సద్గురుకృప-ఆత్మానుభూతి

శ్రీసాయినాథాయనమః
ఆత్మానుభవము లేక ఆత్మసాక్షాత్కారము పొందిన మహాత్ముడే సద్గురువు. అట్టి యనుభూతిని పరిపక్వత నొందిన తన శిష్యులకు సులువుగా అందింపగలడు సద్గురువు. అదియే శిష్యునకు లభించే అత్యుత్తమ గురుకృప. శ్రీసాయిబాబ, శ్రీరామకృష్ణ పరమహంస మరియు శ్రీయుక్తేశ్వరులు గడచిన ఒకటి రెండు శతాబ్దాలకాలంలో పవిత్ర భారతావని ప్రభవించారు.ఆయా మహనీయులు తమ ధర్మాచరణ, బోధామృతములచే సమాజంలోని సామాన్యులనుద్ధరించి వారిని మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుటకు చక్కటి మార్గాల నేర్పరచారు. యోగ్యులైన శిష్యులకు తమశక్తి సామర్ధ్యాదుల సయితం వెచ్చించి, వారిని తమయంతటి వారలగా తీర్చిదిద్దారు. అపార సద్గురు గురుకృపకది నిదర్శనము. అనుపమాన సద్గురు గురుకృపామృతమునాస్వాదించిన కొందరి శిష్యాగ్ర గణ్యుల యనుభవములనిచట స్మరించుకొనెదము. వారి ఆయా అనుభవములు సాధారమనుజలమైన మనలకు సత్యదృష్టి, నిత్యానిత్య వివేకముల ప్రసాదింపగలవు. సత్యాసత్యా విచక్షణచే మానసిక దౌర్బల్యం తొలగి దుఃఖనివృత్తి కాగలదు. సమర్ధసద్గురు సాయినాథులు తమభక్తులకందించిన భావాతీత యనుభవములు కొన్నింటిని శ్రీసాయిసచ్చరిత్రములో వర్ణింపబడినవి. శ్రీసాయిసచ్చరిత రచయిత హేమాడ్ పంత్ తమ ప్రధమ దర్శనంలోనే బాహ్యస్మృతి కోల్పోయి భావాతీతాను భూతిపొంది సర్వం సాయిమయంగా దర్శించాడు. బాబాను మహమ్మదీయుడనుభావముతో నమస్కరించదలచిన రామభక్తుడైన ఓ డాక్టరునకు, రామునిగా దర్శనమిచ్చారు సాయి. ఆతనికి ఓరాత్రి గొప్ప ఆధ్యాత్మికానుభూతిని కలిగించారు సాయి. అనిర్వచనీయమైన ఆనందాన్ననుభవించాడా డాక్టరు. ఆ ఆనందానుభూతి 15 రోజులటులే కొనసాగింది. భక్తాగ్రగణ్యులైన సాయి ప్రచారకర్త శ్రీ బీ. వీ. నరసింహస్వామి సాయి సన్నిధిలో ఎప్పటినుండో బాధిస్తున్న తీవ్ర మానసిక వత్తిడులనుండి క్షణకాలంలో ముక్తుడైనాడు. నాస్తికభావలనింపుకొని సాయిని సద్గురునిగా గ్రహింపని శ్రీ ఎక్కిరాల భరద్వాజ శిరిడీలోని సమాధిమందిరంలో బహుకాలంగా తనను అశాంతికి గురిజేసిన సమస్యలకు పరిష్కారం పొందారు. ఆ మరపురాని రోజు ఫిబ్రవరి 9,1963. మిగుల ఆకలితో మద్రాసు హోటలుకని సమాధి మందిరం మీదుగా వెళ్తున్నారు. ఆ ముందటిరోజు చూసినా, కళకళలాడుతున్న సాయి సుందరవిగ్రహాన్ని మరొక్కసారిచూడాలని మందిరంలోకెళ్లారు. అచటి విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఎదో అతీతమైన స్థితిలో వున్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తననుండివేరుగా యీ సృష్టి వున్నట్లు తోచివుండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్ప మాత్రంగా వున్నదో, దానితో ఆయన తాదాత్మ్యం చెంది వున్నారనిపించింది. ఇది కేవలం భవంగాగాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా వారి హృదయాన్ని కబళించింది. తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలియలేదు. ఆలా ఐదు గంటల సమయం గడచిపోయింది. అన్నగారు తట్టిలేపుటచే మిగుల బాధగా మేల్కొనడం జరిగింది. మనసు అప్రయత్నంగా నిరాయమౌతుంది. వస్తువుల గుర్తించాలన్నా, యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వచ్చేది. ఇల్లు చేరి కొన్నినెలలు గడచినా వారి స్థితి అలానే వుండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు నెలలు క్షణాల్లా గడచిపోయేవి. వారికీజగత్తంతా చైతన్యమయంగా తోచేది. అట్టి మహిమాన్వితము సదాప్రసరించే సద్గురుని కృప!
పరమహంస యోగానంద జగద్విఖ్యాత యోగి పుంగవులు. వారు రచించిన " ఓ యోగి ఆత్మకథ " విశ్వవిఖ్యాత గ్రంధము. వారి గురువు శ్రీ యుక్తేశ్వర్ గిరి. వీరి ఆశ్రమము కలకత్తాకు సమీపమానాయున్న సెరంపూరులో యున్నది. యోగానంద సుమారు తమ పదిహేనవ ఏటనుండి శ్రీ యుక్తేశ్వరు గిరి ని తమగురువుగా సేవించారు. ఓ పర్యాయం ఆశ్రమంలోని చిన్నగదిలో ధ్యానం జేస్తున్నారు యోగానంద, కాని ఎప్పటికి మనసు పరిపరి ఆలోచనలచే కుదుటబడుటలేదు. ఆ సమయంలో శ్రీ యుక్తేశ్వర్ యోగానంద .ఛాతి పైభాగాన తమ చేతితో స్పృశించారు. ఆ సమయంలో యోగానందులకు కలిగిన భావాతీత విశ్వాచేతనానుభవం వారిమాటల్లోనే తెలిసికొనెదము. " నా శరీరం కదలకుండా పాతుకుపోయింది. నా ఉపిరితిత్తులలోని నా శ్వాస ఎదో ఓ పెద్ద అయస్కాంతంతో బయటకు లాగేసినట్లయింది. నా ఆత్మా, మనసూ తక్షణమే వాటి భౌతికబంధాన్ని కోల్పోయి ద్రవరూప కాంతికిరణాలమాదిరిగా నాలోని ప్రతిరంధ్రంలోనుంచి బయటకు ప్రసరించాయి. నాలోని కండ నిర్జీవమైనట్లున్నా అంతకుమున్నెడూ నేను అంతటి చైతన్యంతో తొణికిసలాడలేదని ప్రగాఢ స్పృహ వల్ల తెలిసికొన్నాను. నా తాదాత్మ్య స్థితి ఒక శరీరానికి సంకుచితంగా కట్టుబడియుండక చక్రగతిలో సంచరించే అణువులకు కూడా విస్తరించింది. దూరాన వీధుల్లోని జనం మెల్లగా కదులుతున్నట్లు కనిపించింది. మట్టి పారదర్శకంగా మారి మొక్కల చెట్ల వేళ్ళు స్పష్టంగా కనిపించాయి. వాటి జీవరస ప్రవాహాన్నికూడా గమనించాను. కేవలం ఎదుటి వాటినే చూడగల నాచూపు అన్నివైపులా చూడగలిగేట్టుగా విస్తృత వలయాకార దృష్టిగా మారింది. నా తలకు వెనుకభాగంద్వారా దూరంగా నడుస్తున్న మనుషులను జూసాను. ఆశ్రమం గోడవెనుకకు పోయిన ఆవును స్పష్టంగా చూసాను. నా దృష్టికి దోచిన వస్తువులన్నీ కంపిస్తూ చురుకుగా సాగే చలనచిత్రాల మాదిరిగా స్పందించాయి. నా శరీరం గురువులది ముంగిలి ఉపకరణ సామాగ్రి చెట్లు ఎండ అప్పుడప్పుడు తీవ్రంగా అల్లల్లాడి చివరికి కరిగిపోయి ఓ కాంతి సముద్రమైపోయాయి. అన్నింటిని ఏకంజేసే కాంతి పర్యాయక్రమంలో స్థూల రూపంలోకి మారుతుంది. ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకారణ సూత్రాన్ని వెల్లడిజేస్తున్నాయి.నా ఆత్మ తాలూకు ప్రశాంత అనంత తీరాలమీదికి ఒకానొక ఆనందసాగరం వెల్లువలా పొంగివచ్చింది. పరమాత్మస్వరూపం అక్షయ ఆనందమన్న యనుభవం పొందాను. ఆయన దేహం అనంతమైన కాంతికణజాలాలు. నాలో పెల్లుబుకుతున్న దివ్యప్రభ పట్టణాలను, ప్రపంచఖండాలను,భూమిని సూర్యమండలాన్ని నక్షత్ర మండలాన్ని సూక్ష్మనీహారికల్ని తేలియాడే ఆ బ్రహ్మాండాన్ని చుట్టముట్టడం మొదలు పెట్టింది. రాత్రివేళ దూరాన కనిపించే నగరంలా, మందకాంతిలో వెలుగొందే సమస్తజగత్తూ నా అస్థిత్వపు అనంతత్వంలోనే మిణుకుమిణుకు మంటున్నది. స్ఫుటంగా చెక్కినట్టున్న గోళాకార పరిరేఖలకు అవతల మిరుమిట్లు గొల్పుతున్న కాంతి, దూరపు అంచులదగ్గర కొద్దిగా మందగించింది. అక్కడ నేను ఎన్నటికీ తరగని పరిపూర్ణ ప్రభను దర్శించాను. మాటల్లో చెప్పలేనంత సు సూక్ష్మమైనది, గ్రహరూపాలు అంతకన్న స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి. శాశ్వత అక్షరమైన పరమాత్మనుంచి ప్రసారితమైన కిరణాల దివ్యవిక్షేపం, నక్షత్ర వీధులుగా ప్రజ్వలిస్తూ వర్ణించ వీలుగాని ప్రభలుగా రూపాంతరిత మవుతుంది. సృజన శీలక కిరణాలు నక్షత్రమండలాలుగా ఘనీభవించి, ఆ తర్వాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవడం మళ్ళీ మళ్ళీ చూసాను. లయబద్దమైన విపర్యయంవల్ల కోటానుకోట్ల లోకాలు నిర్మల కాంతిలోకి ప్రవేశించాయి. అటుమీదట అగ్ని, ఆకాశంగా మారింది. తేజోమండల కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించాను. నాలోని కేంద్రకంనుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రభ విశ్వనిర్మితిలో ప్రతిభాగానికి ప్రసరిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృతం, పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణువణువునా స్పందించింది. పరమేశ్వరుని సృజనాత్మక స్వరం విశ్వచలన యంత్ర స్పందమైన ఓంకారంగా ప్రతిధ్వనిస్తూ ఉండడం విన్నాను. హఠాత్తుగా నా ఊపిరితిత్తులలోకి శ్వాస తిరిగి వచ్చింది. నా అనంత అపరిమితత్వాన్ని కోల్పోయానని గ్రహించి, దాదాపు భరించలేనంతగా నిస్పృహ చెందాను. చిచ్ఛక్తికి సులువుగా వసతి కల్పించలేని, అవమానకరమైన శరీరపంజరానికి నేను మళ్ళీ బందీ నయాను. వ్యర్ధజీవితం గడిపే కుర్రవాడిలా నేను బ్రహ్మాండ గృహంనుంచి పారిపోయిన సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీని చేసుకొన్నాను. మా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా నించొని ఉన్నారు. ...." శ్రీ పరమహంస యోగానంద మరియు శ్రీ ఎక్కిరాల భరద్వాజులు అచిరకాలంగా ప్రగాఢ ఆకాంక్షతో అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతనానుభవం (ఆత్మస్థితి లేక సమాధిస్థితి) కేవలం వారి వారి సద్గురువుల అపార కరుణా కృపాకటాక్షములచే మరియు బహు పూర్వజన్మ సుకృతముచే లభించిన బాహుమూల్య దైవ ప్రసాదము. సద్గురుదేవుల కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి! రిఫరెన్స్: శ్రీసాయి సచ్చరిత్రము, ఒక యోగి ఆత్మకథ.
" మనల నెవరయితే సహజస్థితి యందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపుటునికికి అతీతముగా తీసికొని పోయెదరో వారే సద్గురువులు." శ్రీసాయి సచ్చరిత్రము.

Comments

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)