సాయికోపము

శ్రీసాయినాథాయనమః 

సాయికోపము 

తమభక్తులపైన సాయిబాబాప్రేమ తల్లిప్రేమవంటిది, తల్లి దండన బిడ్డశ్రేయస్సుకొరకే! అలాగే వైద్యుడు రోగికిచ్చు చేదు కషాయము రోగనివారణకు మాత్రమేగదా! ఈ విషయమై బాబా భావాన్ని తెలుసుకొందాము. బాబా కోపించిన  అన్ని సందర్భాలలో భక్తులకు మేలే జరుగుట నిచట గమనార్హము. 

భక్తులు వారివారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను , ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కప్పుడు పూజాద్రవ్యముల పళ్లెమును విసరివేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు. అట్టిసమయములలో బాబాను సమీపించుటకు కూడా యెవ్వరికీ ధైర్యము చాలెడిది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైనముకంటె మెత్తగా గనిపించెడివారు. అప్పుడు వారు శాంతిక్షమలకు ప్రతిరూపమువలే గాన్పించుచుండిరి. బయిటికి కోపముతో నూగిపోవుచూ , కళ్లెర్రజేసినప్పటికీ, వారి హృదయము మాత్రము మాతృహృదయమువలే అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరతీసి , " నేనెప్పుడూ యెవరిపైనా కోపించి యెరుగను. తల్లి తన బిడ్డలనెక్కడనైనా తరిమివేయునా? సముద్రము తనను జేరు నదుల నెప్పుడైన తిరుగగొట్టునా? నేనుమిమ్ములనెందుకు నిరాదరించెదను? నేనెప్పుడూ మీయోగక్షేమములనే అపేక్షించెదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీవెంటనే యుండి పిలిచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమనుమాత్రమే!"  సాయిబాబా, శ్రీసాయిసచ్చరిత్రము: అధ్యాయము 11

వేరువేరు సందర్భములలో బాబా పరుషముగా  మాట్లాడిన మాటల ఈక్రింద పరిశీలించెదము. 

అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను. " ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి  గ్రామపు సరిహద్దులపైని చల్లుడు."
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 1
(ఇచటి ప్రయోజనము షిరిడీనుండి కాలరావ్యాధి తొలగిపోయినది).


అంతలో నొక  గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబాకోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. అదిచూసి చాలామంది పారిపోయిరి. కాని బాబాయొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నియు తిట్లరూపముగా బాబా తమకిచ్చిన యాశీర్వచనములని గ్రహించి కదలక నక్కడనే యుండిరి. శ్రీరామజయంతినాడు రావణుడనే యహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీసాయిరూపములో నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమేగదాయని భావించిరి. శిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక రివాజు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి.
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 6
( దుష్టశిక్షణకు కోపము ఆవశ్యకము)

ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒకచేతితో బెకలించుచు , రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి, వానివద్దనుంచి యొక నగిషీ జరీపాగాను కొని, దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను.
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 6
(తనప్రాణసమానుడైన తాత్యపై కోపము, తాత్యా శ్రేయస్సుకొరకే!)

ఇదివినగనే బాబా మిక్కిలి కోపముతో మశీదులోని కొళంబా నీటికుండలను బయటకు విసిరివైచి , తిన్నగా చావడిలోనున్న హాజీవద్దకు బోయి , తన కఫనీని పైకెత్తి  పట్టుకొని, తీవ్రస్వరంతో ; " నన్నుగురించి యేమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడిననీ, పెద్ద హాజీవని గొప్పలు పోవుచూ,యేమిటేమిటో వదరుచున్నావే? నాదగ్గరా నీ ఆటలు? ఖురాను చదివి నీవు తెలుసుకొన్నదిదేనా? మక్కామదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలిసికొనలేకున్నావు!"  అనుచూ, ఏమేమో యింకనూ అతనిని తిట్టి మసీదుకు మరలివెళ్లెను. బాబా అగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్నిగంపల మామిడి పండ్లను కొని వాటిని  హజీకి పంపెను. తిరిగి హాజీవద్దకు వచ్చి తన జేబులోనుంచి  55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీచేతిలో పెట్టెను.
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 11
(ఇచట సాయి జూపిన  కోపము హాజీ అహంకారము తొలగుటకు చేసిన  బాబా చేష్ట, ఆపై యాతనిపై మిగుల ప్రేమ చూపించారుగదా! )

" ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు" మని గర్జించిరి. కొన్ని నిముషములలో వర్షము తగ్గెను, తుఫాను ఆగిపోయెను. శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 11
(ప్రళయశక్తిని మించిన శక్తిని బాబా క్రోధరూపముగ వెల్లడించారు.)

కాని శ్యామా తన విఠలుడగు బాబావద్దకు పరుగిడెను. బాబాయాతని చూడగనే కోపముతో వానిని తిట్టనారంభించెను. " ఓరి పిరికి పురోహితుడా! పైకెక్కవద్దు! ఎక్కితివో నేమగునో చూడు" మని బెదిరించుచూ, తరువాత ఇట్లు గర్జించెను. " పో, వెడలిపొమ్ము." బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయమందెను. కొంతసేపటికి బాబా శాంతించిరి. నిజమునకు  బాబా పలికిన పలుకులు  శ్యామానుద్దేశించినవి కావు, విషమును ఆజ్ఞాపించిన మాటలు. శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 23
(ఇచట బాబా మాటలే శ్యామా ప్రాణరక్షణకు మంత్రవాక్యములు.)

వారిట్లనిరి. అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబాకడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు.", ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారికండ్లు నిప్పుకణములవలె ఎఱ్ఱనాయెను. బాబానుజూచుటకెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గుచ్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకానించెను. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. అదృష్టవశముచే మరికొద్దిసేపటికి బాబాకోపము తగ్గెను. ఇష్ఠానుసారము సేవజేయు నీతిని భక్తులు గ్రహించిరి. ఎవరిసేవ యెట్టిదో బాబాకే గుర్తు. శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 24
(దైవము తనభక్తులపట్ల యవమానము సహించలేరు ప్రహ్లాద, అంబరీష పురాణగాథలు ఉదాహరణములు.)

మేఘా షిరిడీజేరి మశీదుకు పోగా బాబా కోపించి యతనిని లోపలకు రానీయక , " ఈ వెధవని తన్ని తరిమివేయుడు!" యని గర్జించి మేఘునితో నిట్లనెను. " నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువజాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీకులము పోవును. కనుక వెడలిపొమ్ము!"  ఈమాటలువిని మేఘుడు వణక నారంభించెను.  శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 28
(తనపట్ల సరియైనభావము నెలకొల్పుటకు మేఘాలో మార్పునకు బాబా వాడిన మందు.)

మదరాసి సన్యాసి విజయానందుడు బాబావద్దకేగి  సాష్టాంగ నమస్కారము చేయగా బాబాకోపించి యిట్లనెను. " ఈపనికిమాలిన సన్యాసిని తరిమి వేయుడు. వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు."
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 31
( విజయానందునిలో సన్యాసధర్మమును నిలుపుటకును ఆపై యాతనికి సద్గతి ప్రసాదించుటకు చేసిన సాయి చర్య.)

బాబా కోపగించి దేవుతో యిట్లనెను. " ఇక్కడ ఇంకెవ్వరు లేరు. నీవొక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికి ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా?" యని కోపగించెను.
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 41
(బాబా యతనికి జ్నానబోధయను జరీశాలువా ఇవ్వసిద్ధముగానున్నను,  ఇచట ఇతరులనడుగుట యను పీలికలను దేవు దొంగిలించెను, దేవులో పరివర్తనకై బాబా తమ కోపమును ప్రదర్శించిరి.) 

సీమోల్లంఘన సమయమున , బాబా అక్కడ దిగంబరుడై నిలిచి ఎఱ్ఱగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. " ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదీయుడనో చెప్పుడు."
శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 42
(హిందూ ముస్లింల మధ్య సోదరభావము నెలకొల్పుటకు సందర్భోచిత బాబా మాటలు.)

సపత్నేకర్ దూరమునుండియే బాబాదర్శనముజేసి సంతసించెను. గొప్పభక్తితో బాబావద్దకేగి యొక టెంకాయను యచట బెట్టి, బాబాపాదములకు సాష్టాంగనమస్కారము జేసెను. " బయటకు పొమ్ము!" యని బాబా యరచెను. శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 48
(ఈమాటలు బాబా సర్వజ్ఞతకు నిదర్శనము.  సపత్నేకర్ అంతరంగ శుద్ధికి బాబాజేసిన వైద్యము.)

హిమాలయపు సన్యాసి సోమదేవస్వామి బాబా దర్శనమునకు వచ్చినపుడు వానితో బాబా యిట్లనెను. " మా వేషము మా దగ్గరనే యుండనీ, నీయింటికి నీవు పొమ్ము. తిరిగి మశీదుకు రావొద్దు. ఎవరైతే మశీదుపై జెండా నెగరవేయుచున్నారో యట్టివారి దర్శనము చేయనేల? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమయిన ఉండవద్దు."  శ్రీసాయిసచ్చరిత్రము : అధ్యాయము 49
(సోమదేవస్వామి హృదయములో బాబాపట్ల భక్తి శ్రద్దల దీపాన్ని సరిజేశారు.)

ఓసారి బాబా అంకిత భక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ సాయిని చూచుటకు ద్వారకామాయికి రాగా బాబా ఎంతకూ అతనితో మాట్లాడలేదు. కారణమడిగితే, " నేను చెప్పినది గుర్తుంచుకోనివారితో నేనెందుకు మాట్లాడాలి? "  అన్నారు. " మీరు చెప్పినవన్నీ  నాకు గుర్తున్నాయి " అన్నాడు నానా. " మీరు పెద్దమనుషులే! కాని దారిలో ఆ ' సర్కార్ ' ను చూడకుండా చుట్టూతిరిగి వచ్చినది ఆ సాధువు ఆ రూ 300/ అడుగుతాడనేగా?  నేచెప్పినది గుర్తుపెట్టుకొనేది ఇలాగేనా? .... ఇలాంటి వాళ్లతో నేనెలా మాట్లాడను? " అన్నారు. ( ఒకప్పుడు   కోపర్గామ్ లోని దత్తమందిరంలో ఒక ధర్మకార్యానికి  రూ 300/ విరాళమిస్తానని ఒక సాధువుకు నానా వాగ్దానం చేసాడు.  కాని అటుతర్వాత ఆపైకం తెచ్చి వారికివ్వలేదు సరికదా, శిరిడీ వచ్చేటప్పుడు ఆమందిరంవారికి  తన ముఖం చూపవలసి వస్తుందని  ఆ మందిరానికి వెళ్లకుండానే శిరిడీ వచ్చాడు. అందుకోసం అతడు ప్రత్యేకించి ఒక ముళ్లబాటగుండా ప్రక్కదారిలో శిరిడీ జేర  యాతని కాళ్ళలోనూ, వంటిమీద ముళ్ళుగుచ్చు కొన్నాయి.)
(ఇచ్చినమాట నిలుపుకోనందుకు నానాపై బాబా కోపించారు.)
శ్రీసాయిసన్నిధి: పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ

మరొకపర్యాయము నానా శిరిడీ వెళ్ళినపుడు బాబా అతనితో ఎంతకూ మాట్లాడలేదు. కారణమడిగితే, " నీవు నేను చెప్పినది మరచిపోయావు. ఆపేదరాలు యింకా యివ్వమని  కోరితే కోపగించుకొని నీఅధికారం చూపడమెందుకు?  ఆ చెప్పేదేదో మర్యాదగా చెప్పవచ్చుగదా? సాయి యన్నారు. ( ఒకసారి కళ్యాణ్ లో ఒక పేదరాలైన వృద్ధ బ్రాహ్మణస్త్రీ  వారింటికి భిక్షకు వచ్చినది. నానాభార్య  ఆమెకు రెండుశేర్లు ధాన్యమిచ్చినా ఆమె తృప్తి చెందక, నాలుగు శేర్లిస్తేగాని అక్కడనుండి వెళ్లనని చెప్పి వేధించసాగింది. అంతటితో విసుగుచెంది నానా, " ఇచ్చింది తీసుకుపోతావా, లేక జవానుచేత గెంటించమంటావా? " యని బెదిరించాడు. ఆమె వెళ్ళిపోయింది.)
(ఎవరైనా అడిగినప్పుడు అహంకారము, అధికారము లేకుండా దానం చేయాలనేది బాబా సందేశము. నానా ఈసత్యం మరచుటయే బాబాకు కోపకారణం.)
శ్రీసాయిసన్నిధి: పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!










Comments

  1. భక్తుల శ్రేయస్సుగూర్చుటకు సద్గురు శ్రీసాయినాథులు అనుసరించు మార్గాల్లో కోపప్రదర్శన మొకటి! బాబా కోపం భక్తుల శ్రేయస్సుకొరకు మాత్రమే!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)