సాయి కథలు - ఋణానుబంధము
శ్రీసాయినాథాయనమః
సాయి కథలు - ఋణానుబంధము
" మహాత్ముల కథలు వినుట యనగా వారి సాంగత్యము చేయుటే ! " శ్రీ సాయి సచ్చరిత్రము
సాయి బాబా ఋణానుబంధమును గూర్చి బహు విలువైన వ్యాఖ్యజేశారు. ఏదైన సంబంధము లేనిచో ఒకరినొకరు కలసికొనరు. (అనగా పూర్వకాలంలోగాని, మరింత వెనుకకు వెళితే పూర్వజన్మలోగాని తాను వ్యక్తులతో ఏర్పరచుకొనిన బంధము కొనసాగుతుంది. ఈ బంధము పరిచితులతొ గావచ్చు, ప్రస్తుత అపరిచుతులతొ గావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు, భార్యాబిడ్డలతో గావచ్చు , మిత్రులతో గావచ్చు , శత్రువులతో గావచ్చు ఇతరత్ర జీవజంతువులతో కావచ్చు, పూజించెడి దైవంతో కావచ్చు సద్గురువుతో గావచ్చు ). ఈక్రమంలో ఓవ్యక్తి గతంలో మరొకవ్యక్తికి ఏదైనా ఇచ్చుటగాని లేక పుచ్చుకొనుటగాని జరుగుతుంది, కొన్నివేళల ఎలాంటి లావాదేవీలు జరుగక పోవచ్చును. గతకాలంలో యిలా వ్యక్తులమధ్య పరస్పరమేర్పడిన బంధమే తరువాతి కాలంలో ఋణానుబంధంగా మారి వ్యక్తులను కలుపుతోంది. పూర్వం ఋణపడిన వ్యక్తి తన బాకీని తీర్చుటకై ప్రస్తుతం, గతకాలంలో ఋణమిచ్చినవానిని తప్పక కలియుట సంభవిస్తుందనేది బాబా సందేశం. ఇందుకు చక్కని ఉదాహరణ బాబాను చూడవచ్చిన ఇద్దరు గోవా పెద్దల అనుభవాలు. ఓపెద్ద దత్తదేవునికి 15 రూపాయలు ఋణపడియుండుటచే బాబా వానినుండి అంతే సొమ్మును దక్షిణగా స్వీకరించారు, వేరొకపెద్ద బాబా అడుగకయే 35 రూపాయల యివ్వదలచినను యెలాంటి ఋణశేషం లేనికారణంగా వానినుండి స్వీకరించలేదు. ఇలా సాయి భక్తులనుండి దక్షిణ గ్రహించి వారిపూర్వ బాకీలను వసూలుజేసెడివారు. వ్యక్తులమధ్య యిలా ఏర్పడిన లావాదేవీల క్రమము పూర్తిగానంతకాలము ఆ సంబంధిత వ్యక్తులు ఋణానుబంధసూత్రంచే కలుస్తూనే యుంటారు. అలా ఏర్పడిన బాకీల చెల్లింపు పూర్తిగానంతవరకు వ్యక్తి ఎలాంటి ముక్తిపొందడని పెద్దలమాట. ఈసందర్భంలో బాబాచెప్పిన మరికొన్ని మాటల స్మరిద్దాము. " ఎట్టిసంబంధములేక ఒకరినొకరు కలువరు. నీవద్దకు వచ్చిన వ్యక్తులగాని, జంతువులగాని నిర్దయగా తరిమివేయక సాదరముగా చూడుము. దాహార్తులకు నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, బట్టలులేనివారికి బట్టలు, ఇంటివసారా యితరుల విశ్రాంతికి సమకూర్చినచో భగవంతుడు మిగుల ప్రీతిచెందును. ధనసహాయము కోరినవారల నిందింపకుము, వారితో కఠినముగా వ్యవహరింపకుము. ఈజగన్నాటకంలో ఓవ్యక్తిగా పాత్ర సమర్ధవంతముగా నిర్వహించి సంతోషము పొందుము ). బాబాతో ఋణానుబంధము పెంచుకొనుట ఎంతో ఫలవంతము, ఒకరూపాయికి పది యిత్తునని, తనవైపుకు ఓ అడుగు వేస్తే తాను వంద అడుగులు వేస్తానని సాయి అభయసందేశ మిచ్చియున్నారు. సాయి సర్వవ్యాప చైతన్యరూపుడు, సర్వజీవ హృదయవాసుడు గావున యెవరికి జేసిన సహాయమైనను వారికి జేసినటులై పరోక్షంగా వారితో ఋణానుబంధాన్ని పెంపొందించుటకు దోహద పడుతుంది.
శ్రీసాయినాథుని శరత్ బాబూజీ తమ ' సాయిభక్తి సాధన రహస్యం ' గ్రంధంలో బాబాతో ఋణానుబంధం పెంచుకోవడమెలా ? అనే అధ్యాయంలో యీ ఋణానుబంధ విషయాన్ని మిగుల విపులంగా వివరించారు. వారి మాటలలోనే ఆవిషయాన్ని పఠిద్దాం.
" " ఋణానుబంధాన్ని విశ్వసించు! " అనేవారు బాబా. ఎవ్వరూ తమంతట తాముగ తనవద్దకు రారనీ, వారితో తనకుగల ఋణానుబంధం వల్ల తానే వారిని తనచెంతకు రప్పించుకుంటానని బాబా అనేక సందర్భాల్లో అన్నారు. అంటే, బాబాతో ఋణానుబంధమే లేకపోతే, మనమసలు సాయిభక్తులవడమే తటస్థించ దన్నమాట! శ్రీసాయి యొక్క సద్గురు కార్యం, ఆయన రక్షణ మనకనుభవమవడం యొక్క నేపథ్యంలో యీ ఋణానుబంధమనే సూత్రం దాగివుంది. అందువల్ల, ఈ కీలకసూత్రం యొక్క స్వరూపస్వభావాలను అవగాహన చేసుకొని, బాబాతో మనకు గల ఋణానుబంధాన్ని 'ఇంకా' పెంచుకొనే యత్నం చేయడం సాయిభక్తి సాధనలో అత్యంత అవశ్యం కదా? మరి, ఆ 'ఋణ' సాధనకు మార్గాలేమిటి? ఆ సుళువులను కూడా బాబానే కరుణతో మనకందించి వున్నారు. వాటిలో ఒకటి, నైవేద్య నియమం! " ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను" అన్నారు బాబా. తమదైన బాణీలో బాబా సూత్రప్రాయంగా చెప్పిన ఈ ' నీవేదన ' నియమాన్ని పాటించడంలో ఎన్నో సూక్ష్మమైన అంశాలు ఇమిడి వున్నాయి. అవేమిటో చూద్దాం! ' తనకు సంపర్పించిన ప్రతి పైసాకు తాను భగవంతునికి లెక్క చెప్పుకోవాలని, తనకు సమర్పించిన దానికి పదిరెట్లు తిరిగి వారికి ఇవ్వాల్సి వుంటుందని ' బాబా అనేవారు. అంటే, మనం బాబాకు ఏం సమర్పించినా, తిరిగి దానికి పదిరెట్లు మనకు ' చెల్లించి ' , ఆ ఋణం తీర్చుకోవలసి వుంటుందని బాబా భావం. ఇది ఆయన కరుణతో ఆనందంగా నెరవేర్చే అవతార కార్యం, దైవం ఆయన కప్పగించిన కర్తవ్యం. ఈ దృష్ట్యా ' బానిసను ' అన్న బాబా పలుకులకు అర్ధం- ' ఋణగ్రస్తుడను ' అని! నిజానికి బాబాకు మనతో గల బంధాన్ని ' ఋణానుబంధ ' మనేకన్నా ఓ అవ్యాజ ' కరుణానుబంధ ' మనడం సమంజసం! ...... "
బాబాతో మనకు కలిగిన యీ పవిత్ర ఋణానుబంధ సూత్రాన్ని నిత్యకృత్యములలో గుర్తుంచుకొని తగువిధంగా వ్యవహరించి వారి కృపకు పాత్రులవుదముగాక!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!
Your feedback greatly helps for improvement of the blog , please write your opinion in the comments section below and share if you like. ( మీ సలహా మిగుల విలువైనది, క్రింది కామెంట్స్ సెక్షన్ లో మీ అభిప్రాయము తెలియపరచగలరు. నచ్చితే తెలిసినవారితో పంచుకోండి.)
పూలమాలలోని కనబడని దారంలా ఋణానుబంధసూత్రం వ్యక్తులను కలుపుతుంది, ఆబంధమెలా యేర్పడిందో యెవరికి తెలుసు!
ReplyDelete