సాయి కథలు - తీవ్ర ప్రార్థన లేక వ్యాకులత !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - తీవ్ర ప్రార్థన లేక వ్యాకులత
నేడు గురుపౌర్ణమి
నీటిలో పంచదార వేసినకొద్దీ తీపి క్రమంగా పెరుగుతుంది. అలాగే దైవంపై భక్తి, ప్రేమ, అనురాగాలు, పెరిగేకొలది వ్యక్తి తన్మయత్వం వృద్ధిచెందుతోంది. దైవానుగ్రహానికి తీవ్రస్థాయిలో మన ప్రార్ధన కొనసాగాలని మహనీయుల సందేశం. వివేకవైరాగ్యములతోకూడిన వ్యాకులత భగవంతుని పొందుటకు రహస్యమార్గమనియు, నీట మునిగిన మనిషి గాలికై తపించునంత తీవ్రవేదనతొ దేవుణ్ణి వేడుకోవాలని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పియున్నారు.తమ తీవ్రమైన ప్రార్థనచే సాయిబాబా అనుగ్రహమును పొందిన భక్తుల అనుభవమునొకదానిని శ్రీసాయిసచ్చరిత్రములోని 35వ అధ్యాయములో చూస్తాము. బాలాజీ పాటీలు నెవాస్కరు తన జీవితకాలంలో బాబాను మిగుల భక్తిశ్రద్ధలతో సేవించిన ధన్యుడు. ఆతడు మరణించిన పిమ్మట ఓరోజు వాని సంవత్సరికమునాడు నెవాస్కరు పరివారము తమబంధువులను భోజనమునకు పిలిచారు. కాని భోజనసమయానికి పిలిచినవారికి మూడురెట్లుగ బంధువులొచ్చారు. వండిన వంటకములు వచ్చినవారలకు చాలవనియు, తమకుటుంబ గౌరవమునకు భంగము వాటిల్లునని నెవాస్కరు భార్య మిగుల భయపడినది. బాబాను యెంతగానో నమ్మియున్న ఆమె అత్తగారు బాబాను ప్రార్ధించి , ఈ విషయమై కలతచెందక వంటకములన్నియు సాయి ఆహారముగావున వాటిపై విభూతి చల్లి పైన గుడ్డకప్పి వడ్డించమనియు, సాయితప్పక కాపాడుదురనియు కోడలికి సూచించారు. ఆమె ఆసలహాను పాటించినది. వచ్చిన వారలకు భోజనపదార్ధములు సరిపడుటయేగాక ఇంకను చాల మిగిలాయి. తమతీవ్ర ప్రార్థనలచే సమయానికి సాయి సహాయమునావిధముగ నెవాస్కరు కుటుంబీకులు పొందగలిగారు.
దైవకృప, సాయికరుణా పొందుటకు వారిపట్ల తీవ్ర భక్తిశ్రద్ధ లెంతో అవసరము!
ReplyDelete