ఉత్తమ గురుసేవ.
శ్రీసాయినాథాయనమః!
భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లవేళలా అనన్యభక్తితో తననే సేవించాలని మరియు ఆలా సేవించు వారల యోగక్షేమములను తాను వహిస్తానని అర్జునికి బోధించాడు, ప్రస్తుత వ్యాసంలో శ్రీసాయిబాబా తమ గురువునెలా సేవించారో వివరించుకొనెదము. ప్రప్రధమంగా బాబా భక్తులు, తమనెలా సేవించాలో యెచ్చటను ప్రత్యేకించి వివరించలేదు. కాని బాబావారి చర్యలు, సామాన్యసంభాషణలు మరియు వారి పావనచరితములు మౌనముగా ప్రబోధము జేయుచు తమభక్తుల ఉన్నతమార్గముల నడిపించుచున్నవి. అలా సాయి, చెప్పకచెప్పిన అమూల్య సందేశాలనిచట స్మరించుకొనెదము. ప్రస్తుత విషయమునకు శ్రీసాయిసచ్చరిత్రము మూలము. సచ్చిష్యునకు అణకువ, అభిమానరాహిత్యము, ఇంద్రియనిగ్రహము, ఏకాగ్రచిత్తము, గురువుపై పరిపూర్ణవిశ్వాసము, గురువాక్యపాలన, సదాగురుస్మరనయే దప్ప ఇతర ఆలోచనల రానీయకుండుట మరియు తుదకు సర్వస్యశరణాగతి అనగా తమకు తామే గురునకు సంపూర్ణ ఆత్మార్పణము జేయుట. ఈ విశేష ఉత్తమ శిష్యలక్షణములు బాబాయందెలా ప్రతిబింబించాయో తెలిసికొనుట సాయిని సేవించు భక్తులకు మార్గదర్శకములు కాగలవనే ఆలోచనే ఈ ప్రస్తుత రచనకు ప్రేరణయని పాఠక భక్తులు గ్రహింపగలరని ఆశిస్తున్నాను. జౌహర్ ఆలీ ఒక కపటగురువు. అతడు విద్యావంతుడు, ఖురాను చదివాడు, తమమంచిమాటలచే జనుల మోసగించి గురువుగా చలామణి కాసాగాడు. అంతేగాక సాయిబాబాయే తనకు శిష్యుడని యూరివారికి చెబుతూ గురువుగా వ్యవరింపసాగాడు. ఆలీ నైజము నెరిగినను మిగుల అణుకువతో బాబా వానిని గురువుగా సేవించాడు. నిజం నిప్పులాంటిదిగదా, కాలక్రమంలో ఆలీ నిజరూపం బయటపడుటచే శిరిడీ విడిచి వెళ్లి చాలాయేండ్ల తరువాత పశ్చాత్తాపంతో తిరిగివచ్చి సాయి పాదాలపై పడ్డాడు. ఆలీ లోపం తెలిసినా గురపీఠంపై ు ఉన్నాడుకావున బాబా వానిపట్ల గురుభావాన్ని సేవను ఆచరణాత్మకంగా జూపారు. బాబాయే ఓ సందర్భంలో అన్నారు, 'చీపురు పుల్లనైనా గురువుగా పెట్టుకుంటే నువ్వు గమ్యం చేరతావో లేదో చూడు.' యని. సాయి తమ ఆధ్యాత్మిక యనుభవముల మిగుల గుప్తంగా వుంచారు.
ఒకప్పుడు ఖండోబా ఆవహించిన భక్తుడు సాయి పన్నెన్నేళ్ళు వేపచెట్టుక్రింద భూగృహంలో ధ్యానంజేశారని చెప్పాడు. కాని బాబా తమ గొప్పతనం ప్రదర్సింపక అది తమగురుస్థానమని, కాపాడవలెనని ప్రజల మరపించి మూసివేయించారు. అంటే ఖండోబా దేవతయే సాయి తపసును ధృవీకరించారన్నమాట. 12 సంవత్సరములు మనోవాక్కాయకర్మలచే బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యాన్నంటిపెట్టుకొన్నవారికి దైవశక్తులు ప్రాప్తిస్తాయని స్వామి వివేకానంద వచించారు. చికాగో నగరంలో తమప్రత్యేక ప్రసంగమునకు ు విశేష స్పందన రావడం కేవలం బాల్యమునుండి పాటించే వారిసంపూర్ణ బ్రహ్మచర్య నిష్ఠయేకారణమని స్వామి ఆ తరువాత తెలియజేసారు. బాబా మహిమలకు వారి తపసుయే కారణంగా తలచవచ్చును. బ్రహ్మచర్య నిష్ఠయందు సాయి హనుమంతునివంటి వారు, వారి అస్ఖలిత బ్రహ్మచర్యము జనులెరిగిన సత్యము. బాబా తమ గురునామాన్ని వెల్లడింపక రహస్యంగా దాచినప్పటికీ దైవాన్నే గురువుగా అల్లానామాన్ని సదాస్మరించేవారు. ముగ్గురు మిత్రులతో దైవాన్వేషణము జేసిన వివరాలను బాబాయే స్వయంగా వివరించారు. జాడలేని పెద్ద అరణ్యంలో సంచరిస్తూ తమకు తోచినవిధంగా దైవానిగూర్చి చర్చింపసాగారు. మొదటివాడు ఆత్మను ఆత్మజ్ఞాముచేతనే గ్రహించాలని, రెండవవాడు మనసు ఆలోచనలనుండి బయటపడాలని, మూడవవాడు దృశ్యప్రపంచము సదా మార్పుచెందునని, నిరాకారమే మార్పు రహితమని, కావున సత్యాసత్య వివేకం అవసరమని చెప్పాడు. ఈ మువ్వురు గురువు ఆవశ్యకతను గుర్తించలేక పోయారు. కాని బాబా మాత్రం పుస్తకజ్ఞానము నిరుపయోగము, ప్రారబ్దముచే తమకు ప్రాప్తించిన కర్మలు జేస్తూ పరిపూర్ణ విశ్వాసంతో గురునికి సర్వసమర్పణ జేయాలని తమమాటగా జెప్పారు. అడవిలో దారితెలియక తిరిగే వారికి దైవ వశాన బంజారా రూపంలో గురువు తటస్థించి దారితెలియక తిరగవద్దని, తానిచ్చు అన్నపానీయముల స్వీకరించి మార్గదర్శి సాయంతో తమప్రయాణం సాగించమని హితవు బలికాడు. మితృలు మువ్వురు వారి వారి జ్ఞాన పరిధిలో భ్రమిస్తూ గురుని ఆతిధ్యం పొందే సౌభాగ్యాన్ని కోల్పోయి మాయా లోకారణ్యంలో తమ ప్రయాణం కొనసాగించారు. కాని బాబాకు ఆకలి దప్పులు మిగుల మిక్కుటముగా నుండుటచే గురు ఆతిధ్యాన్ని స్వీకరించాడు. బాబాకు కల్గిన ఆకలి దప్పులు సాధారణ మానవులకు కలిగేవి కావు. దైవాన్ని చేరాలనే అతిపెద్ద ఆకలి, అతిపెద్ద దాహం. తీవ్ర వ్యాకులతయే దైవ సన్నిధికి సమీపమార్గమని శ్రీరామకృష్ణ పరమహంస వారి స్వానుభవ సందేశము. బాబా ఆకలి అలాంటి తీవ్ర కాంక్షయే. ఓ సారి గురువు ప్రాప్తించిన పిమ్మట ఆ గురుని పై పరిపూర్ణ విశ్వాసం నిలబడాలి. గురుని మాటలనే ఉపదేశాలుగా పాటించాలి. బాబా అలానే గురుని సేవించారు. ఇంద్రియశక్తులనన్నింటిని తమ కనులలో నిలిపి ఆ కనులతో గురుని తదేకంగా ధ్యానించారు. బాహ్యప్రపంచం అదృశ్యమై, తమ భావమంతా గురురూపంపై నిలబడి క్రమంగా వారి మనసు బుద్ధులు స్తబ్ధమయ్యెడివి. నది సాగరంలో సంగమించిన స్థితి. శిష్యుడు గురునిలో లయించిన మధుర క్షణాలు. పతంజలి యోగశాస్త్రములో జెప్పబడిన ప్రత్యాహార(అంతర్ముఖత ), ధారణ(గురునిపై ఏకాగ్ర దృష్టి ), ధ్యాన(నిరంతర స్మరణ), సమాధి( తానూ గురువు ఏకమైన అనుభూతి) స్థితులన్నియు లయమొందిన ప్రజ్ణాస్థితి,వారిసమాధి స్థితి. సాయి కఠోర తపసు నిరంతరం పన్నెన్నేళ్ళు కొనసాగింది. అందుకేనేమో తనకు శిష్యుడనేవాడెవడున్నాడని సాయి బాధపడేవారు. సాయి స్వతహాగా కారణజన్ములు, జీవనముక్తులు, అవతారపురుషులైనప్పటికీ రామునిలా, కృష్ణునిలా గురుని ఆశ్రయించారు. తమ గురుసేవా వృత్తాంతాన్ని వేరొక సందర్భములో బాబాయే వివరించారు. రాధాబాయను భక్తురాలు బాబానుండి ఉపదేశమాశించి శిరిడీలో ఉపవసింప నారంభించింది. . బాబా యామెను పిలిచి ఉపవాసములతో దైవాన్ని చేరలేమని కేవలం గురుసేవచే తరింపవచ్చని తమ గురుసేవా వృత్తాంతాన్ని మరొక్కసారి వెల్లడించారు. ఎలాంటి మంత్రోపాసనలు లేక పన్నెన్నేళ్ళు నిద్రాహారాలు మాని తన గురుని తదేకంగా వీక్షించానని, గురుశిష్యులిరువురు బాహ్యలోకం మరచి ఆనందసాగరంలో తేలియాడేవారలమని, గురుని వియోగం సహింపలేకపోయెడివాడనని, వారిని చూడక మిగుల అశాంతి పొందెడివాడనని, గురునిపైనే ధ్యాస వారిపైనే శ్వాసగా బహుకాలం ుుసేవ కొనసాగించానని తెలియబరచారు. గురువు తమనుండి యేమి ఆశింపక శ్రద్ధ, సహనమనెడి రెండు పైసల దక్షిణ పొంది కేవలం కరుణ మరియు ప్రేమపూర్వక చూపులతో తమనుఁ కాపాడారని, తాబేలు తన బిడ్డల కేవలం చూపులతో పెంచిన చందాన ుు తమను పెంచి పెద్దజేశారని సాయి వివరించారు. గురుని పరిపూర్ణవిశ్వాసంతో సేవించుటయే ముక్తికి సమీపమార్గమని, ఉపవాస తాపవాసముల యవసరంలేదనుటచే ఆ భక్తురాలు దీక్ష విరమించినది. పైన పేర్కొన్న కొన్ని సందర్భాలలో మాత్రమే సాయి పైవిధంగా తమ గురుసేవా వివరాల బయట ప్రపంచానికి తెలియజేసారు. ఇపుడు పాఠకులందరికి ఓ ప్రశ్న తలెత్తవచ్చును, సాయి జేసిన సేవలా సాధారణ మానవులమైన మనము సాయిని/గురుని సేవింపగలమాయని? ఇందులకు సమాధానమీవిధంగా తోస్తుంది. బాబా సేవామార్గం జూపారు, ఈ విషయంలో యెలాంటి రహస్యమూ లేదు. ఆ మార్గంలో వారు నడచి సమర్ధసద్గురుమూర్తులుగా విశ్వమంతటా వ్యాపించారు. చంద్రునికో నూలుపోవులా గమనం గమ్యంవైపు సాగునంతవరకెలాంటి భయంలేదు. గమ్యం సాయి, గమనం సాధన. శ్రీ బీ. వీ. నరసింహస్వామి, శ్రీ ఎక్కిరాల భరద్వాజ లాంటి భక్తాగ్రగణ్యులీవిధంగా గమ్యం జేరినవారేగదా! శ్రీమతి ఖాపర్డే జన్మజన్మలు సాయిని సేవించి క్రమంగా గోజన్మమునుండి వృద్ధినొంది తుదకు బ్రాహ్మిణి జన్మపొంది పరిపూర్ణ గురుకృపకు పాత్రురాలైనది. ఆమె భక్తిశ్రద్ధలకు సాయిమిగుల ప్రసన్నులై ' రాజారామ్' మంత్రాన్ని స్మరింపమన్నారు. చంద్రునికో నూలుపోవులా మన పరిధిలో సాయిని సేవించి వారి కృపాకటాక్షములకై సదా ప్రార్ధించెదముగాక! పాఠక భక్తులు మీ అమూల్యసలహాలనీ క్రిందనున్న కామెంట్స్ సెక్షన్ లో తెలియజేయగలరు. శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
Today is the 129th anniversary of Swami Vivekananda's historic speech in Chicago.
Interested readers may please share their experiences in this blog by contacting Saisyam99@gmail.com,
ReplyDelete