సాయి కథలు - ఈశరీరంలోని హీనజాతివాణ్ణి వెడలగొట్టాలి !

శ్రీసాయినాథాయనమః!

సాయి కథలు - ఈశరీరంలోని హీనజాతివాణ్ణి వెడలగొట్టాలి!

సాయిబాబా తమభక్తులతో మాట్లాడుచూ ' ఈ దేహంలో ఓ హీనజాతి వాడున్నాడు, వాణ్ణి వెడలగొట్టాలి ' యంటూ వుండేవారు. అందరిలోను మంచిచెడులుంటాయిగదా, చెడును గూర్చి అలా చెబుతున్నారేమో యని తలచేవాణ్ణి. ఈమధ్య శ్రీరామకృష్ణ పరమహంస జీవిత గ్రంధాన్ని చదివేటపుడీ సత్యం మరింత బోధపడింది. అదెలాగో 

పరమహంసలవారి అనుభవాన్ని వారిమాటల్లోనే చూద్దాం.  " ఆధ్యాత్మ గ్రంధాలలో వివరింపబడిన సూత్రాలకనుగుణంగా నా ఆధ్యాత్మిక సాధన కొనసాగుతుండేది. సాధన ఫలితంగా  నాలోని  పాపపురుషుని దహించినటుల భావించేవాణ్ణి. మనలో నిజంగా ఓ పాపపురుషుడున్నాడనియు, వానిని  దహించి నాశనం జేయవచ్చునని అపుడెవరెరుగుదురు.  సాధన ప్రారంభంలో నా దేహమంతా మండునటుల తీవ్ర బాధను అనుభవించేవాణ్ణి. ' ఏ రకమైనదీజబ్బు? ' యని తలస్తుండేవాడిని. కొలదికాలంలోనే అది భరింపరాని  బాధగా పరిణమించినది.  ఎన్నో ఔషధములను, లేపనములను వాడినను యేమాత్రము ఉపశమనము కలుగలేదు. ఆ పిమ్మట ఓరోజు  పంచవటిలో కూర్చున్నాను. అనుకోకుండా, ఆశ్చర్యం గొల్పుతూ  నా యీదేహంనుండి వెలువడు ఓభయంకర నల్లని, చింతనిప్పులలాంటి కన్నుల మనిషిని చూసాను. తప్పతాగిన వానిలా నాముందు తూలుతున్నాడు.  మరుక్షణంలోనే ఈ  దేహంనుండి కాషాయవస్త్రం ధరించిన సుందరరూపుడైన  త్రిశూలధారిని బయటకు రావడం చూసాను. అతడు వెనువెంటనే వీరోచితంగా భయంకరాకారునిపైబడి వాని వధించాడు. ఆ క్షణంనుండి అప్పటివరకు భయంకరముగా మండుచున్న నా శరీరంలోని మంటలు  క్రమంగా క్షీణించాయి."  


దీనివలన మనకోవిషయం తేటతెల్లమవుతుంది, అదేమన పరమహంసలవారి సాధనా పుణ్యఫలం వారిలోదాగిన పాపపురుషుని లేక హీనజాతుని వెడలగొట్టినది. సద్గురుసాయికృపతో నిత్యసాధన,  పుణ్యకార్యాలద్వారా  మనలో దాగిన హీనజాతివానిని వెడలగొట్టెదము గాక!

శ్రీసాయికరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!



Comments

  1. రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ములే తమలోని హీనజాతివాని కనుగొని వెడలగొట్టారంటే, మనలోని చెడును కనుగొని జయించడంకోసం మరెంత మెలకువతో వ్యవహరించాలి? సాయి చెప్పిన ఈవాక్యమెంతసత్యం !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయి బోధ - ఈశోపనిషత్తు.

విష్ణుమాయ.

అధ్యాత్మరామాయణము : అహల్యస్థుతి.