సాయికథలు - విశ్వాసము

శ్రీసాయినాథాయనమః 

సాయికథలు - విశ్వాసము 

శ్రీసాయినాథులు తమభక్తులకెలాంటి ఉపదేశము నివ్వనప్పటికి, ఉపదేశంలాంటి ఓ ఉపదేశమిచ్చారు, అదే బాబా చెప్పిన " శ్రద్ధ-సబూరి". గురువుపట్లగాని, దైవంపట్లగాని, మొక్కవోని అకుంఠితవిశ్వాసం సదానిలుపుకోవడమే సాయి ఉపదేససారాంశము. ఇదేసూత్రాన్ని సాయి తమగురువుపట్ల తమసాధనాజీవితంలో ఆచరించి తమ గురుకృపకు పాత్రులై , తుదకు తామే సద్గురురూపులైనారు. శ్రీసాయిసచ్చరిత్రములో సాయిని పరిపూర్ణవిశ్వాసంతో సేవించిన కాకాసాహెబు దీక్షితు, దాసగణు, నానాసాహెబు చాందోర్కర్, శ్యామా (మాధవరావు దేశపాండే), రాధాకృష్ణ ఆయి లాంటి కొందరిభక్తుల వివరాలు చూస్తాము. ప్రస్తుతం సాయిపట్ల శ్యామయొక్క భక్తివిశ్వాసాలను పరిశీలిద్దాము. బాబాపట్ల శ్యామాది సఖ్యభక్తి, శ్రీకృష్ణునిపట్ల అర్జునుడు చూపిన నమ్మకము, విశ్వాసమును పోలియుంటుంది.

తన ప్రతిశ్వాసలోను సాయిపట్ల ప్రేమానురాగాలను, భక్తిశ్రద్ధలను  నింపుకున్న ధన్యుడు శ్యామా. ఒకరోజు శ్యామా చిటికిన వ్రేలును పాముకరిచింది. క్రమంగా దేహంలోకి విషంవ్యాపింపసాగింది. తనకు మరణం తప్పదని భయపడ్డాడు శ్యామా.  సాధారణంగా శిరిడీలోని ప్రజలు పాముకాటు నివారణకు యచటి విఠలు దేవాలయానికి వెళ్ళుట ఆనవాయితి గాన స్నేహితులు శ్యామా నచటకు తీసుకెళ్ల ప్రయత్నింప, యాతడందులకు సమ్మతింపక,  తన విఠలుడైన బాబావద్దకే పరుగున వెళ్ళాడు. బాబా,  శ్యామా ప్రమాదమును గ్రహించి తిట్లరూపంలో అభయమిచ్చారు. " పో, వెడలిపొమ్ము, దిగువకుపొమ్ము." యనుచు మిగులకోపంతో యాతనిపై విరుచుకు పడ్డారు. శ్యామామిగుల భయపడగ, కరుణామయుడు బాబా కొంతసేపటికి శాంతించి తాను వానిని  తప్పక కాపాడెదనని, విశ్వాసంతో భయమువీడి ఇంటికివెళ్ళి నిశ్చింతగా మెలగవలెనని ఆదేశించారు. సాయి దిగువకు పొమ్మన్నది  శ్యామా శరీరంలో పైకెక్కుతున్న విషమునుద్దేశించినదే గాని వానినిగాదు. పిదప బాబా తనభక్త రక్షణకు ప్రతీకగా   తాత్యాకోతే పాటిలు మరియు కాకాసాహెబు దీక్షితులను  శ్యామాయింటికి పంపించారు. పండుకొనగ ఇంటిలోనే తిరుగవలెనను షరతు విధించారు. శ్యామా యటులనే బాబాపట్ల కృతజ్ఞతగా సాయిని స్మరిస్తూ తనగృహంలోనే పచార్లు చేయనారంభించారు.

నిదురించినయెడల సాయిస్మరణ మాగెడిప్రమాదమున్నది. అందులకే నిదురింపవలదని సాయి వానినాదేశించారేమో? 

ఆపై కొద్దిసేపటికి శ్యామా బాగుపడ్డాడు.  ఇచట చూసాముగదా సాయిపట్ల శ్యామా విశ్వాసమే  వానిని మరణమునుండి కాపాడినది. శ్యామాపట్ల సాయిమాట్లాడిన మాటలే వానిప్రాణరక్షణకు  మంత్రాక్షరములు!   కావున సద్గురు సాయినాథులపట్ల మనం  నిరంతరము నిలిపెడి భక్తివిశ్వాసాలే మనకు శ్రీసాయిరామ  రక్షణాకవచము!

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!





Comments

  1. శ్రీసాయిపట్ల విశ్వాసమే శ్యామా ప్రాణాన్ని రక్షించినది !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

శ్రీసాయిసందేశామృతము(Nectar of Sri Sai's message.)