కల్లలుకాని కలలు 2.
శ్రీసాయినాథాయనమః !
శ్రీసాయినాథాయనమః !
శ్రీసాయిబాబ భక్త రక్షణ మరియు స్వప్నసందేశాలు వారి సమాధి యనంతరము నేటికిని కొనసాగుతున్నవి . భక్తులు నిత్యనూతన అనుభవాలను పొందుచున్నారు . ప్రస్తుతము వివరింపబడిన లీలలు శ్రీసాయిసచ్చరిత్ర మరియు శ్రీసాయిలీలామృతము నుండి సేకరించడమైనది . గగనతలంపై తళుకులీను అసంఖ్యాక నక్షత్రాలవలె వారి మహిమలకంతులేదుగదా! సాయిబాబాను సజీవంగా సేవించిన పరమభక్తుడు కాకాసాహెబు దీక్షితు, బాబా సమాధి యనంతరం బొంబాయి చౌపాటీలో నున్న కాకాసాహెబు యింటిలో ఏకనాథభాగవతము చదువుచున్న సమయాన ఓ సందేహం కలిగింది. నవనాథుల భక్తి మిగులగొప్పదని , కాని అలాంటి భక్తి తమలాంటి సామాన్యులకు కలగదని మిగుల వాపోయాడు . కాని పక్కనున్న శ్యామా అందులకాక్షేపణ తెలుపుచూ, సాయిని విశ్వాసంతో సేవించిన భక్తులకా భయాందోళనలేలయని నొక్కిచెప్పాడు. అందులకు నిదర్శనంగా మరునాడు ఆనందరావు పాఖాడే యనుభక్తునికి సాయి స్వప్నదర్శనమిచ్చి శ్యామామాటల ధ్రువపరస్తూ ఆశీర్వదించి శ్యామాకు పట్టుపంచొకటి దానం చేయమన్నారు . బాబాసందేశంతోను, పట్టుపంచెతోను పాఖాడే, కాకామహాజని యింటికి పారాయణ సమయాన వెళ్లి బాబా సందేశం వివరించాడు . దీక్షితు తగిన సమాధానంపొంది తృప్తిపడ్డాడు . కాకామహాజనికి నవంబర్ 13,1918న స్వప్నంలో సాయి కన్పించి ," నేను సమాధి చెంది నెల అయ్యింది. మానసిక పూజ చేయి " అన్నారు . అతడు నిద్రలేచి చూస్తే ఆమాట అక్షరాలా నిజమైంది . ఆరోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షితు ,ప్రధాన్,హేమాడ్ పంతులకు భోజనం పెట్టాడు . అలానే, నాగేష్ అనే భక్తుడు సమాధి పక్కగదిలో నిద్రించేవాడు . అప్పుడప్పుడతనికి, తోటివారికి సమాధినుండి రకరకాల సంగీతం వినిపిస్తుండేది. అంతటితో వారాగదిలో నిద్రించడం మానేశారు. ఓమారు శ్యామా యనే భక్తుడు బొంబాయి వెళ్ళినపుడు ఒకరాత్రి బాబా కలలో కన్పించి ," నేనిచ్చిన ఊది పొట్లం రోడ్డుప్రక్కన చెత్తకుండీలో వున్నది . త్వరగా వెళ్ళు! " యని హెచ్చరించారు . శ్యామా యిల్లుజేరి చూస్తే పూజలో ఆపొట్లం లేదు . ఇల్లు సర్దడంతో దానినెవరో తీశారు! ఇంటిప్రక్కనున్న చెత్తకుండీలో చూస్తే పొట్లం దొరికింది.
డాక్టర్ రుస్తుంజీ 1930వ సంవత్సరంలో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపర్తిలో స్పృహలేకుండా పడివున్నాడు . ఆ మైకంలో అతనికి ఒక ఫకీరుకన్పించి ," నేనెవరినో తర్వాత నీకే తెలుస్తుంది " అని, ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు. తరువాత డ్రాక్టర్లు అతనిని పరీక్షించి అతడారోగ్యాంగా వుండడంజూసి విస్తుపోయారు . ఒకసారి,బస్సులో సాటిప్రయాణీకుని పుస్తకంలో బాబా ఫోటోజూసి, తనను కాపాడినది ఆయనేనని గుర్తించి , వారి చరిత్ర పారాయణ ప్రారంభించాడు . ఒకప్పుడితని భార్యకు కళ్ళజబ్బువచ్చి, సమాధికి ప్రదక్షిణలుజేసిన పిమ్మట తగ్గిపోయినది . భయంకర క్షయవ్యాధి పీడితుడు శివశంకర్ దీక్షిత్ కలలో తనకో ఫకీరు విభూతి పెట్టడం చూసాడు . త్వరలో వ్యాధి తగ్గడం వాని నాశ్చర్య చకితుని జేసింది . అటుపిమ్మట సాయిబాబా చిత్రపటంజూసి, వానికి స్వప్నదర్శనమిచ్చినది బాబాగా నెరిగి శిరిడీ వెళ్లి బాబాభక్తుడుగా మారాడు. గోపాలాచారికి 1938 లో కలలో ఒక ఫకీరు కన్పించాడు. ఆయనకు మోకాళ్లవరకు పుండ్లున్నాయి . మరుసటి రోజు తన యింటిలోని బాబాపటంలో మోకాళ్లవరకు చదలుండటాన్ని గమనించాడు . సాయికి వారి పటానికి తేడాలేదని గ్రహించాడు . నాటినుండి వారింట సాయిపూజ, భజనలు మొదలయ్యాయి . బి . బి . దూబే 1957లో ప్రమాదకరమైన దీర్ఘ ఉదరవ్యాధిచే బాధపడ్డాడు . ఓరోజు తెల్లవారుజామున కలలో కఫనీ, తలగుడ్డ ధరించిన మహనీయుడు కన్పించగ , వారినే తన గురువుగా తలచాడు దూబే . కొంతకాలం పిమ్మట ఓ మిత్రునిద్వారా తాను స్వప్నంలో జూసిన మహాత్ముని సాయిబాబాగా తెలిసికొని 1973లో శిరిడీ వెళ్లి నాటినుండి సాయిని కొలుచుకొంటున్నాడు . చాలాకాలం బిడ్డలులేని శ్రీమతి సుశీలమ్మకు బాబానుపూజించడం మొదలుపెట్టాక అబ్బాయి జన్మిస్తే సాయిబాబా యని పేరుపెట్టారు . ఆపై ఆమెకు కొన్ని ఆరోగ్య , ఆర్ధిక బాధలు చుట్టుముట్టాయి . బాబాకు ఆమెకు పెక్కు స్వప్నదర్శనములనిచ్చి ఆరోగ్యము , జీవనోపాధి , కర్మనివృత్తి ప్రసాదించారు . సాయిని నిత్యం కొలిచే రిటైరైన పోలీసు ఆఫీసరు బి . ఉమామహేశ్వరరావు సెప్టెంబర్ 1983 లో గుండెనొప్పితో స్పృహకోల్పోయాడు . వానికి మూడవరోజు తెల్లవారుజామున స్వప్నంలో ఒక ఫకీరు వాని నుదుట ఊది పెట్టి బాధతగ్గుతుందని చెప్పారు . మేల్కొన్న వాని నుదుటిమీద విభూతిని చూసినది వాని భార్య . తరువాత ఆయనకు గుండెనొప్పిరాలేదు .
సాయిని కొలిచే కలిచేడు వాసి దశరథ రామయ్య కు 1981లో గుండెనొప్పి వస్తే స్వప్నదర్శనాలిచ్చి వాని రోగముక్తునిజేశారు సాయిబాబ. శ్రీసాయిలీలామృతము పారాయణజేయు ఒంగోలు నివాసి శ్రీమతి శేషారత్నంకు మగత నిదురలో శిరిడీలోని మసీదు , సమాధుల దర్శనమయ్యింది. సమాధిపై గాలిలో కూర్చొన్న బాబా ఆమెకో యోగముద్రజూపి , అరబ్బీలో ఒక మంత్రంజెప్పి జపించమన్నారు . మెలకువ వచ్చేటప్పటికి ,మంత్రం మరచినామెకు విషయమెరిగిన శ్రీ సాయిమాష్టరుగారు కాగితంపై వ్రాసి యిచ్చారు. శిరిడీలో సమాధిమీద వున్న విగ్రహాన్ని చెక్కడానికి బొంబాయినుండి తాలిమ్ అనే శిల్పి వచ్చాడు . వేరువేరు కోణాలలో తీసిన బాబాఫొటోలు లేనికారణంచే, తాలింకు ఎంత శ్రమించినా నమూనామూర్తి తృప్తికరంగా రాలేదు . తుదిప్రయత్నంగా అతడు సాయిని ప్రార్ధింప, నాటి రాత్రి బాబా వానికి కలలో కన్పించి తమరూప దర్శనాన్ని కల్గించారు . తెల్లవారగనే ప్లాస్టరుతో చక్కని నమూనామలచి దానినిబట్టి పాలరాతి విగ్రహం చెక్కాడు ధన్యజీవి తాలిమ్ . శ్రీ దిలీప్ కుమార్ రాయ్ అనే పేరొందిన సాధకునికి వాని మిత్రుడు 1968లో ఒక సాయి విగ్రహమివ్వ దానినతడు తన ఆశ్రయానికి వెలుపలుంచారు. నాటి రాత్రి సాయి వానికి కలలోకనపడి తామువణుకుచున్నటుల చెప్పారు . ఆయన వెంటనే నిద్రలేచి, మర్నాడే ఆ విగ్రహాన్ని ఒక ప్రత్యేక మందిరంలో స్థాపించారు . సాయికి వారి విగ్రహానికి భేదం లేదు . ఆర్ . ఎస్ . చిట్నీస్ ఢిల్లీ నివాసి 1952 లో శిరిడీ లో బాబాసమాధి దర్శించి మిగుల శాంతిని అనుభవించాడు . 1965లో అతనికి విపరీతమైన కడుపునొప్పివచ్చి,నీరు త్రాగడంకూడ కష్టమైంది . డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే అతడు భయపడి బాబాను ప్రార్ధించాడు . నాటిరాత్రి కలలో భయంకరులు నలుగురు అతనిపైబడ్డారు . వెంటనే సాయి వారిపైబడి తరిమేసారు. తెల్లవారేసరికి చిట్నీసుకు జబ్బేలేదు . 1965లో రాహురిలో కులకర్ణి జబ్బుపడి బాబా కృపతో మూడురోజుల్లో రోగముక్తుడయ్యాడు . పిమ్మట వానికుటుంబం శిరిడీలో స్థిరపడ్డారు . 1976లో కులకర్ణి వ్యాధిగ్రస్తుడైనాడు . రాత్రి మెలకువ వచ్చేసరికి ,బాబా అతనిపక్కనే కన్పించారు . అప్పుడు తలుపులు వేసే వున్నాయి . ఇంట్లో దొంగదూరాడని అతను కేకలు వేసేసరికి బాబానవ్వి ఆశీర్వదించి మాయమయ్యారు . తెల్లవారేసరికాతని జబ్బుతగ్గిపోయింది . బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న కరుణాకర్ ఉబ్బసం బాధ భరించలేక ఉద్యోగం మాని శిరిడీ జేరి చావడిలో సేవ జేస్తున్నాడు . కొద్దికునుకు పట్టగానే కలలో సాయి కన్పించి, ధునిపూజ చేయమన్నారు . అతడు మరునాడు ధునిపూజజేసి చిత్రంగా సాయికృపతో రోగముక్తుడయ్యాడు . అతడు శిరిడీ విడచి వెళితే వ్యాధి మళ్ళీ వచ్చి తిరిగి శిరిడీ రాగానే తగ్గేది . అందుకే అతడు శిరిడీలో స్థిరపడ్డాడు . సాయిని కలలో గాంచినా సాయికృపకు పాత్రులమయ్యెదముగదా !
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక! అందరికి శుభమగుగాక! ఓంసాయి శ్రీసాయి జైజైసాయి !
Comments
Post a Comment