సాయి కథలు - ఉపనిషత్తుల బోధ, సాయి జీవన ధార !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - ఉపనిషత్తుల బోధ, సాయి జీవన ధార !
నేడు గురుపౌర్ణమి
నేటి విజ్ఞానయుగంలో ఎన్నో శాస్త్రములు వెల్లివిరిసాయి. రసాయనిక, భౌతిక, వృక్ష, జంతు, వైద్య మరియు యిలాంటి ఎన్నోశాస్త్రములు. ప్రతి శాస్త్రము గూర్చి తెలిసికోవడానికి విద్యార్థులు ప్రధమంగా తరగతిగదిలో పాఠ్యపుస్తకాలను చదవడం అనివార్యము. ఆపై అందువివరింపబడిన సూత్రములు , ఆయా సంబంధిత ప్రయోగశాలలలో నిర్ధారింపబడుటయను సత్యము యెల్లరకు తెలిసిన విషయమే! అటులనే మానవుని ఆధ్యాత్మిక జీవనపురోగమనానికి వెలుగుజూపు మార్గదర్శక సూత్రములు, రహస్యములు మన ఉపనిషత్తులలోను, భగవద్గీత, భాగవతాది గ్రంధాలలోను వివరింపబడినవి. భగవంతుడు సర్వవ్యాపి, ఆత్మ జననమరణాలకతీతము, కర్మఫలములకెవ్వరూ అతీతులుకారు, సర్వస్య శరణాగతితోడనే దైవమును జేరగల మను బహుమూల్య సత్యములు పై చెప్పబడిన గ్రంధాలలో కూలంకుశముగా చర్చింపబడినవి.శ్రీసాయిబాబా జీవితమును నిశితముగా పరిశీలించిన కొన్నిసత్యములు తెలియగలవు. సర్వమత ఆధ్యాత్మిక గ్రంధాలను పాఠ్యపుస్తకాలుగా తలస్తే, ఆయాగ్రంధవిశ్లేషణా విషయములకు ప్రయోగశాల బాబా జీవితము. చెప్పబడిన ఆసత్యవాక్యములకు బాహ్యసాధన రూపమే బాబా జీవితము. సాయి చాల తక్కువుగా మాట్లాడేవారు. వారు జీవించిన విధానముద్వారా, వారి మహిమల ప్రకటనద్వారా, వారిభక్తరక్షణా కార్యముద్వారా తమ దైవత్వాన్ని చూపారేగాని కేవలం వాచక వేదాంతముద్వారా కాదు. ఆత్మ సర్వత్రా వ్యాపకమనియు, అందరిలో వెలిగే దైవం ఒక్కడేయనియు, దైవమేయజమానియనియు చెప్పబడిన సత్యసూత్రములను సాయి తమ జీవితంలో జీవించి నిరూపించారు. కుక్కకు తగిలిగ దెబ్బను తాను పొందారు, శునకమునకు పెట్టిన రొట్టెతో వారి ఆకలి తీరింది. వారికి ప్రియమైన శ్యామసుందర్ యను గుఱ్ఱమునకు తగిలిన వాతలను తాము చూపారు, కొలిమిలో పడిన బిడ్డ కాలినగాయాలను తాముదాల్చారు, ఖాపర్డే పుత్రుని ప్లేగుబొబ్బలను తమ దేహంపైకి తీసుకొన్నారు. ఇలా వారు చూపిన ఏకాత్మభావానికి, సర్వజీవకారుణ్యానికి ఉదాహరణములు కోకొల్లలు. కనులజూచువారలకు, మనసున దలచువారికి, బుద్ధిబలముతొ శోధించువారలకు వారి జీవితం నడిచే వేదాంతసారము, ఉపనిషత్తుల భాష్యము, భగవద్గీతా వ్యాఖ్యానము!
భక్తజనులకు ఉపనిషత్తులు, భగవద్గీత పాఠ్యపుస్తకాలైతే, సాయిబాబా జీవితగాధ ఆయా పవిత్రగ్రంధాలలో చెప్పబడిన సత్యవాక్యనిరూపణల ప్రయోగశాల! ఆయానిజాలను తమద్వారా ప్రకటించిన, ప్రదర్శించిన సద్గురువే సాయినాథులు!
ReplyDelete