సాయి కథలు - కలలతో కర్మనివృత్తి !

శ్రీసాయినాథాయనమః!

సాయి కథలు - కలలతో కర్మనివృత్తి 


శ్రీసాయిబాబా బోధలు మెలకువలోనేగాక, స్వప్నావస్థలోగూడ కొనసాగడం భక్తుల అనుభవ విషయం. కలలద్వారా తన భక్తులకు  బోధయేగాక, బాధానివారణ జేసిన సంఘటనలను  శ్రీసాయిసచ్చరిత్రము, పదమూడవ అధ్యాయంలో   చూస్తాం. సాధారణంగా జీవితంలో వచ్చే కష్టసుఖాలు పూర్వజన్మ కర్మఫలాలపై ఆధారపడియుంటాయనుట పెద్దలమాట. చెడుకర్మ ఎంత బలీయంగాయుంటే బాధలుగూడ అంతబలీయంగా వుంటాయి. భక్తులు భరింపలేని కష్టాలను సాయి స్వయంగా తమపై వేసుకొని యనుభవించెడివారు. అందుకే ఏకాదశసూత్రాలలో, భక్తుల బరువుల తానుమోయుదునని  సాయి చెప్పియున్నారు. అనగా బరువులో చాలవరకు తాముస్వీకరించి, నామమాత్రంగా భక్తులు యనుభవించునటుల జేసెడి సమర్థులు, కరుణామూర్తులు శ్రీసాయినాథులు. తమ స్వప్నాలలో స్వల్పపాటి బాధయనుభవించి తమపూర్వజన్మ పాపములనుండి ముక్తులైన భక్తుల యనుభవాలు మనల నాశ్చర్య పరుస్తాయి. అలాంటి ఓఅనుభవాన్నిచట స్మరించుకొందాము.

పూనాజిల్లా  నారాయణగావ్ కు  చెందిన భీమాజీపాటిలు భయంకరమైన క్షయవ్యాధి పీడితుడై, బాబాభక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాపై  షిరిడీవెళ్లి సాయిని శరణుకోరాడు. ఆజబ్బు యాతని గతజన్మ పాపఫలితం  కావున తానేమి జోక్యంజేసుకోనని బాబా చెప్పారు. కాని సాయితప్ప తనకెవరూ దిక్కులేరని పాటీలు మొరబెట్టుకొనుటచే బాబామనసుకరిగి యాతని బాధాముక్తుని జేయుదునని ఆశీర్వదించారు. బాబామాటే మంత్రంగా పాటీలు బాధ క్రమంగా తగ్గనారంభించినది. వాని రోగానికి అంతగా యనుకూలించని భీమాబాయి యింటిలో బసజేయమని   బాబాజెప్పారు. అతడు షిరిడీలో నున్నపుడు రెండుకలల యనుభవమునిచ్చి బాబా వాని రోగముక్తుని జేశారు. మొదటి కలలో విద్యార్థిగా తాను పద్యములు  సరిగా వల్లెవేయని కారణంగా ఉపాధ్యాయునిచే దెబ్బలు తింటాడు. రెండవకలలో తనఛాతీపై పెద్దబండ  అటునిటు నడుపుటచే మిగుల బాధననుభవించాడు. స్వప్నంలో అనుభవించిన ఈ బాధలచే రోగముక్తుడై పాటీలు స్వగృహానికివెళ్లాడు. రోగికి బాధతెలియకుండా వైద్యుడు మత్తుమందిచ్చి ఆపరేషన్ తో రోగముక్తునిజేసినంత సులువుగా సాయి వాని బాధానివారణ జేశారు. తనగ్రామం జేరిన పాటీలు   జీవితాంతం బాబాపట్ల  కృతజ్ఞతతో  మెలిగి, మహరాష్ట్రలో నెలవారీగా జరుగు  సత్యనారాయణ వ్రతపద్ధతిలో సాయిసత్యవ్రతము జేయనారంభించాడు. 
విశ్వాసంతో సేవించెడి భక్తుల బాధలను  సాయి తప్పకమోస్తారు. సద్గురుసాయినాథుల పట్ల భక్తివిశ్వాసములు కలిగియుండుట జన్మజన్మల పుణ్యఫలమనుటలో యెలాంటి సందేహం లేదు. సమర్ధసాయినాథులకు శతకోటి వందనములు.

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


Comments

  1. సాయిరక్షణ బాబా స్వప్నాలనుండికూడా లభించగలదు!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)