పుస్తకజ్ఞానము-అనుభవజ్ఞానము.
శ్రీసాయినాథాయనమః! నేడు బుద్ధపూర్ణిమ. బుద్ధుడు జన్మించిన, ఆత్మానుభూతి పొందిన మరియు నిర్యాణము చెందిన పవిత్ర పర్వదినము.
జ్ఞానమంటె ఓ విషయాన్నిగురించిగాని, వస్తువుగురించిగాని లేక వ్యక్తిగురించిగాని తెలిసికొనడము.జ్ఞానము రెండువిధములుగా చెప్పబడినది.మొదటిది పుస్తక జ్ఞానము అనగా పుస్తకపఠనంద్వారా గ్రహించెడి విషయము. రెండవది అనుభవజ్ఞానము. ఇచట వ్యక్తి స్వానుభవముద్వారా విషయాన్ని అవగాహనజేసుకొంటాడు. ఓ చిన్న ఉదాహరణమును పరిశీలించెదము. పంచదార రంగు రుచి వాసనాది గుణగణాలను ఓ పుస్తకం చదివిగాని లేక ఎవరిద్వారానైన వినిగాని తెలిసికోవచ్చును. ఈ విషయమై ఎందరెందరో ఎన్నోవిధముల వర్ణించి లెక్కకుమించిన వ్యాసాలను రాసియుండవచ్చును. కాని ఆ విషయజ్ఞానము వ్యక్తి అనుభవానికందదు, అది కేవలము మానసిక జ్ఞానమే! మరో వ్యక్తి అదే పంచదారను ఓ చిటికెడు నోట్లోవేసుకొన్నాడనుకోండి, అప్పుడతనికి కలిగే తియ్యదనం అనుభవజ్ఞానముగా చెప్పబడినది. ఈ రెండుజ్ఞానముల వ్యత్యాసము పాఠకులు తేలికగా గ్రహించగలరు. ఇదే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా జూస్తే దైవాన్ని గూర్చిగాని, ఆత్మనుగూర్చిగాని, బ్రహ్మజ్ఞానాన్నిగూర్చిగాని గ్రంథపఠనంద్వారా గ్రహించడం పుస్తకజ్ఞానమౌతుంది. ఈ విధమైన జ్ఞానము జిజ్ఞాసులెల్లరకు అందుబాటులొ నుంటుంది. కాని కొందరు మహనీయులు అదేజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు, అనగా ఈజ్ఞానము వారికి అనుభవీకరణమౌతుందన్నమాట. అట్టి మహనీయులే సద్గురువులు. గౌతమబుద్ధుడు,సద్గురు సాయిబాబ,రామకృష్ణ పరమహంస,భగవాన్ రమణమహర్షి మున్నగువారీకోవకు జెందిన కారణజన్ములు.గౌతమబుద్ధుడు జ్ఞానోదయం పొందిన పిమ్మట కోరికలే సర్వదుఃఖాలకు కారణమనే సత్యాన్నిగ్రహించి ఆపై , లోకానికి చాటాడు. దైవానుభవాన్ని వారుపొందడమేగాక యోగ్యులైన తమశిష్యులకందించగల సర్వసమర్థులు సద్గురువులు. ఈ విషయమై ముందుజెప్పబడిన అవతారపురుషుల సందేశాన్నిచట క్లుప్తంగా పరిశీలించెదము.
అనంతరావు పాటంకర్ యను ఓ భక్తుడు సాయిబాబాను దర్శించి ఈవిధంగా వేడుకొన్నాడు, " నేనెక్కువుగా వేదవేదాంతములను చదివినప్పటికీ నా మనసునకు శాంతి కలుగుటలేదు. కావున నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనం. మనస్సు శాంతిపొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్ధము. కావున నాయందు దాక్షిణ్యముజూపి శాంతి ప్రసాదించుము." అప్పుడు బాబా ఓ వర్తకుని కథారూపంలో తొమ్మిది భక్తిమార్గములలో ఏదేని ఓదాని నెంచుకొని దైవానుగ్రహంతో శాంతి క్షేమములు పొందమని యాశీర్వదించారు. వినాయక హరిశ్చంద్ర ఠాకూరనే మరో భక్తుడు బాబాపాదములకు నమస్కరించి కండ్ల ఆనందభాష్పాలతో మిగులపరవసించాడు. ఆతని పూర్వవృత్తాంతమెరిగిన సాయి వానికీవిధంగా బోధించారు," నీవు దర్శించిన యోగి అప్పా జెప్పిన విషయములెల్లను నిజమే కాని అవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనములేదు. చదివిన విషయముల జాగర్తగా విచారించి అర్ధముజేసుకొని, ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనములేదు.. గుర్వనుగ్రహములేని పుస్తకజ్ఞానము నిష్ప్రయోజనము." ఈవిధంగా బాబా గ్రంథపఠనల ఆచరణ మరియు గుర్వనుగ్రహముల ఆవశ్యకతలగూర్చి నొక్కిచెప్పారు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణము జేసినవాడైనను, బ్రహ్మజ్ఞానిముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. ఖాపర్డే,నూల్కర్, బూటీలు విద్యావంతులు మరియు మిగుల తెలివైనవారయినప్పటికీ బాబాముందు నోరుమెదిపేవారు కారు. నానాసాహెబ్ చాందోర్కర్ మిగుల విద్యాధికుడు, సంస్కృతభాషా జ్ఞానము కలవాడైనను భగవద్గీతలోని ఓ శ్లోకము యొక్క అర్థమునెరుగకుండెను. కాని బ్రహ్మజ్ఞానియైన బాబ ఆ శ్లోకభావమును వివరించినపిమ్మట నానా మిగుల సిగ్గుపడ్డాడు, వాని గర్వమణిగినది. సాయి బోధించినది సాధారణ గురువుల బోధకాదు, వారి స్వానుభవ బోధ. సాయి సర్వవ్యాపకుడు, జీవులందరి చైతన్యస్వరూపుడు. ఓ భక్తురాలు, ఆకలిగొన్న కుక్కకు రొట్టె విసిరింది. ఆపై చూడవచ్చెనామెతొ తమ ఆకలి తీరినట్లు చెప్పారు. అంటే ఆ శునకంలోని ఆకలికూడా తమ ఆకలిగా అనుభవం పొందారు. శ్రుతులు భగవంతుని ఆనందస్వరూపునిగా పేర్కొన్నాయి. భక్తులు శిరిడీలో ఆ ఆనందానుభూతి పొందారు. సాయిని దర్శించిన రామభక్తుడైన డాక్టరు తన స్వప్నంలో అనిర్వచనీయమైనఆనందాన్ని పొందాడు. ఆతని పారవశ్యం కొన్నివారాలపాటు కొనసాగింది.పూజ్యశ్రీ బీ.వి. నరసింహస్వామి, ఎక్కిరాల భరద్వాజ సాయి సన్నిధిలో పరమశాంతిని అనుభవించిన ధన్యజీవులు. ఎలాంటి పూజాతంతులు, యోగాభ్యాసాల పనిలేదు. కేవలం భక్తినింపుకొన్న హృదయంలో బాబా నివసిస్తారు. వేదాధ్యయనమువల్లగాని, మేధాశక్తివల్లగాని, పుస్తకజ్ఞానం వల్లగాని ఆత్మానుభూతి పొందలేరు. అందులకు ఆత్మానుభూతి పొందిన సద్గురువుల యనుగ్రహము అత్యావశ్యకము. శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
మూలము: శ్రీసాయిసచ్చరిత్రము. To be continued.
Very very nice explanation and useful to all devotees.
ReplyDelete