సాయిబాబా భగవంతుడే(నా) ?
శ్రీసాయినాథాయనమః
సాయిబాబా భగవంతుడే(నా) ?
ఈమధ్యకాలంలో ఈ ప్రశ్న ప్రసిద్ధిచెందిన కొందరి మఠాధిపతుల మనసులగూడా తొలుస్తోంది. ఈవిషయమై నిచట భగవంతుడన యెవ్వరను విషయాన్ని పరిశీలించెదము.మనశాస్త్రములలో భగవంతునికి ఆరులక్షణములు చెప్పబడినవి. అవి వరుసగా 1) కీర్తి, 2) ధనము, 3) అభిమానము లేకుండుట, 4) జ్ఞానము, 5) మహిమ, 6) ఓదార్యము. ముందుగా హిందువులు పూజించెడి అవతార పురుషుల వివరముల నెరుగ ప్రయత్నించెదము. హిందువులు ప్రముఖంగా శివ, రామ, కృష్ణ, హనుమ యిత్యాది దేవతల నారాధింతురు. ప్రస్తుతవ్యాసంలో మనచర్చ కేవలము శ్రీరామ, శ్రీకృష్ణ అవతార విశేషములకు మాత్రమే. ఇప్పుడు ఈ అవతారపురుషులలోని భగవంతుని లక్షణములను మరియు శ్రీసాయిబాబా యందలి దైవగుణములను పైన చెప్పబడిన లక్షణ క్రమంలోపోల్చి చూచెదము.
ప్రధమ భగవద్ లక్షణము కీర్తి. కీర్తియనగా యశస్సు, గొప్పదనం. పైనుదహరింపబడిన అవతారపురుషుల గొప్పతనము ఐదువేల సంవత్సరముల కు పైబడే భారతీయులకు విదితమే. శ్రీరాముని పేరుగాని , శ్రీకృష్ణుని పేరుగాని వినని భారతదేశపు వారుండరు. వారిఖ్యాతి ఊరూరా, వాడవాడ వ్యాపించినది. అన్నిప్రాంతములలోని వివిధభాషలు మాట్లాడు యెందరో తలిదండ్రులు వారిబిడ్డలకు ఆ దైవపురుషుల పేరుపెట్టుగోవడం జగమెరిగిన సత్యం. అనగా వారిగొప్పదనం అంతగా వ్యాపించినదన్నమాట! అలాగే శ్రీసాయిబాబా విషయం పరిశీలిస్తే వారి యశస్సు ఈరోజున విశ్వవ్యాపకము. వారి ఘనత దేశదేశములకు, ఖండఖండములకు వ్యాపించినది. మరియును మనము గ్రహింపదగిన వేరొక సత్యమేమన శ్రీసాయిబాబా సమాధిచెందిన పిమ్మట కేవలము వందసంవత్సరముల కాలవ్యవధిలోనే, వారి ఖ్యాతి దేశనలుమూలలేగాక ప్రపంచమునంతయు నెగబ్రాకినది.
భగవంతుని రెండవ లక్షణము ధనము. ధనము లేక సంపద పెక్కు రూపులుగా నుండును. భౌతిక సంపద ఇండ్లు, పొలాలు, రాజ్యాలు, బంధుమిత్రుల రూపంలో చూస్తాము. ఇవేగాక ఆరోగ్యసంపద, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక సంపద మున్నగునవి. శ్రీరామకృష్ణులు క్షత్రియ వంశంలో ఆజన్మ భాగ్యవంతులుగా జన్మించారు. రాజ్యములనేలారు. భోగభాగ్యముల తేలియాడారు. సాయిబాబా విషయానికొస్తే వారు కేవలము ఫకీరుగానే జీవించినా ప్రస్తుతము వారి శిరిడీ సంస్థానము నిత్యకల్యాణం, పచ్చతోరణం; లక్ష్మీదేవి తాండవిస్తుంటుంది. శ్రీ సాయినాథులు రాజాధిరాజులుగా వెలుగుచున్నారు. అంతేగాక వారి ఆధ్యాత్మిక సంపదకు హద్దులేలేవు. " నా సర్కారు యొక్క ఖజానా ( ఆధ్యాత్మిక ధనం ) నిండుగా నున్నది. అది యంచులవరకు నిండి పొంగిపొరలుచున్నది. " యని సాయియే చెప్పియున్నారు.
మూడవలక్షణము అభిమానరాహిత్యము. శ్రీరామచంద్రులు రాజుగా పట్టాభిషేకమునొందు వేళలో ఎలాంటి భేషజములకు, అభిమానమునకు పోక తనతండ్రియాజ్ఞమేరకు పదునాలుగేండ్ల అరణ్య వాసమునకై బయలుదేరారు. వారి యణుకువ, వినమ్రత యనుపమానము. శ్రీకృష్ణుడు, తాను రాజైయుండిగూడా తనబాల్యస్నేహితుడు , యతిపేదవాడగు సుధాముని పాదముల కడిగి మిగుల ఉపచర్యల జేసినాడు. శ్రీరాముడుగాని, శ్రీకృష్ణుడుగాని తాము అవతారపురుషులమని ఎన్నడూ ప్రకటించుకొనలేదు. ఆంజనేయుడు మరియు అర్జునుడు లాంటి సౌభాగ్యవంతులు, పుణ్యశీలురు మాత్రమే వారి యవతారకార్యమును గుర్తించి సర్వస్యశరణాగతులైనారు. మరి సాయిబాబా వినమ్రత ఎంతటిఘనమైనదో? తమభక్తులతో " బానిసలకు బానిసనగు నేను మీకు ఋణగ్రస్తుడను. మీదర్శనముచే నేను తృప్తుడనైతిని. మీపాదముల దర్శించుట నా భాగ్యము." యని చెప్పియున్నారు. సమస్తజీవులలో సాయిబాబా నారాయణుని గాంచుచుండెడివారు. " నేను భగవంతుడను " అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడు తలచువారు. ' అల్లా మాలిక్ ' అనగా భగవంతుడే సర్వాధికారి యనుచుండెడివారు. బికారిని మహారాజు జేయగల సమర్ధులైనను తాము పేదఫకీరుగానే జీవించారు. వారివినమ్రత, నిరభిమానములకు శతకోటి పాదాభివందనములు.
నాలుగవ లక్షణము జ్ఞానము: ఇచట జ్ఞానమన బ్రహ్మజ్ఞానము, సాధారణ వస్తుసంబంధిత విషయ పరిజ్ఞానము కాదు. శ్రీరామచంద్రులు తమ గురువగు పసిష్ఠమహర్షులనుండి ఎన్నో నిగూఢ వేదాంతవిషయముల గ్రహించారు. వారిరువురి సంభాషణయే ప్రసిద్ధ " యోగవాసిష్ఠము" గా ఖ్యాతి నొందినది. ఇందున ఆత్మానాత్మ వివరణ, వివేక వైరాగ్యముల విపుల చర్చలు గలవు. జ్ఞానవిషయమున శ్రీకృష్ణుని తలువగనే మొట్టమొదట " భగవద్గీత" యే మన మనసులకు స్ఫురించును. భగవద్గీత, ఉపనిషత్తుల సారము, బ్రహ్మవిద్య ప్రదాయని, యోగశాస్త్రము, అందువలననే ఈ పవిత్రగ్రంధము అనంత ఆత్మజ్ఞాన భాండాగారము. శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడు, శిష్యుడు నైన అర్జునునికి కురుక్షేత్ర మహా సంగ్రామ సమయమందు చేసిన మహోపదేశమే భగవద్గీత. ఇందు కర్మ,భక్తి,జ్ఞాన, రాజయోగములు మిగుల విపులముగా చర్చింపబడినవి. సాయిబాబా విషయములో వారు అనంత బ్రహ్మజ్ఞులు. వారికి సర్వవేదముల రహస్యజ్ఞానము విదితము. ఖురాను, బైబిల్ మరియు సర్వధర్మగ్రంధముల మూలజ్ఞానము వారికి కరతలామలకము. సంస్కృతభాషలో ఎంతో యనుభవముగల భక్తుడు నానాసాహెబ్ ఛందోర్కరుని గీతాజ్ఞానము బాబాముందు వెలవెలబోయినది. ఈషోపనిషత్తు నిగూఢజ్ఞానమును నిత్యకృత్యములలో ఎలా సమన్వయ పరచుకొనవలయునో దాసగణుకు, విల్లేపార్లేలోని కాకాసాహెబు పనిపిల్లద్వారా బోధించారు. బ్రహ్మజ్ఞానమునెరుగ ద్వారకామాయి వేంచేసిన ఓ పిసినారి ధనికునికి ఎంతో యుక్తిగా బ్రహ్మజ్ఞానబోధజేశారు. పండితుల విద్యావంతుల భాషాజ్ఞానము, బాబా బ్రహ్మజ్ఞానముముందు వెలవెలబోయినది.
ఐదవ లక్షణము మహిమ. శ్రీరామావతారమున అతికొద్దిగామాత్రమే మహిమలు ప్రదర్షింపబడినవి. ధర్మరక్షణే రామావతార ప్రధాన కార్యము. శ్రీకృష్ణుడు తన బాల్యమందు బాలకృష్ణునిగా గోకులబృందావనమున అనంత అమోఘ లీలలజూపారు. ఈలీలలన్నియు ఎంతో భక్త మనోరంజకముగా శ్రీమద్భాగవతమున వర్ణింపబడినవి. శ్రీకృష్ణుని కౌమారావస్థనుండి ధర్మరక్షణయే ప్రధాన అవతార కార్యము. శ్రీసాయిబాబా అవతారకార్య ముఖ్యోద్దేశము భక్తరక్షణయే! వారి పవిత్రజీవనము మహిమల, లీలల అద్భుత విన్యాసమే! వారిలీలలెల్లయు బాలకృష్ణ లీలలే! లీలాప్రబోధంద్వారా శ్రీసాయి భక్తరక్షణ, భక్తపోషణ, భక్తపరివర్తన, భక్త ఆత్మోన్నతి మిగులజేశారు. ఎన్నిలీలల జూపినను శ్రీసాయి, తెరవెనుక సూత్రధారివలే వ్యవహరించారేగాని, ఎచటను తమ గొప్పతనమును ప్రదర్శింపలేదు. శ్రీసాయి, దైవమే మానుషరూపంలో అవతరించినటుల తమభక్తులకు నిరంతరం యనుభవం ప్రసాదించారు. రామునిగా, కృష్ణునిగా, శివునిగా, దత్తునిగా, గణపతిగా, హనుమగా, ఆదిపరాశక్తిగా శ్రీసాయి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సాయిలీలాభాగవతం, సాయిబాబా జీవితాంతమూ కొనసాగుట పరమాద్భుతము!
ఆరవ భగవంతుని లక్షణము ఔదార్యము. శ్రీరామచంద్రులు మిగుల ఉదారస్వభావులు. సోదర భరతునకై రాజ్యత్యాగము జేసిన పురాణపురుషులు. గంగానది దాటుటద్వారా సరంగు గుహుని, ఎంగిలిఫలములారగించి శబరిని కరుణించారు. మరణావస్థలోని జటాయువుకు మోక్షం ప్రసాదించారు. వానరరాజు సుగ్రీవునకు, రావణుని సోదరుడు విభీషునికి రాజ్యాభిషేకం జేశారు. భక్త హనుమను తమ సోదరభరతునిగా కౌగలించుకున్నారు. ప్రజలను అతిమనోరంజకముగా కొన్నివేల సంవత్సరములు పరిపాలించారు. నేటివరకు శ్రీరామరాజ్యపాలనయే సుపరిపాలనకు పరాకాష్ట! ధర్మరక్షణపట్ల శ్రీకృష్ణుని ఔదార్యము ు నిత్యస్మరణ మంత్రము. పాండవులు ధర్మానికి ప్రతీక , శ్రీకృష్ణాతార కార్యంలో తనభక్తురాలు కుంతీ , ఆమె పుత్రులు పాండవ రక్షణ మిగుల ఔదార్యములు. తన మిత్రుడు భక్తుడునైన అర్జునికి ఎవరికిచేయని సహాయము " గీతోపదేశము " ద్వారా జేశారు. నిత్యస్వర్ణప్రసాదిని శమంతకమణి నిగూడ శ్రీకృష్ణుడు త్యజించారు. శ్రీసాయిబాబా ఔదార్యము వివరించుటకు మన మాటలు చాలవు, మనసు మూగవోతుంది. ఆరోజుల్లోనే భక్తులనుండి నిత్యం దక్షిణరూపంగా పొందిన ఐదువందల రూపాయల పైచిలుకు ధనాన్ని దానం జేసేవారు. భక్తుల బాధల తమ ఒంటిపై వేసుకొనేవారు. కొలిమినబడ్డ బిడ్డరక్షణకై తమ చేతుల కాల్చుకున్నారు. భక్తురాలి పుత్రుని ప్లేగువ్యాధిని తమదేహంపై ధరించి యాతని రోగముక్తుని జేసిన కరుణామయుడు సాయిబాబా. తమ స్వహస్తాలతో వండి పేదలకు అన్నదానం జేసేవారు. భక్తుల కోరికలను మిగుల ఉదారంగా దీర్చెడివారు. సంతాన సౌభాగ్యములు ప్రసాదించెడివారు. జంతువులకు సయితము సద్గతి ప్రసాదించారు. పశుపక్షులయందు తమ ప్రేమను, ఏకత్వము ప్రదర్శించారు. తనను తమ్మునిగా ప్రేమించి సేవించిన భాయిజాబాయి పుత్రుడు తాత్యా పాటిలునకు తమప్రాణముల నడ్డువేసి ప్రాణదానం జేశారు. ఇదియే సాయిబాబా కృతజ్ఞత ఔదార్యమునకు పరాకాష్ట!
పైన పేర్కొన్న విశేష లక్షణములకు అదనంగా సర్వజ్ఞత, సర్వవ్యాపకత, సర్వశక్తిమత , జీవులయెడ అనన్యప్రేమ భగవంతుని లక్షణములు. శ్రీరామ, శ్రీకృష్ణులలో ప్రకాశించిన విధంగా సాయిబాబాలోనూ ఈదైవగుణములు పరిపూర్ణంగా నిండియున్నాయి. ఇంద్రియానుభవములకు అతీతుడైన భగవంతుని వివరించుట, పోల్చిచూచుట మన మానసిక అవగాహనాల పరిధికి మించిన జటిల కార్యమైనను, చంద్రునికో నూలుపోగులా యిచ్చట ఓచిరు ప్రయత్నము చేయడమైనది. సాయిబాబా మానుషరూపదైవం కాదని భావించు సుజనులు, పైన పేర్కొనబడిన విషములగూర్చి లోతుగా ఆలోచించి, శ్రీసాయి నిజరూపమెరుగగలరని ఆశిస్తున్నాను. మన భావముల కనుగుణముగా మన అనుభవములనెడిది పెద్దలవాక్యము. ( ఇచటి చర్చాంశములు రచయిత వ్యక్తిగత యోచనలు మాత్రమే! ).
శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
సాయిబాబా దైవావతారమా యని ప్రశ్నించుటకుముందు, ఆ దైవమనగా నెవరు, ఆ దైవగుణాలు యేమిటి అనే అంశాలపై మనకు సరియైన అవగాహన మిగుల ఆవశ్యకము. దైవావతారులైన శ్రీరామ, శ్రీకృష్ణులకును మానుషరూపము ధరించిన సద్గురు శ్రీసాయిబాబాకు సారూప్యమునిచట పరిశీలింపబడినది.
ReplyDelete