స్త్రీ మూర్తులపట్ల సాయిబాబా మాతృప్రేమ!

శ్రీసాయినాథాయనమః

స్త్రీ మూర్తులపట్ల  సాయిబాబా మాతృప్రేమ!

సాయిబాబా జీవితకాలంలో యెందరో భక్తులు సాయిని మిగుల భక్తిశ్రద్ధలతొ సేవించారు. పురుషులతో సమానంగా ఎందరో స్త్రీలు సాయికి మిగుల యనుంగు భక్తులు, సేవికలు ఐనారు. ఈ విషయాన్ని శ్రీసాయిసచ్చరిత్రములో  చూడగలం. ప్రస్తుతం సాయిని సేవించి, వారి కృపకు పాత్రులైన కొందరి మహిళామతల్లుల యనుభవముల పరిశీలించెదము.

బాయిజాబాయి 

సాయి శిరిడీ వచ్చిన తొలిరోజుల్లో వారిగొప్పతనమును గ్రహించి సేవించిన వారిలో తాత్యాకోతే పాటిలుతల్లి బాయజాబాయి ముఖ్యురాలు. సాయిని తనతమ్మునిలా ప్రేమించెడిది. సాయి ఒచోటున స్థిరంగా యుండక సమీప చిట్టడవులలో తమ అన్నపానీయములు కూడ  మరచి సంచరించేవారు. బాయిజాబాయి ప్రతిరోజు తలపై ఒకగంపలో బాబాకొరకై రొట్టె కూర పెట్టుకొని చిట్టడవిలోని ముండ్లపొదలను సయితము లెక్కింపక దూరదూరములు నడచి బాబాను వెదకి పట్టుకొని మిగుల భక్తిశ్రద్ధలతో, ప్రేమాదరములతో వారికి భోజనము పెట్టుచుండెడిది. ఎనలేని ఆమె సేవను బాబా తుదివరకు మరువలేదు. ఆమెసేవకు ప్రతిగా యామెపుత్రుడు తాత్యాను మిగుల ఆదరించి ఉద్ధరించారు. తమతుదిశ్వాసవరకు తాత్యాను కంటికిరెప్పలా రక్షించారు.       

లక్ష్మీబాయి షిండే 

శిరిడీలోనే నివసిస్తూ తన జీవితకాలమంతా బాబాను సేవించిన శ్రీమతి లక్ష్మీబాయి షిండే, షిండేపాటిలు భార్య. సాయి ఓరోజు దగ్గిరున్న యామెతో  మిగుల ఆకలిగాయున్నదని చెప్పగా, వెంటనే పరుగునవెళ్లి రోటి, కూరాజేసి తీసుకొనిరాగా, సాయి ఆ ఆహారాన్ని సమీప కుక్కకు బెట్టారు. ఆశ్చర్యం, బాధగా జూసిన యామెతో ఆకలిగొన్న కుక్కలోని  ఆత్మకూడా తమరూపమేయని తెలియజెప్పారు. అదితిన్నా తాముతిన్నా ఒకటేయన్నారు. ఈ ఉపదేశం లక్ష్మీబాయి హృదయంపై చెరగరాని ముద్రవేసుకొంది. అప్పటినుండి ప్రతిరోజు సాయంత్రం ఆమె పాలలో నానబెట్టిన రొట్టె నియమంగా ఆయనకు సమర్పింపసాగింది. లక్ష్మీబాయి చదువుసంధ్యలున్న పల్లెపడుచుగాదు, ఓ పేదింటి యిల్లాలైనప్పటికి ఆమెలో ఎంతో సంస్కారముంది. మధ్యమస్థాయి భక్తురాలిగా ఆరంభించి, తన భక్తిశ్రద్ధలతో ఉత్తమస్థాయి చేరుకొంది. అందుకే బాబా మహాసమాధి చెందుటకు కొన్నినిముషములముందు ఆమె మజీదుకు చేరుకోగల్గింది. సాయి తమజేబునుండి ఒకసారి నాలుగు రూపాయి నాణాలు, తర్వాత ఐదు రూపాయి నాణాల తీసి నవవిధభక్తులకు సంకేతంగా ఆమెకు ప్రసాదించారు. శిరిడీలో వీటిని దర్శించుకోవచ్చు. బాబా భౌతిక దేహంతో చివరిసారిగా మానవులకిచ్చిన ప్రసాదమదే! ఆమెలో అంత సంస్కారముండబట్టే సూర్యాస్తమయ మయ్యాక  మసీదులోనికి ప్రవేశించడానికి సాయి అనుమతించినది ఒక్క ఈమెను మాత్రమే. ఆమె మసీదును చివరిగా విడచెడిది. ఒక్కొక్కప్పుడు ఆమె ఇచ్చిన భిక్షనుండి కొద్దిపాటి ఆహరం తీసుకొని , మిగిలిన వంటకం ప్రసాదంగా ఆమెకిచ్చేవారు.  ఆమె వాటిని సమీప రాధాకృష్ణ ఆయికి అందించి, ప్రసాదంగా కొంచెం యింటికి తీసుకు వెళ్ళేది.

సీతాదేవి తార్ఖడ్ 

శ్రీసాయిసచ్చరిత్రములోని 9వ అధ్యాయములో మరొక్క గొప్పసాయి భక్తురాలి యనుభవాల చూస్తాము. రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్ మొదట్లో ప్రార్ధనా సమాజస్తుడైనను  పిదప బాబాకు అంకిత భక్తుడైనాడు. ఆతనిభార్య శ్రీమతి సీతాదేవి తార్ఖడ్   బాబాను మిగుల ప్రేమించెడిది. ఆమె, పుత్రుడు జ్యోతీంద్ర తర్ఖడ్  బాబా నుండి  లెక్కలేనన్ని యనుభవాలను, రక్షణను పొందారు. తల్లీకొడుకులు సాయిదర్శనానికి శిరిడీ వచ్చినపుడు బాంద్రాలోని వారిపటాన్ని తండ్రి తర్ఖడ్ పూజించి నైవేద్యం పెట్టేవాడు. ఓరోజు పూజలో నైవేద్యం  మరువ ద్వారకామాయిలో కూర్చున్నసాయి తల్లీకొడుకులకీవిషయం చెప్పి ఆశ్చర్యపరిచారు. అనగా తమపటానికి తమకు తేడాలేదనేసత్యాన్ని, తమసర్వజ్ఞతను తెలియపరచి  వారిలో తమపట్ల భక్తిని పెంపొందించారు. 1915వ సంవత్సరము డిసెంబరు మాసంలో బాలారాం మాన్ కర్ తనతండ్రి ఉత్తరక్రియలకై శిరిడీవెళ్ళునపుడు వానిద్వారా అప్పటికే నైవేద్యంగా పెట్టబడిన పేడాను మిగుల ప్రేమతో బాబాకొరకు పంపించినది. మాన్కర్ మైలులో యున్నాడు,  అప్పటికే పూజానైవేద్యంగా సమర్పింపబడినా సాయి మాన్ కరుకు మరీగుర్తుచేసి, పేడాను అడిగి తిన్నారు. సాయిపట్ల మనప్రేమంతా వారికెరుకేయన్నమాట! ఒకపర్యాయం బాబాను చూడ వెడలు రఘువీర్ భాస్కర్ పురంధరే భార్య ద్వారా శ్రీమతి తార్ఖడ్  రెండువంకాయల బంపి పెరుగుపచ్చడి, వేపుడు బాబాకై చేసిపెట్టవలసినదని కోరినది. పురంధరే భార్య శిరిడీలో ఓవంకాయతో పెరుగుపచ్చడి చేసి బాబాభోజనసమయానికి తీసికెళ్ళింది. సాయి మిగుల ప్రేమతో పెరుగుపచ్చడి యారగించి, మరి వేపుడెక్కడాయని తమ సర్వజ్ఞతను చూపుచూ అందరినీ ఆశ్చర్య పరచారు. అంటే సాయికి భక్తుల వ్యవహారాలన్నీ తెలుసుననెడి యెరుకతో మనం వ్యవహరించాలన్నమాట.    ఓ సందర్భంలో  శ్రీమతి తార్ఖడ్  శిరిడీలో వేరొకరి యింట్లో అతిధిగా యుంది. భోజనవేళ యచటికి  వచ్చిన ఆకలిగొన్న ఓ కుక్కకు ఆమె రొట్టె విసిరింది. అదేరోజు సాయంకాలం ఆమె మజీదుకుపోగా ఆమె పెట్టినభోజనంతో తమ కడుపు మిగుల నిండినదని పలికారు. ఆకలిగొన్న జీవికి పెట్టెడి ఆహారం సర్వజీవస్వరూపుడు సాయినాథులకు చెందుననెడి సత్యాన్ని  తెలియపరిచారు. ఆత్మసర్వవ్యాపి యనెడి గీతావాక్య సందేశాన్ని నిజజీవితంలో ప్రదర్శించారు. ఓపర్యాయం బాబాయనుమతితో తార్ఖడ్ భార్యాభర్తలు పండరీపురం వెళ్లారు. ఆ సందర్భంలో ఓవింత జరిగింది. పూజాసమయమున  శ్రీమతి తార్ఖడ్ వేయు పూలమాలకందుబాటుగ   పాండురంగని విగ్రహము ముందుకు వంగినది. పూజారులు సైతము మిగుల ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యారు.

రాధాకృష్ణ ఆయి

మొదట పేద ఫకీరుగా మాత్రమే జీవించిన సాయిని ప్రత్యక్షంగా పూజించడం , వారి మసీదును రాజదర్బారులా అలంకరించడము, ఆరతుల జరిపించడము; వీటన్నిటిని మొదట ఆరంభించినది భక్తురాలు రాధాకృష్ణ ఆయీ. మొదటిసారి రాధాకృష్ణ ఆయీ నానాసాహెబ్ చాందోర్కరుతో కలిసి , 1905వ సంవత్సరంలో  పండరీనుండి శిరిడీ వచ్చినది. ఆమె అసలుపేరు సుందరీబాయి క్షీరసాగర్, ఆమె తాత అహ్మద్ నగర్  లో పేరుమోసిన న్యాయవాది. చిన్నవయసులోనే ఆమె భర్త మరణించగా, తన జీవితాన్ని పరమార్థ సాధనలో గడపదలచింది. ఎన్నోజన్మల పుణ్యం వలన ఆమె సాయి సన్నిధి చేరింది. శిరిడీ వచ్చేనాటికి ఆమె మహాసౌందర్యవతియైన యువతి. నిరంతరం ' రాధకృష్ణ ' నామజపం చేయుటచే ఆమెకు రాధాకృష్ణ ఆయీ యను పేరువచ్చినది. భక్తులతోకలసి పండరి యాత్ర జేస్తుండేది. తనవద్దనున్న చిన్న కృష్ణ విగ్రహానికి చిన్నబిడ్డకువలె అన్నిసేవలు చేస్తుండేది. మధురంగా భజనకీర్తనల పాడుచుండెడిది. ప్రధమ దర్శనంలోనే సాయిని దైవరూపునిగా గుర్తించి, వారినే తమ సద్గురువుగా, శ్రీకృష్ణుని ప్రత్యక్ష రూపంగా భావించి జీవితాంతము సేవించినది. ద్వారకామాయిలోనే ప్రతి సంవత్సరం మహావైభవంగా గోకులాష్టమి జరిపించేది.
ఈమె శిరిడీలో తన సమయమంతా సాయిసేవలోను, తీవ్రమైన సాధనలోను గడిపేది. బాబా తనింటికి పంపిన భక్తులతో మాత్రమే మాట్లాడేది. బాబా సంచరించిన వీధులన్నీ స్వయంగా శుభ్రపరచేది. చావడిముందు నీళ్లుజల్లి ముగ్గులు పెట్టేది. బాబా బయటకు లెండికో, చావడికో వెళ్ళినపుడు, సమయం చూసుకొని మసీదును శుభ్రపరచేది. బాబాకూడా ఆమె సేవాభావం గుర్తించి నిత్యం మధ్యాహ్నం భిక్షకువెళ్లి వచ్చాక  శ్యామాద్వారా ఆమెకొక రొట్టె, కూర పంపేవారు. అదే ఆమెకు భోజనం. సాయి విషయవాసనలు జయించిన భక్తుల కొందరిని మాత్రమే ఆయీ యింట బసచేయమని ఆదేశించేవారు. ఆమె సామాన్యంగా ఎవరి ఎదుటకు వచ్చేదికాదు. శిరిడీలో సాయితో నాలుగు మాసములు గడపిన ఖాపర్డే కేవలం ఒకేసారి ఆమె ముఖం జూసానని తన డైరీలో వ్రాసుకొన్నాడు.
రాధాకృష్ణ ఆయీలో బాబాపట్ల తీవ్రమైన శ్రద్ధా భక్తులతోపాటు విశిష్టమైన అధికారము, ఆకర్షణా వుండేవి. ఆమె ఏదైనా చెబితే కోటీశ్వరుడైన బూటీ దగ్గరనుండి అందరూ ఆపని జేసేవారు. బాబా లెండీకి వెళ్ళేమార్గాన్ని యిరుపక్కలా చెట్లునాటించి చక్కని నీడను కల్పించినది. సాయిపట్ల జనులకు భక్తిశ్రద్ధలు పెంచుటకై సాయికి సామూహిక పూజ, నాలుగు ఆరతులు, చావడి ఉత్సవము వంటి వేడుకల ప్రారంభించినది. రాజదర్బారులో వుండవలసిన అలంకారాలు భక్తులే సాయిసంస్థానానికి సమర్పించేలా చేసింది. సాయి ఖ్యాతిని అన్నిదిశలా వ్యాపింపజేసెడి నానాసాహెబ్ చందోర్కర్, దాసగణు, కాకాసాహెబ్ దీక్షిత్ మున్నగువారల  మిగుల ప్రశంసించి ప్రోత్సహించేది. ఆమె కేవలం 35 సంవత్సరాల చిన్నవయసులోనే  దేహం చాలించింది. భక్తులందరూ కలసి 52 సంవత్సరాలలో  సాధించలేని సాయిసంస్థాన వైభవం ఆమె 9 సంవత్సరాలలో సాధించి సాయికృపకు పాత్రురాలైనది!

శ్రీమతి ఖాపర్డే 

శ్రీమతి ఖాపర్డే బాబాకు  ప్రియమైన భక్తురాలు. భర్త శిరిడీలో 4 మాసములుండగా , యీమె 7 మాసములుండి బాబాను మిగుల శ్రద్ధాభక్తుల సేవించింది. ఆమెతో తనకు జన్మజన్మల బంధమని బాబా ప్రకటించారు. తనకు సేవజేయుచున్న యామెకు బాబా ప్రతిసేవ జేశారు. తన బిడ్డ ప్లేగువ్యాధి పీడితుడైనప్పుడు, స్వస్థలానికి వెళ్ళుటకు బాబా యనుమతి కోరినప్పుడు , సాయి ఆబిడ్డ వ్యాధిని తమదేహంపైకి తీసుకొని ఆమెకుపశమనం కలిగించారు. ఎవరికీ యెలాంటి ఉపదేశమివ్వని బాబా " రాజారామ్ " మంత్రాన్ని జపించమని ఆమె కుపదేశించారు. భార్యాభర్తల భక్తిశ్రద్ధలకు మిగుల సంతసించి సాయి భర్త  ఖాపర్డేను బ్రిటిషు పాలకులనుండి కంటికి రెప్పలా రక్షించారు.
గ్రహస్థితులు బాగోని కారణమున తనపుత్రునకు వైద్యవిద్య ప్రవేశం రాదని చెప్పిన జ్యోతిష్యుల మాటలకు మిగుల బాధపడి సాయిని జేరిన శ్రీమతి సావిత్రీబాయి టెండూల్కరును యాశీర్వదించి, ఆమె మనోరథం సిద్ధింపజేశారు. పదవీ విరమణ జేసిన యామెభర్తకు తగు పెన్షను వచ్చునటుల దీవించారు. బిడ్డలకై తపించు శ్రీమతి ఔరంగాబాద్కర్ , శ్రీమతి సపత్నేకరులకు, సాయి మిగుల కరుణతో సంతాన ప్రాప్తి కలిగించారు. అమాయకపు భక్తురాలగు మదరాసీ భజనమండలి మహిళకు తన యిష్టదైవ శ్రీరామ దర్శనము, సాయి కల్పించారు.   ప్రేమతో తమను సేవించు  మౌసీమీబాయిని ఇతరభక్తులు ఆక్షేపించిననూ , సాయి ఆమె సేవను కొనసాగింపజేశారు.
మహిళామతల్లుల పట్ల సాయి జూపిన యిలాంటి ఉదాహరణలకు లెక్కలేదు. తెలిసినంతవరకు నేనిట పొందుపరచాను. సాయిజూపు మాతృప్రేమ అపారము, వర్ణనాతీతము!  కావుననే  భక్తులపట్ల సద్గురుప్రేమ కన్నతల్లిప్రేమకు,  వెయ్యిరెట్లుగా యుంటున్నదని   అక్కల్కోట్ స్వామిసమర్ద్ అభివర్ణించారు!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!

 లక్ష్మీబాయి షిండే 
 బాయిజాబాయి 
 సీతాదేవి తార్ఖడ్ 
ఖాపర్డే దంపతులు 








Comments

  1. గోపికలకు శ్రీకృష్ణుడు, మహిళాభక్తులకు సాయికృష్ణుడు !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)