సాయికథలు - శ్యామా మొక్కులు

శ్రీసాయినాథాయనమః! 

సాయికథలు -  శ్యామా మొక్కులు 

శ్యామా సాయి బాబాకు  అత్యంత ప్రియభక్తుడు. ఎల్లప్పుడూ బాబాను వెన్నటియుండేవాడు.  ఆ శ్యామా తనబాల్యంలో జబ్బుపడినప్పుడు యాతనితల్లి తమగృహదేవతయగు వణిలోని సప్తశృంగికి,  జబ్బుతగ్గినంతనే బిడ్డను తెచ్చి ఆదేవి పాదములపెట్టెదనని మ్రొక్కుకొన్నది. కొంతకాలముపిమ్మట శ్యామాతల్లి  కుచములపై తామరవ్యాధిచే మిగుల బాధపడినది.  తనకునయమైతే రెండు వెండికుచముల సమర్పించెదనని మరల మొక్కొన్నది. కాని ఆరెండు మొక్కులు తీరకమునుపే, ఆమొక్కులుతీర్చు బాధ్యత శ్యామాపైనిడి యామె మరణించినది. శ్యామా ఆవిషయం ముప్పయిసంవత్సరములు మరచాడు. ఆసమయంలో కష్టాలు చుట్టుముట్టడంతో, దానికి   మొక్కులు మరచుటయే కారణముగా ఓ జ్యోతిషునిద్వారా  గ్రహిస్తాడు. మరింత ఆలస్యం ప్రమాదకరమని తలచి రెండువెండికుచముల చేయించి బాబాయే తనసప్తశృంగియని తలచి , తనమొక్కులు స్వీకరింపవలెనని బాబాను వేడుకొంటాడు.

కాని శ్యామాయే స్వయంగా సప్తశృంగిని దర్శించి మొక్కులు దీర్చమని బాబా నిర్బంధిస్తారు. కావున శ్యామా బయలుదేరి వణిలోని దేవత పూజారి కాకాజీ వైద్య నింటికి వెళ్తాడు. చిత్రమేమంటే అదేసమయంలో వైద్య,  బాబాదర్శనానికి శిరిడీ యెలా వెళ్లాలనే ప్రయత్నంలో వుంటాడు. తనయింటికి   శిరిడీ నుండియే శ్యామావచ్చాడని గ్రహించి మిగుల అబ్బురపడతాడు. శ్యామా సప్తశృంగి  మొక్కులు తీర్చుకొన్నపిమ్మట వారిరువురు శిరిడీ వెళతారు.


ఇచట బాబా సర్వజ్ఞత, సమర్ధత, కారుణ్యత లాంటి కొన్ని  రుచికరవిషయముల మనము గ్రహింపగలము. శ్యామా తల్లి మొక్కులు   వణిలోని తమగృహదేవతకు చెల్లింపవలసినవి. బాబాకు చెల్లిస్తే తల్లిమాట తప్పిపోతోంది. కావున దేవి ఆగ్రహానికి యది  కారణమౌతుంది. మొక్కులలానే మిగిలిపోతాయి. కావున శ్యామా తన శ్రేయస్సుకొరకు  వణికి వెళ్లక తప్పదు.  ఈ విషయం అలావుంచిచే, శ్యామా ప్రయాణంలో మరొక ప్రయోజనముంది. పూజారి వైద్య,  మిగుల అశాంత మనస్కుడై దేవిని ప్రార్ధింపగా,  శిరిడీ సాయి  దర్శనానికి వెళ్ళవలసినదని యామె స్వప్నాదేశమిస్తుంది. షిరిడీకి ఎలా వెళ్లాలనే తహతహలాడు వైద్య  యింటికి అదేవేళలో  శ్యామావెళ్ళుట, ఆ సమయ సందర్భాలకు సమర్ధసాయినాథులు సమకూర్చిన చక్కని కూర్పుగాక మరేమిటి?  శ్యామా సప్తశృంగి దర్శనముచే రెండు ప్రయోజనాలు సమకూరాయి. ఒకటి శ్యామా మొక్కులనుండి ముక్తిపొందాడు, రెండవది వైద్య తన చంచలచిత్త ముక్తుడై , బాబా దర్శనముచే పరమానంద భరితుడైనాడు. ఇదే సమర్ధసాయి లీల, మరియు  చాతుర్యము!  ఇచట మనం గమనించవలసిన విషయమేమంటే, సాయిబాబా యితర దేవీదేవతాపూజల విస్మరణను సహించేవారు కాదు. గుడి తలుపులు మూసియున్న కారణమున ఖండోబా పూజ చేయక తనను సేవింపవచ్చిన మేఘాను, తలుపులు తెరచియున్నవని చెప్పి  వెనుకకు తిప్పిపంపి  ఖండోబా పూజానంతరమే, తమను పూజించుటకు యనుమతి నిచ్చారు. కావున  భక్తులు తమమొక్కులు, ఇష్టదేవతాపూజలు   మరువరాదను సత్యము గ్రహించి, జాగర్తపడవలెను! 

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!



Comments

  1. భక్తులు మ్రొక్కిన మొక్కులు మరువరాదు!

    ReplyDelete

Post a Comment