సాయి కథలు - చక్కెరలేని చోల్కర్ చాయ్ !

శ్రీసాయినాథాయనమః

చక్కెరలేని చోల్కర్ చాయ్ ! 

శ్రీసాయి బాబా సర్వాంతర్యామి, సర్వసమర్థులు, తనవారల ఎంతదూరమైనా తాడువేసి లాగుతారు. వేరు వేరు భక్తులు వేరు వేరు మిషలతో సాయిని దర్శించి ధన్యులైనారు. దాసగణు మహరాజు సాయిని తన హృదయం నిండా నింపుకొన్న ఉన్నతభక్తుడు, పరవశంతో సాయిని స్తుతించిన మధుర గాయకుడు, హరిదాసుడు. తన సాయిగానామృతమును పదుగురికి పంచి ఎందరో వ్యక్తులను సాయిభక్తులుగా మార్చిన ధన్యుడు. ఓరోజు ఠాణాలోయున్న కౌపీశ్వరాలయంలోతన హరికథాకార్యక్రమంలో భాగంగా సాయి మహిమను శ్రావ్యంగా పాడుచున్నాడు. కథవినుటకు వచ్చిన శ్రోతలలో చోల్కర్ యనునాతడున్నాడు. సాయిమహిమను విని పులకించిపోయాడు. ఆర్ధిక సమస్యలతో సతమతమగుతున్న యాతడు వెంటనే మనసులో బాబానుధ్యానించి ఇలా మొక్కుకొన్నాడు. "  సాయిబాబా! నేను మిగుల పేదవాడను. తాత్కాలిక  చిన్న ఉద్యోగంతో  నా పెద్ద కుటుంబమును మోయలేకున్నాను. మీ దయచే ప్రభుత్వ పరీక్షలో నుత్తీర్ణుడనై, స్థిరమైన నౌకరీ లభించినచో, నేను శిరిడీ వచ్చి మీకు సాష్టాంగ ప్రణాములాచరించి, మీపేర కలకండ పంచెదను."  చోల్కర్ మనసులోని వేదన  సాయికి వినబడినట్లున్నది, సాయి దీవెనచే  యాతడు పరీక్షలో కృతార్థుడై స్థిరమైన ఉద్యోగం పొందాడు. తనమొక్కును త్వరలో తీర్చవలెననుకొన్నాడు.

కాని పేదవాడగుటచే వానివద్ద శిరిడీయాత్ర ఖర్చులకు సరిపడు  ధనములేకుండెను. కావున తన ఇంటిఖర్చుల కొంత తగ్గించి ఆ పొదుపైన పైసలతో సాయిని దర్శింపదలచి, తాను  రోజూ తాగు తేనీరులొ పంచదార వేయడం మానివేసాడు. 

ఈ పొదుపుతో మిగిల్చిన ధనంతో శిరిడీ దర్శించి, సాయికి సాష్టాంగనమస్కారం జేసి, ప్రేమతొ ఓ నారికేళం సమర్పించుకున్నాడు, అచటివారలకు సాయిపేరున కలకండ పంచాడు. తనమనసులోని కోరికలన్నియు నెరవేరుటచే యెంతో తృప్తిపొందానని బాబాతో చెప్పాడు. చోల్కరు మొక్కు తీరినా, కథ అంతటితో ముగియలేదు.ఇచటనే సాయినాథుల సమర్ధత చూస్తాం.  చోల్కర్ బాపూసాహెబు జోగు అతిధిగా దిగాడు, వారిరువురు బాబావద్ద సెలవుదీసుకొని బయలుదేరబోవ, బాబా జోగును బిలచి, తన అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెరవేసిమ్మన్నాడు. ఈ బాబామాటలకు చోల్కర్ మిగుల చకితుడైనాడు, వానికనుల నీరు నిండాయి. తిరిగి బాబా పాదములై పడ్డాడు.  అసలు విషయం తెలియని జోగు ఓ సాక్షిగా ఇదంతా చూస్తున్నాడు. ఈ పై  మాటలచే బాబా , తనకు చోల్కర్ మనసులోని ఆలోచనలన్నియు తెలియునని, తేనీటిలో చక్కెరమానిన విషయంగూడ గ్రహించితిననియు, మొక్కిన కలకండ ముట్టినదనియు  యాతనికి తెలియ జెప్పారు. సాయిపట్ల చోల్కర్ భక్తిశ్రద్ధలు మిగుల  యినుమడించాయి. సర్వజ్ఞ, సమర్ధ శ్రీసాయిమహరాజులకు శతకోటి ప్రణామములు! 

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి! 

Comments

  1. సాయిసేవతో జీవితం మధురం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)