అందమైన బాబాబడి.
శ్రీసాయినాథాయనమః! పాఠక భక్తులెల్లరకు గురుపూర్ణిమ శుభాకాంక్షలు!
శ్రీసాయిసత్చరిత్ర ముప్పదిరెండవ అధ్యాయంలో సాయిబాబ చదివినబడిగూర్చి వ్రాయబడినది. ప్రస్తుత వ్యాసంలో ఆయావివరములను స్మరించుకొందుము. బాబ తన ముగ్గురు మిత్రులతో కలసి ఓ అరణ్యంలో దేవునిగూర్చి చర్చిస్తు దైవాన్ని వెదక నారంభించారు. దైవ వశాత్తు బంజారా ఒకరు వారిని కలసి సాయంజేయ తలువ కేవలం సాయి మాత్రమే వాని ఆతీధ్యం స్వీకరించారు. ఆపై వారి గురువు ప్రత్యక్షమై కేవలం సాయిని మాత్రమే తమ బడిలో జేర్చుకొన్నారు. ఇందుకు కారణం వెదుక నారంభిస్తే కొన్నివిషయాలు బోధపడగలవు. సాయి మిత్రులు కేవలం పుస్తకజ్ఞానంతో స్వతంత్రంగా ఆలోచించి దైవాన్ని తెలుసుకో దలువ, బాబా మాత్రం పుస్తక జ్ఞానాన్ని నిరసించి మనకు విధించిన కర్మల పూర్తి జేస్తూ దేహాన్ని,మనసును,పంచప్రాణాలను గురుపాదముల బెట్టి మిగుల విశ్వాసంతో శరణువేడవలెనని తమవంతుగా అన్నారు. ఆ నల్వురు దారి కోల్పోయి మిగుల ఆకలితో యున్నప్పటికీ బంజారా ఆతిధ్యాన్ని కేవలం సాయి మాత్రమే స్వీకరించారు, మిత్రులు తిరస్కరించారు. ఇందులకు కారణం సాయి మిగుల ఆకలితో నుండటం. సాయి ఆకలి కేవలం శారీరకం మాత్రమే కాదు. దైవాన్ని తెలుసోకోవాలన్న తీవ్ర వియోగంతో కూడిన వ్యాకులత. మిగతావారికి అంతటి తీవ్ర ఆకాంక్ష కొరవడింది. శరణాగతి యంటే వారికి తెలిసినట్లు లేదు, వారి అహంభావం అందులకు అడ్డుపొరగా నిలచింది. అందులకే వారి గురువు ప్రత్యక్షమై సాయిని మాత్రమే వారి బడిలో జేర్చుకొన్నారు. ఆ బడి సాధారణ బడి లాంటిది కాదు, ఏ విద్యనేర్చుకొంటే మనిషి అజ్ఞానం నుండి బయటపడి తన స్వస్వరూపాన్ని తెలుసుకొంటాడో తెలియజెప్పే ఆత్మజ్ఞానబోధిని. ఇందులకు గురునిపై పరిపూర్ణ విశ్వాసమెంతో ఆవశ్యం. వారి మిత్రులకది లేకపోవడంచే చీకటి అడవిలో సంచరిస్తూ ఎచటికో వెళ్లిపోయారు, కేవలం సాయిమాత్రమే గురుని దయకు పాత్రులై వారి బడిలో ప్రవేశార్హత పొందారు. ఆపై గురువు జేసిన మొట్టమొదటి పని ఏమంటే సాయి కాళ్ళను చెట్టుకొమ్మకు కట్టి లోతైన బావిలొ తల్లకిందుగా వేలాడదీశారు. నాలుగైదు గంటల తరువాత వచ్చి బావినుండి బయటకు తీస్తే, మాటలకందని పరమానందాన్ని తాము పొందినట్లు గురునికి జెప్పారు. ఇదెలా సాధ్యమని తీవ్రంగా ఆలోచించిన పిమ్మట ఓ విషయం మనసుకు తట్టింది. ఆ వివరణ పాఠక భక్తులతో పంచుకోవడం చాల సంతోషకరంగా ఉంది. ఈవివరణ కేవలం వ్యక్తిగతం. పాఠకులు తమకు దోచినట్లు ఆలోచించ గలరు. మనిషి ఆలోచనలు తద్వారా కలిగే అహంకార మమకారాలు,సుఖదుఃఖానుభూతులు మనసునుండి ఉద్భవిస్తాయి, బుద్ధి వాటిని విపులీకరిస్తుంది. అట్టి మనసు, బుద్ధి తమశక్తులను వ్యక్తికి మూలమైన ఆత్మనుండి గ్రహిస్తాయని, ప్రకాశాన్ని పొందుతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించాడు. అట్టి ఆత్మ బొటనవ్రేలు ప్రమాణ దివ్వెలో, హృదయకుహరాన ప్రకాశిస్తుందని పురుషసూక్తంలో వివరించడమైనది. భగవాన్ రమణ మహర్షులుకూడ ఈ వివరణ సత్యమన్నట్లు వ్యక్తి ఉనికికి మూలమైన చావుపుట్టుకులు లేని ఆత్మ (Self) మనిషి హృదయ క్షేత్రంలో కుడివైపున ప్రకాశిస్తుంటుందని పదేపదే భక్తులకు తెలియబరచారు. అది వారి స్వానుభవముకూడా ! ఇపుడు మరింత విశదీకరించుకొంటె ఓ విషయం బోధపడగలదు. మనసు మరియు బుద్ధులకు కేంద్రస్థానం మనిషి మెదడు లేక తల, అది దేహానికి పైభాగానుంటుంది, కాని మనోబుద్ధులను ప్రకాశింపజేయు ఆత్మ స్థానము మాత్రము తలకు దిగువభాగమున యున్న గుండె లేక హృదయ క్షేత్రం! సాధారణ మానవులు తమ మనసు లేక బుద్ధులతో పనిజేస్తారు, కేవలం యోగులు జ్ఞానులు లేక సద్గురువులు మాత్రము ఆత్మ ను కేంద్రస్థానముగ వ్యవహరిస్తారు. మనిషి నిటారుగ యున్నప్పుడు తలపైనుంటింది, హృదయము లేక గుండె దిగువనుంటుంది. కాని తలక్రిందుగ వేలాడినప్పుడు మాత్రము గుండె పైభాగాన తల కిందభాగాన యుంటాయి. అంటే బాబా తలకిందులుగా వేలాడినప్పుడు వారి చైతన్యస్థితి పైభాగానున్న హృదయముగా దలువ వచ్చును. ఆత్మస్థితిని ఆనందమయంగా వర్ణిస్తారు. అందులకే తాము వ్రేలాడినప్పుడు పరమానందాన్ని పొందినటుల బాబా తమ గురునకు జెప్పినటుల భావింపవచ్చును.
పైన పేర్కొనబడిన వివరణకు భగవద్గీతలో చెప్పబడిన అంతుతెలియని తలక్రిందుల అశ్వత్థ వృక్షమును సారూప్యముగ దలుపవచ్చును. దాని వేళ్ళు పైన, కొమ్మలు క్రిందివైపు, మీదివైపు గూడ వ్యాపించి యున్నవి. అనగా కారణము/మూలకారణ దైవము పైన; కరణము/సృష్టి కొమ్మారెమ్మలు క్రింద వ్యాపించివున్నవి. మునుపటి జన్మల కర్మ ఫలితాలే ప్రస్తుతజన్మకు పోషకాలుగ తెలియగవచ్చును. జన్మరాహిత్యము పొందాలంటే జన్మకు కారణమైన పూర్వ జన్మ కర్మలను వివేకమనే ఆయుధంతో సమూలంగా నశింపజేయవలె. ఇందులకు సద్గురు శరణాగతి మరియు దైవ సాయం తప్పక కావలెననెడిది శాస్త్రబోధ!శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి!
(To be continued).
Comments
Post a Comment