అడ్డుగోడ

శ్రీసాయినాథాయనమః 

అడ్డుగోడ 

కాకామహాజని సాయిబాబాకు ప్రియభక్తుడు. బొంబాయిలోని చౌపటిలో నివసిస్తుండేవాడు. అతడు ఓసారి బాబాను చూడ శిరిడీ వెళ్లుచూ తనమిత్రునిగూడ రమ్మంటాడు. కాని మిత్రునికి బాబాపై అంతటి నమ్మకంలేదు. తుదకు బాబాకు నమస్కరించను, యెలాంటి దక్షిణివ్వను యను రెండు షరతులపై శిరిడీకి ప్రయాణమవుతాడు. శనివారం బయలుదేరి ఆదివారముదాయానికి ద్వారకామాయి జేరుతారు. తనను మామూలుమనిషిగా తలచు యిలాంటి వ్యక్తులతో బాబా వ్యవహరించు తీరు యమోఘము. స్నేహితుడు మెట్లెక్కుచూ  యింకను బాబాను సమీపించలేదు, చూడలేదు. కాని మరణించిన తనతండ్రి మధురమైన స్వరంతో మంచిమాటలతో బాబా వానిని  లోనికి ఆహ్వానించారు. ఆకర్షణశక్తిగల  తనతండ్రి కంఠధ్వనిని విన్న మిత్రుడు మిగుల సంతోషపడి లోపలకువెళ్లి  తనమనోనిర్ణయానికి విరుద్ధంగా  బాబా పాదములకు నమస్కరిస్తాడు. 
ఇక రెండవ విషయం దక్షిణగూర్చి. సాయి కాకాను మరీయడిగి రెండుసార్లు దక్షిణ స్వీకరించారు. కాని స్నేహితుని యడుగలేదు. " బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ యడిగెను, నీతోయున్న నన్నేల విడచినారు? " యని యాతడు కాకాచెవిలో గుసగుసలాడినాడు. సర్వజ్ఞులైన సాయి స్నేహితునిభావమెరిగి, వానికిచ్చుట కిష్టములేకుండుటచే  యడుగలేదనియు , ఇవ్వదలచినచో   దక్షిణివ్వవచ్చని వానితో చెప్పారు.  మిత్రుడు తనపూర్వ యాలోచనమార్చుకొని  కాకా యిచ్చినంత
17 రూపాయల బాబాకు దక్షిణిస్తాడు. ఈవిధంగా బాబాకు నమస్కరించదలవని యాతడు నమస్కరించాడు, దక్షిణివ్వతలువకనే దక్షిణిచ్చాడు. ఇదే బాబా చాతుర్యం, తమశక్తిచే  వ్యక్తుల యాలోచనల మార్చి , వారిని తమ భక్తులుగా తీర్చిదిద్దుతారు. అపుడు బాబా వానికి కొన్ని మంచి సూచనల జేస్తారు.

" నీవు దానిని తీసివేయుము. మనకు మధ్యనున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలిసికొన గలము. "

ఇచ్చట బాబా చెప్పిన అడ్డుగోడంటే ఏమిటి? వ్యక్తులు యెవరికివారు తాము ఇతరులనుండి వేరనుకొందురు. తమలోని ఎరుక యనెడి జ్యోతి, యితరులలోని ఎరుక యనెడి చైతన్యరూప జ్యోతి వేరు వేరని భావిస్తారు. తమ యహంకారములను  అడ్డుగోడగా మారుస్తారు. తమతమ  పరిధుల నేర్పరచుకొని అందరిలోనున్న పరంజ్యోతిరూప దైవాన్ని విస్మరిస్తారు. రాగద్వేషాలు పెంపొందించుకొని కొందరిని మిత్రులుగా, మరికొందరిని శత్రువులుగా తలుస్తారు. అంతేగాక అలాంటి భావాలతో వ్యవహరించి మిగుల కర్మఫలాల మూటగట్టుకొంటారు, తృప్తిశాంతుల పోగొట్టుకొంటారు. మరిప్పుడు చూసాముగదా, అడ్డుగోడయన యేమిటో!  అందుకే బాబా మనమధ్యనున్న  యడ్డుగోడల తొలగించమని భక్తులందరితో చెబుతుండెడివారు. శునకంలో, పశువులో , పక్షిలో, పండితునిలో సాయిబాబా ఒకే ఆత్మను గాంచెడివారు. వారెల్లరిలోని కష్టసుఖములకు మిగుల స్పందించెడివారు. అలాంటి సర్వాత్మ సమర్ధసద్గురు శ్రీసాయినాథులకు శతకోటి వందనములు.

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!





Comments

  1. మనమధ్యనున్న గోడను తొలగిస్తే అందరిలో నిండేది, ఉండేది " ఎరుక " లేక చైతన్యము ఒక్కటే! అందుకే సాయిబాబా గోడల కూల్చమన్నారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)