సాయికథలు - రెండు వంకాయలు

శ్రీసాయినాథాయనమః 

సాయికథలు - రెండు వంకాయలు 

సాయిబాబా భక్తులపై ప్రేమ అపారమైనది. భక్తుల హృదయాలలోని ఆలోచనలు, అవసరాలు అన్నియు బాబా కెఱుకయే! భక్తులు తమకు ఏమితెచ్చారు, ఎంత తెచ్చారు అనే భావం గాక  యెలాంటి భక్తిశ్రద్ధలతో తెచ్చారనేదే బాబాకు ప్రధానం. ప్రస్తుత విషయానికొస్తే, బాంద్రానివాసి రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ బాబాభక్తుడు. ఆయనభార్య శ్రీమతి సీతాదేవి తార్ఖడ్, బాబాను మిగుల ప్రేమించెడిది. శిరిడివచ్చినపుడుగాని, బాంద్రలోనున్నపుడుగాని బాబాకేదైనా ఆహారపదార్ధాలు సమర్పించడం ఆమెకెంతో యిష్టం. ఓ పర్యాయం బాంద్రానివాసియే యగు మరొక బాబా ప్రియ భక్తుడు రఘువీర భాస్కర పురంధరే భార్యతో షిరిడీ వెళ్ళుచున్నాడు. అపుడు శ్రీమతి తార్ఖడ్,  పురంధరే భార్యకు రెండు పెద్దవంకాయలనిచ్చి, ఓ వంకాయతో పెరుగు పచ్చడి  మరొక వంకాయతో వేపుడు చేసి బాబాకు సమర్పించవలసినదిగా కోరినది. శిరిడీ జేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడిమాత్రమేజేసి బాబా భోజనసమయానికి  తీసుకెళ్లింది. బాబాకి  ఆ పచ్చడి చాలానచ్చినందున అందరికి పంచారు. వెంటనే, తనకు వంకాయ వేపుడుకూడ అప్పుడే కావలెనని  బాబాకోరారు. ఆకాలంలో శిరిడీలో వంకాయలు దొరకనందున ఆ  పచ్చడి యెవరు తెచ్చారని విచారించి, తుదకు పురంధరుని భార్యకు వేపుడు చేయు  బాధ్యత నప్పగించారు.  వంకాయ వేపుడును బాబా యెందులకు కోరారో  తెలిసి, బాబా సర్వజ్ఞతకు, భక్తుల పట్ల వారిప్రేమానురాగాలకు అందరూ మిక్కిలి ఆశ్చర్య పడ్డారు. ఇచట చెప్పబడిన విషయం చిన్నదైనప్పటికీ; దగ్గరైనా దూరమైనా భక్తుల భావాలకు సాయిబాబా యెలా స్పందిస్తారనేవిషయం  గమనించదగినది. కావున బాబాపట్ల నిరంతర ప్రేమభావం నిలుపుకొనుట మనకెంతో శ్రేయస్కరం. 'నావంక భక్తికనులతో  చూడు, నీవంక ప్రేమ కనులతో  చూస్తానన్న' సాయి  మాట అక్షర సత్యం! 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Comments

  1. " నన్ను భక్తికనులతో చూడు, నేను ప్రేమకనులతో దీవిస్తాను! " సాయిబాబా

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)