సాయి కథలు: సద్గురువు - అభయప్రదాత.
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు: సద్గురువు - అభయప్రదాత
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము
సద్గురువులు, మహాత్ములు మానవాళిని ఉద్ధరించుటకై భూమిపై అవతరింతురు. గడచిన వంద, రెండువందల యేండ్లకాలంలో ఎందరో మహనీయులు భూతలమును పవిత్రపరిచారు. ముఖ్యంగా భారతావనిలో వీరిరాక విశేషంగా గోచరిస్తుంది. ఆకోవకు చెందినవారే సద్గురుదేవులైన సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మున్నగువారు. సాయిబాబా తమ చివరిక్షణంవరకు మానవోద్ధరణకు విశేష కృషిజేశారు, ప్రస్తుతం తమ సమాధినుండిగూడ ఆ పవిత్ర కార్యం నిర్వహిస్తున్నారు. సద్గురువులు తమ అలౌకిక దృష్టి, నవ్వు మరియు స్పర్శలచే తమ భక్తులకు ఇంద్రియాతీత పారవశ్య, పరమానందముల సమకూర్పగలరు. ఖాపర్డే విద్యావంతుడు, సాయిని సశరీరంగా సేవించిన ధన్యజీవి. అతడు బాబా సమ్ముఖమున ఓరోజు తనకుగలిగిన అనుభవములను డైరీలో యిలా వ్రాసాడు, " నేను ఆయన పాదాలొత్తాను. అవి చెప్పలేనంత మృదువుగా వున్నాయి. ఆయనెంతో ప్రసన్నంగా నవ్వారు. ఆ నవ్వు చూడడానికి శిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు. నేను పరవశించి పిచ్చివానిలా కన్నార్పకుండా చూస్తుండి పోయాను. ఆయనీరోజు భక్తులందరిపైనా యోగదృష్టి సారించారు. రోజంతా చెప్పలేని పారవశ్యంతో గడచిపోయింది. "ప్రస్తుతవ్యాసంలో రామకృష్ణ పరమహంస తమభక్తులకెలా అభయ ప్రదానం జేశారో పరిశీలించెదము. భక్తరక్షణలో వారు నిరంతర శ్రామికులైనప్పటికి యిచట ఓ ప్రత్యేక సంఘటన గూర్చి చెప్పడమైనది. పరమహంస ఆగష్టు 16, 1886 న కలకత్తాలో మహాసమాధి చెందారు. అంతకు షుమారు 18 నెలలముందు దక్షిణేశ్వర్ లో గొంతుకుసంబంధించిన కాన్సర్ వ్యాధికి గురియైనారు. వ్యాధి కుదుటపడక పోవుటచే వారిని భక్తులు చికిత్సకై కలకత్తా కాశీపూర్ గార్డెన్ హౌస్ కు తరలించారు. అంతటి బాధాకరమైన గొంతునొప్పి వ్యాధిచే పీడితులైనను వారి నిరంతర భక్తరక్షణా బాధ్యతను కొనసాగించారు. జనవరి 1వ తారీఖు 1886న కాశీపూర్ లో జరిగిన ఘటన మరువలేనిది. భక్తులకు పరమహంస కామితవరద కల్పవృక్షంగా గోచరించారు, అభయమిచ్చారు. ఆఘటన విశేషములనిపుడు స్మరించుకొనెదముగాక!
జనవరి 1న రామకృష్ణులు ఒకింత బాధానివారణ పొంది, ఉద్యానవనంలో కొద్దిసేపు విహరింపదలచారు. ఆరోజు శెలవుదినం గావున పట్టణ పలుప్రాంతాలనుండి గృహస్థ భక్తులు ఒంటరిగాను, బృందాలుగాను రావడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం సుమారు మూడుగంటల ప్రాంతంలో పరమహంస మేడమెట్లు దిగి తోటలో ప్రవేశించారు. అచటజేరిన సుమారు 30మంది భక్తులు వారికి గౌరవపూర్వక నమస్కారములుజేసి వెనుక నడవసాగారు. కొద్దిదూరం వెళ్ళినపిమ్మట రామకృష్ణులు దారిపక్క చెట్టుక్రిందున్న గిరీష్, రాం , అతుల్ మున్నగు భక్తుల జూశారు. వారెల్లరు సమీపించి మిగుల సంతోషంతో గురుదేవులకు నమస్కరించారు.
అచటివారెవరూ మాటలాడకమునుపే గిరీష్ తో రామకృష్ణు లన్నారు, " గిరీష్, అందరికి నన్ను అవతారపురుషునిగా చెబుతావు, నాలో నీవేమి చూసావు? నన్నేమి అర్ధం చేసుకున్నావు? ఆమాటలకు గిరీష్ ఏమాత్రము చలింపక మిగుల వినయంతో మోకాళ్లపై నిలబడి, చేతులు జోడించి, మిగులభావోద్వేగం తో, గద్గద స్వరంతో గురుదేవుల పాదాలకు ప్రణమిల్లి యిలా అన్నాడు, " వానిగురించి నేనేమి చెప్పగలను? వ్యాస, వాల్మీకి మున్నగు ఋషులే వాని వైభవాన్ని వర్ణించలేక పోయారు! " గిరీష్ నిజమైన భక్తివిశ్వాసాల కూడిన మాటలకు రామకృష్ణులు మిగుల చలించి వానివైపు జూస్తూ, యచటి భక్తులతో ఇలా అన్నారు, " ఇంక నేను మీకిచ్చే అవసరమేముంది ? మీరెల్లరకు నా ఆశిస్సులు, మీరెల్లరు ఆత్మోద్ధరణ నొందెదరుగాక! " ఈకొద్దిపాటి మాటలే చెప్పి , తమభక్తులపట్ల అవ్యాజ ప్రేమ, కరుణలతో వివశులై మిగుల పారవశ్యభూతులైనారు. రామకృష్ణుల హృదయలోతులనుండి వెలువడిన స్వార్ధరహిత దీవెనలు భక్తుల అంతరంగాలలోనికి చొచ్చుకొనిపోయాయి, వారెల్లరు పరమానందంతో పిచ్చివారైనారు. వారు కాలాన్ని, లోకాన్ని మరిచారు, తమగురుదేవుల వ్యాధి మరిచారు, వ్యాధిపూర్తిగా తగ్గువరకు వారిని తాకరాదనే వారు ముందుతీసుకొన్న నిర్ణయాన్ని మరిచారు. దేవలోకమునుండి ఓ అద్భుత దివ్యమూర్తి దిగివచ్చి వారిని ప్రేమతో పిలుస్తున్నట్లుగా రామకృష్ణుల తదేకంగా చూస్తున్నారు, వారి బాధలెల్ల మోస్తూ కన్నతల్లిగా రక్షించెడి కరుణామూర్తిని కళ్ళార్పకుండా చూస్తున్నారు. సాష్టాంగ నమస్కారములుజేసి వారి పవిత్రపాదధూళి పొందుటకు తహతహలాడారు. ఒకరివెనుక మరొకరు రామకృష్ణుల పాదముల తాకుచుండ ' రామకృష్ణులకు జై ' జయజయ కారాలు మిన్నుముట్టాయి. భక్తులట్లు వారిపాదములు స్పృశించుచుండ, పరమహంస కరుణాసాగర హృదయం హద్దులుదాటి పొంగిపొరలినది. దక్షిణేశ్వర్ లో నిత్యం మిగుల పారవశ్య స్థితిలో భక్తుల తమ దివ్యహస్తంతో తాకుతూ దీవెనల నందించిన విధంగా కాశీపూర్ ఉద్యానవనంలో ఆ పావన సాయంకాలవేళ ప్రతియొక్కరినీ స్పృశిస్తున్నారు. ఆరోజునుండి రామకృష్ణులు తమ దైవత్వాన్ని సమీపమునయున్న తమకు, బాహ్యప్రపంచవాసులకు ప్రకటిస్తున్నటుల, భక్తగణం భావించారు. పాపులు, ఆదివ్యాధి పీడితులు, అజ్ఞానులు పరమహంస పవిత్ర పాదచాయలో యూరట నొందెదరనుటలో వారికేమాత్రం సందేహం లేదు. రామకృష్ణుల ఆ అపూర్వ ప్రత్యేక పారవశ్యస్థితిని గాంచి కొందరు మాటలురాని మూగలైనారు. గురుదేవుల ఆశీసులు పొందుటకు రమ్మనుచు భవనంలోనున్న వారిని, కొందరు పెద్దగా పిలుస్తున్నారు. మరికొందరు వనంలోని పువ్వులవెదజల్లుచూ మంత్రోచ్ఛరణలతో పూజలు జేస్తున్నారు. రామకృష్ణులు తమ పరమానంద పారవశ్యమునుండి, సాధారణ స్థితికి వచ్చినపిమ్మట అచటిభక్తులు చల్లబడ్డారు. ఆప్రత్యేక సాయంసమయ నడక ముగించి రామకృష్ణులు భవనంలోని తమగదికి వచ్చి సేదదీరారు.
శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
గురువు జ్ఞానదాత ! సద్గురువు అనుభవ ప్రదాత !
ReplyDelete