సాయి కథలు - అక్కచెల్లెండ్ర అనురాగము !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - అక్కచెల్లెండ్ర అనురాగము
ఇచట చదువుట ప్రారంభించగనే సాయి కథలలో అక్కచెల్లెండ్ర ప్రస్తావన మెక్కడనుండి వచ్చినదని పాఠకులకో అనుమానం కలుగవచ్చును. ఇందులకు శ్రీసాయిసచ్చరిత్రము లోని 15వ అధ్యాయమును పరిశీలించెదము. ఈ అధ్యాయం లోని విషయంలోకి వెళ్ళితే మన అనుమానం తీరుతుంది. ఓరోజు సాయిబాబా ద్వారకామాయిలొ కూర్చున్నారు. సాయికెదురుగా ఓ భక్తుడుకూడ కూర్చున్నాడు. ఇంతలో గోడపైని బల్లి టికు టికు మని కూసింది. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలుకులకర్ధమేమని బాబానడిగాడు. అది శుభమా అశుభమాయని ప్రశ్నించాడు. తన చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూడ వచ్చుటయే ఆబల్లి ఆనందానికి కారణమని బాబా చెప్పారు. భక్తునికిదంతయు అయోమయముగా దోచి, అలాగేచూస్తుండిపోయాడు. కాసేపటికి బాబాదర్శనానికై ఓ వ్యక్తి ఔరంగాబాదునుండి గుఱ్ఱంపై వచ్చాడు. అలసిన గుఱ్ఱానికి ఉలవలు తెచ్చుటకై తన సంచిలోని ధూళిని విదిలించాడు. అందులోనుండి ఓబల్లి అందరూ చూస్తుండగా గోడపై కెక్కినది. ప్రశ్నించిన భక్తుడదంతయు కనులప్పగించి చూస్తున్నాడు. వెంటనే ఆబల్లి గోడపైనున్న తనసోదరివద్దకు సంతోషంతో జరజరా పాకుతూ వెళ్ళింది. ఎంతో కాలం తరువాత కలసిన ఆ అక్కచెల్లెండ్రు తమ ప్రేమానురాగాల పంచుకొన్నారు, గిరగిర దిరుగుచు బహు సంబరపడ్డారు. ఎక్కడి శిరిడీ, ఎక్కడి ఔరంగాబాదు? గుఱ్ఱపురౌతు ఔరంగాబాదునుండి బల్లినెలా తెచ్చాడు? అక్కచెల్లెండ్ర కలయికను బాబాముందుగానెలా చెప్పగలిగారు? ఇది మన మాటలకందని బాబా మహిమ!శ్రీసాయిబాబా రాజాధిరాజులు, యోగిరాజులు, సర్వసమర్థులు, సర్వజ్ఞులు. అష్టసిద్ధులు, నవనిధులు వారినాశ్రయించాయి. సాయి ధౌతి, ఖండయోగములాంటి యోగప్రక్రియలయందు బహు నిష్ణాతులు. పతాంజలి యోగసూత్రాలలోని మూడవ అధ్యాయమైన విభూతి పాదంలో యోగసిద్ధులు పొందుటకు సంబంధించిన రహస్య విషయములు వివరింపబడినవి. ఆవిషయముపై పెద్దలోతుగా పరిశీలించుట ప్రస్తుత సందర్భం కాదు, కాని కొద్దిగా తెలుసుకొందాం. మొదటిగా సంయమ యనగా ఏమో తెలిసికొందము. ఎనిమిది అంగములున్న రాజయోగములోని మొదటి భాగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార యను ఐదు భాగములున్నవి. ధారణ, ధ్యాన, సమాధి యను మూడు అంగములు రెండవ భాగములో నున్నవి. ధారణ, ధ్యాన, సమాధుల మూడింటిని కలిపి ' సంయమ ' మందురు. మనముజేయు ఏదేని ధ్వనికి మూడు అంశములుంటాయి. అవి వరుసగా శబ్దము, శబ్దమునకు సంబంధించిన అర్ధము, ఆ అర్ధముయొక్క మన అవగాహన. సాధారణముగా ఈమూడు అంశాలు ఒకదానిలోనొకటి కలిసి యుంటాయి. కాని సాధనచే యోగి ఈ అంశములను విడివిడిగా వేరుజేయగలడు. సాధకుడు లేక యోగి ఏదేని ధ్వనిపై , పైన వివరింపబడిన ' సంయమ ' మాచరించిన వానికి ఆ ధ్వనికి సంబంధించిన అర్ధము మరియు భావము తేటతెల్లమౌతుంది. ఆధ్వని చేయునది మనిషి కావచ్చును, లేక మరేదైన జంతువు కావచ్చు. అనగా యోగి ' సంయమ ' ప్రక్రియ ద్వారా ఇతర జంతువుల లేక పక్షుల లేక ఇతర భాషల అర్థములను సులువుగా గ్రహింపగలడు. సాయిబాబా యోగిరాజులుకావున తమ ' సంయమ ' ప్రక్రియద్వారా గోడపైని బల్లి జేసిన టికు టికు శబ్దార్ధమును గ్రహించి, ఎదుటవానికి తెలియపరచిరి. మరొక్క విధంగా జూస్తే సాయిబాబా యోగవిద్యలో మరియు ఆత్మసాక్షాత్కారవిద్యలో బహు ప్రావీణ్యులు, కేవలం సంకల్పమాత్రముననే సర్వవిషయముల గ్రహించి సమాధానమివ్వగలరు. నిజమేదో ఆ సాయినాథులకే ఎరుక! సమర్ధసద్గురు శ్రీయోగిరాజ, సాయినాథుల శక్తికి శతకోటి ప్రణామములు!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
సర్వజీవుల అంతరంగ స్పందన సాయిగనుక , వారికి బల్లికూతా తెలుసు, శునకపు ఆకలీ తెలుసు, మనిషి బాధా తెలుసు!
ReplyDelete