ఘటనల కూర్పు - సాయి దేవుల నేర్పు.

శ్రీసాయినాథాయనమః
బాల్యంలో పిల్లలందరం ఓ చిన్న పజిల్ ఆట ఆడేవాళ్ళం. అది దేశపటానికి సంబంధించినది. వేరు వేరు చెక్క ముక్కలుగానుండిన రాష్ట్రాల ను కూర్చి దేశపటం జేయడం. ముందుగా ముక్కలను గుట్టగా వేసి ఆముక్కలను సరియైన స్థానంలో అమర్చి మరల దేశపటం చేయటం. పజిల్ ఆరంభంలో చూసినపుడు ఏ ముక్కలోనూ ఎలాంటి ప్రత్యేకత కనిపింపదు, దేశం అసలే కనపడదు. కాని ఆయా ముక్కలను ఓ వరుస ప్రకారం అమర్చితే చక్కటి దేశపటం దర్శనమిస్తుంది. ఎవరు అతి తక్కువ సమయంలో పజిల్ పూర్తిజేస్తారో వారే విజేతలు. అలాంటి మరో ఉదాహరణ, చిత్రకారుని చిత్రం, ఆరంభంలో ఏవేవో పిచ్చిగీతలుగా కనబడే రేఖలు చివరకు ఓ సుందర మనోహర రూపంగా కాన్వాసుపై రూపుదిద్దకుంటాయి. పజిల్ విజేత లేక చిత్రకారుడే సమర్ధ సద్గురు సాయినాథులు. చిత్రకారుని పిచ్చగీతలె సాయి తమ భక్తులకు సమకూర్చే చిన్న చిన్న ఘటనలు. ప్రధమంగా ఆయా ఘటనలలో ఏ ప్రత్యేకతా కనిపింపదు, కాని ఆపై కొంతకాలానికి వేరువేరుగా జరిగిన ఆ ఘటనల వెనుక ఓ చక్కని లీల గోచరమిస్తుంది. అదే వ్యక్తికి జరిగే అనుభవం. ఆలా జరిగే కొన్ని యనుభవాల పర్యవసానంగా ఆ వ్యక్తి క్రమంగా సాయి మార్గంలో తెలియకనే అడుగులువేసి పిదప సాయి భక్తునిగా పరిణితి చెందుతాడు. భక్తుల యనుభవ ఘటనల వెనుక, కనబడని పూల పరిమళంలా, సాయి నేర్పరితనమెంతో గోచరిస్తుంది. అలాంటి కొందరి సాయిభక్తుల యనుభవాల నిచట స్మరించెదము. ప్రధమంగా శ్రీసాయిసచ్చరిత్ర రచయిత అన్నాసాహెబ్ దబోల్కర్ యనుభవాల కొన్నింటిని క్లుప్తంగా పరిశీలించెదము. దబోల్కర్ నకు 1910 కి ముంది గురువులపై పెద్దనమ్మకముండేదికాదుకాని, అంకిత సాయిభక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ వత్తిడిచే బాంద్రానుండి శిరిడీకి రైల్లో ప్రయాణమౌతాడు. దాదర్ లో దిగి అచటినుండి మన్మాడు రైలు ఎక్కవలెననెడిది వాని యాలోచన. అలానే దాదర్ కు టికెట్టు కొని రైల్లో కూర్చున్నాడు. కాని అదేసమయంలో వాని అడావుడి జూసి వివరములెరిగిన ఎలాంటి పరిచయంలేని మహమ్మదీయుడొకడు దాదర్ స్టేషన్ లో మన్మాడు బండి ఆగదుకనుక అచట దిగక ఇంకనూ ముందుకుబోయి బోరీబందరులో దిగమని సలహా నిచ్చాడు. ఇలాజరుగకుంటే అనుకొన్నప్రకారం ఆ మరుసటి ఉదయానికి శిరిడీ జేరలేక పోయెడివాడు. పెక్కు అనుమానాలుగూడ కలిగియుండెడివి. శిరిడీజేరిన మొదటి రోజుననే బాలాసాహెబ్ భాటే యనువానితో గురుని ఆవశ్యతగూర్చి వాదించి ఆపై బాబాదర్శనానికి వెళ్లిన వానిని హేమాడ్ పంతుగా సంబోధిస్తాడు బాబా! హేమాద్రిపంతు దేవగిరి యాదవవంశ రాజులకు ప్రధానామాత్యుడు, గొప్ప పండితుడు మరియు రచయిత. ఆ సంబోధనాకెంతో ప్రాముఖ్యతుంది. పైనపేర్కొన్న ప్రధానామాత్యునికి వ్యతిరేక బుద్ధియైన దబోల్కర్ ఆ పైకాలంలో గొప్పవ్యక్తిగా తీర్చబడ్డాడు. సాయిబాబా సంస్థానాన్ని చాల చాకచక్యంగా నడిపాడు. భక్తులకు, భగవద్ గీత సమమైన శ్రీసాయిసచ్చరిత్రయను గొప్పగ్రంధమును రచించాడు.కేవలం యేడు రోజుల్లోనే సాఠేయను భక్తుని సాయి కరుణించి స్వప్నదర్శనమిచ్చి నందున యాసూయజెందిన అన్నాసాహెబ్ ను శ్యామావద్దకు పంపి యాతని సందేహనివృత్తిజేస్తాడు బాబా. ఎలాంటి మంత్రోపదేశాలతో పనిలేక కేవలం గురునిపైనే పూర్ణవిశ్వాసముంచాలనెడి బాబా బోధను శ్యామాద్వారా గ్రహిస్తాడు హేమాద్రిపంత్. ఇదే క్రమంలో సాయి తమ ప్రేరణచే దాసగణు మహారాజును గొప్ప కీర్తనకారునిగానూ. నానాసాహెబ్ చాందోర్కరును ప్రముఖ సాయిభక్తి ప్రచారకునిగాను తీర్చిదిద్దారు. ఖాపర్డే మరియు బాలగంగాధర్ తిలక్ లకు ఆసిసులందించి, బ్రిటిష్ దొరల మనసులలో మార్పుని కల్గించి భారతస్వాతంత్ర సాధనలో తెరవెనుక సూత్రధారిగా వ్యవహరించారు. మేఘశ్యాముడు గొప్ప శివభక్తుడు. యజమాని సాఠే వానిని సాయి దర్శనానికి పంపగా బాబాను మహమ్మదీయునిగా దలచిన యాతని సాయి నిరాకరించారు. కొంతకాలం త్రయంబకమున శివుని యర్చించి మరల దర్శనానికి వచ్చిన మేఘాను కేల్కరు కల్పించుకోవడంతో యనుమతిస్తాడు బాబా. సాయిని శివునిగా దలచి ఎంతో భక్తితో సేవిస్తాడు మేఘ. వాడాలో నిదురించే మేఘకు దర్శనమిచ్చి గోడపై త్రిసూలం గీయమంటాడు బాబా. అటులనే త్రిసూలం గీసి బాబాను జూడవెళ్లిన సమయంలోనే పూనానుండి వచ్చిన రామదాసి యనుభక్తుడు సాయికి శివలింగమొకటి బహూకరిస్తాడు. ఆలా త్రిసూలం గీచిన వెంటనే వచ్చిన లింగాన్ని మేఘకు బహూకరిస్తాడు బాబా. మేఘ మిగుల ఆశ్చర్య చకితుడయ్యాడు. అభిషేకం జేయదలచు వానికి మొదట యంగీకరించక ఆపై కేవలం తలపైమాత్రమే నీళ్లు పొయ్యమన్నాడు బాబా. ' హరగంగే,హరగంగే' యనుచు మైమరచి శరీరమంతటిపై నీళ్లు పోసిన మేఘ, కేవలం తలమాత్రమే తడియుట జూసి మిగుల ఆశ్చర్యానందాల పొందుతాడు. నాసిక్ జిల్లా వణిలో యచటి సప్తశృంగి దేవతకు పూజారి కాకాజీవైద్య. ఓ సమయాన పెక్కు కష్టాలపాలై మనఃశాంతిని కోల్పోయి దేవతను వేడుకొంటాడు. పిమ్మట ఆదేవత స్వప్నసందేశానుసారం తనసమస్యా పరిష్కారానికై శిరిడీ బాబాను దర్శింప బలంగా కాంషిస్తాడు కానీ శిరిడీ వివరాలా తనికేమాత్రం తెలియవు. అదేసమయంలో శ్యామా బాబా ఆదేశంపై తన పూర్వపు సప్తశృంగి మొక్కుల దీర్చుకొనుటకై వణి పూజారింటికి వెళ్తాడు. ఎంతటి విచిత్ర ఘటనల కలయిక. శ్యామా మొక్కులు దీర్చుకొన్న పిమ్మట వారిరువురు శిరిడీ వెళ్తారు. వైద్య సాయిదేవుల దర్శన ప్రభావంచే మిగుల మనఃశాంతిని పొంది 12 రోజులచటనే సంతోషంగా గడిపి బాబా ఊది ప్రసాద ఆశీర్వాదములపొంది ఇల్లు జేరతాడు. సమాధిమందిర నిర్మాణంలోనూ వింతఘటనల కలయిక జూడగలము. నాగపూరు కోటీశ్వరుడు బాపూసాహెబు బూటీ శిరిడీలో నివసించుటకై సొంతభవనం నిర్మింప దలుస్తాడు. కొన్నాళ్ల పిదప దీక్షితు వాడాలో నిద్రించుచుండగా యాతనికో దృశ్యం కనిపిస్తుంది. బాబా స్వప్నంలో గనపడి మందిరంతో సహా నొక వాడాను నిర్మించమంటాడు. అచటనే నిద్రిస్తున్న శ్యామాకు అలాంటిస్వప్నమే కలుగుతుంది. భావోద్వేగానికి గురై యేడ్చుచున్న శ్యామాను జూసి కారణమడుగుతాడు బూటీ. వారిరువురి కలలు ఒకటే యైనందున బాపూసాహెబు బూటీ మిగుల విస్మయమొందుతాడు. ఆపై భవనానిర్మాణం పూర్తయి యందు బాబా శరీరాన్ని సమాధిజేస్తారు. ఎంతటి చాకచక్యంతో బాబా సమాధిమందిరనిర్మాణం జేయించారో యూహాతీతం! తుదకు స్వానుభవంతో ఈ వ్యాసం ముగిస్తాను. బాబాపై భక్తికుదిరిన కొన్నాళ్ళకు 2004 లో, శిరీడీలో ఓ చిన్న అపార్టుమెంటు యుండిన బాగుండునని ఆలోచన కలిగింది. అదేసంవత్సరం జూన్ మాసంలో చికాగోనుండి వెల్వడు ఆన్ లైన్ సాయివిచార్ యను పత్రికలో ఓ ప్రకటన వెలువడింది. తరతరాలుగా సాయిని సేవించిన భక్తుల వంశీయులు యచట అపార్మెంట్స్ కడుతున్నారని. బిల్డర్ ను సంప్రదించి ఓ చిన్న అపార్ట్మెంట్ బుక్ జేసి, అక్టోబరు 2005 లో గృహప్రవేశం జేశాము. అంతా సాయి సంకల్పం, సాయి దయ! శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! REF: శ్రీసాయిసచ్చరిత్ర, సాయిసన్నిధి.
సిల్వర్ ఓక్ అపార్ట్మెంట్స్ , శిరీడీ.

Comments

  1. సాయిదేవులు కుశలకర్ములు, వారి చేష్టలగోచరములు, భక్తులకు శుభకరములు. సాయి ఘటనాఘటన కర్త!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)