సాయికథలు - చిత్తం శివునిపైన, భక్తి చెప్పులపైన!!

శ్రీసాయినాథాయనమః 

సాయికథలు - చిత్తం శివునిపైన, భక్తి చెప్పులపైన!

సాయిబాబాను చూచుటకు తండోపతండములుగా ప్రజలు తరలి వచ్చేవారు. కొందరు పరిపూర్ణ భక్తివిశ్వాసాలతో , కొందరు తమ సమస్యల పరిష్కారానికై, కొందరు బాబాను పరీక్షించుటకు యిలా వేరు వేరు భావాలతో సాయిని దర్శించేవారు. సాయి సర్వజ్ఞులు, సర్వసమర్దులు గావున వచ్చెడివారి   అంతరంగములకనుగుణంగా  వారికి యనుభవముల నిచ్చెడివారు. సాయిబాబాను దర్శించిన బొంబాయి పెద్దమనిషి హరి కానోబా పైన చెప్పబడిన మూడవ వర్గానికి చెందినవాడు. బాబా ఘనతను ఇతరులనుండి విన్ననూ, యాతనికి నమ్మకము కుదురలేదు, సంశయాత్ముడు. కావున స్వయంగా బాబాను పరీక్షించుటకై ద్వారకామాయికి, చక్కని జలతారు తలపాగా ధరించి, అప్పుడేకొన్న కొత్తచెప్పులు వేసుకొని వచ్చాడు. చెప్పులు కొత్తవిగావున యతని శ్రద్ధ వాటిపైనే నిలబడింది. వాటిని జాగ్రత్తగా ఓమూలన బెట్టి సాయిని దర్శింప వెళ్ళాడు. బాబాకు భక్తితో నమస్కరించి ఊది ప్రసాదములు పొంది వెనుదిరిగాడు. అంతలోనే వింతగా యాతడచట యుంచిన కొత్తచెప్పులు మాయమయ్యాయి. ఎంతవెదికినా కనబడక పోవుటచే శిరిడీ వచ్చిన ఆనందం కూడా మరచి  మిగుల చికాకుతో బసకు వచ్చాడు. తన బసలో స్నాన, పూజాదులు ముగించి భోజనానికి సిద్ధమయ్యాడు కాని మనసంతా ఒకటే చికాకు, కళ్ళముందు ఆ కాళ్ళ చెప్పులే కదులుతున్నాయి. ఎలాగో భోజనం ముగించి చేతులు కడుగుకొనుటకై బయటకు వచ్చాడు. ఇక్కడే ఓ గమ్మత్తు జరిగింది. ఒక మరాఠీ కుర్రవాడు చేతనున్న కఱ్ఱ చివర ( కనబడకుండా పోయిన ) కొత్తచెప్పుల జత తగిలించి " హరికా బేటా, జరీకా ఫేడా " యని యరుస్తూ కానోబా వైపుకు వచ్చాడు. తన తండ్రిపేరు హరి,  జరీ తలపాగ యున్నవానికి ఆ చెప్పులివ్వమని బాబా చెప్పిపంపారని   ఆ కుఱ్ఱాడు కానోబాతో చెప్పాడు. కానోబా ఈ యనుకోని సంఘటనకు మిగుల ఆశ్చర్య పడ్డాడు. తన  జరీ తలపాగ చూపించి, తనతండ్రిపేరు హరిగా వివరించి పోయిన తన కొత్తచెప్పుల తిరిగి పొందాడు. చూచువారలకు తలపాగా కనబడుతుందిగాని, తన తండ్రిపేరు  బాబాకెలా యెరుకయో యూహించలేక పోయాడు. బాబాను పరీక్షింపదలచి వచ్చిన యాతడు ఆ పనిముగియుటచే తృప్తిగా వెనుదిరిగాడు, సాయిని గొప్ప సత్పురుషునిగా గ్రహించాడు.  సాయిని భక్తిశ్రద్ధలతో దర్శించాలి  గాని, సందేహ మనసులతో గాదు!  


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

Comments

  1. సాయిబాబా పట్ల మనభావమేటులో, అనుభవంకూడ యటులనే !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)