సుందర శిల్పం - సాయి సంకల్పం!

శ్రీసాయినాథాయనమః 
సుందర శిల్పం - సాయి సంకల్పం!
శిరిడీలోని సమాధిమందిరంలో, బాబాసమాధి వెనుకప్రక్కగా ప్రతిష్ఠింపబడిన సాయి సుందర విగ్రహమునుజూసి తన్మయులుగాని వారుండరు. సజీవరూపంగా  పరిపూర్ణచైతన్య వంతమైన బాబాను చూచునట్టి యనుభూతి భక్తులకు కలుగుతుంది. అందరి అంతరాత్మల యలరు చైతన్యతరంగమే శ్రీ సాయిబాబా. భక్తుల అంతరంగముల చైతన్యపరచి ప్రేరణగూర్చి ,  తమ సంకల్పముల నెరవేర్చుకొనెడి కుశలకర్ములు శ్రీసాయినాథులు. బాబాసుందర మూర్తి నిర్మాణంలో వారి  సంకల్పప్రభావమెలా పనిచేసిందో ఇచట పరిశీలించెదము.

ఓరోజు బొంబాయి నౌకాశ్రమములోనికి ఇటలీ దేశం నుండి పెద్దచలువఱాయి శిల వచ్చినది. ఆలాపడియున్న శిలను ఎవరూ గ్రహింపకుండుట జూసి , నౌకాశ్రమ యజమాన్యం వేలం వేస్తే, ఓవ్యక్తికొని షిర్డీ సంస్థానమువారికి సమర్పిస్తాడు. సంస్థానమువారు ఆశిలను బహువిలువైనదిగా నెఱింగి, ఆ శిలనుపయోగించి  బాబా మూర్తిని చేయించాలని తలచారు. ఇందులకై వారు బొంబాయికి చెందిన సుప్రసిద్ధ శిల్పి బాలాజీ వసంత తాలిం ను సంప్రదించి వానికీపవిత్రకార్యము నప్పగించారు.  శిల్పి సాధారణముగా  ఓ నమూనా శిల్పాన్నిచెక్కి, దాని ఆధారంగా అసలు శిల్పాన్ని తయారుజేస్తారు. శిల్పి తాలిం వద్ద  బాబారూపానికి సంబంధించిన ఎలాంటి చిత్రపటముగాని, శిల్పముగాని లేకుండుటచే నమూనా శిల్పం చెక్కడం  పెద్ద సమస్యగా మారింది. బహుసుందర బాబామూర్తిని చెక్కుటకు   సహాయం కోరుచూ  సాయిని   తీవ్రంగా ప్రార్ధించాడు తాలిం.

మరురోజు తెల్లవారు ఝామున తాలిం, తన శిల్ప శాలను తెరచి నప్పుడు ఆ గదియంతయు దేదీప్యమానంగా వెలుగుచూ అందు సాయి సాక్షాత్కరించారు. శిల్పితో, తమరూపమును  అన్నివిధములా పరిశీలించి  తదనుగుణముగా విగ్రహాన్ని చెక్కమని సూచించి, యాతని ఆశీర్వదించి బాబా యదృశ్యులైనారు. 

బాబా నిజరూపం, శిల్పి హృదయంలో ముద్రించుకు పోవుటచే యాతడు బాబా సుందరమూర్తిని బహుచక్కగా కూర్చాడు. కాని విగ్రహం పూర్తయినపిమ్మట బాబకుడిపాదపు చిటికినవ్రేలి క్రింది శిలాభాగమున దోషాన్నిగ్రహిస్తాడు తాలిం. మరల బాబాను ప్రార్ధించి ఉలితో ఆ దోషమున్న భాగాన్ని కొట్టగా, సరిగా అదేభాగం మూర్తికెలాంటి భంగం కలుగనిరీతి విడివడి, సుందర సాయి ఆకృతి శిల్పం కనువిందు జేసింది. సాయిని జీవించియుండగా జూచి,  వారితో సాన్నిహిత్యముగా మెలిగిన  ప్రియభక్తులు శ్రీమతి లక్ష్మీబాయి షిండే, శ్రీసాయి శరణానందులు  సాయి మనమోహన  విగ్రహమును జూచి, అది సాక్షాత్తు సాయినాథుని పోలియున్నదని  యబ్బురపడ్డారు. అక్టోబర్ 7, 1954 విజయదశమిరోజున శ్రీసాయి శరణానందుల చేతులమీదుగా సాయిబాబా సుందర  పవిత్ర విగ్రహము స్థాపించబడినది. జీవించియున్నపుడు బాబాకు జరిగిన సేవలన్నియు ప్రస్తుతము వారివిగ్రహమునకు, వారి సమాధికి జరుగుచున్నవి. ప్రపంచ నలుమూలలనుండి శ్రద్ధాళు భక్తులు నిత్యం  సాయి విగ్రహ, సమాధులకు ప్రణమిల్లి తరించుచున్నారు! 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!



Comments

  1. శ్రీసాయిని సజీవులుగా చూడలేదేయను వ్యాకులత యేల? శిరిడీ సమాధిమందిరమున నిలువెత్తువారి సుందరవిగ్రహమును దర్శించి వారిని ప్రత్యక్షముగా చుసిన అనుభూతిని పొందగలము!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)