అనుకరణ అనర్ధం.
శ్రీసాయినాథాయనమః!
అనుకరణ గురించి మాట్లాడుకొనేముందుగా శ్రీ మహాభాగవతములోని ఓ మధుర సన్నివేశాన్ని స్మరించుకొందాము. ఆది మహావిష్ణు శంఖ చక్ర గదా పద్మాలను సదా ధరిస్తాడనేది సర్వులకు తెలిసినవిషయమే. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మదాల్చినపుడు పౌండ్రక వాసుదేవుడను ఓ రాజుండేవాడు. అతడు మూర్ఖుడు, మహా అహంకారి. శ్రీకృష్ణుని పేరుప్రఖ్యాతులు విని తానుగూడ శ్రీకృష్ణునిలా ప్రజలచే పూజింపబడాలని శంఖ చక్ర గదాది ఆయుధములను చేయించుకొని ధరించడము మొదలుపెట్టి ప్రజలు తనను శ్రీకృష్ణునిలా పూజింప నిర్బంధించేవాడు. ప్రజలకీవిషయం చాలవింతగా దోచి వానినంతగా పూజించేవారు కాదు. అందులకాతడో ఉపయామాలోచించి శ్రీకృష్ణుడులేకున్న ప్రజలు తననే కొలుస్తారని శ్రీకృష్ణునిపై దండెత్తి చివరకు మరణిస్తాడు. అర్హతలేని అనుకరణ యెంతటి ప్రమాదకారొగదా!
మహాత్ముల, సద్గురువుల జీవితవిధానముల పరిశీలించి, వారిబోధనలను అర్ధం జేసికొని, వారుసూచించిన మార్గంలో పయనించడమెంతో శ్రేయస్కరము కదా! అట్లుగాక కొంతమంది నకిలీగురువులనిగూడ చూస్తుంటాము. వారు సద్గురువుల, మహనీయుల వేషభాషలనెంతో నేర్పుగా అనుసరిస్తుంటారు కాని వారి అంతరంగం అందుకు భిన్నంగా వుంటుంది. ధనార్జన కీర్తిప్రతిష్టలపైనే వారిధ్యాస నిలుస్తుంది. అందులకే ఎంతో వివేకంతో సద్గురువులనెన్నుకోవాలి, ఒకవిధంగా ఆ సద్గురువువే తనవారల నెన్నుకొంటారనికూడ కొందరు విజ్ఞులు చెబుతుంటారు. ఏదేమైనా కానిండు ఓ గురునికి సర్వస్యశరణాగతి జేసేముందు సాధకులెంతో మెలకువతో వ్యవహరించాలి. ఈసందర్భంలో మరొక ముఖ్యవిషయమేమంటే మహాపురుషులలా నటించి కొందరు భంగపడతారు, కొన్నిసందర్భాలలో చాలాపెద్ద శిక్షలకు లోనౌతారు, ప్రమాదాలకుకూడ గురియగుతారు.
ప్రస్తుతం ముక్తారాం యను పేరుగల ఓ సాయిభక్తుని గూర్చి తెలుసుకొందాము. ఈ వివరములు శ్రీసాయిసచ్చరిత్రలో చెప్పబడలేదు కాని కొన్ని సాయిబాబా జీవితవిషయముల తెలియజెప్పు పత్రికలయందు ప్రచురించడమైనది. నిజం దైవానికెరుకయినా, ఓ మంచిసందేశం ఇచట మనకు లభిస్తుంది. ముక్తారామ్ మొట్టమొదట 1910వ సంవత్సరప్రాంతంలో తన ఖాందేష్ లోని రివరీ ప్రాంతము నుండి షిరిడి వచ్చాడు. తనసంసారాన్ని ఆస్తిపాస్తులను వదలి సాయి బాబా సన్నిధిలో మిగుల విరాగిగా జీవించడం మొదలుపెట్టాడు. బాలారాం మాన్కరు యను వేరొకభక్తునితో బాబా అనుమతితో పెక్కు ప్రాంతాలు దర్శించి షిర్డినే తన నివాసంగా మార్చుకున్నాడు. బాబాకూడా వారిరువురిపట్ల యెంతో ఆదరణ చూపేవారు. ఉదయానే ద్వారకామాయికి వచ్చి బాబాకు సమీపాన ధుని వద్దకూర్చునేవాడు. మధ్యాన్న హారతి వరకుండి బాబాతో భోంచేసేవాడు. పిమ్మట సమీప తన చిన్నరేకుల గదికెళ్ళి తానచట సమకూర్చుకొన్న చిన్న ధునికెదురుగా కూర్చునే వాడు. మండుటెండలో సయితం బాబా నివారించినా వినకుండా మజీదు దునివద్దనే కూర్చునేవాడు. అంతది ఆతని శ్రద్ధ పట్టుదల, మరియు బాబాపై ప్రేమ. బాబా వాని ప్రేమకు మిగుల ప్రసన్నుడై వానికొక కఫనీ, తలగుడ్డ బహూకరించారు. ఇలా కొంతకాలం జరిగినపిమ్మట బాబా మహాసమాధి చెందారు. మహాసమాధి పిమ్మట ముక్తారామ్ లో అనుకోని కొన్ని మార్పులొచ్చాయి. తనను బాబా వారసునిగా భావించి బాబా కూర్చుండెడి ఆసనంపై కూర్చునేవాడు,తోటిభక్తులు వారించినా వినక బాబా సందేశంగా కూర్చుంటున్నాననే వాడు. కొన్నిరోజులపిమ్మట యెవరూ ఊహించని సంఘటన జరిగింది. బాబా ఆసనంపై కూర్చున్న వాని క్రిందిభాగమంతా సూదులతో గుచ్చినటుల మిగుల బాధ మొదలై, విపరీత రక్త స్రావమయ్యేది. అపుడాతడు మజీదు విడచి దూరంగానుండసాగాడు. కాని బాధ రక్తస్రావం ఆగక ఆపై ఏడెనిమిది రోజులకు మరణించాడు. అజ్ఞానం అహంకారం వాని ప్రాణం తీశాయి. ప్రస్తుత సమాజంలో సయితం యెంతో మంది నకిలీ గురువులను నిత్యం జూస్తుంటాం. తమ వాక్చాతుర్యంతో ప్రజలను, ప్రభుత్వాలను సయితం మోసగిస్తుంటారు. కాని అట్టి కపటనాటక గురువులు, సన్యాసులు దైవశక్తివద్ద అంతిమ తీర్పుకు తలవొగ్గక తప్పదు! అనుకరణ యెంత పెద్దదైతే శిక్ష అంత పెద్దగా వుంటుందని విజ్ఞులంటారు!
శ్రీ సాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Ref: SaiGuru Trust magazine
ఈ నకిలీ ప్రపంచంలో పాలకు నీటికి తేడా గ్రహించి మెలకువతో వ్యవహరించాలి, కపటగురువులకు దూరంగా ఉండాలి.
ReplyDelete