సాయి కథలు - మాయనుగూర్చి మహాత్ముల వ్యాఖ్య !
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - మాయనుగూర్చి మహాత్ముల వ్యాఖ్య !
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము
ఈ విషయంపై శ్రీ రామకృష్ణ పరమహంస ఏమన్నారో సోదాహరణంగా పరిశీలిద్దాం. ఒకరోజు సాయంత్రం దక్షిణేశ్వర్ కాళీదేవలయమున నివసిస్తున్న రామకృష్ణులవారిని చూచుటకు ఓభక్తురాలు తన సవతిసోదరి (stepsister) మరియు సోదరియొక్క మరదలితో కలసి వచ్చినది. ఆ మువ్వురు మహిళలు పరమహంసకు ప్రణామముల నాచరించి తమతమ స్థానాల్లో కూర్చొన్నారు. కుశల ప్రశ్నల యనంతరము వారితో ' జీవితధ్యేయమేమిటి? భగవంతునెలా ప్రేమించాలి? ' అనే అంశంపై ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు.
" భగవంతుని శరణు పొందుట అంత సులువా ఏమిటి? సర్వుల మోహింపజేయు ఆ మహామాయ చేష్టలన్నియు అనూహ్యములు. అంత సులభంగా ఎవరినైనా ఆమె వదులుతుందా? బంధుజనులెవ్వరూ లేని వ్యక్తికి ఓ పెంపుడు పిల్లితో అనుబంధపాశం కలిగిస్తుంది. పిల్లికొరకై చేపలు, పాలు తెచ్చే ప్రయత్నంలో ఆ మనిషి విసిగి వేసారతాడు. మరొక్క ఉదాహరణ చూద్దాం, సంపన్న కుటుంబలో తమ తమ భర్తల బిడ్డల కోల్పోయిన మహిళల గూర్చి. చివరి క్షణాల కెదురుజూచు విధవలు మినహా శేష కుటుంబ సభ్యులెల్ల కాలగర్భంలో కలిసిపోయారు. పాతబడిన ఇల్లు సగభాగం కూలిపోయింది, మరొక భాగం శిధిలావస్థలో ఉంది. ఆ శిధిలాల కప్పుల నుండి మఱ్ఱిమొక్కలు, ఆకుకూర మొలకలు మొలుస్తున్నాయి. ఆ స్త్రీలు మొలచిన ఆ ఆకుకూరల తింటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలా వారెందుకు జీవిస్తున్నారు? వారేల దైవాన్ని స్మరించరు? నిజం చెప్పాలంటే దైవ శరణాగతి కోరడానికది సరియైన సమయం. కాని వారలా చేయుటలేదే! మరొకరి విషయం చూద్దాం. దురదృష్ట వశాత్తు ఓ మహిళ వివాహమైన కొద్దిరోజులకే తన భర్తను కోల్పోయింది. ఆమె ప్రస్తుతం యవ్వనంలో వుంది. దైవాన్ని స్మరింపవచ్చుగదా, కాని అటుల జేయుటలేదు, తన సోదరుని కుటుంబ బాధ్యతలను నెత్తికెక్కిచ్చుకుంది. తలపై చక్కగా బన్ తో చుట్టలా కేశాలంకరణ జేసుకొన్నది. భుజాన పవిటకొంగు అంచున యింటి తాళాల గుత్తి వేలాడుతుంది. చాల అహంకారంతో ప్రవర్తిస్తుంది, అందరిపై పెత్తనం జేస్తుంది. ఆ రాక్షస ప్రవృత్తికి పొరుగువారు సైతము ఆమెను జూచుటకు భయపడేవారు. ' నేను లేకుంటే నా సోదరుడు భోజనంకూడ చేయడు ' అంటూ అందరికి తన గొప్పను ప్రకటించేది. ఎంతటి దౌర్భాగ్యురాలు ! నీ స్థితిని గ్రహింపలేకున్నావా? " ఎంతటి యాదృచ్చిక సంఘటన! రామకృష్ణుల భక్తురాలిసోదరి మరదలి కథయే యిది అంతా ! తన సోదరుని కుటుంబలో ఆమెదే అజమాయిషీ, అధికారమూను. ఆమెగతాన్ని గూర్చి ఎవరూ ముందుగా పరమహంసకు తెలియబరచలేదు. మనుషుల హృదయపు లోతులలో దాగియున్న అహంకార విషయవాంఛలను, వివరించుటకై వారీకథనెంచుకొన్నారు. వారిమాటలు ఆమె హృదయానికి సూటిగా గుచ్చుకొన్నాయి. ' రామకృష్ణులవారలా తన మరదలగూర్చి యెందులకు మాట్లాడారు? ఆమెంత నొచ్చుకొంటుంది? ' భక్తురాలిసోదరి, ఆమె చెవిలో గుసగుసలాడినది. ' మనమేమి చేయగలం? అది రామకృష్ణుల ఇచ్ఛ, ఈవిషయమై వారికెవరూ ముందుగా తెలియపరచలేదు. ' భక్తురాలి సమాధానం. "
Ref: Sri Ramakrishna and His Divine Play by Swami Saradananda, Swami Chetanananda
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
Sai Naam Bhajake Maya ko Tajake
v>
ఎంతవారలైనను మాయాబద్ధులౌతారు, నారదముని సైతము విష్ణుమాయ వుచ్చులో పడి, తుదకు శ్రీహరి కృపచే ముక్తుడైనాడనేది పురాణ సందేశం.
ReplyDelete