సాయి కథలు - అణుకువ , అహంకారము
శ్రీసాయినాథాయనమః సాయి కథలు - అణుకువ,అహంకారము సాయిబాబా తాము స్వయంగా అణుకువలో అగ్రేశ్వరులు. ఈవిషయం వారివేషభాషలలోను, వారి నిత్యజీవనవిధానంలోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. వారిమాటలు సయితము మిగుల క్లుప్తము. చిరుగుల కఫనీ, చేతిలో సట్కా , భిక్షాటనకు పాత్ర ఇవే వారి సంపద. పాతమజీదే వారి రాజమహలు. ఎల్లప్పుడూ " అల్లా మాలిక్ " అంటూవుండేవారు. తాము దేవుని నమ్మినబంటుగానే చెప్పుకున్నారేగాని, తమకు తాము దైవంగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. భక్తులకు తాను సేవకుడనని చెప్పుట సాయిబాబావారి యణుకువకు, వారి నిరహంకారానికి పరాకాష్ట. అణుకువ, వినయములాంటి దైవగుణాలు భక్తులు కలిగియుండాలని , సాయి మనకు చెప్పకనే చెప్పారు. అదేవిధంగా అభిజాత్య, దురహంకారములతో తమవద్దకు వచ్చినవారిని సాయి తీవ్రంగా నిరసించేవారు. ఈవిషయమై శ్రీసాయిసచ్చరిత్రములోని 11వ అధ్యాయ విషయముల పరిశీలించెదము. బాబా భక్తుడు తాత్యాసాహెబు నూల్కరు తమ చివరిరోజుల్లో శిరిడీలో నివసించాడు. వాని స్నేహితుడు డాక్టరు పండితు యనునతడు బాబాను చూడ శిరిడీ వచ్చి నమస్కరించిన పిమ్మట వానిని సాయి, దాదాభట్ కేల్కరు యింట...