సాయి కథలు - " నా వాణ్ణి పతనం కానివ్వను! "

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - " నా వాణ్ణి పతనం కానివ్వను!  " 

తమభక్తులనెపుడూ పడిపోవనీయనని సాయినాథులు అభయమిచ్చినారు. కోపతాపాలనుండి, కామ లోభాలనుండి భక్తుల విచిత్రరీతుల రక్షించారు. హరి వినాయక్ సాఠే బాబాకు గొప్పభక్తుడు. శిరిడీలో  సాయినిదర్శించు వారలనివాసమునకై   మొట్టమొదట  సాఠేవాడ  నిర్మించాడు. సాఠే ప్రవర్తనను సాయి యెలా చక్కదిద్దారో పరిశీలిద్దాము. తమమామ దాదాకేల్కర్ సలహాపై శిరిడీలో ఇరువది ఎకరాల పొలము కొన్నాడు సాఠే. ఆ భూమిని తనభార్యతో కలసి చూచుటకై తాత్యానుండి ఎద్దులబండి తెప్పించాడు. భార్య మొదట అంగీకరించినదికాని, తర్వాత తండ్రిమాటపై చూచుటకు రానన్నది. తనమాటవినలేదన్న మిగుల కోపంతో ఆమెను దండించుటకు చెర్నాకోలు తీసుకొన్నాడు. అదేసమయాన మేఘుడు పరుగులవచ్చి వెంటనే బాబా రమ్మన్నారన్న వార్తను సాఠేకు తెలియజేస్తాడు. సాయిని సందర్శించిన సాఠేతో బాబా, ' ఏమిటి విషయం, ఏమైనది? నీభూమి అక్కడే వుందిగా, చూచేదేమిటి? ' అన్నారు. సాఠే ప్రవర్తనపట్ల సాయి యెంతటి అప్రమత్తులోకదా!
మరొక సంఘటన. ఒకరోజున మొదటిసారిగా శిరిడీలో ఓభక్తురాలి యింటికి వెళ్లదలచాడు సాఠే. సరిగా అంతకు కొద్దిసేపటికి ముందే బాబా  ఒకరి యింటి మారుపేరు సూచిస్తూ ఆయింటికెపుడైనా వెళ్ళావా యని యాతని నడిగారు. సాఠేకు యేమి బోధపడలేదు. బాబా మిన్నకున్నారు. పిమ్మట సాఠే ఆమె యింటికి వెళ్లి మాటలాడుచుండగా యాతని మనసులో చెడు ఆలోచనలు రాసాగాయి. తక్షణమే బాబా ఆ యింటిముందు సాక్షత్కరించి, దగ్గరిగా  వేసియున్న వాకిలితలుపు నెట్టి , ' ఎంతటిపని చేస్తున్నావు? ' అన్నట్లు భంగిమ జేసి మాయమయ్యారు. సాఠే మిగుల పశ్చాత్తాపము జెంది అక్కడినుండి వెంటనే వచ్చేసాడు, మరెన్నడూ ఆయింటివైపు కెళ్ళలేదు.
మూలము: సాయిసన్నిధి, పరమపూజ్య ఆచార్య శ్రీఎక్కిరాల భరద్వాజ

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


Comments

  1. భక్తుల అంతరంగాల శుద్ధిజేసి భగవంతుని కర్పించుటకై సాయిబాబా అవతరించారు !

    ReplyDelete

Post a Comment