సాయికథలు - పరివర్తన

శ్రీసాయినాథాయనమః 

సాయికథలు - పరివర్తన 

సాయిబాబా తమభక్తులలో మంచిమార్పు తెచ్చి  వారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గంలో నడిపించుటకు వేరువేరు మార్గముల నవలంబించెడి వారు. ఈమార్గాలలో స్వప్నదర్శన, సందేశాలు ఒక ముఖ్యమైన మార్గము.  శ్రీసాయిసచ్చరిత్రములో చెప్పబడిన మద్రాసు భజనమండలివారి యనుభవములనొకసారి విశ్లేషించుకొనెదము. వీరిలో యజమాని, వానిభార్య, కుమార్తె, యాతని వదిన యున్నారు. రామదాసు పంథాకుచెందిన వీరు కాశీయాత్రకు వెళ్లుచు శిరిడీలోని సాయిబాబాను దర్శించి, వారినుండి  దక్షిణ పొందుటకై వచ్చి ద్వారకామాయిలో మంచిభజన చేసారు. యజమానురాలుతప్ప మిగిలిన మువ్వురూ  పేరాశపరులు. వారికి ధనమేముఖ్యం. ఓరోజు ఆరతి సమయంలో భక్తివిశ్వాసములుగల యజమానిభార్యకు, తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రునిలా బాబా దర్శనమిచ్చారు. ఆమె  తన్మయురాలై మిగుల యానందము ననుభవించినది. కాని ఆమెది భ్రమయని, కేవలచాదస్తమని భర్త తృణీకరించాడు.

అలాంటి విశ్వాసరాహిత్య భర్తలో బాబా ఎలాంటి పరివర్తన తెచ్చారో ఇపుడు చూద్దాం. ఓరోజురాత్రి  యాతనికి విచిత్రమైన కల వచ్చినది. పోలీసులు వానిచేతులుకట్టి ఓ పంజరంలో  బంధించారు. బాబాయెదురుగాయుండ తనకీదురవస్థ యేలని బాబాను ప్రశ్నించాడు. బాబాపై తనకు విశ్వాసం కలదని,  తనగతజన్మల పాపమునేల హరింపడని ప్రశ్నించాడు. బాబాపై యంతటి విశ్వాసము కలిగియుండుటచే కనురెప్పపాటులో  బంధముక్తుడైనాడు.  కాని పోలీసువారు రక్తముకారుచూ క్రిందపడుటచే,  పై ఆఫీసర్లు వచ్చి యాతని బంధింతురని , సాయితప్ప వేరెవరూ తనను రక్షింపలేరని   తలచి  పాదనమస్కారం చేసాడు.  తానుజేసిన మొదటిరోజు నమస్కారం కేవలం దక్షిణలకోసమేనని, యిప్పటినమస్కారం బాబాను దేవునిగాతలచి చేసానని చెప్పాడు.  తమయిండ్లలో మహమ్మదీయ సంప్రదాయముల పాటిస్తూగూడ సాయిబాబాను,  హిందువులను పాడుచేయు  ముస్లింగా తలచుట పొరపాటని గ్రహించాడు.  తుదకు ఆశ్చర్యంగా బాబాకృపచే పరమపదించిన తమగురు రామదాసస్వామి దర్శనం పొందాడు. బాబా ఈవిధమైన స్వప్నసందేశముద్వారా భజనసమాజ యజమానిలో అనూహ్య మార్పును, ఉన్నతిని సమకూర్చారు.  చివరకుస్వప్నంలో బాబాను పరుగెత్తి పట్టుకొనుటలో విఫలుడైనాడు. ఈ స్వప్నానుభవం తర్వాత, ఆతనిలొ మనోవైఖరి పూర్తిగామారి , బాబాగొప్పతనమును గ్రహించెను.


బాబా,  తమలీలలను లోతుగా చదివితే ఎన్నో రత్నమాణిక్యాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుత కథలో మనకు దొరికే అమూల్య రత్నాలేమో చూద్దాం. మొదట యజమానికి బాబాపై విశ్వాసం లేదు, అదే కలలోని యాతని సంకెళ్లు. పిమ్మట తన చేతులకు కట్టిన తాళ్లను తొలగించుటకు సాయిని వేడుకొనుటయే యాతని గురునిపై విశ్వాసానికి తొలిమెట్టు. కాని పరిపూర్ణబంధ విముక్తి కలుగలేదు. ఎపుడైతే తన అసహాయతనెరిగి, సద్గురు సాయిని సర్వస్య శరణాగతి కోరి పాదాభివందనం చేసాడో, అపుడే బంధవిముక్తుడైనాడు. స్వప్నమైన మరుదినమున ఆరతివేళలో బాబా వానికి మిఠాయిలతోపాటు రెండు రూపాయల దక్షిణిచ్చారు. ఇది గురుకృపా ప్రాప్తికి సంకేతము.  అలాగే మనంకూడా సద్గురుని ఆశ్రయించి భవసాగర బంధముక్తులము కాగలము. యజమానికి సాయి ముస్లిం యను శంకకూడా తొలగినది. అంతేకాదు, సద్గురు కృపతో తన ఆరాధ్యగురు రామదాసస్వామిని చూడగలిగాడు. భక్తులు  తమఇష్టదైవాన్నికాని,  తమతమ వ్యక్తిగత   గురునికాని , సద్గురుసాయినాథుల కృపతో  సులువుగా పొందగలరు. సద్గురులీల మిగుల లోతైనది, మన మనసుకు, బుద్ధికి అందనంత శక్తివంతమైనది. అందుకే కలలో యజమాని వృద్ధుడని తలచిన బాబాను పరుగుపందెంలో  అందుకోలేకపోయాడు!

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!



Comments

  1. సద్గురుకృప భక్తులలో తెలియజాలని గొప్పపరివర్తన తెస్తుంది, క్రమంగా చీకటినుండి వెలుగులోకి ప్రయాణం సాగుతుంది!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)