సాయి కథలు - అణుకువ , అహంకారము

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు -  అణుకువ,అహంకారము 

సాయిబాబా తాము స్వయంగా అణుకువలో అగ్రేశ్వరులు. ఈవిషయం వారివేషభాషలలోను, వారి నిత్యజీవనవిధానంలోనూ స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. వారిమాటలు సయితము మిగుల క్లుప్తము. చిరుగుల కఫనీ, చేతిలో సట్కా , భిక్షాటనకు పాత్ర ఇవే వారి సంపద. పాతమజీదే వారి రాజమహలు. ఎల్లప్పుడూ " అల్లా మాలిక్ "  అంటూవుండేవారు. తాము దేవుని నమ్మినబంటుగానే చెప్పుకున్నారేగాని, తమకు తాము దైవంగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. భక్తులకు తాను సేవకుడనని చెప్పుట సాయిబాబావారి యణుకువకు, వారి నిరహంకారానికి పరాకాష్ట.  అణుకువ, వినయములాంటి దైవగుణాలు  భక్తులు కలిగియుండాలని , సాయి మనకు చెప్పకనే  చెప్పారు. అదేవిధంగా అభిజాత్య, దురహంకారములతో తమవద్దకు వచ్చినవారిని సాయి తీవ్రంగా నిరసించేవారు. ఈవిషయమై శ్రీసాయిసచ్చరిత్రములోని 11వ అధ్యాయ విషయముల పరిశీలించెదము.

బాబా భక్తుడు తాత్యాసాహెబు నూల్కరు తమ చివరిరోజుల్లో శిరిడీలో  నివసించాడు. వాని స్నేహితుడు డాక్టరు పండితు యనునతడు బాబాను చూడ శిరిడీ వచ్చి నమస్కరించిన పిమ్మట  వానిని సాయి,  దాదాభట్ కేల్కరు యింటికి పంపారు. ఆతనింటికే పంపుటలోని విశేషం తరువాత తెలుస్తుంది. పూజాసామాగ్రితో ద్వారకామాయి కొచ్చిన దాదాభట్టుతో డాక్టరు పండిట్ కూడ వస్తాడు. దాదాభట్టు బాబాను పూజించిన పిమ్మట,  పండిట్ భట్టుపూజాపళ్ళెరమునుంచి చందనమును దీసి బాబానుదిటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసాడు. అందరికి ఆశ్చర్యం కలిగేవిధంగా బాబా ఒక్కమాటయినా యనక యూరకున్నారు. ఈ చందనసేవ కేవలము మహల్సాపతిమాత్రమే చేయుచుండెడివాడు. డాక్టరు చందనసేవను ఏల అంగీకరించారని భట్టు బాబానుయడుగ , సాయి ప్రసన్నంగా  యిలా అంటారు, "  నేను ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించుటద్వారా తాను మైలపడిపోవుదననే దురభిమానము లేకుండా , ఆతడు నాలో తన గురువును భావించుకొని, అట్లుచేసెను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది. అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను?. "  డాక్టరు పండిట్ ఆవిషయాన్ని పిమ్మట ధృవీకరిస్తాడు. ఇందులకు భిన్నంగా  అహంకారంతో బాబాను చూడవచ్చిన వేరొకని అనుభవం ఇదేఅధ్యాయంలో చెప్పబడినది. 

హాజీ  సిద్దీఖ్ ఫాల్కే  యనువాడు కల్యాణ్ నివాసి.  మక్కా మదీనా యాత్రలు జేసి సాయిని జూడ శిరిడీ వచ్చి తొమ్మిది నెలలున్ననూ, బాబా వానిని మసీదులో పాదముపెట్టనీయకుండుటచే, ముందున్న ఖాళీ జాగాలో  కూర్చుండెడివాడు. ఫాల్కే మిగుల నిరాశ నిస్పృహలకు లోనై, శ్యామాద్వారా బాబాకు  తన కోర్కెను విన్నవించుకొంటాడు. బాబాపెట్టిన నాలుగు షరతుల నొప్పుకుంటాడు. కొన్నిసందర్భాలలో  కరుణించేముందు  బాబా మిగుల కోపించుట భక్తులకు తెలిసిన విషయమే!  శ్యామాద్వారా,  ఫాల్కే నాలుగు   షరతుల అంగీకారాన్ని విన్న బాబా మిగుల కోపంతో మసీదులోని నీటికుండల బయటకు విసరివేసి, తిన్నగా చావడిలోనున్న హాజీవద్దకు పోయి తీవ్రస్వరంతో , " నన్నుగురించి ఏమనుకొనుచున్నావు? నీవేదో గొప్పవాడివనీ, పెద్దహాజీవని గొప్పలు పోవుచూ, యేమిటేమిటో వదరు చున్నావే? నా దగ్గరా నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలిసికొన్నదిదేనా?  మక్కా మదీనా  యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలిసికొనలేకున్నావు! "  అనుచూ మిగుల తిట్టి మసీదుకెళ్లారు. బాబా ఆగ్రహానికి ఫాల్కే మిగుల భయపడ్డాడు. నిజంగా భయపెట్టువాడుకాదు , మిగుల కరుణామయుడుకావున, బాబా కొన్ని గంపల మామిడిపళ్ళను కొని హాజీకి పంపారు. పిదప హాజీవద్దకు వచ్చి తనజేబునుండి తీసి ఏబదిఐదు రూపాయల హాజీకిస్తారు. అప్పటినుండి హాజీని బాబా ప్రేమాదరములతో చూసెడివారు.

మిగుల అహంకారంతో బాబానుచూడవచ్చిన కొందరి యనుభవముల చూచెదము. బ్రిటిష్ కమీషనర్ కర్టిస్, యాతని భార్య, అహ్మద్ నగర్ కలెక్టర్ మెక్లిన్స్, వాని క్రింద ఉద్యోగి  రామచంద్ర జోగ్లేకర్ బాబానుజూడ శిరిడీకి వస్తారు. భిక్షకెళ్లి వచ్చేవరకు వేచియుండమని బాబా వారికి చెబుతారు. త్వరగా రావలసినదనే భావంతో వారు మిగుల అసహనానికి లోనవుతారు. బాబాతిరిగి వచ్చి వారి సహనాన్ని పరీక్షింపదలచి  మరికొంత సమయం వేచియుండమని వారికి  చెప్పి మరల భిక్షకెళతారు. సహనంకోల్పోయిన  పెద్దలు  సాయి ఆశీర్వాదము పొందకనే తిరిగివెళ్ళిపోతారు. నిజానికి బాబా ఆశీస్సులతో బిడ్డలు కలుగుతారని ఆశించి వారంతా దర్శనానికి వచ్చారట. కానీ ఆకార్యం నెరవేరలేదు.  ఆపై ఆమెకు సంతానం కలుగలేదు. 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


Comments

  1. బాబాను సామాన్య మానవమాత్రునిగా తలచేవారు సయితము వారినుండి నేర్చుకోతగిన అతిముఖ్య అంశము " అణుకువ ".

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము 51 (Nectar of Sri Sai's message 51)