సాయి కథలు - సిత్రాలు, సాయి చిత్రపటాలు!
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - సిత్రాలు,సాయి చిత్రపటాలు!
శ్రీసాయిబాబా సర్వవ్యాపి. సమస్తచరాచర జగత్తంతా వ్యాపించియున్నారు. సాయి సర్వదేవ, సర్వ దేవీ, సర్వ యోగి స్వరూపుడేగాక, జంతువులలోను, ఎగిరిపక్షులలోను, కదలని శిల్పంలోను, కదిలే చిత్రపటంలోనూ సర్వత్రా నిండియున్నారు. వారందరిలోని చలనానికి, చైతన్యానికి సాయి స్పందిస్తారన్నది చెప్పుటకు వారిచరిత్రయే పెద్దసాక్ష్యం! ప్రస్తుతవ్యాసంలో సాయి చిత్రపట రూపంలొ భక్తులకెలాంటి యనుభవములనిచ్చారను యంశమును పరిశీలంచెదము.నవయుగ తుకారముగ పిలువబడే గొప్పభక్తుడు, సంగీతకారుడుయగు బాలబువ సుతార్ ఒకసారి శిరీడీవచ్చి బాబాకు నమస్కరించగా, వానిని గత నాలుగు సంవత్సరములుగా యెరుగుదునని సాయి చెప్పారు. మొదటిసారిగా శిరీడీ వచ్చిన సుతార్ కు యీమాటలు అర్ధంకాలేదు. కాని తీవ్రంగా ఆలోచించినపిమ్మట బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫొటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను.
అంటే బాబా తమ ఫోటోకి, తమకు ఎలాంటి తేడా లేదని, భక్తితో తమఫోటోకు నమస్కరించినా యది తమకామోదయోగ్యమని చెప్పకనే చెప్పారు.
ఇక మరోవిచిత్రం చూద్దాం. 1917వ సంవత్సరం హోళీ పండుగనాడు, బొంబాయి నగరంలో హేమాద్రిపంతుకు స్వప్నంలో, సన్యాసి వేషంలో బాబాకన్పించి ఆ రోజు వారింటికి భోజనానికి వచ్చెదమని చెప్పారు. నిజముగా బాబా వస్తారనే ఆశతో , బాబాకు కూడా వంటచేయించాడు పంతు. భోజనసమయమైనది. అతిధులందరు భోజనానికి సిద్ధమైనారు. బాబాకొరకై వారిమధ్య నొక పీటనమర్చారు. 12 గంటలైనను ఎవరు రాకపోవుటచే, తలుపులు వేశారు. అన్నశుద్ధియనంతము అందరూ భోంచేయుటకుపక్రమింపబోగా , మేడమెట్లపై చప్పుడు వినిపించింది. హేమాద్రిపంతు వెంటనేపోయి తలుపుతీయగ, ఇద్దరు ముస్లింలు పాతపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పై పెట్టి, యది తమవస్తువుగా స్వీకరింపుమని, భోజనసమయమగుటచే ఆ ఫోటో వివరములు తరువాత వివరించెదమనుచు, చకచకా వెళ్లిపోయారు. హేమాద్రిపంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముంది. అతడు మిగుల ఆశ్చర్యపడుచూ, బాబా పటమునకు నమస్కరించి బాబాకొరకు వేసిన పీటపై బెట్టి వండిన వంటకములెల్ల వడ్డించి, నైవేద్యము పెట్టిన పిమ్మట అందరు సకాలమున భోజనము పూర్తిజేసిరి. చెప్పినమాట కలలోయైనను తమమాటకు కట్టుబడి, సరియగు సమయానికి చక్కని ఫోటో రూపంలోవచ్చి బాబా అందరిని ఆశ్చర్య పరచారు. ఇలా ఫోటోతోకూడ తమ ఏకాత్మ భావాన్ని నిరూపించారు. ఇక మరొక్క సాయి యద్భుత చిత్రపటలీల. సాయి భక్తుడు, నాగపూర్ వాసి కాకాసాహెబు దీక్షితు తమ కుమారుని ఉపనయనమునకు, వేరొక అంకిత భక్తుడు గ్వాలియర్ కు చెందిన నానాసాహెబ్ చాందోర్కర్ తమ పెద్దకుమారుని వివాహమునకు తమతమ గృహములకు రమ్మని బాబాను ప్రేమతో ఆహ్వానింప శ్యామాను తమప్రతినిధిగా తీసుకొని వెళ్ళవలయునని చెప్పారు. కాని తామే స్వయంగా రావలసినదని బలవంతపెట్టగా, బాబా వారికి శ్యామాను దీసుకొని పోవలసినదనియు కాశీ , ప్రయాగ యాత్రలు ముగియుసరికి వారు శ్యామాకంటె ముందుగనే గయలో కలిసెదమని చెప్పారు.బాబాయనుమతితో శ్యామా , అప్పాకోతే యనువాని వెంటనిడుకొని నాగపూర్, గ్వాలియర్ లలోని శుభకార్యములకు హాజరై ఆపై కాశీ, అయోధ్య యాత్రలజేసి గయను జేరారు. రైలుబండిలో గయలో ప్లేగుగలదనివిని చికాకుపడి, రాత్రి గయ స్టేషన్ లో దిగి ధర్మశాలలో బసజేశారు. మరునాటి ఉదయం గయ పాండా వారినిజేరి యచట ప్లేగు లేదనియు, భయము వలదూ యనుచు , తమగృహమున కాహ్వానిస్తాడు. అలా వారు పాండా ఇంటిలో దిగారు. ఇల్లు పెద్దది, చాల సౌకర్యముగానుంది, అన్నిటికంటె ముఖ్యముగా ఇంటిముందుభాగంలో యమర్చబడిన బాబాయొక్క అందమైన పెద్దపటము జూసి శ్యామా మిగుల ఆశ్చర్య సంతోషములకు లోనయ్యాడు. " కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామకంటె ముందుగనే గయకు బోయెదను" యను బాబా మాటలు గుర్తుకు దెచ్చుకొన్న శ్యామాకు, కనుల నీరునిండాయి. 12 సంవత్సరముల పూర్వము తానే బాబాయనుమతితో ఆ పటాన్ని శిరిడీ సందర్శించిన పాండా కొసగినటుల శ్యామా వానిద్వారా, తెలిసికొంటాడు. ఆ శ్యామాయే తనయింట అతిధిగా నుండుట తెలిసికొన్న పాండా మిగుల ఆనందంతో రాజలాంఛనములతో వారిని ఆహ్వానించి , గజారోహణం జేస్తాడు. మరి ఇలా సాయిబాబా చిత్రపట, విచిత్ర లీలల జూచితిమిగదా.
భౌతికంగా బాబా రూపం కనుమరుగైనప్పటికి , ద్వారకామాయిలో శ్రీసాయి తమ చిత్రపటరూపంలో నిత్యం వేలాది భక్తులకు తమ ఆశీస్సులందిస్తున్నారు, రక్షిస్తున్నారు. శ్యాంరావ్ జయకర్ యనునతడు యీ సజీవరూపు సాయిచిత్రాన్ని లిఖించాడు. ఈసత్యమెరిగిన మనము సాయిచిత్రపటాన్ని సాయిలా భావించి, భక్తిశ్రద్ధలతో సేవించెదముగాక! మన భావమే మన యనుభవానికి మూలమని పెద్దలు జెప్పారు గదా!
విశ్వాసముంటే బాబా చిత్రపటమే సమాధానమిస్తుంది!
ReplyDelete