సాయి కథలు - దుష్కర్మల ఫ(బ) లం తగ్గించడమెలా?

శ్రీసాయినాథాయనమః 

సాయి కథలు -  దుష్కర్మల  ఫ(బ) లం తగ్గించడమెలా?

శ్రీసాయిబాబాను కర్మధ్వంసిగా నామావళిలో స్థుతిస్తాము. వ్యక్తులు  తాము చేసిన దుష్కర్మల ఫలం, బలం అనుభవింపక తప్పదు.  ఇందులకు సాయిబాబా చక్కని విరుగుడు చెప్పారు. అనన్యంగా శరణు కోరినవారి కష్టముల దీర్చెదననియు, వారిబరువుల మోసెదననియు, వారి కర్మల నశింపజేయుదుననియు , తమ ఏకాదశ సూత్రాలలో మాట ఇచ్చియున్నారు. తానెన్నడూ మాటతప్పనని ద్వారకామాయిలో మరిమరీ నొక్కిచెప్పారు. శ్రీసాయి చరిత్రలోని భక్తుల అనుభవాలన్నీ ఇందుకు నిదర్శనము. " అనన్యంగా శరణు పొందటం " అంటే ఇదివరలో తెలిసో తెలియకో దుష్కర్మల జేసియుండవచ్చు కాని ఇప్పుడు నిన్ను ( సాయిని) ఆశ్రయించాను, నేనిక పిమ్మట చెడుకర్మల  చేయనని సాయికి ప్రమాణం చేయటమేయని దీనిభావం. మంచివానిగా మారిన పుత్రునిజూసి ఏతండ్రి సంతోషింపడు?  తండ్రికితగ్గ బిడ్డలకమ్మని సాయి తమభక్తులకు చెప్పియున్నారు. ఆశ్రీతుల దుష్కర్మ ఫలితాలను సాయి తన దివ్యశక్తితో దహించి వారికి మేలుచేస్తారు. దీనికి సంకేతంగా సాయి ద్వారకామాయిలో నేటికిని అహోరాత్రాలు మండే  ధుని ప్రతిష్టించారు.
(పూనాజిల్లా  నారాయణగావ్ కు  చెందిన భీమాజీపాటిలు భయంకరమైన క్షయవ్యాధి పీడితుడై, బాబాభక్తుడు నానాసాహెబ్ చాందోర్కర్ సలహాపై  షిరిడీవెళ్లి సాయిని శరణుకోరాడు. ఆజబ్బు యాతని గతజన్మ పాపఫలితం  కావున తానేమి జోక్యంజేసుకోనని బాబా చెప్పారు. కాని సాయితప్ప తనకెవరూ దిక్కులేరని పాటీలు మొరబెట్టుకొనుటచే బాబామనసుకరిగి యాతని బాధాముక్తుని జేయుదునని ఆశీర్వదించారు. బాబామాటే మంత్రంగా పాటీలు బాధ క్రమంగా తగ్గనారంభించినది. వాని రోగానికి అంతగా యనుకూలించని భీమాబాయి యింటిలో బసజేయమని   బాబాజెప్పారు. అతడు షిరిడీలో నున్నపుడు రెండుకలల యనుభవమునిచ్చి బాబా వాని రోగముక్తుని జేశారు. మొదటి కలలో విద్యార్థిగా తాను పద్యములు  సరిగా వల్లెవేయని కారణంగా ఉపాధ్యాయునిచే దెబ్బలు తింటాడు. రెండవకలలో తనఛాతీపై పెద్దబండ  అటునిటు నడుపుటచే మిగుల బాధననుభవించాడు. స్వప్నంలో అనుభవించిన ఈ బాధలచే రోగముక్తుడై పాటీలు స్వగృహానికివెళ్లాడు. రోగికి బాధతెలియకుండా వైద్యుడు మత్తుమందిచ్చి ఆపరేషన్ తో రోగముక్తునిజేసినంత సులువుగా సాయి వాని బాధానివారణ జేశారు. తనగ్రామం జేరిన పాటీలు   జీవితాంతం బాబాపట్ల  కృతజ్ఞతతో  మెలిగి, మహరాష్ట్రలో నెలవారీగా జరుగు  సత్యనారాయణ వ్రతపద్ధతిలో సాయిసత్యవ్రతము జేయనారంభించాడు.)
మూలము: సాయిసూక్తి-ఆచార్యవాణి

శ్రీసాయికరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!


Comments

  1. సాయి పై భక్తిబలం పెరిగే కొలది , దుష్కర్మ ఫలం క్షీణిస్తుంది !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.