సాయి కథలు - పెద్దముల్లు చిన్నముల్లు

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు - పెద్దముల్లు  చిన్నముల్లు 

సాయిబాబా తన భక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ కు భగవద్గీత 4వ అధ్యాయం, 34వ శ్లోకం వివరిస్తూ,  గురువు తన బోధయనెడి అజ్ఞానంతో  శిష్యునిలోని జన్మజన్మల కొనసాగిన చీకటిపొరలనెడి అజ్ఞానాన్ని తొలగిస్తాడని తెలియబరచారు. అంటే బోధకునిది  పరిపూర్ణ జ్ఞానం కాదన్నమాట. బోధ పెద్దముల్లులాంటిది, దాని సాయంతో శిష్యునిలో దాగిన అజ్ఞానమనే చిన్నముల్లును తొలగించ వచ్చును. అంతవరకే బోధయొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత. వ్యక్తి తన నిజస్వరూపం తెలిసికొనుటకు బోధకు అతీతమైన పరిపూర్ణ అనుభవం పొందాలి. ఈవిషయాన్నీ  క్రింది విధంగా అర్ధం చేసుకొనవచ్చును. ఒక వ్యక్తి పంచదార గూర్చి వినలేదు, తినలేదు, చూడలేదు, దాని లక్షణములుకూడ ఏమాత్రం తెలియదు. మరొక వ్యక్తి గలడు, అతడు పంచదారను చూసాడు, దాని ధర్మాలగూర్చి విన్నాడు కాని తన జీవితంలో ఎపుడూ రుచిచూసి యెరుగడు. కాని పంచదారనుగూర్చి తనకున్న జ్ఞానాన్ని   రెండవ వ్యక్తి  మొదటివానితో పంచుకొనవచ్చును.  ఇచట రెండవవాని జ్ఞానం పైనచెప్పబడిన పెద్దముల్లులాంటిది. రెండవవానికి పంచదార వివరాలు తెలుయునుగాని, దాని నిజమైన రుచి యనెడి అనుభవం లేదు. ఆ రుచిని చవిచూడాలంటే పెద్దముల్లులాంటి బోధనుకూడ అతిక్రమించి అనుభవ స్థాయికి వ్యక్తి ఎదగాలి. బోధగురువులెందరున్నా అనుభవాన్ని ప్రసాదింపలేరు, కేవలం సద్గురువే తన శిష్యునికి ఆలాంటి అనుభవాన్ని అందింపగల సమర్ధుడు. సాయిబాబా అలాంటి సద్గురువు. శ్రీ బి.వి. నరసింహస్వామి, శ్రీ ఎక్కిరాల భరద్వాజ లాంటి కారణజన్ములు సద్గురు సాయినాథుల నుండి అలాంటి  దివ్యానుభూతిని  పొందారు.  అర్జునునకు అలాంటి అనుభవం కలిగించిన శ్రీకృష్ణుడు సద్గురువు. అలాంటి సమర్ధ సద్గురువుల నాశ్రయించాలని భగవద్గీత సందేశం!

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!  

Comments

  1. ఆత్మానుభవం, ఆత్మానందం పొందుటకు బుద్ధిసరిహద్దులు దాటి వెళ్లవలె, ఈ అనుభవాన్ని బుద్ధితో సాధింపలేమని అలాంటి యనుభవమును పొందినట్టి సద్గురు సాయిబాబా, రామకృష్ణ పరమహంస లాంటి దైవపురుషుల సందేశం! వర్షపు రాకగూర్చి తెలిపే పంచాంగాన్ని ఎంతపిండినా ఓ నీటిచుక్క రాలదనేది రామకృష్ణుల వారి బోధావాక్యం!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.