సాయి కథలు - ముందు ముచ్చట్లు, వెనుక చప్పట్లు !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - ముందు ముచ్చట్లు, వెనుక చప్పట్లు
లోకవ్యవహారం చాలచిత్రంగా యుంటుంది. కొందరు వ్యక్తులు తమపరిచయస్తులు ఎదురైనప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో మాట్లాడతారు, కాని వారు ప్రక్కకు వెళ్ళగానే వారిగురించి చాల చులకనగా మాట్లాడతారు, అందుకే ' ముందుముచ్చట్లు, వెనుక చప్పట్ల ' ను సామెతవచ్చింది. సాధారణవ్యక్తులపట్ల యేమోగాని, సద్గురువులపట్ల అలావ్యవహరించడం సదావర్జనీయము! శ్రీసాయిసచ్చరిత్ర, 21వ అధ్యాయంలో ఇందులకు సంబంధించిన ఓ చక్కని ఘటన వుంది. ఓరోజు పండరి నుండి యొక ప్లీడరు ద్వారకామాయికి వచ్చి వినయంగా సాయిపాదములకు ప్రణామములాచరించి , దక్షిణ సమర్పించి అచట జరుగు వ్యవహారముల గమనిస్తూ ఓమూల కూర్చున్నాడు. మనలాంటి సాధారణవ్యక్తులకు ఈవిషయం మామూలుగ యుంటుంది. కాని సర్వజ్ఞులు కావున వారికీ అందరి అంతరంగాలు తెరచిన పుస్తకాలే! బాబా ఆ లాయరు వంక చూస్తూ యిలా అన్నారు," ప్రజలెంత మోసకారులు? వారు పాదములపై పడుదురు, దక్షిణలర్పింతురు , కానీ చాటున హేళన చేయుదురు. ఇది ఎంత విచిత్రము? "
ఈ బాబామాటలు ప్లీడరుకు సూటిగా తగిలాయి. అచటనున్న వారలకీవిషయమేమీ బోధపడలేదు కాని ప్లీడరు తనపరంగా గ్రహించాడు. వాడాకు వెళ్ళినతర్వాత కాకాసాహెబు దీక్షితుతో ఇట్లన్నాడు. " బాబా చెప్పిన మాటలెల్లా నిజాలే! వారీ బాణం నాపైనే ప్రయోగించారు. నేనెవరిని నిందించరాదు, తృణీకరించి మాట్లాడరాదని నాకు చక్కని బోధజేశారు. పండరీపురమునుండి సబ్ జడ్జ్ నూల్కరు యనునాతడు, తన ఆరోగ్యాభివృద్ధికై షిరిడీ వచ్చి సాయిని ఆశ్రయించాడు. ఈవిషయమై పండరీపుర ప్లీడర్ల గదిలో వివాదం జరిగింది. ఔషధము వాడి రోగనివారణ పొందుటకు బదులుగుగా నూల్కరు శిరిడీ వెళ్లినంత మాత్రాన ఆరోగ్యం కుదుటబడుతుందా? సాయిబాబాను సైతము నిందించిరి. నేనుకూడ ఆసంభాషణముల పాల్గొని సాయిని విమర్శించితిని. నా ప్రవర్తన సరికాదని సాయిచట వివరించిరి.ఇది నాకు దూషణముకాదు. దీనిని సాయి ఆశీర్వాదముగా, మంచి సందేశముగా గ్రహించెదను. నేనెవరిని దూషించను, నిందించను, ఇతరుల విషయముల జోక్యం జేసికొనను. "సాయి సర్వవ్యాపకులు, సర్వజ్ఞులు గావున దూర దూర విషయములు వారికెరుకే. లేకుంటే మూడువందల మైళ్ళ దూరాన పండరీపురంలో జరిగిన వివాదం వీరికెలా తెలుస్తుంది? కావున అందరి అంతరంగాలలో సంచరించే పాండురంగడే సాయిగా గ్రహించి మన నిత్యవ్యవహారాలలో ఇతరులపట్ల బహుజాగ్రత్తగా మెలగవలెను.
సద్గురుని పవిత్రహృదయంతో దర్శించాలి. మనసులోని మాటనే చెప్పాలి, నోటితో చెప్పిన మాటనే ఆచరించాలి. దీనినే త్రికరణశుద్ధి యంటారు.
ReplyDelete