సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే సాయినాథులు!

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - తమభక్తుల అవహేళన సహింపని శ్రీహరియే  సాయినాథులు! 

సాయిలీలలను స్మరిస్తుంటే శ్రీకృష్ణుని, శ్రీరాముని,  గాథలు కనులముందు గోచరిస్తాయని రచయిత హేమాద్రిపంత్ శ్రీసాయిసచ్చరిత్రములో పేర్కొన్నాడు. నాకుకూడ అలాంటి యనుభవమే అపుడపుడూ కలుగుతుంటుంది. శ్రీసాయిసచ్చరిత్రము 48వ అధ్యాయములోని శేవడే మరియు సపత్నేకర్ కథలు చదువునపుడు ఓ మధురమైన విష్ణులీల మనసుకి తట్టింది. ఆవివరాలను క్లుప్తంగా పరిశీలిద్దాము.  ముందుగా సపత్నేకరు గూర్చి తెలిసికొందాము. షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోట నివాసి యతడు, తన లా పరీక్షకు చదువుచుండెను. శేవడే ఆతని సహవిద్యార్థి, సాయిబాబాను మిగులునమ్మినవాడు. తానుబాగుగ చదవకున్నను బాబాకృపతో లాపరీక్షలో తప్పక ఉత్తీర్ణుడ కాగలనని విశ్వసిస్తాడు. బాబాపై యాతని అపార విశ్వాసానికి నవ్వుకొంటాడు సపత్నేకర్. అంతేగాక బాబాను సయితము వెక్కిరిస్తాడు. పరీక్షలో పాసైన సపత్నేకర్ అక్కల్ కోటలో న్యాయవాదవృత్తి ప్రారంభిస్తాడు. పదేళ్ళపిమ్మట  దురదృష్ట వశాత్తు తన భార్యను, ఒక్కగానొక్క కొడుకుని కోల్పోతాడు. మిగుల వికలమనస్కుడై పండరీపురము, గాణ్గాపుర పుణ్యక్షేత్రముల దర్శించినను యెలాంటి మనశ్శాంతి పొందలేకపోతాడు. తుదకు తనరెండవ భార్యతో బాబాను దర్శించి, శరణుకోరి వారిఆశీసులతో మనశ్శాంతిని పుత్రసంతానాన్ని పొందుతాడు. ఇపుడు పైగాధకు సారూప్యమైన విష్ణుభక్తుడు అంబరీషుని గూర్చి కొద్దిగా వివరించుకొందాము.    పరమవిష్ణుభక్తుడైన అంబరీషునిపై ముక్కోపి దుర్వాస ముని  ఓక సందర్భంలో మిగుల కోపించి తనజటాజూటమునుండి ఓరాక్షసుని సృష్టించి వానిపైకి పురికొల్పుతాడు. అంబరీషుని సదా రక్షించెడి సుదర్శనచక్రము ఆరాక్షసుని చంపివేసి, ఆపై దుర్వాసుని వెంబడిస్తుంది. ముని  కైలాసము, బ్రహ్మలోకము,  చివరకు వైకుంఠమునకు పరుగుల  వెళ్లి త్రిమూర్తుల శరణువేడినను వారినుండి ఎలాంటి రక్షణ పొందలేకపోతాడు. చివరకు అంబరీషుని శరణువేడి సుదర్శన చక్రమునుండి  రక్షింపబడతాడు.   శ్రీహరి దూషణ, సద్గురు దూషణ మిగుల వర్జనీయము, వారిభక్తులజోలికి మరీ వెళ్లరాదను సత్యము పైగాథలనుండి తేటతెల్లము.

అంబరీషుని కథ ( శ్రీమద్భాగవతపురాణమునుండి )  

అంబరీషుడు సత్యమునే నమ్ముకొన్న మహావిష్ణు భక్తుడు. విష్ణుమూర్తికి ప్రియమైన యజ్ఞము  నొకపర్యాయము యెంతో  భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీమన్నారాయణుని కృపకు పాత్రుడైనాడు. విష్ణుభగవానుడు ప్రసన్నుడై తన సుదర్శన చక్రమును అంబరీషునికి సామ్రాజ్య శాంతిసౌఖ్యాలకు, రాజ్యరక్షణకు నియమిస్తాడు.   మరొకసమయమున అంబరీషుడు ద్వాదశి వ్రతమాచరిస్తాడు. వ్రతనియమప్రకారము,  ముందురోజు ఏకాదశి దినమంతయు ఉపవసించి ద్వాదశఘడియలు ముగియులోపున అతిధులందరకు సంతుష్టిగా భోజనము సమకూర్చి తానును భుజింపవలెను. ద్వాదశఘడియలు ముగియులోపున దుర్వాసమహర్షి తనశిష్యపరివారంతో రాజును సందర్శిస్తాడు. అంబరీషుడు యెంతో గౌరవ మర్యాదలతో మహర్షినాహ్వానిస్తాడు. రాజుకోరికపై, వాని అదరణీయ అతిధిగా యుండుటకు  అంగీకారమును తెలియజేసి,  తన నదీస్నానము ముగించి తిరిగి వచ్చువరకు  వేచియుండవలసినదిగా  అంబరీషునికి తెలియజెపుతాడు. కాని ద్వాదశఘడియలు ముగియుచున్నను, దుర్వాసమహర్షి  రానికారణమున, వశిష్ట మహర్షి సలహాపై తులసితీర్థం పుచ్చుకొని దుర్వాసమహర్షి రాకకై    ఎదురుచూస్తాడు. 
మిగుల ముక్కోపియైన దుర్వాసముని,  తానుభుజింపకమునుపే రాజుభుజించి (తులసితీర్థం స్వీకరించుట భోజనంతో సమానముగా తలంచి) తన పట్ల అతిథిధిసేవా ధర్మము పాటించలేదని తలచి మిగుల క్రుద్ధుడై, తనజటాజూటమునుండి ఓరాక్షసుని సృష్టించి అంబరీషుని సంహరించుటకై పురికొల్పుతాడు. అంబరీషుని సదా కాపాడెడి సుదర్శనచక్రము గ్రక్కున ఆరాక్షసుని వధించి  దుర్వాసుని వెంబడించినది. దుర్వాసుడు తన ప్రాణరక్షణకై బ్రహ్మలోకపు  బ్రహ్మదేవునివద్దకు, కైలాసము మహాదేవుని వద్దకు పరుగులు తీస్తాడు. కాని వారిరువురు తమ అసహాయతను తెలియజేయుటచే, తుదకు వైకుంఠములోని సాక్షాత్తు శ్రీమన్నారాయుని శరణు కోరతాడు. తాను భక్తికి కట్టుబడియుండుటచే ఎలాంటి సహాయము జేయలేనని, కేవలము అంబరీషునే శరణు వేడమని విష్ణుమూర్తి పలుకుతాడు. తుదకు దుర్వాసుడు తన ప్రాణముల రక్షింప అంబరీషుని పాదములపై బడతాడు. విష్ణుమూర్తిని ప్రార్ధించి సుదర్శనచక్ర బారినుండి దుర్వాసుని రక్షిస్తాడు భక్త అంబరీషుడు. 

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


                      
                       
  



Comments

  1. ఎవరినమ్మకము వారిది, కావున భక్తుల భక్తి , విశ్వాసాలను అవహేళన చేయుట సదా వర్జనీయము!

    ReplyDelete

Post a Comment