రెండు అధ్యాయములు !

శ్రీసాయినాథాయనమః 

ఓం శ్రీ సాయి ఉపద్రవనివారిణే  నమః !

సాయి కథలు - రెండు అధ్యాయములు
" మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము  చేయుటే " శ్రీ సాయి సచ్చరిత్రము

శ్రీసాయిసచ్చరిత్ర పఠనము మిగుల శ్రేయోదాయకము. సాయిభక్తులకీ పారాయణ పవిత్రగ్రంధములైన భగవద్గీత, ఖురాను, బైబిల్ గ్రంథపఠనముతో సమానఫలదాయిగా చెప్పబడినది. శ్రీసాయిసచ్చరిత్రములో 51 అధ్యాయములున్నవి. ఈగ్రంధమును సాయి ప్రేరణచే అన్నాసాహెబ్ దబోల్కర్ యను భక్తుడు ప్రప్రధముగా మరాఠీ భాషలో రచించాడు. ఈగ్రంధాన్ని సంక్షిప్తముగా తెలుగులోనికనువదించినవారు శ్రీ పత్తి నారాయణ. గ్రంథపారాయణమువలన కలుగు పెక్కుప్రయోజనములను ఈగ్రంథమునందు విపులీకరించడమైనది. పారాయణచే భక్తులకు కలిగిన పెక్కు యనుభవములే  యిందులకు సాక్ష్యము. సాధారణముగా శ్రీసాయిసచ్చరిత్రపారాయణము  భక్తులు ఏడురోజులలో పూర్తిజేసెదరు, దీనినే సప్తాహపారాయణమందురు. కొందరు రోజుకోయధ్యాక్రమమున చదివెదరు. ముఖ్యముగా భక్తుల కష్టనివారణకై  11, 15  అధ్యాయములు శ్రేయస్కరమని ఆయా అధ్యాయముల చివర చెప్పబడుటచే ఆయా అధ్యాయములందు చెప్పబడిన విషయములను  సంక్షిప్తముగా   తెలిసికొందము.
ముందుగా 11వ అధ్యాయవిషయముల పరిశీలించెదము.
ఇందు సాయినాథుని సగుణరూపమున  ధ్యానించుట, పూజించుట  సులభమార్గమని చెప్పబడినది. అనగా సాయిని చిత్రపటరూపంగాగాని, విగ్రహరూపంగాగాని పూజించడం భక్తులకు తేలికమార్గం. గంగానది సముద్రంలో కలియుటకుముందు, మార్గంలో ఎందరికో దాహం తీరుస్తుంది, చెట్టుచేమలకు, పైరుపంటలకు ప్రాణం పోస్తుంది. అటులనే సాయినాథునిలాంటి మహనీయులు తమజీవనగమనంలో ప్రజలకెంతో సుఖశాంతుల ప్రసాదించి లోకానికి మిగులమేలుజేస్తారు. సాయిబాబా తమజీవితకాలాన్ని శిరిడీలో మాత్రమే గడిపినప్పటికీ వారి విశ్వవ్యాపకతను దూర దూరముల  భక్తులు యనుభవించారు, వారిని సర్వాంతర్యామిగా గ్రహించారు. అలాంటి దైవరూపసద్గురునికి వినయపూర్వక ప్రణామములు.
ఇక ఈ అధ్యాయములోచెప్పబడిన కథలేమిటో చూద్దాం. మొదట డాక్టర్ పండితు గురించి తెలిసికొందాము. ఇతడు సాయిభక్తుడైన తాత్యాసాహెబ్ నూల్కరుకు స్నేహితుడు. పండితు శిరిడీవచ్చి  బాబాను దర్శించి నమస్కరించాడు. బాబా యతనిని  పూజారి దాదాభట్ కేల్కరు యింటికి పంపారు. కొంతసేపటికి  బాబాను పూజించుటకై వారిరువురు ద్వారకామాయికి పూజాసామాగ్రితో వచ్చారు. మొదట భట్టు సాయిని పూజించాడు. ఆపిమ్మట పండితు పూజాపళ్ళెమునుండి చందనము గ్రహించి బాబానుదిటిపై  త్రిపుండ్రాకారము అనగా మూడుఅడ్డగీతలు వ్రాసాడు. ఎవరినుండి ఇలాంటి చందనసేవలు అంగీకరించని బాబా మౌనంగా యుండుటజూసి భట్టు ఆశ్చర్యపడ్డాడు. ఇదేవిషయాన్ని ఆరోజుసాయంకాలం బాబానడిగాడు భట్టు. సద్బ్రాహ్మణుడైన పండితు బాబాను ముస్లిముగా తలంచక మిగులనిష్కల్మష భక్తితో తనగురువుగా భావించి చందనమద్దుటచే తాను మాట్లాడలేకపోయానని సాయి వివరించారు. భక్తికి బందీ సాయినాథులు, యుక్తికికాదు. ఇక రెండవకథ హాజీ సిద్దిఖ్ ఫాల్కే యనువానిగూర్చి.  ఇతడు కళ్యాణ్ నివాసి, ముస్లింధర్మం పాటించేవ్యక్తి. ఫాల్కే మక్కా మదీనా యాత్రలుజేసి సాయిని జూడ శిరిడీ వస్తాడు. కాని బాబా వానిని మజీదులోనికి యనుమతించకపోవుటచే తొమ్మిదినెలలు చావడి ఉత్తర భాగంలోనే బసజేసాడు. మజీదుముందున్న  ఖాళీ ప్రదేశంలో మాత్రమే దూరంగా కూర్చునేవాడు. క్రమంగా నిరాశా నిస్పృహలకు లోనై తనబాధను బాబాప్రియభక్తుడు శ్యామాకు వివరించాడు. శ్యామా అందులకు సమ్మతించి తగు సమయాన  బాబాను  ఈ విషయమై యడిగాడు. అల్లా కటాక్షం లేనిదే ప్రవేశించలేడని ముందుగా పలికిన బాబా ఫాల్కే కొరకై కొన్నిసమాధానములనడుగుతాడు. ఇదేవిషయమై శ్యామా వానినడుగ యతడు తృప్తిగా సమాధానమిస్తాడు. బారవీ బావికి ఇరుకుదారిద్వారా నడువగలననియు, నలుబదివేల రూపాయలకు బదులు బాబాకు నాల్గు లక్షలిచ్చుటకు సిద్ధమనియు, తనకెలాంటి మేకమాంసమవసరం లేదనియు, కేవలం బాబాభిక్షపాత్రలోని  ఓముక్క చాలని శ్యామాద్వారా బాబాకు తెలియజేస్తాడు. ఈమాటలువిన్న బాబా మిగుల కోపించి యచటి మట్టికుండల దూరంగా విసరివేచి ( భక్తుల యనుగ్రహించుటకుముందు కోపించుట బాబా నైజం.) తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకెళ్లి తీవ్రస్వరంతో, " నన్నుగురించి యేమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడిననీ, పెద్ద హాజీవని గొప్పలు పోవుచూ, యేమిటేమిటో వదరుచున్నావే? నాదగ్గరా నీ యాటలు? ఖురాను చదివి నీవు తెలిసికొన్న దిదేనా?  మక్కామదీనా యాత్రలు జేసితినను గర్వంతో నేనెవరో తెలియకున్నావు! " యంటూ ఇంకెమేమో తిట్టుచు మజీదుకు తిరిగివెళ్ళారు. బాబా అగ్రహావేశాలజూసి హాజీ భయపడ్డాడు. బాబాది కన్నతల్లిహృదయంగదా, త్వరలోనే శాంతించి కొన్నిగంపల మామిడిపండ్లనుకొని వానికి పంపారు. తిరిగి హాజీ వద్దకొచ్చి వానిచేతిలో 55 రూపాయలుంచారు. అప్పటినుండి హాజీకి మజీదులోని కనుమతించారు. దైవానికి తాను సేవకుడనని నొక్కిపలికిన  బాబా,  వ్యక్తిగత అహంకారాన్ని సహించేవారు కాదనే సత్యాన్ని ఈ ఘటనద్వారా మరొక్కసారి తెలిసికొంటాము.
అహంకారమనేది మనిషి మనసులోదాగిన కనబడని శత్రువు. హాజీ అంతఃశత్రువునెలా పారద్రోలి వానికి సాయపడ్డారో చూసినపిమ్మట   ప్రకృతి ఉపద్రవములనుండి  శిరిడీ ప్రజలనెలా సాయి కాపాడారో తెలిసికొందాము.

ఓనాటి సాయంకాలము శిరిడీలో గొప్పతుఫాను సంభవించినది. కారుమేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. తీవ్రమైనగాలి వీచనారంభించినది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసింది. క్షణకాలంలో నేలంతా జలమయ మయింది. పశుపక్ష్యాది జీవకోటితోసహా యచటి ప్రజలెంతో భయభ్రాంతులైనారు. శిరిడీలో కొలువున్న శని, శివపార్వతులు, మారుతి  ఖండోబా మున్నగు దేవతలు వారినాదుకోలేదు. కావున నిస్సహాయులైన వారందరు మశీదుకొచ్చి బాబాను శరణుజొచ్చారు. తుఫాను నాపివేయుటకై బాబాను వేడుకొన్నారు. అలా ఆపదలోనున్న జనులజూసి బాబా హృదయం ద్రవించినది. సాయిబాబా వెంటనే బయటకువచ్చి మజీదు అంచున నిలబడి బిగ్గరగా, " ఆగు నీతీవ్రతను తగ్గించు, నెమ్మదించు" మని గర్జించారు. ఆపై కొన్నినిముషాలలో వర్షంతగ్గి గాలి వీచడమాగి తుఫాను ఆగిపోయినది. నీలాకాశంలో చంద్రుడు కనిపించాడు. సంతోషంతో ప్రజలెల్లరూ తమతమ యిండ్లకెళ్లారు. వేరొకదినమున మిట్టమధ్యాహ్నము దునిమంటలు అపరిమితంగా లేచాయి. మంటలు మజీదు కప్పుకున్న దూలాల తాకుచున్నాయి. అచ్చటకూర్చున్నవారికేమి తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడనిగాని, నీళ్లుజల్లి మంటల చల్లబరచుడనిగాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడ్డారు. వారి భయాందోళనల గ్రహించిన బాబా తమ సటకాతో పక్కనున్న స్తంభముపై కొట్టుచు, " దిగు దిగు శాంతించుము. " యనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెంగా మంటలు తగ్గిపోయి ధుని ముందులా మితంగా మండసాగినది. (శిరిడీ ప్రజల రక్షించినటుల  లోకాన్ని  చుట్టేసిన కరోనా మహమ్మారినుండి విశ్వమానవాళిని రక్షించి, జనుల హృదయముల దహించు  గుండెమంటలు నివారించుటకై సమర్థ సద్గురుసాయినాథుల  ఆర్తితో మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.)
(" ఎవరైతే భక్తిశ్రద్ధలతో  పై కథలను నిత్యము పారాయణముజేసెదరో సాయికృపచే వారు కష్టములనుండి ముక్తులగుదురు. " 11వ అధ్యాయము.)

15వ అధ్యాయము 
అధ్యాయ ఆరంభమున భగవంతుని కీర్తించుపద్ధతినిగూర్చి వివరింపబడినది. ఓరోజు కీర్తనకారుడు, బాబాభక్తుడగు దాసగణుమహారాజు హరికథచెప్పుటకు వెళ్లుచు ఆశీస్సులకై సాయిబాబాను సందర్శించాడు. తలపై పాగా, పొడవాటి కోటు, లోపలచొక్కా, పైన ఉత్తరీయములతో   మిగుల అలంకరించుకొన్నాడు. బాబా అతనితో "  ఏమోయ్, పెండ్లికొడుకా !  ఇంతచక్కగా ముస్తాబై ఎక్కడికి పోవుచున్నావు? " అనెను. హరికథ చెప్పుటకై వెళ్లుచున్నానని దాసగణు చెప్పగా, బాబా యిట్లన్నారు. " దానికి ఈ అలంకార దుస్తులన్ని యెందుకు,  తీసివేయుము. "  వెంటనే దాసగణు ఆయా అలంకారముల  బాబా పాదములవద్దనుంచాడు. ఆపై  కేవలము కట్టుపంచె , చేతిలో చిరుతలు మెడలో పూలమాలమాత్రమె  ధరించి హరికథచెప్పుటకుపక్రమించేవాడు. భగవంతుని మిగుల భక్తిశ్రధ్ధలతోడను, వినయవిధేయతలతోడను, నిరాడంబరముగను సేవింపవలయుననెడిది సాయి సందేశము. 
పిదప ఈ అధ్యాయములో చెప్పబడిన ముఖ్యకథను వివరించుకొందాము. 11వ అధ్యాయములో బాబా శిరిడీ ప్రజలను ప్రకృతి విపత్తునుండి   యెలా రక్షించారో చూశాము. ప్రస్తుత అధ్యాయములో  సాయి ఆర్ధిక బాధలనుండి ఓ వ్యక్తినెలా ముక్తునిజేసారో చెప్పబడినది. పేదరికము పెద్దశత్రువు, సొంత కడుపునింపుటకు, తన పరివార రక్షణకు  మనుజుడు కోటివిద్యలు నేరుస్తాడు, అందులకే మనపెద్దలు ' కూటికొరకు కోటివిద్యలు '  సామెత జెప్పారు. ఓ పర్యాయం బొంబాయి  ఠాణా లోని కౌపీనేశ్వరాలయంలో దాసగణు మహారాజ్ హరికథ జెప్పుచు సాయిమహిమను పాడుచున్నాడు.  కథ వినువారలలొ చోల్కరు యనునతడున్నాడు.  అతడు మిగులపేదవాడు, సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. దాసగణు కథకు మిగుల పరవశించాడు. వెంటనే అక్కడికక్కడే మనసులో సాయిబాబాను ధ్యానించి ఇలా మొక్కుకొన్నాడు. "  సాయీ! నేను మిగుల పేదవాడను, కుటుంబమునే పోషింపలేకున్నాను. మీ అనుగ్రహముచేత ప్రభుత్వ పరీక్షలో కృతార్థుడనై స్థిరమైన యుద్యోగము లభించినచో నేను శిరిడీ వచ్చి మీపాదములకు సాష్టాంగ ప్రణామము జేసెదను. మీపేరున కలకండ 
పంచెదను. "  బాబా కృపచే చోల్కరు పరీక్షలొ పాసయ్యాడు. మరి శిరిడీ యెలా వెళ్ళాలి? ఖర్చులకు తనవద్ద తగినంత డబ్బులేదు. ఇంటిఖర్చులు తగ్గించుకున్నాడు. పంచదార లేకుండ టీ తాగనారంభించాడు.  ఇలా పొదుపైన పైసలతొ సాయిని దర్శించాడు. బాబా పాదములపై బడి కొబ్బరికాయ సమర్పించాడు, కలకండను పంచాడు. తానుపొందిన తృప్తి శాంతులను బాబాకు వివరించాడు. అపుడు జోగు యను భక్తునింట  అతిధిగా ఉన్నాడు  చోల్కరు.  ఇంటికి వెడలుటకై వారిరువురు బయలుదేరువేళ బాబా జోగును పిలచి, " నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెరవేసి యిమ్ము! "  ఈమాటల భావమును గ్రహించిన చోల్కరు  హృదయము ద్రవించినది, కనులనీరు కమ్మినది. తిరిగి బాబా పాదముల ప్రణమిల్లాడు. చోల్కరు ఆవిధముగా సాయిబాబా కరుణచే ఈతిబాధలనుండి ముక్తినొందాడు. ఇచట సాయి చెప్పక చెప్పిన సందేశమేమిటి?  "  నా ముందర భక్తితో మీచేతులు చాపినచో వెంటనే రేయి పగలు మీచెంత నేనుండెదను. నాదేహము నిచ్చటనున్నప్పటికి సప్తసముద్రములకవ్వల  మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీ కిచ్చవచ్చినచోటుకు పోవుడు. నేను మీచెంతనే యుండెదను. నా నివాస స్థలము మీహృదయమునందే కలదు. నేను మీ శరీరంలోనే యున్నాను. ఎల్లప్పుడు మీహృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్నీవిధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. "  
రెండుబల్లుల చిన్నకథచెప్పి రచయిత హేమాద్రిపంతు ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఇచట సాయి సర్వజ్ఞులుగను, సర్వజీవ హృదయవాసి గను మనము తెలిసికొనెదము.  ఒకనాడు బాబాముందు మజీదులో ఓ భక్తుడు కూర్చొన్నాడు. మజీదుకప్పుపై ఓ బల్లి టికు టికు మని శబ్దం జేస్తుంటే దానర్ధమేమని బాబానడిగాడు. ఔరంగాబాదు నుండి తనను జూడవచ్చు చెల్లెలు రాకచే బల్లి సంబరపడుతుందని సాయి చెప్పారు. భక్తునికిదేమి బోధపడలేదు. కాసేపటికి ఔరంగాబాదునుండి ఓ వ్యక్తి గుర్రముపై బాబా దర్శనమునకై శిరిడీ వచ్చాడు. తన గుఱ్ఱమునకు ఆకలివేయుటచే ముందుకు పోలేకున్నాడు. గుఱ్ఱమునకు ఉలవలు తెచ్చుటకై వెళ్లునప్పుడు సంచిలోని ధూళిని విదిలించాడు. అందులోనుండి ఓ బల్లి క్రిందపడి అందరూ జూచుచుండ గోడనెక్కి తనసోదరిని సంతోషంతో జేరినది. ఎంతోకాలం తరువాత కలియుటచే అక్కాచెల్లెళ్లు పరస్పరం కౌగలించుకొని ముద్దాడారు. శిరిడీ యెక్కడ? ఔరంగాబాదెక్కడ? రౌతు బల్లితో ఔరంగాబాదునుండెలా వచ్చాడు?  అక్కచెల్లెళ్ల కలయిక నెలా బాబ చెప్పారు? ఇదియంతయు బహు విచిత్రముగాయున్నది !  

(" ఎవరైతే యీ అధ్యాయమును భక్తిశ్రద్ధలచే పారాయణముజేసెదరో వారి కష్టములన్నియు శ్రీసాయినాథుని కృపచే తొలగును. "  15వ అధ్యాయము.) 

( Please share with  your loved ones and Sai devotees.)

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 




Comments

  1. సర్వేజనా సుఖినోభవంతు!
    సమర్ధసద్గురు శ్రీసాయినాథులు కరోనా ఉపద్రవమునుండి సర్వజనులను రక్షించుటకై హృదయపూర్వకముగ ప్రార్ధించెదము !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)