సాయి కథలు - రూపాయి దక్షిణ, పదిరూపాయల రక్షణ !

శ్రీసాయినాథాయనమః

సాయి కథలు -  రూపాయి దక్షిణ, పదిరూపాయల రక్షణ ! 

శ్రీసాయిసచ్చరిత్ర రచయిత హేమాద్ పంత్ యిలా అంటారు, " వేదపురాణాది సద్గ్రంధములు చదువునప్పుడు నాసద్గురు మూర్తియే యడుగడునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడిగా నా ముందు నిలచి , తన లీలలను తామే వినిపింప జేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకము కృష్ణునివలె గాన్పించును."  అలాగే  నేను ఏదేని బాబాలీల  చదువునప్పుడు ఆసన్నివేశానికి  సమాంతర కృష్ణలీల  మనస్సుకు వెంటనే స్ఫురిస్తుంది. సాయిబాబా మిగుల ఉదారులు, ఒక్కరూపాయికి పదిరూపాయలిత్తునని నమ్మబలికారు. ఇందుకు సంబంధించిన సందర్భము శ్రీసాయిసచ్చరిత్రము 35వ అధ్యాయములో లభిస్తుంది. బాబా తనప్రియ భక్తుడు కాకామహాజని నుండి 15 రూపాయలు దక్షిణపొంది అతనికిట్లు చెప్పిరి. 

" నేను  ఒకరూపాయి దక్షిణ యెవరివద్దనుంచిగాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరక యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియక నేనెవరిని అడుగను. ఫకీరెవరిని  చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము  పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అదిముందు గొప్ప పంట అనుభవించుటకొరకే. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. "   ఇచట భక్తులకెంతటి ప్రయోజనకర యుపాయమును బాబా చెప్పినారోకదా!  ప్రేమతో యిచ్చెడిది యెంతటి స్వల్పమైనను, దానికి ప్రతిగా పదిరెట్లిస్తామన్నారు. అలాగే భక్తుడు తనవైపు ఒక అడుగువేస్తే,  తాను భక్తునివైపు వంద అడుగులు వేస్తానని బాబా  చెప్పారు. 

పైవిషయము చదువునపుడు శ్రీకృష్ణుని తులాభారలీల మనసుకు తట్టినది. శ్రీకృష్ణుని ప్రియసతి సత్యభామ, శ్రీకృష్ణుడు కేవలము తనకుమాత్రమే చెందియుండుటకు వ్రతమాచరించి, ఆ వ్రతంలోని భాగంగా శ్రీకృష్ణుని నారదమహర్షికి దానమిచ్చినది. శ్రీకృష్ణుని బరువుకు సరిపడు  బంగారమును మహర్షికి దానమొసగి తిరిగి కృష్ణుని పొందవచ్చును గావున తులాభారం చేస్తుంది. త్రాసులో ఓప్రక్క శ్రీకృష్ణభగవానుడు కూర్చున్నాడు, వేరొక ప్రక్క యాతని  బరువుకు సరిపడ బంగారము నుంచుటకు సత్యభామ  తన ఆభరణముల నన్నిటిని యందుంచ ప్రారంభించినది. కాని యెంత బంగారమందుంచినను శ్రీకృష్ణుని బరువుకు సరికాకుండెను. సత్యభామ మిగుల వ్యాకులత చెందినది. తన అసహాయతకు మిగుల బాధపడినది, ఆమె అహంకారము సడలినది . ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుని పెద్దభార్య రుక్మిణీదేవి శ్రీకృష్ణుని పొందుటకై,  భక్తితో మనసులో ప్రార్ధించి త్రాసు రెండవ వైపున ఓచిన్న తులసి దళముంచుతుంది.  ఆశ్చర్యముగా తులసిదళం కృష్ణుని బరువుకు సరితూగుతుంది. అంటే రుక్మిణీదేవి  భక్తితో   తృణప్రాయమైన  తులసి దళం సమర్పించి అనంత పద్మనాభుని యనగా పరమాత్మ శ్రీకృష్ణుని తన సొంతం చేసుకొంది. అనగా రుక్మిణీదేవి భక్తితో సమర్పించిన తులసిదళానికి అనంతవిశ్వపతి శ్రీకృష్ణుడు తనకు తానే సంపర్పించుకొన్నాడన్నమాట. భక్తికి దాసుడు పరమాత్మ, యుక్తికికాదు. ఇలాంటి మరొక్క ఘటన. శ్రీకృష్ణుని బాల్యస్నేహితుడు సుధాముడు ప్రేమతో గుప్పెడు అటుకులు సమర్పించి ,శ్రీకృష్ణునినుండి  ఓ బంగారుభవనాన్ని కానుకగా పొందాడు.  అలాగే  మనం చేయు చిన్న చిన్న పనులుకాని, చిన్న చిన్న దానధర్మాలుకాని సద్గురుసాయి పట్ల మిగుల భక్తితో  యాచరించి, యనంత ఫలితముల పొందెదముగాక !  అపుడే మనమిచ్చు ఒక రూపాయి దక్షిణకు , బాబానుండి పది రూపాయల రక్షణ లభిస్తుంది! ఇందులో యిసుమంత సందేహము లేదు.

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

Comments

  1. "చిన్న చిన్న పనులను మిగుల భక్తిశ్రద్ధలతో దైవపరంగా ఆచరించి సద్గురుసాయి అనుగ్రహ, రక్షణలను పొందెదము గాక ! "

    ReplyDelete
  2. ఎంతటి లాభసాటి బేరము , ఒక్కరూపాయికి పదిరెట్లిస్తామన్నారు బాబా!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)