముచేసే యోచన కేవలం మానవులకు మాత్రమేవుంది. మిగిలిన చరాచర జీవులన్నియు ప్రకృతి నియమాలపాటిస్తూ, స్వయం విచక్షణలేని స్థితిలో వుంటాయి. కావున మానవులు సామాన్య జీవజంతువులులాగాక ఉన్నతాశయాలతో మనుగడ సాగించాలి. కేవలం నిద్రాహారాలు,భయ సంభోగాలతో తమ విశిష్ట అవకాశాన్ని పోగొట్టుకొనరాదు. తమజీవన యాత్రకు అవసరమైన వస్తుసముదాయం మాత్రమే సేకరిస్తూ; దేహాన్ని, మనస్సునూ  ఆరోగ్యంగా ఉంచుకొంటూ తమ బుద్ధిని ఉన్నత ఆశయాలకు, ప్రయోజనకర యోచనకు,  అన్వేషణకు  వినియోగించవలెను. లేకుంటే ఇతరజీవజంతుజాలానికి మానవజన్మకు పెద్దతేడా ఉండదు. మానవజన్మతో వేరొక సమస్యగూడ వుంది , తనతల్లిలాంటి సృష్టినిగూడా నాశనముజేయు చెడుబుద్ధులకు తావుంది, ఏ యితర ప్రాణితో యిలాంటి అపాయముండదు. కావున అందరు మానవజన్మ ప్రాముఖ్యతనెరిగి  తదనుగుణంగా ఉన్నతజీవనానికి పాటుపడాలి. తాము తమ మనుగడకు  సృష్టినుండి పొందిన వనరుల ఋణవిముక్తికి  , తమవంతుగా ఎన్నోరెట్లు ఉపయోగపడే కార్యాలు చేయాలనేది పెద్దలమాట. ఆదైవలీలావిలాసమైన సృష్టినిజూచి కేవలం మానవుడే అబ్బురపడగలడు. ఆదృష్టితోనే దైవం మానవుని సృష్టించాడని శాస్త్రవాక్యంగా చెప్పబడినది.

సృష్టి రహస్యాలనెరిగి,ఆత్మపరమాత్మల అనుభవముపొందిన సద్గురువులకుగూడ ఈసృష్టి జన్మనిచ్చినది. ఆ దైవమే సద్గురు రూపమెత్తి, ధర్మరక్షణా కార్యాన్ని నిర్వహిస్తున్నటుల విజ్ఞులు చెబుతారు. అలాంటి సద్గురువుల సేవించి, దైవాన్వేషణలో ముందుకుసాగాలి , దైవకృపపొందాలి; అదే మానవజన్మకు ధన్యత. సాయిబాబా చూచుటకు ఫకీరులైనను, అంతరంగంలో ఆత్మానుసంధానులు, స్థితప్రజ్ఞులు, భిక్షాటనజేయు శివరూపులు. షిరిడీ వచ్చినకొత్తలో అచటిప్రజలు బాబాను పిచ్చిఫకీరుగా తలచేవారు, చాలాకొద్దిమందిమాత్రమే సాయిని దైవరూపునిగా గుర్తించారు. వారిలో తాత్యాకోతే పాటీలు తల్లి బాయిజాబాయి ఒకరు. అడవులతిరుగు సాయిని వెదుకుచూ, ఆయనకు భోజనంపెట్టక తాను తినని ధన్యురాలాతల్లి.

సాధారణ మానవజన్మనెత్తిన తాత్యాకోతేపాటీలు, మహల్సాపతి  మజీదులోని సాక్షాత్తు దైవరూపునితో ఎన్నోసంవత్సరాలు నిదురించారు, వారిదే భాగ్యంగదా! సాయిబాబా తమభక్తులనెంతో ప్రేమించేవారు, సమీపగ్రామమైన రహతా వెళ్లి గణపతిరావు పాటీలు, చంద్రభాను సేఠ్ ల చూచివచ్చేవారు. రహతావాసులు సాయినెంతో ప్రేమతో ఆహ్వానించేవారు. సాయిసర్వజ్ఞులు. సమీప రహతా,నీమ్ గాం గ్రామాల దాటని సాయికి రైళ్ల రాకపోకలన్నీ విశదములే. సాయియనుమతితో షిరిడీని విడిచే భక్తుల కెలాంటి ఆపదలు కలిగేవికాదు, అనుమతిలేక వెళ్లేవారు కష్టముల పాలయ్యెడివారు.

తొమ్మిదవ అధ్యాయము 

" నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు" యని సాయిబాబా చెప్పారు. అలాంటప్పుడు మనుష్యులకెంత ధైర్యం, బాబాయనుమతిలేక షిరిడీ విడచుటకు? ఈఅధ్యాయములో అలాంటి కొందరి అనుభవాలు చెప్పబడ్డాయి. తాత్యాకోతే పాటీలు ద్వారకామాయికి హడావుడిగా  టాంగాలోవచ్చి, కోపర్గామ్ వెళ్లాలని బాబాయనుమతి అడిగాడు. బాబాయనుమితంచనప్పటికీ  స్వతంత్రించి శ్యామానుగూడా తోడుతీసుకెళ్ళక ప్రయాణంకొనసాగించగ, మరేమైనది ?  దారిలో సాఫుల్ విహిర్ వద్ద టాంగాబోల్తాపడి గాయాలపాలైనాడు. ఇలాగే మరోసారి కొల్హారు గ్రామానికెళుతూ టాంగా ప్రమాదానికి గురైనాడు.

అలాంటిదే ,  మరోసారి ఓ  ఐరోపాదేశపెద్దమనిషి , నానాసాహెబు చాందోర్కరునుండి పరిచయ పత్రంతో షిర్డీ బాబాదర్శనానికి వచ్చి తనకుతగిన గౌరవము లభించలేదని తలచి బాబాయనుమతి లేక షిర్డీ వదలి సావుల్ విహిర్ సమీపంలోనే టాంగా ప్రమాదానికి గురై, కోపర్గావ్  ఆస్పత్రి పాలైనాడు.  దైవాజ్ఞతోనే జీవనయానం సుఖమయం కాగలదు.

జీవులకు తాముజేసే మంచిచెడు పనులవలన పుణ్యపాపాలు ప్రాప్తిస్తాయి. తెలిసో తెలియకో గృహస్తులు తమనిత్యకృత్యాలలో, నిస్సహాయులై యెన్నో పాపాలుచేస్తుంటారు. మరి ఆ పాపాలకు నిష్కృతియేమిటి?  అతిధులకు భోజనము పెట్టుటవలన ఆ పాపోపశమనం కలుగుతుందని శాస్త్రవాక్యం. అందులకే బాబా ఇంటింటికివెళ్ళి వారినుండి భిక్షస్వీకరించి వారిపాప క్షయం జేసేవారు.

దైవ దర్శనానికిగాని, సద్గురుదర్శనానికిగాని ఒట్టిచేతులతో  వెళ్ళరాదు. పత్రంగాని , పుష్పంగాని, ఫలంగాని , లేక కనీసం కొద్దిపాటి నీటినైనా ప్రేమతో సమర్పించుటకు తీసికెళ్ళాలి. భక్తులు మరచితే బాబా మరీగుర్తుజేసి వారినివేదనల యందేవారు. ఆత్మారాం తార్ఖడు సతీమణి  బాంద్రానుండి పుత్రునితో షిరిడీ వచ్చినది. వారు యింట్లో రోజూచేయు పూజ భర్తచేస్తూ ఓరోజు  నైవేద్యమివ్వడం మరచితే, ఈవిషయం బాబా ఆ తల్లిబిడ్డలకు ద్వారకామాయిలో గుర్తుజేసారు. అలాగే యామెపంపిన వంకాయలతో జేసిన  వంకాయ పెరుగుపచ్చడి పురంధరేభార్య  సమర్పింప, తానుతలచిన వేపుడుకూడా కావాలని యడిగారు. మరోసారి  శ్రీమతి తార్ఖడు నివేదించినపిమ్మట పంపిన పాలకోవాను, మైలువడ్డ గోవిందరావు మాన్కరునుండి, గుర్తుజేసి స్వీకరించారు. అదీ, భక్తులపై బాబా అనురాగం!

సర్వజీవులలో సాయివ్యాపించియున్నారుగావున అందరి ఆకలిని సాయి పొందేవారు. శ్రీమతి తార్ఖడు, ఆకలిగొన్న ఓ కుక్కకు రొట్టెవిసరితే, తమయాకలి తీరెనని యామె ద్వారకామాయివచ్చి నపుడు  చెప్పి ఆశ్చర్యపరిచారు. భగవద్గీత, భాగవతము,ఉపనిషత్తులలో భగవంతుడు సర్వవ్యాపిగా చెప్పబడినది, ఇచట బాబా ఆసత్యాన్నే నిదర్శనా పూర్వకముగా  నిరూపించారు. ఇదిసాధారణ విషయంగాదు.

పదవ అధ్యాయము 

సాయిబాబా సదా ఆత్మస్థితిలో విరాజిల్లేవారు. భవసాగరంలోని సామాన్యులందరం, సంసారక్షేత్ర పరిధిలోనివారలమే. ఈక్షేత్రపరిధి, శక్తి చాల తక్కువ. శక్తివంతమైన అయస్కాంత సమీపమునకు వచ్చిన సాధారణలోహము సహితము, అయస్కాంతధర్మము పొందినవిధంగా ; సామాన్యులమైన మనముసహితము, సద్గురు నిత్యస్మరణచే వారిశక్తిక్షేత్రానికి దగ్గరకాగలము, మన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకొనగలము. ఈపధ్ధతిని శక్తిపాతముగా గ్రహింపవచ్చును. కావున సంసారజలధి దాటుటకు సాయిని నావ నడిపే నావికునిగా జేసుకొందాము. పిండికొద్దీ రొట్టెచందాన, భక్తులభక్తిశ్రద్ధలనుబట్టి గురు అనుగ్రహం ప్రాప్తిస్తుంది.

బాబా జీవితమే లీలాసాగరము. వారు జేసే ప్రతిచర్యవెనుక ఓలీలగాని,సందేశంగాని గ్రహింపవచ్చును. కేవలము నాలుగుమూరల పొడవు, జానెడుమాత్రమే వెడల్పుగల చక్కబల్లను గుడ్డపీలికలతో మసీదు దూలములకు వేలాడదీసి, నాలుగుప్రక్కల దీపాలనుంచి శయనించడం కేవలం సాయిబాబాకే సాధ్యమేమో! సాయి పరిపూర్ణులుగావున, బాబా కోరకనే అష్టసిద్ధులు సమకూరాయి.

అల్లకల్లోల అలలకు దూరంగా సాగరగర్భం శాంతికి నిలయమైనటుల, సాయిచూచువారలకు చిర్రుబుర్రులాడినా, అంతరంగములో కంపనములేని పరబ్రహ్మస్థితి స్థిరులు. వారిజీవనము నిరాడంబరతకు నిలువెత్తు దర్పణము. సిరిసంపదలకు,కీర్తిప్రతిష్ఠలకు అతీతులు. వారుసదా స్మరించే ' అల్లాహ్ మాలిక్ '  సాయి అణుకువకు నిదర్శనము.  సాయిగొప్పతనమును  గ్రహింపలేని జనులు నిజంగా దురదృష్టవంతులు గదా!

సాయి ముఖ్య సందేశమేమన సర్వజన సామరస్య జీవనము. హిందూముస్లిములందరు వారికి సమానులు. ఇతరులకు కీడుచేయక, చేయగలిగితే  కేవలం మేలుమాత్రమే చేయండని బాబా ప్రబోధించేవారు. సాయిబాబా సద్గురువులు. వారు కేవలం వాచావేదాంతానికి పరిమితులుగాక, అనుభవమనే  భాషతో భక్తుల సంభాషించేవారు. ఒక్కమాటలో, వారు మానుషరూప దైవము. వారితోజీవించిన షిరిడీప్రజలు ధన్యులు. నిత్యకృత్యములలో సాయిస్మరణచే ఉల్లాసముగా లీలల పాడుకొనెడివారు.

ఎవరైనా భగవతావతారులు యన వారికి ఆరులక్షణాలుండవలెను. ఆవివరుసగా; కీర్తి,ధనము,అభిమానరాహిత్యము,జ్ఞానము,మహిమ,ఔదార్యము. ఈ లక్షణాలన్నీ సాయిలో పుష్కలముగా యుండుటచే వారు భగవత్స్వరూపులుగా లోకం గుర్తించి, కీర్తించింది. అంతటి దైవరూపులు అణుకువలోమాత్రం అగ్రేశ్వరులు. చూచువారలకు వారు ఇంద్రియవిషయాలలో మునిగియున్నటుల గాన్పించినను, ఇంద్రియానుభవాలకతీతులు. కామదహనులు, హనుమంతునివలే యస్ఖలిత బ్రహ్మచర్యులు. పదవులు, గద్దెలంటే వారికీ గిట్టదు. నానావళి కూర్చోదలచినపుడు, తమగద్దెను ఖాళీజేసిన అభిమానరహితులు.

వారుభక్తులకు ఎలాంటి నియమనిష్టలు విధింపక కేవలం 'సాయి,సాయి ' స్మరణ చాలనెడి వారు. ఇలాంటిసులభమార్గాన్ని వదలి, అన్య దారులవెదకటం  అవివేకంగాదా? కావున మన మనసులను అభ్యాసముచే గురుస్మరణలో నింపవలెను. వారిగాధల లీలల సదా గుర్తించుకొనవలెను. కానిఓచిన్న సమస్య, భగవదనుగ్రహం లేక వారికథాశ్రవణం చేయలేము. మహాత్ములకథల వినుటయన, వారిసాన్నిహిత్యముననుభవించుటే! వారిసాన్నిహిత్యముచే సర్వమును పొందగలము. క్రమంగా లోకస్థితినుండి,లోకాతీతస్థితిని పొందగలము. అదియేగదా మానవజన్మచరితార్ధము! అదృష్టదేవత మనల కరుణించుటచేగదా , మనలో సాయిభక్తి వికసించుచున్నది.

పదునొకండవ అధ్యాయము 

ఘనీభవించిన నీటిని మంచుగడ్డని, ప్రవహించేనీటిని జలమనునటుల, భగవంతుడుకుడా రూపం దాల్చినపుడు అవతారపురుషుడని, రూపరహితస్థితిలో పరబ్రహ్మస్వరూపుడని శ్రీరామకృష్ణ పరమహంస వివరించారు. ఆధ్యాత్మిక మార్గంలో తొలుత సగుణోపాసన ద్వారా భగవంతుని సులభంగా ధ్యానింపవచ్చని భగవద్గీతాది గ్రంధాలు సూచిస్తున్నాయి. సాయిబాబాను వేరువేరు భక్తులు వేరువేరుగా తలచినను, అనుభవములపొందిన ముఖ్యభక్తులకు సాయి సాక్షాత్తు భగవంతుడే! సాయిదైవగుణములను లెక్కింపలేము. పావనగంగ సాగరంలో విలీనమునకు ముందు తనమార్గంలోని చెట్లచేమలకు జీవాన్ని, దాహార్తులకు దాహాన్ని దీర్చుచు సాగినవిధంగా, మహాత్ములు తమజీవనగమనములో  జనులకు సుఖశాంతులు ప్రసాదిస్తారు. భక్తులు ఆనందస్వరూపమైన పరబ్రహ్మను సాయిరూపములో అనుభవించిరి. భక్తుల భావానుగుణముగా బాబా వారివారి  సేవలందేవారు. సాయి షిరిడీలో యున్నను, భక్తులు వారి సర్వాంతర్యామిత్వమును నిత్యమూ అనుభవ పూర్వకముగా గ్రహించెడివారు. పరమాత్మ సర్వవ్యాపకుడు గదా!

బాబాను సేవించుటకు తెలివితేటలుగాక, నిష్కల్మష అమాయకపు భక్తికావలెను. డాక్టరు పండితుడు అలాంటి భక్తుడుగావున  యాతడు చందనముతో  నుదిటిపై త్రిపుండ్రాకారము వ్రాసినను బాబా యూరకుండెను. చిర్రుబుర్రులాడినా, కోపతాపములు ప్రదర్శించినా భక్తులపై సాయికి తల్లిప్రేమనుమించిన ప్రేమ. భక్తులనుండి బాబాకోరేదిగూడ ఆలాంటి ప్రేమనే! కళ్యాణ్ నివాసి హాజీ సిద్ధీఖ్  ఫాల్కే తాను మక్కా మదీనా యాత్రలు జేసితినన్న యహంభావముతో బాబానుచూడవచ్చిన, తొమ్మిదిమాసములవరకు యాతనివంకైనను జూడక, తుదకు  యాతని అహంకారము తొలగినపిమ్మట పండ్లబుట్ట, దక్షిణలతో స్వీకరించారు. అహంకారస్వభావులుకిది గొప్ప హెచ్చరిక.

సామర్ధ్యము, మహిమ భగవద్ లక్షణములు. షిరిడీలో గొప్పతుఫాను సంభవించినవేళ తీవ్రహెచ్చరికలతో శాంతింపజేసి ప్రజల యాందోళన పారద్రోలారు. వేరొకపర్యాయము మజీదుకప్పు తాకు ధునిమంటలను, సటకాతో నేలపైకొట్టుచూ తగ్గింపజేశారు. సాయిపై ప్రేమగలిగి వారి మహిమల సదా స్మరించేవారు కష్టములనుండి విముక్తులగుదురు, కోరికలన్నీనెరవేరి కడకు  కోరికారాహిత్యమును  పొందెదరు.

పన్నెండవ అధ్యాయము 

శిష్టరక్షణ దుష్టశిక్షణ యే భగవదవతారకారణము. కాని సద్గురువుల అవతారకార్యము యిందులకు ఓకోణంలో  భిన్నమైనది. వారికి మిత్రులు శత్రువులుండరుగావున సర్వోద్ధరణయే వారిముఖ్యపాత్ర. శిక్షకుబదులు, ఉన్నతస్థితికిజేర్చు శిక్షణ అవతారకార్యంలో ప్రధానంగా గోచరిస్తుంది. వారు తమపుణ్యమువెచ్చించి పాపోద్ధరణ జేస్తారు. వారిపిలుపురాక, వారికరుణలేక భక్తులువారిజేరలేరు. షిరిడీ యాత్రచేయాలన్నా, అచట కొనసాగాలన్నా, తిరుగుప్రయాణం చేయాలన్నా  బాబా సంకల్పంపైనే ఆధారపడియుండేది. కావున సాయిపిలుపునందిన  భక్తులు ధన్యులు. బాబాకు భక్తుల  భూత వర్తమాన భవిష్యత్తులు ఎరుకయే !

కాకామహాజని గోకులాష్టమి యుత్సవముజూచుటకు షిరిడీలో వారముండదలచి వచ్చిన బాబా వానిని మరునాడే పంపివేశారు. నిజంగా మేనేజర్ కు వాని యవసరము కలిగినది. బాబాను దర్శించి నిఫాడ్ పోదలచిన ప్లీడరు ధుమాల్ ను వారముంచారు, మాజిస్ట్రేటుకు కడుపునొప్పిచే కేసు వారం రోజులపాటు వాయిదాపడింది. బాబా సర్వజ్ఞులుగదా! బేలాపూరులో జబ్బుపడినకుమారుని జూడదలచు నిమోన్కరు భార్యను  భర్త మరుదినమే రమ్మనినా,  బాబా నాలుగుదినముల యనుమతినిచ్చిరి.

బాబా భక్తుల వశీకరించు  శక్తి అద్భుతము. బాబాను ముస్లిమని తలచిన ములేశాస్త్రికి తమగురువగు  ఘోలప్ స్వామి దర్శనమిచ్చి వాని భక్తివిశ్వాసాల పెంపొందించారు. సాయిని  ముస్లిముగా దలచు రామభక్తుడైన డాక్టరుకు రామదర్శనమిచ్చి ఆశ్చర్యపరచారు. ఈఘటనలలో భక్తులపట్ల బాబా కారుణ్యము, సర్వజ్ఞత మిగుల వ్యక్తమౌతోంది!  

పదమూడవ అధ్యాయము 

సాయిబాబా వారి జీవనవిధానము నిరాడంబరతకు దర్పణము. వారిమాటలు క్లుప్తములు, సందేశాత్మకములు , అర్ధవంతములు, శక్తివంతములు, స్థితప్రజ్ఞ ప్రబోధములు. మాయ తననుగూడ వదలక బాధిస్తుందని బాబా చెప్పుటచే మనమెంత జాగరూకులైయుండవలెనోగదా! నిరంతర హరినామ స్మరణమే దానికి విరుగుడుగా సాయి సూచించారు. కావున దైవస్మరణ మరువరాదు.  ఎవరు  అదృష్టవంతులో , ఎవరు పాపరహితులో వారే సాయిని భజించగలరని  స్వయముగా సాయే చెప్పియున్నారు. కేవలము సాయినామ స్మరణచే  సప్తసాగరముల దాటించెదనని అభయమిచ్చారు. పూజాతంతులుగాని , షోడశోపచారములుగాని, నియమనిష్టల గూడిన  అష్టాంగయోగసాధనలతోగాని పనిలేక కేవలము తమపట్ల భక్తికలిగిన చాలనెడి అతిసులువైన మార్గాన్ని సాయి మనల కందించారు.  కావున వారిమార్గంలో నడవడం అదృష్టముగా భావించాలి, కాని మరోసందర్భంలో చెప్పినటుల మావిడిపూతలా మధ్యలో రాలిపోక పండుగామారి, జీవితముల ఫలవంతము జేసుకోవాలి. వారిపట్లశరణాగతిభావము నిత్యకృత్యముగా జేసుకోవాలి. అట్లైన సాయి మనకెంతో దూరానుండరు, మనముగూడ సాయిసమీపములోనే  యుంటాము.

నారాయణగావ్ నివాసి భీమాజీపాటిలు క్షయవ్యాధితో బాబా వద్దకురాగా, పూర్వజన్మకర్మఫలముగా కలిగినవ్యాధియని, తానుజోక్యంజేసుకోనని పలికారు. కాని యాతడు బాబాను శరణాగతికోరి దీనముగా ప్రార్ధించినపిమ్మట సాయివాని కర్మఫలముల క్షీణింపజేసి రోగముక్తునిజేశారు. కృతజ్ఞతగలిగిన భీమాజీపాటిలు మహారాష్ట్రలో ప్రధమంగా సాయిసత్యవ్రతముజేయుట ప్రారంభించాడు. సాయిబాబా కర్మధ్వంసులుగా చెప్పబడ్డారు. కర్మఫలముల వలన  భక్తులకు కలిగిన వేరువేరు వ్యాధులను   తమ కారుణ్యంతో నివారించారు. బాలాగణపతి షింపి  మలేరియా జ్వరమునుండి, బాపుసాహెబు బూటీ  విరేచనము వాంతులనుండి, ఆళందిస్వామి చెవిపోటునుండి, కాకామహాజని విరేచనములనుండి, దత్తోపంతు కడుపునొప్పినుండి, శ్యామా మూలవ్యాధినుండి, మరియు  గంగాధరపంతు, నానాసాహెబ్ చాందోర్కర్ లు తమ  కడుపునొప్పుల నుండి  ముక్తులైనారు. బాబావాక్కు బ్రహ్మవాక్కుగావున కేవలము తమమాటలతోను, ఆశీస్సులతోను భక్తుల రోగముక్తులజేశారు. పైకారణముల మూలమున ,  సాయిశరణాగతిపొంది మనందరముగూడ ఆరోగ్యజీవనము గడిపెదముగాక!

భీమాజీపాటిలు రోగాన్ని బాబా యెలా నివారించారో పరిశీలించెదము. రోగికి అంతఅనుకూలముకాని భీమాబాయి యింట్లో బసచేయించారు. రెండుస్వప్నానుభవాల నిచ్చారు. మొదటికలలో పద్యములు  సరిగ్గా ఒల్లింపకపోవుటచే ఉపాధ్యాయునిచే దెబ్బలుతిన్నాడు. రెండవస్వప్నములోగూడ ఛాతీపై పెద్దబండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే బాధననుభవించాడు. రెండుబాధలుగూడా యాతనికి  కలలో కలిగిన యనుభవమేగాని, జాగృతిస్థితిలోకాదు. సాయిబాబా యెంతటి సమర్ధులంటే, క్షయవ్యాధికారకమైన యాతని భయంకర  పూర్వ పాపకర్మనుగూడ, కేవలము స్వప్నానుభవంతో తుడిచివేసారు. అంటే కొండంత భారాన్ని గోటిదెబ్బతో తొలగించారన్నమాట. ప్రాణాంతక ప్రమాదాలు, రోగాలు కూడా బాబాదయతో చిన్నచిన్న ప్రమాదాలు, బాధలుగా మారడం భక్తుల యనుభవాల్లో చూస్తాము. నానాసాహెబు చాందోర్కరు పెద్దగుర్రబండి ప్రమాదమునుండి, చిన్నదెబ్బలతో బయటపట్టాడు. పిళ్లే పదిజన్మల యనుభవింపదలచిన గినియా పురుగుల  భాధను , బాబా ఉదినిచ్చి కేవలము పదిరోజులలో కుదిర్చారు.  కావున సాయిబాబా కర్మనివారణా పద్ధతులు అనూహ్యములు, ఆశ్చ్యర్యకరములు.

 పదునాలుగవ అధ్యాయము 

పెక్కుజన్మల పుణ్యఫలముచే మనకు లభించిన యరుదైన మానవజన్మను ఉన్నతాశయములకై వినియోగింపవలెను. సృష్టి స్థితి లయములకు మూలకారణశక్తి నెరుగవలెను. సత్య శోధన గావింపవలెనేగాని, తదితర జీవకోటిలా ఆకలి, నిదుర, భయభోగాలతో మనిషిజన్మ యవకాశమును వ్యయపరచరాదు. రేయిపగలు సాయిని గుర్తుంచుకోవడము, సాయియనుగ్రహప్రాప్తికి ఓ చక్కటి మార్గముగా నిచట చెప్పబడినది.
నాందేడు పార్సీ వర్తకుడు రతన్ జీ షాపుర్జీ వాడియా. అతనికన్నియున్నను, సంతానములేకుండుటచే మిగుల చింతించుచుండెను. దాసగణు సలహాపై బాబాను దర్శించి ఫలపుష్పాల నర్పించాడు. దక్షిణగా ఐదురూపాయలివ్వదలచిన వానినుండి కేవలము ఒక్కరూపాయి, రెండు అణాలు మాత్రమే స్వీకరించి పూర్వము మిగులసొమ్ముపొందినటుల పలికారు. బాబా  ఆశీర్వచనములు పొంది సంతోషంతో రతంజీ వెనుదిరిగాడు. ఆపై దాసగణునితో యోచించి తాను పూర్వము మౌలాసాహెబను యోగిని సత్కరించ, అందులకు తాను మూడురూపాయల పదునాలుగణాలు వెచ్చించినటుల గుర్తించాడు. కొద్దికాలము పిమ్మట యతనికి పుత్రసంతానము కలిగెను. ఆ దంపతుల యానందమునకు మితిలేకుండెను.

ఇచట రతన్ జీ కోరిక నెరవేరుటకు ముఖ్యముగా మూడు కారణాల చెప్పవచ్చును. మొట్టమొదట యాతడు బాబాను శరణువేడాడు, ఆపై దక్షిణసమర్పించాడు. షిరిడీ వచ్చుటకుముందుగనే మౌలాసాహెబను సత్పురుషుని సేవజేసాడు. తానుజేసిన ఈపుణ్యకార్యముల ఫలితముగా పుత్రసంతానాన్ని పొందాడు. కావున సద్గురుని శరణాగతివేడుట, దానధర్మములు జేయుట మరియు సాధుసంతుల సేవించుట ఇష్టకామ్య ఫలసిద్ధికి దోహదకారులుగా గుర్తింపవచ్చును. బాబా దక్షిణల స్వీకరించి భక్తుల చెడుకర్మల పారద్రోలేవారు. దక్షిణ కేవలము ద్రవ్యరూపముగా గాక సద్గ్రంథపఠనరూపముగాను, చెడుగుణముల విసర్జనగాను బాబా గ్రహించేవారు. అందరినినుండి దక్షిణగ్రహింపక , కేవలము బాకీపడ్డవారలనుండి మాత్రమే స్వీకరించేవారు. దక్షిణద్వారా భక్తులకు ధనపిపాస, ధన వ్యామోహాలు తగ్గుముఖం పడతాయి. తానుస్వీకరించిన దక్షిణల అదేరోజు సాయంకాలానికి దానధర్మాల ఖర్చుపెట్టేవారు. కావున దేవుడిచ్చినసంపదను సత్కార్యాలకు వెచ్చించవలెను. లేనియెడల పుణ్యఫలము క్షీణించినపిమ్మట మరుజన్మములలో పేదరికమనుభవింపవలయునని పెద్దలు చెప్పెదరు. మరియు మానవుడు ఆధ్యాత్మిక మార్గములో ముందుకెళ్లుటకు ధనవ్యామోహము, స్త్రీ లోలత్వము  తగ్గించుకొనవలెను.

పదునైదవ అధ్యాయము 

ఆధ్యాత్మమార్గంలో ప్రయాణం చేయునప్పుడు మన వస్త్రధారణ గాని , ప్రవర్తనగాని చాల అణుకువతోడను, నిరాడంబరముగను యుండవలెను. ఇదేవిషయం బాబా  షిరిడీలో  హరికథచెప్ప బయలుదేరిన దాసగణుకు బోధించారు. సాయిబాబా దాసగణుని కేవలము నిమిత్తమాత్రునిజేసి తమ కీర్తి మహిమలను దూరదూర ప్రాంతములవరకు వ్యాపింపజేశారు. దాసగణు మహారాజు తన భక్తి భావోద్రేక గానామృతంతో ఎంతోమందిని సాయిమార్గంలో నడిపించారు.

ఠాణాలోని కౌపీనేశ్వర ఆలయంలో దాసగణు జేసిన భక్తిమయ  సాయిమహిమరసామృతమునకు చోల్కర్ యను నతడు మిగుల చకితుడైనాడు. అతడు కడుపేదవాడు, ఠాణా సివిల్ కోర్టులో తాత్కాలిక యుద్యోగి. తాను ప్రభుత్వ పరీక్షలో పాస్సయ్యి, శాశ్విత ఉద్యోగముపొందిన షిరిడి వెళ్లి బాబాను సేవించుకొనునటుల మనమున నిశ్చయించుకొన్నాడు. బాబా యనుగ్రహంచే యటులే పరీక్షలో కృతార్థుడై శాశ్వితోద్యోగము పొందాడు.
షిరిడీ వెళ్ళుటకు తనసొంత ఖర్చుల తగ్గించుకొని కొంత డబ్బు సమకూర్చుకొన్నాడు. చక్కెరలేని తేనీరు త్రాగాడు. పొదుపైన పైసలతో షిరిడీవెళ్లి, బాబాకు ప్రణమిల్లి, తానుతెచ్చిన నారికేళము సమర్పించి, సాయిపేర అందరికి కలకండ పంచాడు. చోల్కరుతో తిరుగువెడలు జోగును బాబా  పిలిచి అతిథికి మిగుల చక్కెరల తేనీరివ్వమని చెప్పారు. తనఅంతరంగ  నిర్ణయమెరిగిన బాబాశక్తికి పరవశుడై చోల్కరు బాబాకు మరల ప్రణమిల్లాడు. ఇందుపూర్వకముగా మనకు తెలిసేదేమంటే బాబా కరుణామయులు, సర్వజ్ఞులు, సమర్థులు. భక్తితో చేతులుజాపిన రేయింబవళ్లు మనవెంటే మసలుతానని, సప్తసముద్రాల వెలుపలగూడా మనపనులు తనఎరుకలోనివేయని, తానుభక్తహృదయ నివాసియని పేర్కొన్నారు. తననీవిధముగా గ్రహించిసేవించువారు ధన్యులుగా బాబా పేర్కొన్నారు. కావున మనము వారి సర్వజ్ఞతను, కారుణ్యహృదయాన్ని, సమర్ధతను నిత్యమూ గుర్తుంచుకోవాలి.

బాబాసర్వజ్ఞతను చాటు మరోఉదాహరణ యీ అధ్యాయములో చెప్పబడినది. ఓభక్తుడు గోడపైనున్న బల్లి టికు టికు శబ్దమునకర్ధమడుగ, ఔరంగాబాదు నుండి తనను చూడవచ్చు చెల్లి రాకయే దానిసంతోషకారణమని బాబా పలికారు. అటులనే జరిగినది. ఓరంగాబాదునుండి బాబాను చూడ వచ్చిన భక్తుని సంచినుండి ఓబల్లి వెల్వడి అందరు చూచుచుండగా గోడపైకి బ్రాకి రెండవబల్లితో యానందముగా నాడెను. కావున బాబాసర్వజ్ఞతను,కారుణ్యమును,సామర్ధ్యమును, సాన్నిహిత్యమును  మనము సదాగుర్తిస్తూ వారిని సదా స్మరిస్తూ వారిరక్షణా వలయంలో నిర్భయముగా నుండెదముగాక!           

16-17 వ అధ్యాయములు 

బ్రహ్మజ్ఞానమును పొందవలెనన్న పేరాసను విడువవలెను. ధనికుడు బ్రహ్మజ్ఞామునకై బాబా వద్దకు వచ్చినను ధనపిపాస విడువలేకుండెను. బాబా తనది నగదు బేరమేగాని యఱువుబేరము కాదని చెప్పారు. ధనవంతుని పరీక్షించుటకై ఒక బాలుని నాలుగిండ్లకు 5 రూపాయల అప్పుకు బంపినా ధనికుడు మిన్నకుండెను. బ్రహ్మజ్ఞానము పొందుటకు పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు,బుద్ధి,అహంకారము యను 5 రూపాయల నర్పించవలెను. అందులకు ఈక్రిందచెప్పబడిన అర్హతలు కావలెనని చెప్పారు. వరుసగా అవి ముముక్షుత, విరక్తి, అంతర్ముఖత, పాపవిమోచన,సరియగు నడవడి, ప్రియములుగాక శ్రేయములయందు ఆసక్తి, మనసు ఇంద్రియముల స్వాధీనత, పావన మనసు, గురువుయొక్క ఆవశ్యకత, భగవంతుని కటాక్షము.

బాబా పైవిషయములజెప్పి , యాతని జేబులో 5 రూపాయలకు 50 రెట్లు డబ్బుందని పలుక, యా పెద్దమనిషి జేబునుండి నోట్లకట్ట బయటకుదీయ , సరిగా 10 రూపాయల నోట్లు 25 యుండగా, అందరు ఆశ్చ్యర్యపడిరి. మనిషి పేరాశ వదలనంతవరకు ఆధ్యాత్మిక జ్ఞానము లభింపదని బాబా పలికారు. పేరాశ, బ్రహ్మజ్ఞానములు ఉత్తర దక్షిణదిక్కులనియు, పేరాశయున్నంతవరకు ఆధ్యాత్మికసాధనలన్నియు వ్యర్ధములని ఉపదేశించారు. బాబా తనఖజానా నిండుగాయున్నదని చెప్పారు. కాని దానినిపొందాలంటే తగిన యోగ్యత కావాలని గట్టిగాచెప్పారు. బాబాగారి దైవశక్తే వారి ఖజానాగా మనమెరగాలి, ఆ ద్రవ్యముపొందుటకు తగిన అర్హతసంపాదించాలి. అప్పుడే సాయికృపయను ద్రవ్యరాశి మనకు ప్రాప్తిస్తుంది. ధనికుని నెపముజేసి బాబా పంచిన యమృతబోధను దగ్గరున్న వారందరు యాస్వాదించారు. 

18,19 అధ్యాయములు 

ఈ అధ్యాయములు శ్రీసాయిసచ్చరిత్రమునకు హృదయసమానములు. ఇందు హేమాద్రిపంతును బాబా ఏవిధముగా ఆశీర్వదించెనో వివరరములతోపాటు, పెక్కు ఇతరఉపదేశముల జేసిరి. సాఠే యనునతడు షిరిడీలో 7 రోజులలోనే  గురుచరిత్రము  పారాయణము పూర్తిజేసి సాయిస్వప్నమును, మరోమారు పారాయణముజేయు సందేశమును పొందెను. ఈవిషయముల నెరిగి హేమాద్రిపంతు మనసు అసూయచే  కలవరపడ, బాబా వానిని  శ్యామాయింటికిపంపించి  వాని నోటితో గురువుపట్ల సర్వశ్య శరాణాగతియే సర్వమనియు, ఎలాంటి మంత్రోపదేశముల, ఉపవాసముల  పనిలేదను సంగమనేరు నివాసి రాధాబాయి అనుభవగాథను చెప్పించారు. బాబా చెప్పక చెప్పిన సందేశమిది కావున సర్వులకు ప్రయోజనము జేకూర్చుచున్నది. తాబేలు వేరొకఒడ్డుపైనున్న తనపిల్లల కేవలం చూపులతో పెంచిపెద్దజేసినట్లు, సద్గురు కరుణావీక్షణాలే శిష్యులకు సర్వము సమకూర్పగలవను సత్యమును, సాయిసందేశముగా  హేమాద్రిపంతు  గ్రహించాడు. ఈసత్యమునెరిగిన హేమాద్రిపంతును దీవించినటుల, సాయిబాబా మధ్యాన్న ఆరతి యనంతరము వానిచేతిలో తీపి కలకండ బెట్టి ఆశీర్వదించారు.

ఎవరైనా ఋణాను బంధముచేతనే మనల కలుస్తారని , కావున ఎవరిని తక్కువచేయరాదని, చేయగలిగిన సహాయం చేసి వారికి మేలుకుర్చాలని పలికారు. పరనిందపాపమనియు  నిందించువాడు, నిందితుని పాపముల తుడిచి తాను ఆ పాపముల యనుభవిస్తాడని బాబా చెప్పారు. మరియు సాయిబాబా తమశిష్యులలో మంచియాలోచనల ప్రేరేపించేవారు. గురువారమంతయు రామస్మరణ  జేయదలచు హేమాద్రిపంతు మజీదు వచ్చినపుడు, ' గురుకృపాంజన్ పాయో మేరే భాయ్' యను చక్కని పాటను, ఔరంగాబాదు గాయకుడు శ్రావ్యముగా పాడగా విన్నాడు. నిరంతర సాయిధ్యానముచే, నది సాగరంలో సంగమించినటుల భక్తుడు సాయిలో ఐక్యమగును. వేరువేరు భక్తులకు వారిస్వభావముల ననుసరించి,; వేరువేరు పనుల జేయించెడివారు, వేరువేరు మార్గముల సూచించెడివారు.

కావున సాయిని వేరు వేరు విధముల సేవించు భక్తులు తమ మధ్య వైషమ్యులు కలుగకుండా జాగ్రత్తపడాలి. సాయి అందరివాడేయనెడి సత్యమును మరువరాదు. మరియు సాయితో సంబంధము ప్రతివ్యక్తికి వ్యక్తిగతమని  గుర్తించాలి. ఒకే కుటుంబములోనివారైనను ప్రతివ్యక్తికి బాబాతో యనుబంధము ప్రత్యేకము, వ్యక్తిగతము. అందరికకీ  ఒకేయనుభవము కలుగవలయునను నియమములేదు. మనము ఎవరి శ్రమను ఉంచుకొనక ధారాళముగా ప్రతిఫలమివ్వవలెను.

20 వ అధ్యాయము 

మన బుద్ధి స్వయం ప్రకాశములేక, ఆత్మప్రకాశమునుండి తన ఉనికిని సంపాదించుకొన్నదని భగవాన్ రమణమహర్షివంటివారు అనుభవపూర్వకముగ బోధించారు. దాసగణు మహారాజు ఆధ్యాత్మిక పుస్తకములనెన్నింటినో చదివియున్నాడు. తన బుద్ధి జ్ఞానముతో ఈశోపనిషదుకు వ్యాఖ్యానము వ్రాసినప్పటికీ, ఉపనిషదు మూలభావమెరుగక, బాబా సాయము కోరగా, వీలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితు పనిపిల్లద్వారా యాతని సమస్యతీరునట్లుచెప్పారు. దాసగణు వీలేపార్లేలోని దీక్షితుయింటికి వెళ్లి పనిపిల్లను చూసాడు. ఆమె చిరుగుబట్టలలోను, కొత్తచీరలోను, మరల మునుపటి పాతచిరుగులలోను, అనగా వేరు వేరు స్థితులలోను ఒకేరకపు ఆనందభావమును వ్యక్తపరచినది. అలాగే తీరికలేని పనిలోనూ యామె స్వభావము సంతోషమయమే! భగవంతుడు సదా రక్షించువాడనియు, సర్వవ్యాపకుడనియు, మనకు ప్రాప్తవస్తువులతో సుఖముగా నుండవలెనను సత్యమును దాసగణు మహారాజు పనిపిల్ల ద్వారా  గ్రహించెను. బాబా ఉపదేశ మార్గములనేకములలో యిదియొకటి.

ఉపనిషదులలో ముఖ్యముగా ఆత్మతత్వమునుగూర్చి చెప్పబడినది. ఆత్మ సర్వవ్యాపకము, సదాప్రకాశవంతము. బాబా జీవితమును గాని , వారిమహిమలనుగాని పరిశీలించి ఈసత్యమునెరుగగలము. ఉపనిషదులలో వివరింపబడిన ఆత్మస్వరూపే బాబాయని తెలియగలము. బాబా లీలాజీవితమును శ్రద్ధతో గమనించిన, ఉపనిషత్తుల బోధ సులభముగా గ్రహింపగలము. కేవలపఠనముచే ఉపనిషత్తుల సందేశము సులభగ్రాహ్యముకాదు. బాబా సర్వవ్యాపి, సమస్తచరాచరములలో నిండియున్నారు. వారికి అందరు సమానులే. వేరులేని అస్థితిలో  నేను నీవను  భావమునకు తావులేదు. అట్టి భావమును నిరంతరము కలిగియుండిన దుఃఖమునకు తావులేదు. అలాగే సాయిబాబా నిత్యపూర్ణకర్ములు, ఎలాంటి విరామమూలేక, సదా భక్తరక్షణా, భక్తపాలనా  కార్యనిమగ్నులు. అలాగే మనంగూడ జ్ఞానప్రకాశ కర్మల సదా ఆచరించి ఆనందమయజీవితమును గడుపవలెను. స్వహిత, పరహిత కర్మలతో మనుగడ కొనసాగింపవలెను. ఉపనిషదుల సందేశములను, జీవనవిధానంలో మిళితము జేయవలెను. ఎలాంటి సోమరితనమునకు తావివ్వరాదు.

21 వ అధ్యాయము 

తమవంతు రానిదే ఎవరూ సాధుసంతులను కలవలేరు. హేమాద్రిపంతు బాబా కరుణవలననే సాయిని సేవించగలిగెను. యోగులు, యితర యోగుల అంతరంగమెరుగుదురు. రతంజీ వాడియా మౌలాసాహెబును సత్కరించుటకు ఖర్చుపెట్టిన మూడురూపాయల పదునాలుగు అణాలు, దక్షిణగా తనకు అందినది సాయి చెప్పియున్నారుగా! అలాగే వడగాంలో అప్పాయను కన్నడయోగి వినాయక హరిశ్చంద్ర ఠాకూరుకు చెప్పినసందేశము బాబాయెఱిగి యున్నారు, ఠాకూరు  నాన్హే ఘాటు ప్రయాణ కష్టాలనెఱిఁగియున్నారు. వీనిద్వారా బాబా సర్వజ్ఞులనెడి సత్యము మరల తెలియడమైనది. కేవలము పుస్తకజ్ఞానము చాలదనియు, చదివిన విషయములగూర్చి  జాగర్తగా విచారించి, అర్ధముజేసుకొని, ఆచరణలో పెట్టవలెననెడి సందేశమును బాబా ఠాకూరుకు చెప్పారు. అలాగే బాబాబోధను , బాబాభక్తులెల్లరు తమ తమ ఆచరణలలో పెట్టనిదే ఉపయోగముండదనెడిది యిచటి సాయి సందేశము.

అనంతరావు పాటంకరు వేదముల,ఉపనిషత్తుల, పురాణముల పఠించినప్పటికీ మనఃశాంతి పొందక యుండెను. అందులకు యాతని పుస్తకజ్ఞానము భక్తిగా మారకపోవడమే కారణము. సాయి వర్తకుని కథజెప్పి, తొమ్మిదిలద్దెలనెడి భక్తిని కలిగియుండమని బోధించారు. అనగా భగవంతుని జేరుటకు పుస్తకజ్ఞానమే చాలదనియు, ఆ జ్ఞానముచే   భగవంతునిపట్ల భక్తినిపెంపొందుచుకొనవలె ననెడిది బాబా సందేశము. శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, నమస్కార, దాస్య సఖ్యత్వ, ఆత్మనివేదన లనెడి  తొమ్మిది భక్తి దారులలో ఎదో యొకటి ఎంచుకొని పరమశాంతి పొందవలెనని బాబా చెప్పారు. అనగా దైవంపట్ల, దైవరూపులైన సద్గురువుల పట్ల భక్తిని పెంపొందించుకొని మనఃశాంతి పొందవలెనని  మనమెరుగవలెను.

పండరీపుర ప్లీడరు విషయములోగూడా బాబా సర్వజ్ఞత వెల్లడవుతుంది. దగ్గరకు వచ్చి నమస్కారముజేసి, దక్షిణ యిచ్చినప్పటికి, పూర్వము పండరిలో నూల్కరు, బాబాలను ప్లీడరు నిందించుట సాయి ఎరుకలోనిదే. కావున దగ్గరగాని, దూరముగాని సాధు సత్పురుషులపట్ల గాని,  పరుల పట్ల గాని   నింద మరియు  యనవసరపు వ్యాఖ్యలు  పనికిరావు.

22 వ అధ్యాయము 

బాబాపై ధ్యానమునకొక చక్కని మార్గము, వారిపాదములపై దృష్టి నిలపడం. బాబా ప్రబోధము సందర్భములబట్టి మనమూహింపనిరీతిని  వేరువేరుగ నుండెడిది. వారిలీలలు లెక్కింప సాధ్యము కానివి.

బాబావారి సర్వజ్ఞత, కారుణ్యత  వారిలీలలన్నిట ప్రతిబింబించేవి. చితలీ గ్రామపర్యటనకు వెడలు మిరీకరుని ముందుపలికి, సర్పగండమునుండి కాపాడారు. బాబా భక్తుడు  శ్యామా బాబాకు మిక్కిలి ప్రియుడు. మిరీకరునితో చితలీ వెళ్ళడము బాబారక్షణకవచముగా  మనమెరుగవలెను. ఈవిధముగనే బాబా ముందుపలికి బూటీని ప్రాణగండమునుండి కాపాడారు. చావడిలోగూడా బాబారక్షణా యనుభవముల అమీర్ షక్కర్ , అబ్దుల్లా గాంచిరి. పురాణకాలక్షేప సమయమున హేమద్పంతును తేలుకుట్టకపోవడం బాబా భక్తరక్షణా లీలగా గ్రహింపగలము. కాకాసాహెబు మేడపై కిటికీలోకి పామువచ్చినా బాబాకృపతో యెవరికెలాంటి యాపద వాటిల్లలేదు. చంపుట మాని సర్వజీవుల ప్రేమించవలెనని బాబాపలికారు. ఈ అధ్యాయములో బాబా సర్వజ్ఞత, భక్తులపట్ల వారి వల్లమాలిన దయ యెంతయో సుస్పష్టము.

                                                                       23 వ అధ్యాయము 

సదాపరిణామశీలమగు దేహము,గుణములే తన స్వరూపముగానెంచి,  ఆ భావనలకు యనుగుణముగా  చేయు కార్యములెల్లను జీవుని నిజతత్వమునకు దూరముగా తీసుకెళ్తాయి. నిజతత్వములో స్థిరముగా ప్రతిష్ఠుతులైన సద్గురుని శరణాగతితోడనే తననిజరూప నైజాన్ని వ్యక్తి గ్రహించగలడు. తనస్వస్వరూపమునెరుగుటకు ఎంతో శక్తిమయ జ్ఞానమవసరము. అట్టిజ్ఞానము, శక్తి కేవలము సద్గురుని పాదముల ఆశ్రయించుటవలననే లభించును. సాయి సాక్షాత్తు దైవస్వరూపులైనను సాధారణమానవునివలె జీవించారు. తాము విశ్వాత్మ రూపులుగావున, అందరిలోని ఆత్మప్రకాశమును వారుగాంచెడివారు, అందరి  యనుభవముల తాము పొందేవారు. 'అల్లామాలిక్' ఉచ్చారణే వారి నిరంతర స్మరణ. కేవలము మన పుణ్యఫలముచేతనే సాయినాథుని లీలాశ్రవణము జేయుచున్నాము.

కేవలము యోగాభ్యాసముల, గ్రంథపఠనల వల్ల  దైవానుభవము కలుగదు. ఆహారపుటలవాట్లచే దేవుని గాంచలేము. రొట్టెను పచ్చిఉల్లిపాయతో తిను సాయి తనకేమి మేలుజేయగలడను సందేహమనస్కుడైన సాధకుని అంతరంగమెరిగిన బాబా, జీర్ణించుకొనగలవారే దానిని తినవలెనని పలికినపుడు, బాబా సర్వజ్ఞతకు శక్తికి యాతడు పాదాక్రాంతుడైనాడు. స్వచ్ఛమైన మనసుతో తనకష్టముల దెలిపి బాబా యూది, ఆశీసుల పొందాడు.
కొన్నిసంఘటనలవలన వ్యక్తుల భక్తి విశ్వాసాలు వ్యక్తమౌతాయి. శ్యామా విశ్వాసమట్టిది. తనను పాముగరచినా, సాయినే దైవంగా నమ్మి ద్వారకామాయికి వెళ్ళాడేగాని, పాముకాట్లు బాగగు విఠలుని గుడికి వెళ్ళలేదు. ఆతని విశ్వాసమే యాతనికి రక్షగా నిలిచినది. బాబా కేవలము తమనోటిమాటలచే యాతని పామువిషవిముక్తుని జేశారు. మాయ సముద్రములాంటిది, దాని దాటుటకు బాబా పాదముల హృదయమందు ధ్యానింపవలెను.
బాబా  మూఢవిశ్వాసముల నొప్పుకొనెడివారుకాదు. షిరిడీలో కలరావ్యాపించినపుడు, గ్రామస్తులు కట్టెలు కొనగూడదను జేసిన నియమమును తిరస్కరించి, బండివానినుండి కట్టెలు కొన్నారు. అట్లాగే గురు పరీక్షకు నిలబడగల విశ్వాసమే, విశ్వాసము. బాబా ద్వారకామాయిలో ముసలి మేకను నరకమన్నపుడు, మిగిలినవారందరు తప్పుకొనగా, చంపుట యెరుగని స్వచ్ఛమైన బ్రాహ్మణుడు దీక్షితు గుర్వాజ్ఞ పాలనకు  సిద్ధమైనాడు, అందుకే యాతడు సాయికి అంకిత భక్తుడైనాడు. ఆతనికి, బాబా ఆఙ్ఞయే వేదవాక్కు.

సాధారణశిష్యులుగా నుండక, దృఢమైన నమ్మకము, బుద్ధికుశలతలు కలిగియుండిన ఆధ్యాత్మిక పరమావధి దూరముకాదు. అందులకు అందరమూ ప్రయత్నింపవలెను.

24 వ అధ్యాయము 

సాయిలీలా శ్రవణ , మననములు జీవితపరమావిధి పొందుటకు చక్కటి ఉపాయము. సాయి తమ హాస్య, చమత్కారములతో భక్తులనొప్పింపక ఆనందపరచేవారు. హేమాద్రిపంతు కోటుకు శనగలు అంటిన కథ ఇందులకుదాహరణము. పంతు ఆదివారపు సంతకెళ్లకపోయినా, యాతని బట్టలకు శనగలు అంటుకోవడం ఓ వింతగాభావించవచ్చును. ఈసందర్భాన్ని పురస్కరించుకొని బాబా సర్వులకు చక్కటి నీతిని బోధించారు. మనకు లభించిన ఆహారమంతయు భగవద్ప్రసాదమేగదా! కావున తినుటకు ముందు భగవదార్పితముగా తినవలెను. మనయనుభవములన్నియు పంచేంద్రియ జనితములు కావున, ఆయాపనులకుముందు అనగా ఆయా ఇంద్రియకార్యములనిర్వహణకుముందు, వాటిని దైవార్పణ భావముచే చేయవలెను. ఇట్లు దైవార్పణబుద్ధిచే చేయుటచే, మనము మంచి పనులనే జేసెదము, మంచి యాలోచనలనే జేసెదము. క్రమంగా అంతఃకరణము శుద్ధిపొంది మనలో సాత్వికభావములు పెంపొందును. శుద్ధ అంతఃకరణముచే జేయు కార్యములకు మంచి ఫలితములు కలుగును. కావున ' శ్రీకృష్ణార్పణమస్తు ' యనిగాని, ' శ్రీసాయినాథార్పణమస్తు '  యనిగాని హృదయపూర్వకముగా తలచి తినుట, ఆలోచించుట చేయవలెను. ఇట్లు రోజంతా చేయుటచే సాయిరూపదైవము మన స్మరణలో నిలుస్తాడు. క్రమముగా యిదే ధ్యానముగా మారుటచే, సాయి సదా మనచెంతనే యుంటారు. సదా వారి రక్షణ ప్రాప్తిస్తుంది.

చెంతనున్న సహపాటి  శ్రీకృష్ణునకర్పింపక తినుటచేతను, యసత్యములాడుటచేతను సుదాముడు దారిద్య్ర మనుభవింపవలసి వచ్చెను. తుదకు ప్రేమభావంతో భార్యచేసిన యటుకుల సమర్పించి   శ్రీకృష్ణుని యనుగ్రహముచేతనే సిరిసంపదలు పొందాడు.  బాబా తమ చాతుర్యపు మాటలచే  తమను సేవించుచున్న అన్నా చించణీకరు , మావిశీబాయి పోట్లాట నాపి యచటివారందరిని ఆనందపరచారు. బాబా ఎల్లవేళల భక్తులను వారివారి భావాలకు అనుగుణంగా తమసేవ జేయనిచ్చెడివారు. ఎవరిభక్తి ఎలాంటిదో బాబాకే ఎరుక. మావిశీబాయి బలంగా బాబా పొత్తికడుపు తోమునప్పుడు, యితర భక్తులు జేసిన ఆక్షేపణలకు మిగుల క్రోధితులైనారు. ప్రతిభక్తుని సేవ బాబాపట్ల వాని  వ్యక్తిగతమనియు , సేవ కేవలము బాబాకు, మరియు  చేయు భక్తునికి మాత్రమే సంబంధించినదిగా మనమెరుగవలెను. ఇతరులభావాలకు, యాక్షేపణలకు  తావులేదు.

25 వ అధ్యాయము 

శ్రీసాయినాథులు యోగిచూడామణి, సమస్తశుభములకు నిలయము, ఆశ్రయదాత. మనకు కావలసినది వారిపై పరిపూర్ణభక్తి,నమ్మకములు మాత్రమే! రచయిత కేవలము సాయి అనుగ్రహముచేతనే గ్రంథరచనచేసాడు. హృదయమంతా సాయిని నింపిన భక్తులను అపాయములనుండి కాపాడెడివారు. దాము అన్నాకథ యిందులకు తార్కాణము.

ధనసంపాదనయందు అందరికి ఆసక్తి ఉంటుంది. వ్యాపారంజేసి దగ్గరమార్గంలో డబ్బు ఎక్కువ పొందాలనెడి వారు చాలామంది వుంటారు. దానికి పేరాశ తోడైతే ధనవ్యామోహం మరింత పెరుగుతుంది. మిత్రునిసలహాపై  దాము అన్నా పత్తివ్యాపారముజేయ తలచి బాబాయనుమతికై లేఖవ్రాయ, చదవకముందే బాబా విషయమెరిగి నిరాకరించారు. దాము వ్యక్తిగతంగా బాబాను కలిసినా అదే సలహాఇవ్వడంతో పత్తివ్యాపార యాలోచన దాము విరమించుకున్నాడు. ఇదేవిధముగా ధాన్యములబేరమునుండి బాబా రక్షించారు. వ్యాపారంజేసిన దాము స్నేహితుడు ఆపారధననష్టం పొందాడు. ఈ విషయాల్లో సాయి దయాగుణం, భక్తరక్షణా ధురంధరత వ్యక్తమౌతున్నాయి.1897 వ సంవత్సరమునుండి దాము అన్నా షిరిడీలోని ఉరుసు ఉత్సవసమయములకు ఓజెండా కానుకగా యిచ్చుచుండెడివాడు. జ్యోతిష్యుల భవిష్యవాణీకి వ్యతిరేకముగా, దామూ అన్నాకు బాబా ఆశీసులతో  సంతానప్రాప్తి కలిగినది.

ఈ అధ్యాయములోనే బాబా తమ సమాధియనంతరము అప్రమత్తులమని చెప్పియున్నారు. తమ సమాధినుండి సమాధానము వెలువడునని సాయి వక్కాణించినారు. తమ వెముకలు మాట్లాడునని, తమ సమాధి భక్తులవెన్నంటి తిరుగునని అభయమిచ్చారు. భక్తులు ఎల్లవేళల సాయిని జ్ఞప్తియందుంచుకొని హృదయపూర్వకముగా నమ్మిన యెడల సదా సాయిరక్షణా కవచము ప్రాప్తిస్తుంది. పూర్వజన్మ పుణ్యమువలన సాయిలీలలు వినుచున్నాము, యనుభవించుచున్నాము. కావున సాయిపై పరిపూర్ణభక్తి జన్మాంతరము నిలుచుటకై బాబాను హృదయపూర్వకముగా వేడుకొనెదము.

సాయిబాబా దామూకు అమృతతుల్యములగు మాటలుచెప్పినారు. తాము సదా యాతని రక్షించెదమనియు, కోరినవెంటనే సాయము  లభించునని చెప్పారు. చెప్పినవిధముగనే  యాతని కష్టకాలమున సాయి సహాయము, ఓదార్పు లభించినవి. సాయి తమవద్దకు  వచ్చువారల గూర్చి బహుచక్కని ఉపమానమును చెప్పారు. మావిడిచెట్టుకు గంపలకొద్దీ పూతపూచినా, చివరకు ఫలమయ్యేది చాలాతక్కువైనట్లు;  చివరివరకు తమపై భక్తివిశ్వాసాలు, నమ్మకముంచెడివారు బహుయరుదని, మనందరికి హెచ్చరికలాంటి మాటలు చెప్పారు. ఈహెచ్చరిక మనమనసుల నిత్యస్మరణావాక్యముగా నిలువ వలెను, ఏరోజూ మావిడిపూతలా రాలిపోక సాయి పథంలో మనజీవితముల ఫలవంతము జేసికొనవలెను

26 వ అధ్యాయము 

రూపములన్నిటిని ఆవరించినది విశ్వ చైతన్య శక్తి. రూపములు అశాశ్వితము, కాని వాని యన్నిట ఆవరించిన చైతన్యము, రూపములు కనుమరుగైనను తానుమాత్రము రూపరహిత స్థితిలో సదాప్రకాశించును. అందులకే రూపసహిత లోకము మాయగా చెప్పబడినది. రూపరహిత చైతన్యశక్తియే, సత్యముగాను, దైవముగాను చెప్పబడినది. కావున అనంతకాలచక్రంలో, మానవజీవన కాలం ఓనీటి బుడగ కాలంతో పోల్చిచెప్పబడినది. కేవలము సద్గురువు మాత్రమే మనకీసత్యమును అనుభవపూర్వకముగా బోధించగలరు. వారే సత్యదృష్టిని ప్రసాదించగలరు.  ఆ సత్యమునే, ఆదైవమునే సాయిబాబా అల్లాహ్ మాలిక్ గా సదా స్మరిస్తూ యుండేవారు. అందరిలో ప్రకాశించే దైవ శక్తి ఒక్కటైనప్పుడు, శక్తిప్రవాహకములుగా అందరూ సమానులే! అందుకే ప్రపంచమంతా ఏక కుటుంబముగా పెద్దలు పేర్కొన్నారు.

హేమాద్రిపంతు ఓ చక్కని ఆనందకరమైన మానసికపూజను వివరించారు. అదేమన ఆనందమయహృదయము, స్వచ్ఛమైన ప్రేమ, దృఢమైన విశ్వాసము, అష్టసాత్వికభావాలు, ఏకాగ్ర చిత్తము, శరణాగతిభావము, హృదయపూర్వక భక్తితో మనశిరసును సద్గురుసాయి పాదముల యుంచెదముగాక! సాయిబాబా మన మనసుల అంతర్ముఖముజేసి, రూపాతీత దైవమును సదా వీక్షించునటుల దీవించుగాక. మా మనసులలోని చాంచల్యము హరింపబడుగాక.

వేరొక గురువుకు శిష్యుడైన భక్తపంతు బాబా దర్శనముపిమ్మట మూర్ఛితుడైనాడు. వానికి స్పృహ వచ్చినపిమ్మట ,బాబా వానిని వేరొక గురుశిష్యునిగా గుర్తించి తన గురువుపైనే పూర్తివిశ్వాసముంచునటుల పలికారు.
కరుణామయుడు సాయినాథులు హరిశ్చంద్ర పితళే మూర్చరోగపుత్రుని యాశీర్వదించి రోగముక్తునిగావించారు. నమ్మకము, యోపిక గలవారిని భగవంతుడు తప్పక రక్షించునటుల పలికారు. సహజంగా దక్షిణల స్వీకరించు బాబా, పితళేకి 3 రూపాయలు ఆశీర్వ పూర్వకముగా నిచ్చి, తాము అంతకు ముందు 2 రూపాయలిచ్చితమని పేర్కొన్నారు. అక్కల్కోట మహారాజు స్వామి సమర్ధ ను తాను, తనతండ్రితో దర్శించినప్పుడు; స్వామి వారికి 2 రూపాయలిచ్చినటుల పితళే తన తల్లినుండి గ్రహించాడు. ఈవిషయముద్వారా సాయిబాబా, తాము స్వామిసమర్ధ వేరొక రూపులుగా జెప్పారు. పితళే గురు ఆశీసుల లభించిన కానుకలను, భక్తిశ్రద్ధలతో  పూజింపవలెననెడి సత్యమును గ్రహించాడు. ఈ ఘటనద్వారా  సాయిబాబా కారుణ్యము, సర్వజ్ఞత వ్యక్తమౌతున్నాయి.

సాయినాథుల దయాళుత్వము , సర్వజ్ఞత, సమర్ధతల  వ్యక్తపరచు వేరొక భక్తుని  అంబాడేకరు అనుభవం చూద్దాము. తన కష్టముల యనుభవింపలేక షిరిడీలో బావిలోదూకి ఆత్మహత్య జేసికొన ప్రయత్నించినపుడు, సమీప హోటలు యజమాని సగుణమేరు నాయకు ప్రేరణగలిగి అక్కల్కోటకర్ మహారాజ్ చరిత్ర పుస్తకమును వానికిచ్చి చదువమనెను. తానుపుస్తకము తెరువ స్వామి ఆత్మహత్యకు పాల్పడిన భక్తుని రక్షించిన కథ ఆ పుటలో కన్పించగా, అంబాడేకరు తన ప్రయత్నమును విరమించుకున్నాడు. బాబాసలహా యిటుల లభింపనిచో వాడు చచ్చియే యుండును. ఆ తరువాత బాబాయనుగ్రహంతో జ్యోతిష్యంలో ప్రావీణ్యత సంపాదించి, కావలిసిన ధనసంపాదనజేసి  జీవితమును సుఖముగా గడిపాడు.

27 వ అధ్యాయము 

సాయిబాబా రామభక్తులు భాగవతము, జ్ఞానేశ్వరి, ఎకనాథభాగవతము, ఆధ్యాత్మిక రామాయణము మరియు విష్ణుసహస్రనామము లాంటి  సద్గ్రంధములు చదువుటకు ప్రోత్సహించేవారు, తాము తాకి భక్తులకు ఆశీర్వాదములతో తిరిగి యిచ్చెడివారు. సాగరస్నానము సమస్తపుణ్యనదుల స్నానంతో సమానమైనట్లు, శ్రీసాయి పాదసేవ సర్వదేవీ దేవతా సేవతో సమానమైనది. సాయి కోర్కెలదీర్చు కల్పతరువు, జ్ఞానసాగరులు. సాయిలీలల భక్తిశ్రద్ధల పఠించువారలకు సాత్వికభావములు పెంపొందును.

సాయి శ్యామాకు పెక్కు పుస్తకముల బహూకరించారు. కేవలము గ్రంథపఠనము ఫలితమివ్వదు, భక్తిశ్రద్ధల భావమెరిగి చదువవలెను. విష్ణుసహస్రనామము నిత్యముచదువునట్టి రామదాసికి పుస్తకభావమేమియు తెలియదు. కావున బాబా వానికి మంచి ఉపదేశమిచ్చారు. రామదాసికి  అందరియెడ సమత మమతలుండవలెనని, భగవంతుని సర్వవ్యాపకతను గ్రహింపవలెనని, చిన్నచిన్న విషయాలలో ఇతరులతో పోట్లాడరాదని, వారిలోని భగవంతుని గాంచవలెనని బోధజేశారు. శ్యామాపై కరుణచే యాతనికి , రామదాసి విష్ణుసహస్రనామ  పుస్తకమును  బహూకరించారు. బాబాయనుగ్రహముచే శ్యామాకు విష్ణుసహస్రనామపుస్తకమందు మంచి అవగాహన, ప్రావీణ్యము లభించెను. విద్యావంతుడు నార్కేకు బోధించగలిగెను. సాయిబాబా ఈవిధముగా విష్ణుసహస్రనామ ప్రాధాన్యతను భక్తులకు తెలియపరచారు. విష్ణుసహస్రనామ పుస్తకానికి బదులుగా , శ్యామానుండి పంచరత్నగీత యను పుస్తకమును రామదాసి పొందాడు. ఎవరి ఋణమును  వుంచుకొనరాదు.

సాయిబాబా జన్మాంతర జ్ఞానులు. ఖాపర్డే భార్య పూర్వజన్మవివరములెల్ల భక్తులకు తెలియపరచి, యామె సేవకు సంతసించి యామెతెచ్చిన భోజనమును మిగుల యాతురతతో  భుజించారు. తమ కాళ్ళను  తోముచున్నయామె చేతులను బాబా తోముట  భక్తులపట్ల సాయికిగల వాత్సల్యమును తెలియజేయు చున్నది.  ఆమె పట్లగల ప్రేమాతిశయముచే యామె యడుగకయే,  ' రాజారామ్ ' యను మంత్రమునుపదేశించారు. ఇది బాబా ప్రసాదించిన శక్తిపాతము. ఈఘటన గురుశిష్యుల యేకత్వమును చాటుచున్నది.

28 వ అధ్యాయము 

సాయిబాబా వేదజ్ఞానమందును, ఆత్మసాక్షాత్కారవిద్యయందును ప్రావీణ్యులుగావున వారు సద్గురువులు. ఆత్మ సర్వవ్యాపి, అందరిలో ప్రకాశించు దివ్యజ్యోతి. అట్టి జ్ఞానమును, అనుభవమును కలుగజేయు విద్య ఆత్మవిద్య. ఉపనిషదులయన్నిటా,  ఆత్మనుగూర్చి వేయినోళ్లతో చెప్పబడినది. ఉపనిషత్తుల భావము అందరికి తేలికగా అర్ధంకాదు, కాని బాబా తమ అనేక లీలలద్వారా ఈ సత్యమును సామాన్యులకు సహితము అర్ధమగునటుల, భక్తులకు అనుభవముల ద్వారా  విశదీకరించారు.

సాయి సంకల్పము లేక మనము వారినిచూడలేము. వేయిక్రోసుల దూరముననున్నను తనవారలను  పిచ్చుక కాళ్లకు తాడుకట్టి యీడ్చినటుల , సాయి లాగెడివారు.ఈ అధ్యాయములో అలాంటి మూడు పిచ్చుకల వివరాలు చెప్పబడినవి. లాలా లక్ష్మీచందు మొదటివాడు. 1910 వ సంవత్సరము క్రిస్టమస్ పండుగకు కొన్నివారములకు ముందు యతడు తనకలలో భక్తుల మధ్యయున్న ఓ వృద్ధునిజూశాడు. కొన్నాళ్ల పిమ్మట తనమిత్రునియింట దాసగణుకీర్తనసమయమున బాబా పటమును జూసి, తానుస్వప్నములోజూసిన ముసలివానిబోలియున్నటుల గమనించి, షిరిడీకి వెళ్ళుటకు యారాటపడగా, వానిమిత్రుడు శంకరరావు యాతని ఇంటికి అదే రాత్రి వచ్చి షిరిడీ వచ్చెదవా యని యడిగెను. సద్గురుని వెదుకుటలోను, ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తునికి సహాయపడును. లక్ష్మీచందు పినతండ్రికొడుకు వద్ద 15 రూపాయలు అప్పుచేసి షిరిడీలో బాబాను దర్శించెను. బాబా ఆవిధముగా వానిని షిరిడీకి లాగెను. షిరిడీలో వానికనేక యనుభములనిచ్చి సాయి, తనభక్తుని గావించుకొనెను. వాని యనుభవములయన్నిటా సాయి సర్వజ్ఞత వెల్లడవుతుంది.  మరొక పిచ్చుక బెరహంపూరు మహిళ. ఈమెకు తన కలలో సాయి తమగుమ్మము వద్దకు వచ్చి కిచిడీ యడుగ, మేల్కొని చూడగా  యెవరూ లేకుండిరి. ఆమె భర్తకు అకోలా బదిలీయైనపిమ్మట, భార్యాభర్తలు షిరిడీవెళ్లి బాబాను దర్శించిరి. ఆమె భక్తితో కిచిడీ జేసి బాబావద్దకెళ్ళగా, సాయి ఎంతో ఆత్రుతతో, ప్రేమతో కిచిడీ తినినారు. అదీ భక్తులపట్ల సాయిప్రేమ.

ఈ అధ్యాయములో ఈడ్చబడిన మూడవ పెద్ద పిచ్చుక మేఘశ్యాముని గూర్చి చెప్పబడినది. మేఘా విరంగామ్ నివాసి, హరి వినాయక సాఠేగారి వంట బ్రాహ్మణుడు. అమాయకుడు, చదువురాని శివభక్తుడు. సాఠేగారి ప్రోత్సాహముతో బాబానుచూడ బయలుదేరినా, సాయిని ముస్లింగా తలచి సంశయించాడు. వానిమనసెరిగిన బాబా యాతని  వెడలగొట్టగా, యతడు నాసిక్ లోని త్రయంబకేశ్వరుని సంవత్సరమున్నర  సేవించి మరలబాబా వద్దకు రాగా, సాయి కరుణతో  స్వీకరించారు. మేఘ ఎంతటి పుణ్యాత్ముడోగాని, సాయిపై యాతనికి మిగుల భక్తిశ్రద్ధలు కలిగాయి. సాయియే శివుడను భావమేర్పడి, నిత్యమూ  సాయికి బిల్వార్చన జేసెడివాడు. బాబా యాతనిపై ప్రేమచే తానే శివుడననే నమ్మకమును వానిలో దృఢపరచారు, యెన్నో అనుభవముల గూర్చారు. మేఘ మరణించినపిమ్మట సాయి యాతడే తననిజమైన భక్తుడని, తమ స్వంతఖర్చుతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయించారు. వీటన్నిటియందును సాయి సర్వజ్ఞత, భక్త వాత్సల్యము మిగుల స్పష్టముగా తెలియుచున్నవి.

29 వ అధ్యాయము 

సాయిబాబాను వేరువేరు భక్తులు వేరువేరు కోరికలతో దర్శించేవారు. మద్రాసు భజన సమాజమువారు తమ కాశీ యాత్రలో కాసులనాశించి సాయిని దర్శించారు. వారిది అసలైనభక్తికాదు. కాని యజమాని భార్య భావకురాలు, శ్రీరామభక్తురాలు. కావున బాబా ఆమెకు శ్రీరామునిలా కన్పించారు. భావమేటులో యనుభవ మటులగదా!   అంతశ్రద్ధ లేని మిగిలినవారికెలాంటి యనుభవము కలుగలేదు. సాయి బోధలో స్వప్నసందేశాలకు ముఖ్యస్థానముంది. భజనసమాజములోని భర్తకు స్వప్నసందేశముద్వారా తమ మహిమను  తెలియజేసి తమభక్తుని గావించి, యనుగ్రహించారు. బాబా దయచే వారి కాశీ యాత్రగూడ విజయవంతమైనది. ఈ విషయాలలో బాబా సర్వజ్ఞత,సమర్ధత, భక్తులమనసుల మార్చు చతురతలు నిండియున్నాయి.

బాబాయనుగ్రహ శక్తిముందు గ్రహముల  శక్తి యల్పమే! సావిత్రీబాయి టెండూల్కర్ పుత్రునికి గ్రహస్థితి బాగుండనప్పటికీ, బాబాయనుగ్రహశక్తిచే వైద్యవిద్యయందు ప్రవేశము లభించినది. అలాగే యామెభర్త ఉద్యోగ విరమణానంతరము బాబాకరుణచే, కుటుంబఖర్చులకు సరిపడు పెన్షన్ లభించినది. కాప్టెన్ హాటే సాయిని స్వప్నంలో దర్శించి చిక్కుడుకాయల కూర, దక్షిణల సమర్పింప తలువ మెళకువరాగా, ఆయా వస్తువుల మిత్రునిద్వారా సాయిసేవకుపంప, బాబా వాటిని ప్రేమతో గ్రహించి వాని ననుగ్రహించారు. వేరొకపర్యాయము కాప్టెను మనోగతమును గ్రహించి, మిత్రునిద్వారా పంపిన రూపాయి నాణెమును తాకి, తమ ఆశీర్వచనములతో తిరిగి వానికి పంపించారు. బాబాచేయుపనులు అనూహ్యములు. సాయి ఆశీర్వచనములతో తిరిగిపొందదలచిన వామన నార్వేకర్  సీతారామలక్ష్మణుల నాణెమును శ్యామాకిచ్చారేగాని, తిరిగి వానికివ్వలేదు. ఎవరికేది ప్రాప్తమో సాయి కెరుక! 

30 వ అధ్యాయము 

భక్తులకోరికల పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. హేమాద్రిపంతు బాబా జీవితకథ వ్రాయసంకల్పింప సాయి వానికోరిక దీర్చెను. నా వ్యక్తిగత కోరికలూ కొన్ని నెరవేరినవి. సాయికథల యభిరుచికి కావలసినవి భక్తివిశ్వాసములు మాత్రమే.

సాయిలీలలయందు యెంతో  చతురత,సమర్ధత,సర్వజ్ఞత,భక్తకారుణ్యత నిండియుంటాయి. కాకాజీవైద్య నాసిక్ జిల్లాలోని వణి సప్తశృంగి దేవాలములోని పూజారి, మిగుల కష్టములననుభవించి మనఃశాంతి కోల్పోయాడు. తన ఆరాధ్య దేవత స్వప్నసందేశము మేర షిరిడీ బాబాను సందర్సింప దలచెను. కాని షిరిడీ పోవుటెట్లో తెలియకుండెను.  సరిగా అదేసమయమున బాబా ప్రియ  భక్తుడు శ్యామా తానుమరచిన  సప్తశృంగి మొక్కుల చెల్లించుటకు  సాయి యాజ్ఞమేర వణి లోని వైద్య యింటికి వెడలెను. ఎంతటి ఆశ్చర్యమైన కలయిక. మొక్కులుతీర్చుకొన్న పిమ్మట వైద్యతోపాటు శ్యామా షిరిడీకి మరలెను. బాబా దర్శనముచే కాకాజీవైద్య పరమానందమును, పరమశాంతిని పొందెను. అచట 12 దినములుండి బాబా వూది, ఆశీస్సులతో యిల్లు చేరెను.
ఈ సందర్భమున రెండు విషయములు పరిష్కరింపబడినవి. ముఖ్యముగా కాకాజీవైద్య షిరిడీదర్శించి బాబా ఆసిసులందినటుల కనబడినను, ఎంతోకాలంగా నిలిచిపోయిన శ్యామా మొక్కుబడులు తీర్చబడినవి. మనము మొక్కిన మొక్కులు తప్పక దీర్చవలెననెడి సందేశము గ్రహింపదగినది.

బాబాబోధలో స్వప్నసందేశములకు ప్రత్యేకత కలదనెడిది భక్తుల యనుభవ విషయము. మరియు బాబా స్వప్నములకు కాలనియమము లేదు. రహతా వాసి కుశాల్ చందుకు బాబా షిరిడీకి  వెంటనే రమ్మని పిలిచిన కలవచ్చినది. కాని వాని గుఱ్ఱములేకుండుటచే బాబా వద్దకెలావెళ్ళవలెనను సందేహము. అదేసమయములో   దీక్షితుని టాంగాతో రహతాపంపి, కుశాలచందును రప్పించుట బాబాలీలగదా! పంజాబీ రామలాల్ తనకలలో బాబా షిరిడీకి రమ్మను పిలుపును వినునప్పటికీ, బాబా వివరములు తెలియకుండుటచే, వీధి దుకాణంలో ఫోటోరూపంలో తమ వివరాలు తెలిపి షిరిడీకీడ్చినారు. భక్తుల పిలుచు  సంకల్పము సాయిది, షిరిడీకీడ్చు సహకారము, మార్గము సాయిదే!

31 వ అధ్యాయము 

" ఎవరయితే వారి యంత్య దశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొనెదరో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు. "  భగవద్గీత
అంత్య సమయమందు మనసును నిలకడగా నేదోమంచి యాలోచనయందే నిలుప వలెనన్నచో నిత్యము దానినవలంభించుట యవసరము. కావున భగవానుని జ్ఞప్తియందుంచుకొని, సదా భగవన్నామ స్మరణ జేయుచు యోగులకు సర్వస్య శరణాగతిజేసిన, వారు యంత్యకాలమున సహాయము జేసెదరు. విజయానంద్ మద్రాసు సన్యాసి. మానససరోవర యాత్రచేయదలచి మార్గమున షిరిడీలో సాయిబాబాను దర్శించెను. కాని చేయదలపెట్టిన పనులయందు పట్టుదల లేకుండుటచే బాబా వానిని మొదట తిరస్కరించిరి. కాని భక్తులు  మిగుల శ్రద్ధతో  సేవించుట జూసిన సన్యాసికి సాయిపై మిగులప్రేమ గలిగెను. కాని సర్వజ్ఞులైన బాబాకు వాని భూత భవిష్యత్తులు బాగుగ దెలియును. వానిమరణము సమీపించెనని నెరిగిన బాబా వానిచే ' రామవిజయము ' ను చదివించిరి. ఆపై త్వరలోనే విజయానందుడు సాయిసన్నిధిలో తన యదృష్టముచే తుదిశ్వాస విడచి సద్గతి పొందెను.

బాలారాం మాన్ కర్ భార్యమరణానంతరము షిరిడీజేరి సాయిప్రేమకు పాత్రుడాయెను. వాని భవిష్యత్తెరిగిన సాయి సద్గతి కలిగింపదలచి వానిని మచ్చింద్రగడమునకు పంపెను. మచ్చింద్రగడమున వానికి సాయి తన సజీవ భౌతిక దివ్యదర్శనమునిచ్చెను. కావున సాయి కరుణకు స్థలము ప్రధానము కాదు. కాని వాని మానసిక స్థితికి, నిత్య  ధ్యానమునకు యనుకూలమగుటచే మాన్ కర్ ను యా ప్రాంతమునకు సాయి పంపిరి. కొంతకాలముపిమ్మట యాతడు షిరిడీజేరి బాబా సన్నిధిలో సద్గతి పొందెను. ఈవిధముననే కాకాసాహెబ్ నూల్కర్, మేఘశ్యాముడు మరియు నొక పులి సాయిసన్నిధిలో తమ తుదిశ్వాస విడచి సద్గతి పొందిరి. కావున పుణ్యలోక ప్రాప్తికి నిత్యసాయిస్మరణ, ధ్యానములు యెంతో సాయము కాగలవు.

32 వ  అధ్యాయము 

ప్రతివ్యక్తికి తన సంకుచిత మానసిక స్థితినుండి సర్వజనోద్ధారక ఆత్మస్థితికి జేర్చుటకు ఓ గురువు ఆవశ్యకము. అలాంటి మార్గముజూపుటకు గురువు తప్పని సరి యని శాస్త్రవాక్యము. ఈ విషయమున బాబా తమ యనుభవమునే జెప్పియున్నారు.

ప్రత్యేకమైన దారిలేని దైవాన్ని జూచుటకు అదైవసన్నిధినెరిగిన  ఓ గురువు తప్పక  కావలెను. సాయి తన ముగ్గురు మిత్రులతో కలసి మతగ్రంధముల చదువుచూ దైవానిగూర్చి చర్చించుట మొదలిడినారు. సాయి దైవాన్ని మన బుద్ధిద్వారా గ్రహింపలేము, మననిర్దేశపు కర్మల తప్పక చేయుచు, మనోవాక్కాయ కర్మల గురుని  సర్వస్య శరణాగతికోరవలెనని తన వంతుగా చెప్పారు.  మిగిలినవారు తమ తమ రీతుల మాట్లాడిరి. ఈవిధముగా చర్చిస్తూ దైవాన్వేషణలో ఆ నలుగురు అడవులలో తిరుగ నారంభించిరి. వారిదారిలో ఓ వర్తకుడు తారసిల్లి అన్వేషణకు ఓ మార్గదర్శి కావలెననియు, తానిడు  భోజనము గ్రహించి తమ యన్వేషణ కొనసాగింపుడని సలహానిచ్చెను. తాముపండితులమను భావముచే వానిసలహా నిరాకరించి ఆ కారడవులలో గమ్యమెరుగక తిరుగుచూ యదృష్టవశముచే తొల్లిచోటుకు వచ్చి ఆ వర్తకుని మరలగలసికొనిరి. వర్తకుడు మరల వారితో  మార్గదర్శిని తోడిడి , భోజనముజేసి వెదకుటకు వెళ్ళమన సాయి మిత్రులు తిరస్కరించి తమదారిని తాము బోయిరి, కాని సాయి వాని ఆతిధ్యము స్వీకరింప గురువు ప్రత్యక్షమై తనవెంటరమ్మన సాయి వానిని గురువుగా స్వీకరించి 12 సంవత్సరములు యకుంఠిత  శ్రద్ధ సహనాలతో గురుసేవ జేస్తాడు.  కేవలము సాయి మాత్రమే గురువు నంగీకరించి తమగమ్యము చేరగల్గిరి, మిత్రులు గురువునంగీకరింపక తమజీవితాశయమును జేరలేకపోయిరి. కావున దైవాన్నిజేరుటకు మనముకూడ ఆత్మజ్ఞానమెరిగిన గురుని తప్పక ఆశ్రయింపవలెను.  సాయిమార్గంలో ఉపవాసములతో పనిలేదు. కావున ఉపవసింపదలచిన గోఖలేగారి భార్యను సాయి ఉపవసింపనీయలేదు. సాయి జీవులయుద్ధరణయను  బట్టలనేయు సాలివృత్తిజేపట్టి  దైవానుగ్రహము పూర్తిగాపొంది విశేష పుణ్యమనెడి అశేషధనరాశుల సంపాదించారు. మనంకూడా సాయిసేవజేసి యాపుణ్యరాశిని పొందవలెను.

33 వ అధ్యాయము 

మానవుల మూడు రకముల వ్యాధులు పీడిస్తాయి, శారీరకవ్యాధులు, మానసిక అలజడులు, ఆధ్యాత్మిక చీకట్లు. ఈమూడురకాల అనారోగ్యాలనుండి ముక్తిపొందినవారే పరిపూర్ణ స్వస్థులు. సమర్ధసద్గురు సాయినాథులు తమభక్తులను ఈమూడు రుగ్మతలనుండి ముక్తుల జేసెడి వారు. ఇందులకు సాయిబాబా ఆశీర్వదించి ఊదీని పంచెడి వారు. పంచభూతములచే చేయబడిన మన దేహములు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమై బూడిదయగును, జగత్తు అశాశ్వితము, బ్రహ్మమే నిత్యమను సందేశమును ఊది తెలుపుచున్నది.

బాబా యూదితో పెక్కువ్యాధులు నయమగుచుండెను. తేలుకాటేమి, ప్లేగు జబ్బేమి ఊది ధారణ, యూది కలిపిన తీర్ధములచే బాగగుచుండెను. నానాసాహెబు చాందోర్కరు పుత్రిక మైనతాయి ఊది సేవించి   సుఖముగా ప్రసవించినది. అసన్నివేశమే జాంనేరు లీలగా జగత్ప్రసిద్ధమైనది. ఈలీలలో సాయిబాబా కారుణ్యము, సర్వవ్యాపకత, సామర్ధ్యము, చమత్కారము అన్నీ మేళవించి యున్నాయి. సాయిబాబానే బండివానిగా, బండిగా, అశ్వములుగా రూపుదాల్చి ఊదీని షిరిడీనుండి జాంనేరు జేర్చిరి. ఇది సామాన్య లీలగాదు.

జబ్బుపడిన భక్త నారాయణరావుకు  స్వప్నంలో  కనపడి వాని రోగముక్తుని జేసిరి.  అపుడే దర్శించిన సంకీర్తనకారుడు బాలబువా సుతారు 4 సంవత్సరముల క్రితమే తెలియునని జెప్పుట యాశ్చర్యకరము, ఏలన యతడు అంతకు పూర్వము బాబా ఫొటోకు నమస్కరించెను. అప్పాసాహెబు కులకర్ణి నుండి  తానివ్వదలచిన 10 రూపాయల  సాయిగ్రహించి నవవిధభక్తులకు సంకేతమనునటుల వాని  ఆశీర్వదించి 9 రూపాయల తిరిగి నిచ్చిరి. బాబా యూదితో కులకర్ణి ఎంతో లబ్ధి పొందెను. యోగీశ్వరులు ఏకాత్మ భావముతో వ్యవహరింతురు. హరిభావ్ కర్ణిక్ సాయికివ్వదలచిన రూపాయి దక్షిణను నాసిక్  లో  కాలారామ్ మందిరమున నరసింగ మహరాజను యోగి మరీ  యడిగి  గ్రహించెను. సాధుసేవ సాయికి చేసిన సేవయే!

34 వ అధ్యాయము 

పెక్కు ఊది మహిమలిందు చెప్పబడినవి. డాక్టరు మేనల్లుని రాచకురుపు సాయిబాబా ఊదిమహిమచే మానిపోయినది. ఈ ఘటనచే కలిగిన అనుభవములచే డాక్టరు బాబా భక్తుడాయెను. డాక్టరు పిళ్లే నారిపుండు మిగుల బాధితుడు, తనబాధను పదిజన్మలకు పంచమని సాయినాథునివేడుకొనగా, వూదిశక్తిచే కేవలము పదిరోజులలోనే యాతని బాధనివారణ జరిగినది. శ్యామా మరదలు ప్లేగు వ్యాధి బాబా ఊది ప్రభావముచే మటుమాయమైనది. మూర్చరోగి ఇరానీ బాలిక నీటిలోకలిపిన ఊది సేవించి స్వస్థురాలయ్యెను. హర్దా పెద్దమనిషి మూత్రకోశ రాళ్లు బాధితుడు, ఊది సేవనముచే బాగయ్యెను. బొంబాయి మహిళకు  షిరిడీలో సాయిబాబా యూదిచే సుఖప్రసవనమాయెను. కావున సాయిశక్తి , సాయి యూది శక్తి అమోఘము, అద్భుతము.

35 వ అధ్యాయము 

సాయిబాబా తమ పట్ల విశ్వాసము లేనివారిని తమభక్తులుగా మార్చు చతురత అనూహ్యము, అద్భుతము. పెక్కుమంది బాబాను పరీక్షయింపవచ్చి తుదకు సాయి శరణాగతి కోరి వారిభక్తులుగా నిలచిపోయిరి. కాకామహాజని మిత్రుడు నిరాకారరూపునిగా భగవంతుని ఆరాధించెడివాడు, కావున మానుషరూపుడైన సాయిబాబాను నమస్కరించుటకు ఇష్టపడకుండెను. కాని దూరమునుండే వానితండ్రి స్వరముచే బాబా  సంబోధించుటచే మిగుల యాశ్చర్యపడి, మసీదులోపలికి వెళ్లి తనయుద్దేశ్యమును మరచినవాడై బాబాపాదములకు నమస్కరించెను. దక్షిణవిషయంలోగూడా బాబా వాని మనసెరిగి తుదకు 17 రూపాయల  స్వీకరించిరి.

పైవిధముగనే కాకామహాజని యజమాని ఠక్కర్ ధరమ్సేజేథా భాయ్ అనుమానమనస్కుడు. బాబాను పరీక్షించుటకై కాకామహాజనిని , వేరొకరిని వెంటనిడుకొని  షిరిడీవచ్చెను. గింజలున్న ద్రాక్షలను, గింజలు లేనివానిగా మార్చిన బాబాలీలగని యజమాని మిగుల తృప్తిపడెను. బాబా వాని చంచల మనసుగని వాని కిష్టమైనచోట విశ్వాసము నిలకడగానుంచమని బోధించిరి. తనతోపాటు కాకా తిరిగి మరలుటకు బాబాయాజ్ఞనివ్వ, యాతనికి మరోనిదర్శనము లభించినది. ఈకారణములచే తన మనోనిశ్చయము మరచి బాబాకు 15 రూపాయల దక్షినొసగెను. చివరకు తన సంశయములెల్ల తొలగుటచే సాయిబాబా శక్తి గ్రహించి ఎంతోనేర్చుకొనెను. సాయి తనను పూజించినను, లేకున్ననూ ఎవరినీ ద్వేషించెడివారుకారు, వారికందరు సమానులే.

బాంద్రానివాసి ఓ పెద్దమనిషి గతించిన తన తండ్రి  స్వప్నపీడచే మిగుల పీడితుడు. సాయిబాబా యూది సేవనముచే ఆ బాధముక్తుడై సుఖముగా నిదురించెను. బాలాజీ నెవాస్కరు బాబాకు అంకిత భక్తుడు, బాబాను ప్రేమమీర సేవిచెడివాడు, బాబా తిరుగు దారుల ఊడ్చేవాడు, తానుపండించిన పంటను సాయికి యర్పించెడివాడు. బాలాజీ మరణానంతరము వాని సావత్సిరికము నాడు పిలిచిన వారికి మూడురెట్లు బంధువులు రాగా, బాబా ఊది వంటపాత్రలందువేసి, వాటిపై గుడ్డకప్పివడ్డించగా, అందరికి సరిపోవుటయేగాక ఇంకను చాల మిగులుట సాయి ఊది మహిమ. సాయి,  బాలాజీ సేవకు  సంతుష్టులై వానికి, వాని భార్యాబిడ్డలకు బట్టలుపెట్టెడివారు. 

36 వ అధ్యాయము 

సాయిబాబా అందరినుండి దక్షిణల స్వీకరించేవారు కాదు, ఎవరు మొక్కుకొని, మొక్కుదీర్చక యున్నారో వారినుండి మాత్రమే దక్షిణ పొందెడివారు. ఓపర్యాయము గోవానుండి యిద్దరు పెద్దలొచ్చినను, కేవలము నొక్కరినుండి 15 రూపాయలు అడిగితీసుకొన్నారు. రెండవ పెద్ద బాబా అడకకుండానే 35 రూపాయలివ్వగా, తిరస్కరించారు. ఇలా ఏలయని దగ్గరున్న సాయిఅంకిత భక్తుడు శ్యామా యడుగ, సర్వజ్ఞులు బాబా ఆ వచ్చిన  పెద్దల పూర్వకథల వివరించారు. మొదటి పెద్ద దత్తభక్తుడు, తనకు ఉద్యోగము వచ్చిన మొదటినెల జీతమిచ్చునటుల దత్తదేవునికి మొక్కుకొని, మొక్కుమరచుటచే యాతనినుండి మొదటినెల భత్యము 15 రూపాయలు అడిగి పుచ్చుకొన్నారు. సాయి దత్తస్వరూపులు కదా! ఎవరైనను, ఎపుడైనను మొక్కినమొక్కులు మరువరాదను సత్యమును గ్రహింపవలెను.

రెండవపెద్ద కథవేరు. నమ్మకస్తుడైన నౌకరు 30 వేల రూపాయల దొంగిలింప, యతడు మిక్కిలి దుఃఖితుడాయెను. వాని యదృష్ట వశమున దారివెడలు ఫకీరు యాతని బాధనెరిగి, ఇష్టమైన యాహారము విడచి షిరిడీ సాయి దర్శనముజేయ, యాతనికి పోయిన ధనము లభించునని చెప్పగా, యాతడటులనే జేసి తన పైకమును తిరిగి పొందెను. (తప్పునెరిగిన  నౌకరు  దొంగిలించిన డబ్బును తిరిగి యిచ్చెను). బాబా  ఎంతటి కరుణామయులు, దారివెడలు ఫకీరు వారేగావచ్చును, ఎవరెరుగుదురు? బాబా ఎంతటి సర్వజ్ఞులు, స్వప్నములో వానికి కన్పించి మరచిన  సాయిదర్శనమును గుర్తుజేశారు. దారిలో మంచినౌకరు రూపులో స్టీమరులో సాయే చోటుకల్పించారు. సాయిని దర్శించుటచే వాని మొక్కుతీరినది, అందులకేవానినుండి ఎలాంటి దక్షిణ స్వీకరించలేదు. ఈ ఘటనలబట్టి సాయిబాబా దక్షిణలందుటయందు యెంతటి నియమబద్ధులో నెరుగవలెను. ఎవరినుండి కారణములేక దక్షిణల స్వీకరించేవారు కాదు. మరొక్క నీతిగూడా ఇందుమూలముగా తెలియజెప్పారు, అదేమన ఋణము, శత్రుత్వము, హత్య జేసిన దోషము తప్పక చెల్లింపవలెను. కావున మనందరమీవిషయమున జాగరూకులము గావలెను. అటులనే మొక్కినమొక్కులు మరువరాదు.

మరొక్కవిషయము, అపరిగ్రహమునుగూర్చి  బాబా చెప్పక చెప్పిన నీతి. భక్త మహల్సాపతి పేదవాడైనను ఎంతో పుణ్యవంతుడు. ఇతరులనుండి సొమ్ము పొందినయెడల వానికి పుణ్యము క్షీణించును, గావున ఉదారుడైన హంసరాజునుండి ఎలాంటి ధనసహాయమును మహల్సాపతి పొందుటకనుమతించలేదు. సాయి, తాము  సంతానలక్ష్మి గా మరొక్కసారి జూపారు. ఎంతోకాలంగా సంతానలేమిచే బాధపడు షోలాపూరు నివాసి ఔరంగబాదుకర్ భార్యను ఆశీర్వదించి, పుత్రసంతానం ప్రసాదించారు. వారు కృతజ్ఞతతో సమర్పించిన 500 రూపాయలతో బాబా గుఱ్ఱము శ్యామకర్ణకు శాల కట్టింపబడినది.

37 వ అధ్యాయము 

సద్గురునితో ముడివడిన జీవనము నిత్యసంబరము. షిరిడీలో జరుగు వేడుకలలో చావడి ఉత్సవము యొక ముఖ్యమైనది. 1910 డిసెంబరు 10 వ తారీఖునుండి చావడిలో పూజా హారతులు జేయ ప్రారంభించిరి. బాబా రోజు విడచి రోజు చావడిలో నిదురించెడివారు. ఆ నిదురించెడిరోజు  షిరిడీవాసులకెంతో ఆనందమయ దినము. ఆ వేడుక ఓకల్యాణ ఉత్సవములాంటిది. భక్తుల భజనలతో ప్రారంభమయ్యెడిది. వారివెనుక రధము, కుడివైపు తులసి బృందావనము, ముందు సాయిబాబా. భక్తులు తాళములు,చిరుతలు, మృదంగము, కంజరలతో
భజనలుజేసెడివారు. సాయివారందరిని సూదంటులా తమవైపుకు లాగెడివారు. దండధారులు సాయినాధునికి జేజేకారములు పల్కెడివారు. మజీదును తోరణములతోను, దీపములతోను అలంకరించెడివారు. బాబాగుఱ్ఱము శ్యామకర్ణను బాగుగ యలంకరించెడివారు. తాత్యాపాటిలు, మహల్సాపతి, జోగు, కాకాసాహెబు దీక్షితులు సాయిని వెన్నంటి నడచేవారు. ఇంతటి కోలాహలముమధ్యన ఎలాంటి కంపనములేక  సాయి నిశ్చింతితులు.
చావడినిగూడ మిగుల యలంకరించెడివారు. చావడిలో ఆరతికిముందు బాబా చిలుము పీల్చెడివారు, పిమ్మట జోగు బాజాభజంత్రీలనడుమ  ఆరతి చ్చెడివాడు. పిమ్మట  భక్తులు బాబాకు నమస్కరించి తమతమ యిండ్లకు వెడలెడివారు. బాబా తమ పొరుపుల  తామే యమర్చుకొని నిదురించెడివారు. మనముకూడ చావడి వేడుకను నిదురకు ముందు  మదిలో తలచి సుఖనిద్ర పొందెదముగాక!

38 వ అధ్యాయము 

అన్నిదానములలో మిన్న అన్నదానము. బాబా తాము బిక్షనుండి తెచ్చిన ఆహారమును తోటివారలతోను, సమీప పశుపక్షులతోను కూడి భుజించెడివారు. వారిది ఎల్లలులేని సర్వజీవప్రేమ. మనిషికి కావలసిన నిత్యావసరాలు అన్నము, వస్త్రము, నివాసము. వస్త్రముగాని, నివాసముగాని అవసరమైనను అన్నిటికంటే అన్నము జీవికి పరమావశ్యకము. సమయానికి భుజింపకున్న మనిషి ఆకలికి తాళలేడు. బాబా తనభక్తులను ఉపవసింపజేసెడివారు కారు, యటులనే ఆకలితో నుండనిచ్చెడివారు కారు. మరియొక ప్రత్యేకతయేమంటే బాబా స్వయముగా వంటజేసి వారే భక్తులకు వడ్డించి వారితో  కలసి భుజించెడివారు. శాకాహారులకు శాకాహారము, మాంసాహారులకు మాంసాహారము సమకూర్చెడివారు. వంటకు కావలసిన పెద్దపాత్రలు రెండు బాబావద్దయుండేవి. కావలసినసరుకులను బజారునుండి తామే కొనితెచ్చెడివారు. వంటవస్తువులు, మసాలాలు తగిన మోతాదులోవేసి వంట ఎంతో రుచికరంగా వండేవారు. మరుగుచున్న దేకిసాలో చేయిపెట్టి అన్నము సరిగా ఉడికినదో లేదో చూచుచుండెడివారు, కానివారి చేయి ఏమాత్రము కాలెడిదికాదు. వంటపూర్తికాగానే బాబా ఆపాత్రలను మజీదులోనికి తెచ్చి మౌల్విలచే ఆరగింపు పెట్టించేవారు. మొదట మాల్సాపతికి , తాత్యాకు ప్రసాదముగా పంపించి పిమ్మట పేదవారికి, దిక్కులేనివారికి సంతృప్తిగా పెట్టుచుండెడివారు. బాబాతోకూడి భుజించినవారెంత ధన్యులోకదా!

బాబా దేవాలయములపట్ల ఎంతో గౌరవము జూపెడివారు. తమభక్తులనుకూడ యటులే జేయమనెడివారు. నానాసాహెబు షిరిడీ వచ్చునప్పుడు మార్గమధ్యమున కోపరగాం లో దత్తదేవాలయానికెళ్లి దర్శనముపిమ్మట షిర్డీకి  పయనమయ్యెడివాడు. కాని ఓపర్యాయము తన షడ్డుకుడు దత్తభక్తుడైన బినీవాలాతో షిరిడీ వచ్చునప్పుడు కోపర్గావ్ లోని దత్తదేవాలయమునకు వెళ్ళలేదు.సర్వజ్ఞులైన బాబా ఈవిషయము నెరిగిన నానాతో కోపముగా మాట్లాడి, యాతడు వానితప్పునెఱుగునట్లు జేసిరి. కోపర్గామ్ లో గోదావరినదిలో స్నానమప్పుడు వానికి ముల్లుగుచ్చుకొనుట ఈ అపచారమునకు కొంత శిక్షగా బాబా అభివర్ణించిరి.

బాబా భక్తులపైప్రేమ హద్దులెరుగనిది. తాము  సాక్షాత్తు భగవదస్వరూపులైనను సాధారణ మానవులతో కలసి భుజించెడివారు. బాబాచేతిభోజనము ఎంతో శక్తి , మరెంతో తృప్తి నిచ్చెడిది.హేమాద్రిపంతు బాబా ప్రసాదంగా గిన్నెడు మజ్జిగ సేవించి మనకు కావలసినంత యమృతమును బాబాలీలల రూపముగా మనకందించెను. మనమీయమృతమును గిన్నెలతోత్రాగి మిగుల తృప్తి, ఆనందము పొందెదముగాక! బాబా తోటివారలతో కలసిభుజించుట, గోకులంలో బాలకృష్ణుడు తన తోటిగొల్లవారితో చల్దులారగించులీలను తలపింపజేయుచున్నది. సాయిదేవులు మానవరూప దైవమేకదా!

39 వ అధ్యాయము 

భాషకు స్పందన మనస్సునుండి, బుద్ధినుండి వస్తుంది. మనస్సు, బుద్ధులు తమ చైతన్యమును  తమకంటే అతీత స్థితిలోయు న్న ఆత్మ( విశ్వచైతన్యము ) శక్తినుండి పొందుతాయని శాస్త్రవాక్యము. సాయిబాబా ఎల్లవేళలా ఆత్మస్థితులు కావున వారికి జీవులందరి అంతఃకరణము సువిదితము. అటులనే అందరిభాషలు సాయి కెరుకయే ! షిరిడీలోని స్త్రీలు బాబామహిమను తమనిత్యకృత్యములన్నిటియందును పాడుచుండెడివారు. వారిమనసులు నిష్కల్మషములు, వారి భక్తిప్రేమలు పావనములు. వారుపాడు చక్కని పాటలు విన్నవారికి మనఃశాంతి  కలుగజేయుచుండెను.

అందరిమనసులలోని ఆలోచనలు బాబాకు విదితములుగావున నానాసాహెబు తనమనసును మంచిభావములతో నింపుటకొరకు బాబాసన్నిధిలో భగవద్గీతలోని ఓ శ్లోకమును తనలోతాను వల్లెవేయుచుండెను. బాబాకు సంస్కృతభాష తెలియదనుభావము నానాది, మరియు తనజ్ఞానానికి తానే గర్వించెడివాడు. సాయిబాబా యాతడు వల్లించుశ్లోకవివరమడుగ, నానా తనకుతెలిసిన భాష్యము చెప్పెను. 4 వ అధ్యాయములోని 34 వ శ్లోకమది.
" తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి  తే జ్ఞానం జ్ఞానిన స్తత్స్వ దర్శినః."
శ్లోకమునందలి ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ  యను పదములకు సమగ్రభావమును నానా చెప్పలేకపోయెను. మరియును జ్ఞానులు చేయు బోధ,  శిష్యుడు అంతరంగ అనుభవము పొందువరకు   అజ్ఞాన స్థాయి యందేయుండుననెడి సత్యమును నానా గ్రహింపలేకుండెను. జ్ఞానముగూడా బోధస్థాయిలో అజ్ఞానమే, అది శిష్యునికి పరిపూర్ణ యనుభవమైనపుడు మాత్రమే జ్ఞాన మయము కాగలదు. కావున గురుబోధ సయితము అజ్ఞానమే!  అనుభవమనెడిది స్వవిషయము, తాను సొంతముగా పొందవలయునేగాని, బోధద్వారా సాధ్యముకాదు. ఇతర జ్ఞానులుగూడ శ్రీకృష్ణ సమానులే. ప్రణిపాతమన గురుని సర్వశ్య శరణాగతికోరి చేయు సాష్టాంగ ప్రణామము, పరిప్రశ్న యనగా శిష్యుడు తీవ్రముముక్షువుగా మారి, ఎంతోకుతూహలముతో సత్యమునెరుగుటకు వేయుప్రశ్నయేగాని, గురుని బుట్టలోవేయు హీనభావముచే వేయు ప్రశ్న కాదు.  ఈ సమగ్రవివరణ నానా బాబాముఖమున వినగా, యాతని అహంకారము యణగిపోయెను.

శ్రీసాయినాథులు సమర్ధ సద్గురువులు. అందరి హృదయవాసిగావున, వ్యక్తుల చైతన్యమును ఉద్దీపింపజేసి  సాయి తమసంకల్పములను ఎంతో చతురతతో సాకారము జేసెడివారు. దీక్షితువాడాలో నిదురించు బూటీకి, శ్యామాకు మందిరసహిత వాడాను నిర్మించునటుల ఏకకాలమున  స్వప్నసందేశమిచ్చినారు. మురళీధరునికి నిర్మించిన స్థలమునందు  బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడు, బూటీవాడాయే సమాధిమందిరము.

40 వ అధ్యాయము 

నదులు సాగరంలో విలీనమైనపిమ్మట తమ పరిమిత ఉనికిని కోల్పోయి సాగరరూపమును, శక్తిని   పొందును. అటులనే దయాసాగర సాయిదేవులు తమ భక్తులకు తమ శక్తుల పంచెడివారు. సాయిలీలలు ఊహకందనివి, దహనులోని బి.వి. దేవుగారింటికి మరిద్దరితోకలసి భోంచేయుటకు వచ్చెదనని మాటిచ్చి, యటులనే సన్యాసిరూపముతో భోంచేసివెడలెను. ఆ సన్యాసే కొద్దిరోజులముందు గోరక్షణ నిధులకై దేవును కలియుటచే యాతడు వచ్చిన సన్యాసిని సాయిగా తెలియకుండెను. ఎంతటి చమత్కారమీలీల! తెరవెనుక సూత్రధారిలా సాయి కనపడరు, వినపడరు  కాని అన్నిపనులను ఎంతో క్రమపద్ధతిలో నిర్వహిస్తారనుటకు ఇది యొక చక్కటి ఉదాహరణము. అటులనే సాయి ఏరూపంలో భక్తుల జేరుతారో అనూహ్యముగావున ఎంతో మెలకువతో వ్యవహరింపవలెను.

మరొక్కసాయిలీల, హోళీ పండుగనాడు భోజనానికి వచ్చెదనని హేమాద్రిపంతుకు స్వప్నసందేశమిచ్చి, సరిగా భోజనసమయానికి చిత్రపటం రూపుతో విందారగించుట యెంతటి  విచిత్రము. ఆ చిత్రపటంవెనుక, సాయి ఎంత పెద్దకథ నడిపించారు!  సాయి ఏరూపంతో మనల జేరెదరో తెలియదు గావున భక్తులు మిగుల సావధానులై మెలగవలెను. సాయిబాబా మాటలు నిత్యసత్యములు, యటులనే వారి స్వప్నసందేశములుగూడ! అందరిలో దాగిన ఆత్మచైతన్యమే వారుగావున, మనుషుల ఉత్తేజపరిచి వారిద్వారా తమకార్యాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తారు సాయినాథులు.

41 వ అధ్యాయము 

శ్రీసాయి సర్వ దేవీ, దేవతా, జీవ స్వరూపులే గాక సర్వశిల్ప, సర్వ చిత్ర, సర్వచరాచర స్వరూపులు. శ్రీసాయిసచ్చరిత్ర పాఠకులకిదియంతయు విదితమే! బాంద్రాలోని అలీమహమ్మదు యింటిలోని పటములన్నియు నీటమునుగ, కేవలము సాయి  చిత్రపటమే నీటిగండము తప్పుకొనుట చిత్రాతిచిత్రము. హోలీపండుగనాడు హేమాద్రిపంతునింటికి భోజనానికి వచ్చెదనని స్వప్నసందేశమిచ్చి, సరిగా భోజనవేళకు అలీమహమ్మద్ యింటినుండి హేమాద్రిపంతునింటికి పటం రూపంతోరావడం, తనకు  తనపటానికి  ఎలాంటి బేధం లేదని సాయినాథులు చెప్పక చెప్పిన సత్యం.

సద్గ్రంథ పఠనముకూడా సద్గురుని ఆశీసులతో నిర్విఘ్నముగ జరుగును. విద్యావంతుడైనప్పటికీ బి.వి.దేవు జ్ఞానేశ్వరి పఠనముజేయలేకుండెను. బాబా ఆశీసు, స్పర్శలతో జ్ఞానేశ్వరి పుస్తకము పొందిన పిమ్మట చదువమని   బాపూసాహెబు జోగు యాతనికి సలహానిచ్చెను. బాబా మహారాజులు, ఏమైనా చేయగల సమర్థులు, ఈవిషయమెరుగక దేవు, సాయి సహాయము పొందక  బాలకరాముని సహాయము కోరుటచే, సర్వజ్ఞులగు బాబా క్రోధమునకు కారకుడాయెను. అందుచే వానిని తిట్టిరి , కొట్టిరి, మిగుల దక్షిణలందిరి. పట్టుబట్టలు తామివ్వ సిద్ధమవ్వ, ఇతరులనుండి గుడ్డపీలికలలాంటి సలహాలేల పొందెదవని సాయిబాబా దేవుతో మిగుల పరుషముగా మాట్లాడి తుదకు శాంతించిరి. బాబా కృపతో దేవు జ్ఞానేశ్వరి పఠనమునెరిగెను. బాబాకోపముగూడ ఆశీర్వాదమే! సాయి సర్వసమర్థులు, వారి ఆసీసులుండిన సర్వము సమకూరును.

 42 వ అధ్యాయము 

సద్గురుని పాద కమలములను జ్ఞప్తియందుంచుకొనిన మన కష్టములు నశించును, మరణము దాని నైజము కోల్పోవును, ఐహిక దుంఖములు నశించును. శ్రీసాయిలీలలను జాగ్రత్తగా వినిన మన మనసులు  పావనమగును.
సాయిబాబా 1918 సెప్టెంబరు 28 వ తారీఖున జ్వరపడి, క్రమముగా బలహీనులై 17 వ రోజు అనగా 1918 అక్టోబరు  15 వ తేదీ మంగళవారము మధ్యాహ్నము 2.30 గంటలకు భౌతిక శరీరమును విడచిరి. ఈ విషయమును రెండుసంవత్సరముల ముందే 1916 లో సూచించారు. 1916 విజయదశమి సాయంకాలము షిర్డీ ప్రజలు సీమోల్లంఘనమొనర్చి వచ్చుచుండగా బాబా మిగులక్రోధితులై " ఈ రోజే నా సీమోల్లంఘనము" యనుచు సటకాతో నేలపై కొట్టిరి. రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దులు దాటుట, కాని బాబాసూచించినది వారు దేహము, బుద్ధి, మనసులనెడి  తమ సాధారణ సరిహద్దులుదాటి హద్దులేలేని యనంతమైన ఆత్మ స్థితిలో, సర్వవ్యాపక స్థితిలో ప్రవేసించెదమనెడి భావముగా దోచుచున్నది.

కొద్దిరోజుల పిమ్మట జబ్బుపడిన రామచంద్ర పాటిలుకు బాబా దర్శనమిచ్చి వాని మరణము రద్దుజేసితిననియు, తాత్యా కోటే పాటీలు 1918 విజయదశమినాడు మరణించుననియు, యీ రహస్యమునెవరికి తెలియజేయవలదని బలికిరి. బాబా చెప్పినావిధముగా 1918 విజయదశముకిముందు తాత్యా తీవ్రముగా జబ్బుపడెను, కాని అనంతకరుణామయుడగు బాబా వాని మరణము రద్దుజేసి, దానికి ప్రతిగా తమ దేహమును త్యజించిరి. ఎంతటి దయాసముద్రులు సాయినాథులు!  ఈవిధంగా బాబా, తాత్యాను రక్షించి , వాని తల్లి  బాయిజాబాయి ఋణం దీర్చుకొన్నారు. అదే విధంగా తమకు అతిప్రేమతో సేవజేసిన లక్ష్మీబాయి షిండేకు నవవిధభక్తులకు సంకేతమనునటుల 9 రూపాయల దానమిచ్చిరి. తుదకు బయాజీ అప్పాకోతే పాటీలు ఒడిలో బాబా తమ చివరి శ్వాస విడచిరి.   కృతజ్ఞతలో బాబాకు సాటియెవరు లేరుగదా! ఈ పైనుదహరించిన ఘటనలద్వారా సాయిబాబాయొక్క సర్వజ్ఞత, కృతజ్ఞత  కారుణ్యము మున్నగు కళ్యాణ గుణములు తెలియు చున్నవి. సాయినిసేవించి, వారినుండి ప్రేరణపొంది మనముగూడా కృతజ్ఞత కారుణ్యములాంటి లోకహిత, దైవగుణముల నలవరచుకొనెదముగాక!   

43,44 అధ్యాయములు 

ప్రస్తుతజన్మ చివరి క్షణాలే మరుజన్మ వాసనలు బీజములు. కావున చివరి క్షణాలను పవిత్రభావనలతో గడపిన వారికి పవిత్ర ఉత్తరజన్మలు ప్రాప్తిస్తాయని మన గ్రంధాలు చెబుతున్నాయి. కావున మరణమునకుముందు గీత,భాగవతము మున్నగు దైవగ్రంధాల శ్రవణము చేయించెదరు. బాబా తమ దేహత్యాగానికి ముందు వజేయను వానిచే రామవిజయమను గ్రంధమును పారాయణ చేయించెను. భక్తులపై బాబా కరుణ అపారమైనది. తమచివరి నిముషాలు చూసితట్టుకోలేరనేమో బాబా;  దీక్షితు, బూటీ వంటి అంకిత భక్తులను వారివారి బసలలో భోజనముచేయుటకు పంపివేసిరి. కాని లక్ష్మీబాయి  షిండే, భాగోజీ షిండే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోంకర్ , శ్యామా బాబాను కనిపెట్టుకొనియుండిరి. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయల దక్షిణ ఇచ్చినపిమ్మట, తమను బూటీ వాడాకు దీసికొని పొమ్మని చివరిమాటలుగా చెప్పి బాబా బాయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణముల విడిచిరి. బాబా మరణముచే షిరిడీ విషాద సాగరమున మునిగినది. బాబాసమాధిచేయు విషయమున హిందూ ముస్లిములకు వాదోపవాదములు జరిగినను, తుదకు హిందువుల యభిమతమే నెగ్గి, బాబాను బూటీవాడాలో  మురళీధరునికి కట్టినచోట శాస్త్రోక్తముగా సమాధిజేసిరి. కావున బాబాయే మురళీధరుడు, వాడాయె పూజామందిరము. బాలాసాహెబు భాటే , ఉపాసనీబాబాలు ఉత్తరక్రియలు నెరవేర్చిరి. బాబా శరీరము 36 గంటలు గాలిపట్టినను బిగిసిపోలేదు.

బాబా నిష్ఠ, గురుభక్తి  యెంత గొప్పవోగదా, తమగురుని గుర్తుగా తాముపొందిన ఇటుకను  తమవద్ద చివరివరకు  తలగడగా నుపయోగించిరి. ఇది వారి యపరిమిత గురుభక్తికి ప్రబల నిదర్శనము. మజీదు శుభ్రముజేయు సమయమున ఇటుక విరిగినపుడు, బాబా మిగుల దుఃఖితులై తమ యదృష్టమే ముక్కలైనటుల యేడ్చిరి.   1886 వ సంవత్సరములో బాబా తమదేహమువిడిచి 72 గంటలు సమాధి పొందిరిగాని , తమ అవతారకార్యము కొనసాగించుటకు మరల జీవితులైరి. కావున  దేహాతీత  శాశ్విత ఆత్మస్వరూపులు సాయి. మజీదులోని శ్యామరావు జయకర్ చిత్రించిన  బాబా జీవితమెత్తు పటము భక్తులకు తృప్తిని, ఆశీసులనిచ్చుచున్నది. సమాధిపిమ్మటగూడ  బాబాభక్తరక్షణా కార్యము నేటికిని కొనసాగుచున్నది. సాయే దైవము. బాబా జీవితవిధానమును భక్తులు అంత తేలికగా అనుసరింపలేరు. అందులకు దుష్కర్మలు నశింపవలెను, అభిమానము అంతరించవలెను, పాపపుణ్యములు భస్మము కావలెనని  జోగుతో బాబా పలికిరి. భార్య మరణానంతరము జోగు స్వేచ్చాపరుడై సన్యాసము స్వీకరించి తనజీవిత పరమావధి పొందెను. కరుణామూర్తి యగు బాబా  పెక్కుసారులు మజీదులో తమభక్తుల శ్రేయస్సునకై పలికిన మాటలు, " ఎవరైతే నన్ను ఎక్కువుగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము, నాకథలు తప్ప మరేమియు చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నా నామమునే యెల్లప్పుడు జపించుచుండును. ఎవరైతే సర్వస్యశరణాగతి చేసి , నన్నేధ్యానించెదరో వారికి నేను ఋణస్థుడను ,  వారికిమోక్షమిచ్చి వారి ఋణము దీర్చుకొనెదను."  జీవులందరిలో 'నేనుగా' విరాజిల్లు  చైతన్యము లేక ఆత్మయే సాయి స్వరూపము. కావున మనము అందరిలో  సాయిని దర్శించి, సాయిని సేవించవలెను. ఎవరిని బాధపెట్టినను ఆ బాధ సాయిపొందెదరను నిత్య ఎరుకతో మనము జీవింపవలెను.

45 వ  అధ్యాయము 

సాయిబాబా నిత్యసత్యులు , చిరంజీవులు. వారిలీలలు సమాధికి ముందువలే యిప్పటికీ కొనసాగుచున్నవి. బాబాపై భక్తిచే మన బుద్ధి, మనస్సు, యింద్రియములన్నిటిని కేంద్రీకరరించి ఏకాగ్రత, మనోనిగ్రహములచే సద్గురుసాయిని సేవించవలెను. బాబా యటులనే తమ గురుని సేవించి పరిపూర్ణ సిద్ధపురుషులైనారు. ఎపుడు మనము గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో, మనముగూడ సాయిలో ఐక్యమై ఆత్మస్వరూపమును గాంచెదము. ఆ భావస్థితిలో సాయిని సర్వత్రా చూచెదము.
బాబా తమ భౌతికదేహముతో నుండినపుడు వారిని సర్వశ్య శరణాగతితో సేవించినముఖ్యులలో కాకాసాహెబు దీక్షితులు ముందువరుసలో నుందురు. బాబాయాజ్ఞానుసారము దీక్షితు నిత్యము భాగవతము, భావార్ధరామాయణము చదువుచుండెను. ఓ పర్యాయము బొంబాయి చౌపాటీలోని కాకామహాజని యింటిలో శ్యామా, మహాజని సమక్షమున కాకా ఎకనాథభాగవతము చదువుసందర్భమున, యాతని మదిలో పెద్దసందేహమొకటి కలిగెను. నవనాథుల భక్తి మిగులగొప్పది, ప్రస్తుతకాలంలో మనమలాంటి భక్తిని పొందగలమా యనెడిది యాతని సందేహము. ఒక విధంగా బాబాయునికినిగూడా సందేహించినట్లున్నది యాతని అనుమానము. కాని శ్యామా అందులకామోదించలేదు. బాబాలాంటి సద్గురుని పొందిన మనలాంటి వారలము వారి నిత్యత్త్వముపై నమ్మకముంచిన, నిరాశ యేల చెందవలెనను భావమును శ్యామా వ్యక్తపరచెను. కాని దీక్షితు తృప్తిపొందకుండెను. సాయి సదా చైతన్యులు, మరియు పారాయణ సందర్భము గావున సూక్ష్మరూపమున వారితో నుండినటుల
మనమెరుగవలెను. మరియు మనసందేహములన్నియు బాబాకు తృటిలో యెఱుకయే!

కాకాసాహెబు సందేహమునకు సమాధానమా అన్నటుల మరుదినముననే ఆనందరావు పాఖాడే శ్యామాను వెదకుచూ పురాణపఠన స్థలమునకు విచ్చేసి వారికి తన యనుభవమును తెలియపరచెను. తనస్వప్నములో సముద్రజలములలో సాయిని గాంచితిననియు, పక్కనున్న శ్యామా సహాయముచే నీటినుండి బయటకు దీసిన బాబాపాదములకు  నమస్కరించితిననియు, బాబాచెప్పినటుల కృతజ్ఞతతో శ్యామాకు పట్టుపంచె తెచ్చితిననియు వారలకు విన్నవించెను. చీట్లు వేసి, యనుకూలముగా వచ్చిన  పిమ్మట శ్యామా పంచెగ్రహించెను. ఇచట కాకా సందేహము మిగుల సమయోచితముగా, యెలాంటి సమయ విలంబనములేక  పరిష్కరింపబడినది. " నానుండి సలహాలు, రక్షణా తక్షణమే " యను సాయి మనలకిచ్చిన భరోసా యెంత సత్యవంతమోగదా!
హృదయ పూర్వకముగా మన గురుని ప్రేమించి, సర్వశ్య శరణాగతివేడి భక్తితో వారిపాదములకు మొక్కినచో  భవసాగరమును సులభముగా దాటగలము.
కనులుతెరచి నిదురింపగల సమర్ధయోగిపుంగవులైన సాయిబాబా మాత్రమే మజీదుకప్పునుండి వేలాడు ఎత్తైన  బల్లపై శయనింపగలరు. సామాన్యులకది యాసాధ్యము. " మంచిగాని చెడ్డగాని,ఏది మనదో యది మనదగ్గర నున్నది. ఏది యితరులదో , యది యితరులవద్ద నున్నది." యనునది   చక్కని సాయిమాట!

46 వ అధ్యాయము 

శ్రీసాయినాథులు సూక్ష్మరూపముతో సర్వవ్యాపకులు, వారిని గుర్తించి సేవించుట అందరికి సాధ్యముగాదు. పండితులము, జ్ఞానులమను దలచు అహంకారులకు సాయిబాబా మిగుల దూరులు. కాని నిరాడంబరభక్తులకు నిత్యరక్షణ గూర్చెదరు సాయినాథులు. అన్నిపనులు తాము చేయుచున్నను ఏమియు తెలియనివానివలె నటించెదరు. సర్వశ్య శరణాగతికోరి, నిత్యమూ వారినామస్మరణ చేయుభక్తుల కోరికలు సాయిదీర్చెదరు. మన మనసు శాంతమగుటయే సర్వస్యశరణాగతికి గుర్తు. ఒకసారి బాబా తమ భక్తుని యామోదించినచో, దూరమేని దగ్గిరేని ఎల్లవేళల వాని నంటియుండును. భక్తుడెచటకు పోయినను వానికంటె ముందు యాప్రదేశమునకు సాయి వెడలును.

కాకాసాహెబు దీక్షితు, నానాసాహెబు చాందోర్కరులు సాయిబాబాకు మిగుల ప్రియమైన భక్తులు. వారిరువు తమ తమ గృహముల శుభకార్యములకు సాయిని యాహ్వానింప తమకు బదులు శ్యామాను అప్పాకోతేతో వారిగృహములకు పంపిరి.  సాయి ఆశీస్సులతో గృహముల శుభకార్యములు విజయవంతముగా ముగియును. ఈసందర్భమున శ్యామా బాబాకృపకు సంకేతము. బాబాకృపతో శ్యామా, అప్పాకోతేల కాశి, అయోధ్య యాత్రలు మిగుల సఫలమయ్యెను. వీరిరువు గయజేరినపుడు తమభక్తుడు పండాగృహముననే సాయి వీరికి వసతి సమకూర్చెను. కాని పాండా గృహమున వీరిరువురు యడుగుబెట్టుటకుముందే సాయి చిత్రపటరూపమున వారియింటజేరి శ్యామాకు మిగుల యాశ్చర్యమును, ఆనందమును కలుగజేసిరి . చిత్రమేమన ఆ చిత్రపటమును పూర్వము పాండా బాబాయనుమతితో శ్యామానుండియే పొందియుండుట మిగుల యద్భుతము. సాయి కృపతో శ్యామా యాత్ర గౌరవప్రదంగా మిగుల సఫలమాయెను. శ్యామాకు గయలో గజారోహణా  మర్యాద  మిగుల లభించినది. సాయి సర్వజ్ఞులు, ఈ విషయములెల్లయు ముందు తెలిసినను తామేమీ యెరుగనటుల ప్రవర్తించిరి. జగన్నాటకమున ఎంతటి చతురతగలిగిన సూత్రధారులు సాయినాథులు! వారి సర్వజ్ఞతకు, సమర్ధతకు శతకోటి వందనాలు! బాబాకు జంతువులపైనను యపరిమిత ప్రేమయుండెడిది. రెండు మేకలుగా జన్మించి మజీదు సమీపమునకు వచ్చిన  పూర్వజన్మ జతగాండ్రను  సాయి గుర్తించి వారికి శనగపప్పుల తినిపించారు. జన్మజన్మల నేస్తము సాయిబాబా! మేకలుగా పుట్టిన సోదరులు పరస్పరము ఒకరినొకరు చంపుకొని మిగుల పాపకర్మ జేసిరి. వారిపాపకర్మ యా మేకలను  తిరిగి ఇచ్చివేయునటుల జేసినది. వారిరువురు  సాయిసాన్నిధ్యానికిదూరులయ్యారు.

47 వ అధ్యాయము 

శుద్ధ అంతఃకరణముచే పశువులు సహితము పరమేశ్వరుని జేరును , అటులనే మలిన అంతరంగంతో మంచి మానవజన్మ పొందినవారు సయితము తుదకు హేయజన్మలు పొందెదరు. ఈ సత్యమునే మనపెద్దలు జీవితమును పరమపదసోపానపటముగా చక్కగా పోల్చిచెప్పినారు. మంచిపనులతో నిచ్చెనలెక్కి ఉత్తమజన్మల పొందవచ్చును, యటులనే చెడుపనులుచేసి విషకర్మలప్రభావముచే దుష్టజన్మలును యనుభవింపవలెను. శ్రీసాయిసచ్చరిత్రలో ఈవిషయముల ధృవీకరించు చక్కని ఉదాహరణములు చెప్పబడినవి. శ్రీమతి ఖాపర్డే తన పూర్వజన్మలో గోవుగా సాయిదేవులకు పాలిచ్చి, క్రమంగా మానుషజన్మలనెత్తి తుదకు పావన  బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఖాపర్డే లాంటి ఉత్తమ భర్తను పొందగలిగినది. ఇందులకు విరుద్ధముగా ఓ ధనికుడు స్వార్ధబుద్ధితో ప్రజలు దేవాలయ పునర్నిర్మాణానికి సేకరించిన నిధులను కబళించి పరమేశుని శాపకారణముగా మరుజన్మలో వీరభద్రప్ప పేరున బిచ్చమెత్తు బ్రాహ్మణుడాయెను. ఆ జన్మలోగూడా చెన్నబస్సప్పయనువాని పై శతృత్వభావము, ద్వేషము పెంచుకొని మూడవ జన్మలో విషసర్పముగా హీన జన్మపొందెను. పూర్వజన్మలో బాబా సాన్నిహిత్యము లభించినప్పటికీ తన దుర్గుణముల, దుష్టసంస్కారముల ప్రభావముచే మరుజన్మలో సర్పరూపము పొందుట యెంతో శోచనీయము. అటులనే ఋణానుబంధముచే వ్యక్తులు కలసెదరు. ధనికలోభి  భార్య మరుజన్మలో గౌరినామముతో పూజారి కూతురుగా జన్మించినది. తనధనమును ముందుజన్మలో శివాలయ పునరుద్ధరణకు వినియోగించిన కారణముగా విశేష సంపదపొందినది. ఋణాను బంధముచే పూర్వజన్మలోని లోభి భర్తనే మరల భర్తగా పొందినది. మన పూర్వ జన్మ సంస్కారములు మిగుల బలమైనవి, ధనిక జన్మలోని లోభిగుణము వీరభద్రప్పగా జన్మించినను వానిని వీడలేదు. ధనమునకై చెన్నబసప్పతో మిగుల ద్వేషము, వైరము  పెంచుకొని తన మానవజన్మను పాడుజేసుకొనెను. ఆపై హీన సర్పజన్మము పొందినను యాతనిలోని ద్వేషము, పగ కొనసాగినవి. జన్మల బంధము, సంస్కారములు  యెంత బలీయమొకదా, బలహీనుడైన చెన్నబసప్ప కప్పజన్మపొంది  పాముజన్మపొందిన వీరభద్రప్ప నోటబడుట యెంతటి దయనీయము?

ఇచటమనము  పెక్కువిషయముల  గ్రహింపవలెను. వ్యక్తులు ఋణము, వైరము, హత్య లకు తదనుగుణ ప్రతిఫలముల  తప్పకపొందెదరు. కావున మనము ఈజన్మలోనే ఇతరుల ఋణమును తీర్చివేయవలెను, లేనియెడల మరుజన్మలో వడ్డీతోసహా దీర్పవలెను. అటులనే మన మనసులలో వైరభావమును దుడిచివేసి   అందరియెడ ప్రేమభావమును పెంపొందించుకొనవలెను, లేనియెడల మరుజన్మలో వైరభావము కొనసాగును.  హత్యయను మాటనుగూడా మనసులో తలువగూడదు. దైవసేవకు వెచ్చించిన ధనము యెన్నోరెట్లుగా ప్రతిఫలమిచ్చుట ఈకథలో గమనించితిమి. మనరక్షణకు బాబాను సర్వశ్య శరణాగతి వేడవలెను.  సాయి సత్యవంతుడు, జన్మజన్మల బాంధవుడు. ఆడినమాట తప్పని హరిశ్చంద్రుడు. శరణాగతికోరి మరుజన్మలో కప్పగామారిన చెన్నప్పను పాముగామారిన వీరభద్రప్ప నోటినుండి సరియగు సమయమున విడిపించి వాని ప్రాణముల రక్షించెను. ఎంతటికరుణామయులు సాయిదేవులు! స్వప్నములో కలిగిన దైవసందేశాల నాచరించి యధిక ప్రయోజనములు పొందవలెను. లోభి భార్య తనస్వప్నసందేశానుసారముగా  ఆలయ పునరుద్ధరణకై  ధనమునుపయోగించి పరమేశుని కృపకు పాత్రురాలై మరుజన్మలో గౌరిగా  మిగుల లభ్డిపొందెను. అందులకే చేసిన ధర్మము చెడని పదార్ధమని పెద్దలు చెప్పారు.

48 వ అధ్యాయము 

ఆత్మస్థితిని పొంది ఆ స్థితిలో  సదావిహరించువారు, తమ శిష్యులను ఆ స్థితిలో నిలుపగలవారు   సద్గురువులు, మిగిలినవారు సాధారణ జ్ఞానబోధ గురువులు, వీరు ఆత్మానుభవస్థితిని ప్రసాదింపలేరు. సాయిబాబా, రామకృష్ణపరమహంస, రమణ మహర్షి, లహిరీమహాశయ మున్నగువారు సద్గురువులు. సద్గురువులు తమ శిష్యులపట్ల సమభావం చూపెదెరేగాని , తాము గొప్పవారమనుభావమును సదాత్యజించియుందురు.  సాయిబాబా సమాధిపిమ్మటగూడ  ప్రేమతో సేవించు తమభక్తులను  నిత్యమూ కాపాడుచున్నారు.  కావున మనందరమూ సాయిని మిగుల భక్తిశ్రద్ధలతో సేవింపవలెను, ప్రేమింపవలెను. నిత్యస్మరణచే ప్రేమదీపాన్ని సదా ప్రజ్వలింపవలెను. కావున సాయినామమును  సదా చింతింపవలెను.

గురువును సర్వశ్య శరణాగతి వేడిన అసాధ్యములు సుసాధ్యములు కాగలవు. షేవడే బాగుగా చదువకున్నను బాబాపై పూర్తి నమ్మకముంచుటచే తన పరీక్షలో విజయము సంపాదించెను. కాని యాతని సహయోగి సపత్నేకరు షేవడే విశ్వాసమును శంకించి, బాబాను చులకనజేసి మాట్లాడుటచే తన రాబోవు కాలంలో పెక్కు కష్టముల నొందెను. తన ఏకైక పుత్రుని కోల్పోయెను. తమ్మునితో సాయిబాబాను దర్శించినను బాబా యనుగ్రహమును పొందలేకుండెను. తాను మానసిక పరివర్తననొంది మరల  భార్యతో సాయిబాబాను దర్శింప, పరమదయాలు సాయినాథులు కరుణించి ఆశీర్వదించి పుత్రసంతానమును ప్రసాదించిరి. కావున సద్గురువులపట్ల చులకన భావనముంచక మిగుల వినయవిధేయతలతో సేవింపవలెను. అవిధేయతకు ప్రతిఫలము తప్పక చెల్లింపవలెను. తదనుగుణముగా మన ప్రవర్తనను తీర్చి దిద్దుకొనవలెను. సపత్నేకరు భార్య పుణ్యురాలు,షిర్డీకి వచ్చుటకుముందు సాయిబాబా  యామెకు  స్వప్నసందేశమిచ్చిరి, యది శుభకర మాయెను. సాయిదర్శనముచే ఎప్పటినుండోయున్న ఆమె  వంటినొప్పులు తగ్గిపోవుట సాయికృపకు నిదర్శనము. పశ్చాత్తాపము  గూడ పావనగుణమే, తనతప్పునెరిగి సాయిని శరణుకోరుటచే సపత్నేకరుకు బాబా ఆశీస్సులు లభించినవి. సపత్నేకరు చెప్పకనే వాని పూర్వకథను చెప్పుట సాయి సర్వజ్ఞతకు మరో చక్కని తార్కాణము. సాయిబాబా సర్వజ్ఞులు, కరుణామయులు. వారు సపత్నేకరుకు బహూకరించిన నారికేళము, సాయికృపకు సంకేతము. మురళీధర్,భాస్కర్,దినకర్లను మువ్వురుపుత్రులు కలుగుట సాయిచలువే! సత్పురుషుల కలలోగూడ దూషింపరాదు!

49 వ అధ్యాయము 

సద్గురువు పరబ్రహ్మ స్వరూపులు, ఆ పరబ్రహ్మస్వరూపుని వేదములు సయితము నెఱుగజాలవు,కొనియాడజాలవు. వారిని మానవమాత్రులమైన మనము వర్ణింపలేముగావున మౌనము దాల్చుటయే మేలు, కాని సాయిలీలల, వారిసుగుణములజూసిన యూరకుండలేము. వారినికొనియాడుటకు ప్రేరితులమగుదుము. మిత్రులతోడి, బంధువులతోడి చేసిన భోజనము మిగుల ప్రియముగ నుండును, ఒంటరిగా తినిన వంటలు పెద్దగారుచింపని విధముగా, సాయిలీలలామృతమును పదువురితో ఆస్వాదించినపుడు మాత్రమే మనము మిగుల తృప్తిని ఆనందమును పొందెదము. సంసారబంధమునుండి తప్పించుకొనుటకు ఓ చక్కని మార్గమిచట చెప్పబడినది. సాయిని ధ్యానింపవలెను, సాయినామమును నోటితో పలుకవలెను, వారి మాటల మననము సేయవలెను, వారిరూపమును మనసున నింపవలెను, వారిని హృదయపూర్వకముగా ప్రేమించుచు సాయికొరకే మన సమస్త కార్యముల చేయవలెను.

కొందరు వ్యక్తులు సాయి గొప్పతనమును శంకించి వారిని పరీక్షింప వచ్చి తుదకు సాయిశక్తికి తల వంచి మంచిభక్తులాయిరి. బొంబాయి పెద్దమనిషి హరి కానోబా, మిగుల సంశయ స్వభావుడు, తలపై జలతారు పాగాధరించి, కొత్తచెప్పులువేసుకొని తన మిత్రులతో సాయిని పరీక్షింపవచ్చెను. కాని బాబాకు నమస్కరించి వచ్చునప్పటికీ మూలనుంచిన యాతని చెప్పులు మాయమైనవి. ఇదియొక సాయిజూపిన చిన్న చమత్కారము. అతడు వాడాలో స్నాన పూజాదులు ముగించుకొని, భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చినపుడు ఓ బాలుడు పోయిన ఆ చెప్పులను కఱ్ఱచివరకు వేలాడదీసి జరీ ఫేటా ధరించిన హరికి పుత్రుడెవ్వరని యఱచుచు వచ్చుటజూసి కానోబా మిగుల యాశ్చర్యమునకు లోనాయెను. తన వివరములను  ఆ బాలునికి వివరించి తన పోయిన చెప్పుల తిరిగి పొందెను. తమను  పరీక్షింపవచ్చిన సరియైన యనుభవము సమకూర్చి సాయి తమ సర్వజ్ఞత, సామర్ధ్యముల వానికి జూపిరి. సోమదేవ స్వామి ఉత్తరకాశికి చెందిన సాధువు. సాయిలీలల విని సాయిని చూడ షిర్డీ వచ్చెను. కాని దూరమునుండియే మజీదుపై నెగురు పెద్దజండాలజూసి  సాయిని యాడంబికునిగా   సంశయించి వెనుదిరుగదలచినను , తోటి భక్తుల  ఒత్తిడిచే తుదకు సాయిని జూసెను. సాయి స్వరూప, నిరాడంబర  స్వభావములజూసిన సాధువు మనసు కరిగెను. ఆతడు  మిగుల యానందించి శాంతిపొందెను. సాయి వాని సంశయ ఆంతర్యమునెరిగి తగువిధముగా మాట్లాడ సాధువు మిగుల ఆశ్చర్యపడెను. పిమ్మట సాయిసర్వజ్ఞతను, గొప్పతనమును గ్రహించి యాతడు బాబాకు గొప్పభక్తుడాయెను.

నానాసాహెబు చాందోర్కరు బాబాసన్నిధి పొందిన యదృష్టవంతుడు, కాని మనిషి మనసు కోతిలాంటిది. బీజాపూరునుండి బాబాను సేవింప వచ్చిన ఘోషాముస్లిము మహిళ ముఖమును మరల జూడ దలచెను. సర్వజ్ఞులగు  సాయినాథులు నానా మనసునెరిగి అందము వెనుక, అన్నిఅందముల సృష్టించిన యా దేవుని జూడమని సందర్భోచితముగా వాని భావమును సరిజేసిరి. సాయిబాబా భక్తుల శ్రేయస్సునకు తమ సర్వజ్ఞత నుపయోగించెడివారు. సాయిబాబా కృపను పొందుటకు మన భావముల శుద్ధిజేసుకొనవలెను. భావశుద్ధిచే బాబాను జేరుట సులువు!

50 వ అధ్యాయము 

సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారినోరును వినువారి చెవులును పవిత్రములగును. మంచిమిత్రులను కలిగియుండటంకూడా జీవితానికి వరమనే చెప్పాలి. నానాసాహెబు చాందోర్కరు లాంటి స్నేహితుడు లభించడం కాకాసాహెబు దీక్షితు యొక్క అదృష్టము.  చాందోర్కరు  ప్రోత్సాహముతోనే కాకాసాహెబు సాయిబాబా ను చూడ గలిగెను. తన అంగవైకల్యము బాగగుటకు బదులు తన మనసుకుంటితనము సరియగుటకు కాకా బాబానుజూడ మిగుల యాతురపడెను. తన భక్తుల పాశమేసి లాగునటుల బాబా సంకల్పముతోడనే కాకా షిరిడీ వెళ్లగలిగెను. అందులకు బాబానే చక్కని ఏర్పాట్లు మిగుల నేర్పుతో సమకూర్చెను. కాకా అహమదు నగరు ఓట్ల మిషతో మిరీకరుల యింటికి  రావడం, శ్యామా వారిని కలవడం, వారింట్లో బాబా ఫోటో చూడటం, ఆ రాత్రి రైలులో కాకాసాహెబు మిత్రుడే గార్డుగా యుండటం, ఫస్టు క్లాసులో రైలు ప్రయాణం చేయడం, మరునాడు ఉదయం కోపర్గామ్ లో నానాసాహెబును కలసి గోదావరి స్నానానంతరము షిరిడీ జేరటం, బాబా దర్శనానంతరం దీక్షితు పొంగిపొరలు ఆనందమనుభవించడం, ఈ వరుస సన్నివేశములలో ఎంత చక్కని కూర్పు, యెంతటి బాబా చాతుర్యము, సమర్ధతలు నిండియున్నాయి! బాబాతోడి పెక్కు లెక్కకందని  యనుభవముల రుచిజూసి , తుదకు రైలులో హేమాద్రిపంతుతో ప్రయాణించునపుడు సునాయాస మరణము పొందిన కాకాసాహెబు జన్మము ధన్యము!
సాయిబాబాను యెందరో సమకాలీన యోగులు, సత్పురుషులు గౌరవముతో పూజించి సేవించిరి. వారిలో దత్తాత్రేయభక్తులు శ్రీ వాసుదేవానంద స్వాములవారు యొకరు. వారు  నాందేడునుండి తమజూడవచ్చిన   పుండలీకరావుకు సాయికి సమర్పించుటకై  మిగుల భక్తిప్రేమలతో నారికేళమివ్వడం, దారిలో పగులగొట్టి పుండలీకరావు  తినడం, షిరిడీలో ఆ కొబ్బరికాయనుగూర్చి వానిని  సాయి యడగటం  ఎంత చక్కటి లీల. ఇచట పుండలీకరావు నిమిత్తమాత్రుడు. సంకల్ప, సాకారములకు బాబాయే సూత్రధారులు. ఎన్నోజన్మల పుణ్యముచేతను, బంధము చేతను మాత్రమే మనము సాయిబాబాను చూడటం, వారి యనుగ్రహం పొందటం జరుగుతుంది. బాలారామ్ ధురంధర్ యట్టి యదృష్టవంతుడు, తనసోదరునితోవచ్చి బాబాను దర్శించెను. సర్వజ్ఞులు బాబా వారిరాకను ముందుగనే తెలియపరచి, వారిది 60 జన్మల బంధమని చెప్పడం బాలారామ్ పూర్వజన్మ పుణ్యఫలమనే  చెప్పాలి. బాబా తమచిలుమును వానికిచ్చి వాని దీర్ఘ  ఉబ్బస వ్యాధిని దూరంజేయటం బాబాకృపకు సంకేతం.  6 సంవత్సరముల పిమ్మట  బాబా మహాసమాధి చెందినరోజున  యాతడు ఉబ్బసము మరలపొందుట, ఇంతకాలము బాబా  నిత్య  రక్షణ వానికి  లభించెననుటకు యిది చక్కని తార్కాణము. గురువారమునాడువచ్చి చావడి ఆరతిసమయాన బాబాలో పాండురంగని తేజముజూసిన బాలారామ్ జన్మము మిగుల ధన్యము !

51 వ అధ్యాయము 

శ్రీసాయి కథలను వినినను, తోటివారలకు వినిపించినను, కథలసారమును గ్రహించి తదనుగుణముగా ప్రవర్తనల సరిదిద్దుకొన్నచో మన మనసులకు ఎంతో తృప్తిశాంతులు లభిస్తాయి. అదేగా జీవితపరమావధి. సాయి చరాచర జగత్తంతయు వ్యావించియున్న దివ్యవిశ్వశక్తి. వారికందరు సమానులే, వారు ద్వందాతీత స్థితప్రజ్ఞులు. వారిని నిత్యమూ స్మరించుచూ, శరణాగతి వేడిన సాయి మనల వెంటనడచు నిత్యసత్యుడు. సాయి అనుభవ, ఆనంద, ఆరోగ్య ప్రదాత. మనల అంతరంగములు కల్లోలసాగరములు, పెక్కుచికాకులు, లెక్కకుమించిన సమస్యలు. కాని సాయిని యాశ్రయించుటచే భవసాగరమును సులభముగా దాటవచ్చును. మన మనసులు శాంతపడును, జీవన ఆరాట పోరాటములు సమసిపోవును. క్రమంగా అంతరంగశుద్ధి కలిగి నిశ్చల శాంతియను మన లక్ష్యము లభించును . మనజీవితమును నావతో పోల్చిన,  వారు సురక్షితముగా తీరముజేర్చు సరంగు.

సాయిని నిత్యమూ స్మరించుచూ, వారిచరిత్రను నిత్యపారాయణజేసిన యెడల ఆపదలు తొలగిపోవును. మన అంతరంగ శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు క్రమంగా కృశింప, మనలోకి సాయిశక్తి క్రమంగా ప్రవేశించును. వారి కథలను నిత్యమూ వినుటచే ఆధ్యాత్మిక జీవితమందు శ్రద్ధకలుగును. పాపములు నశించి కర్మఫలములు కృశించును. సాయిని పూజిస్తూ, వారిలీలాసాగరమున మునకవేయుటచే  బహుమూల్య మణులు లభ్యమగును. సాయికథలను ఇతరులకు వినిపించుటచే మనకు కొత్త కొత్త సంగతులు తెలియును. సాయిసగుణరూప ధ్యానముచే మనల ఆత్మసాక్షాత్కార మార్గము ప్రయాసరహితమగును. సాయిని సర్వస్యశరణాగతి వేడుటచే  నేనుయనెడి  అహము నశించి మన  వ్యక్తిచైతన్యము, సాగరమున కరిగిన ఉప్పుబొమ్మలా, సాయి విశ్వచైతన్యమున విలీనమగును. మన జాగృతి,స్వప్న, సుషుప్తులలోని ఏదేని ఓస్తితిలో సాయిలో లీనమైనచో మనబాహ్యబంధములు విడివడును. పవిత్రత, పూర్తివిశ్వాసములతో వారము రోజులలో శ్రీసాయిచరిత్ర పారాయణముచేసినచో ఆపదలన్నియు నశింపగలవు. కోరినకోర్కెలు నెరవేరును, ధనమునుకోరిన ధనమును, జ్ఞానమును కోరిన జ్ఞానమును  పొందవచ్చును. ఇందులకు పరిపూర్ణ భక్తి నమ్మకములు  అవసరము. రోజుకోయధ్యాయము భక్తితో పారాయణ జేసినను అపరిమిత యానందము కలుగును.

శ్రీసాయిసత్చరిత్రను గురుపౌర్ణమినాడు, గోకులాష్టమినాడు, శ్రీరామనవమినాడు, విజయదశమినాడు తప్పక పారాయణ చేయవలెను. పారాయణముచే రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్య వంతులగుదురు. మన మనసులు సుస్థిర శాంతిపొందును. భక్తిశ్రద్ధల తీవ్రతనుబట్టి మనకు ఫలము ప్రాప్తించును. ఈ గ్రంధమును చదువు భక్తులు పరిపూర్ణభక్తిని శ్రీసాయిపాదముల పొందెదరుగాక! మనమనసులు సర్వజీవులయందు సాయిని దర్శించుగాక!

శ్రీసాయినాథాయ నమః!
ఓం శాంతి శాంతి శాంతిః!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!

















         


Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.